గొర్రెల్లో సంతానోత్పత్తి గురించి చాలా తక్కువ విషయాలు గొర్రెల కాపలా దారులకు తెలుసు అని చెప్పుకోవాలి. ఎందుకంటే గొర్రెలను ఖచ్చితంగా వినియోగించుకుంటే సంవత్సరానికి రెండు పిల్లల్నిపుట్టించవచ్చును. కానీ చాలా మంది రెండు సంవత్సరాలకు రెండు పిల్లలు వచ్చే విధంగా అనుకుంటారు. కానీ మనం శాస్త్రీయ పద్ధతిలో సరైన కింద మేళకువలు పాటిస్తే మనం అనుకున్న విధంగా తడవకు రెండు పిల్లలు వచ్చి లాభాలు పొందుతాము.

మంచి సంతానోత్పత్తి గల గొర్రెల ఎంపికలో గుర్తుంచుకోవలసిన విషయాలు:

వయసు రీత్యా రెండు శాశ్వత పళ్ళు వేసిన గొర్రెలను ఎంచుకోవాలి. మంచి తరాలను కలిగి ఉండాలి. ఆడ గొర్రెల విషయంలో మంచి శరీర సౌష్టవం, పొదుగు, వెనుక రెండు కాళ్ళ మద్య భాగం వెడల్పుగా, వెనుక నడుము భాగం వెడల్పుగా ఉండాలి. ఈ లక్షణాలు ఉంటే మంచి పిల్లలు పుట్టడానికి అవకాశం ఎక్కువ. తక్కువ వయసు గల ఆడ గొర్రెలను ఎంచుకోకూడదు ఎందుకంటే పుట్టే పిల్లలు బలంగా ఉండవు మరియు పెరగవు కుడా. సంతానోత్పత్తి కోసం కొత్తగా ఉపయోగించే ఆడ గొర్రెలు, ముందుగా 2-3 సార్లు ఈనిన గొర్రెల బరువులో కనీసం 70 శాతం అయినా ఉండాలి.

పొట్టేళ్ల విషయంలో మంచి దారుడ్యమైన కండ కలిగి, బలిష్టమైన కాళ్ళు కలిగి, ఎటువంటి లోపాలు లేకుండా ఉండాలి. ముఖ్యంగా బాడీ కండీషన్‌ స్కోరును ఖచ్చితంగా కలిగి ఉండాలి. పొట్టేలు వషణ కాయలు బాగా వద్ధి చెంది, అవి ఉండే భాగంలో పై చర్మంతో అతికి ఉండాలి. వేలాడకుండా ఉండే జీవాలను ఎంచుకోకూడదు. పొట్టేలుకు ఉండవలిసిన ముఖ్యమైన లక్షణం ఏమిటంటే లిబిడో లేదా లైంగిక ప్రవర్తన/వాంఛ బాగా ఉండాలి. తగినంత మేత, ఎక్కువ వేడి, ఒత్తిడి, జబ్బు చేయడము వల్ల లిబిడో తగ్గుతుంది.

గొర్రెల్లో సంతానోత్పత్తిలో ఉండవలిసిన మార్గదర్శకాలు :

సంతానోత్పత్తి వయస్సు : 6-8 నెలలు

పిల్లలు పుట్టిన తరువాత ఎదకు వచ్చే కాలం : 21 రోజులు

గర్భాస్త కాలం : 147 రోజులు (144-152 రోజులు)

ఎదకు ఎదకు మధ్య కాలం : 16-17 రోజులు(14-19 రోజులు)

ఎదలో ఉండే కాలం : 24-36 గంటలు

మందలో 20 ఆడ గొర్రెలకి ఖచ్చితంగా ఒక పొట్టేలు సరిపోతుంది (20:1)

ఆడ గొర్రెలు ఎదలో ఉన్నప్పుడు ఉండే లక్షణాలు :

మేత సరిగ్గా మేయక పోవడము, తోక ఎత్తడం, వెనుక మానం లేదా యోని పెదాలు ఉబ్బడం మరియు జిగురు లాగ ఉన్న స్రావాలు కారడం, తరచుగా మూత్రం పోయడం, తరచుగా అరవడం, వేరే గొర్రెల మీదికి ఎక్కడం, పోట్టేలుతో కలవడానికి సిద్ధంగా ఉండడం.

పొట్టేళ్ళు ఏ విధంగా ఎదలో ఉన్న గొర్రెలను గుర్తిస్తాయి?

పొట్టేళ్ళు వాసన చూడడం, శబ్దం మరియు ప్రవర్తన ద్వారా గుర్తిస్తాయి. గుర్తించిన తరువాత ఆడ గొర్రె మానం లేదా యోని భాగాన్ని మూతితో రుద్దడం, తన పై పెదవిని వంకరగా తిప్పి మెడను సాపి గాలిలోనికి చూడడం, ఆడ గొర్రె మెడ దగ్గర చర్మం లేదా ఉన్నిని కొరకడం లేదా లాగడం, తన ముందు కాలుతో గొర్రెను రుద్దడం చేసి చివరగా తన ముందు రెండు కాళ్ళను గొర్రె వెనుక భాగములో ఎక్కి ఉంచి సంయోగములో పాల్గొంటుంది.

మందలో యెదలో ఉన్న గొర్రెలను ఎలా గుర్తించాలి?

సరిగ్గా సంయోగంలో పాల్గొనలేని పొట్టేలును ఉపయోగించి సంయోగానికి ఉపయోగం లేని పొట్టేళ్ల ద్వార మందలో ఉన్న యెదలో ఉన్న గొర్రెలను గుర్తించవచ్చు.

గొర్రెల ఆప్రాను తొడగడం ద్వార :

గొర్రెల ఆప్రాను అంటే 60 శ 45 సెం.మీ. కలిగి నాలుగు ప్రక్కల కట్టడానికి వీలుండే ఒక గుడ్డ. ఈ ఆప్రానును పొట్టేలు శరీరానికి తొడుగుతారు. ఎప్పుడైతే కలవడానికి ప్రయత్నిస్తే ఈ గుడ్డ అడ్డుపడుతుందో దీని వల్ల సంయోగం జరుగదు. ఎదలో ఉన్న వాటిని మాత్రమే గుర్తించడానికి వీలవుతుంది.

వ్యాసేక్టమి చేసిన పొట్టేలు ద్వార :

కొంత మంది మందలో పనికిరాని పోట్టేల్లకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ లేదా వీర్య నాళికలను తీసివేస్తారు లేదా వషణ కాయలు కొట్టడం అంటారు. దీన్ని ఉపయోగించుకుని మందలో ఎదలో ఉన్న గొర్రెలను గుర్తిస్తారు. వీర్యం రాదు కాబట్టి సంయోగం చేసిన ఫలితం ఉండదు.

ఆడ గొర్రెను సంతానోత్పత్తికి ఎలా తయారు చేస్తారు?

ఫ్లషింగ్‌:

సంతానోత్పత్తి కాలానికి మూడు నుండి నాలుగు వారాల ముందు మంచి పోషణ కలిగిన మేత మరియు దాణాను ఇవ్వడాన్ని ఫ్లషింగ్‌ అంటారు. ఈ విధంగా చేయడం వల్ల గర్భంలో అండాలు ఏర్పడి కవలలు పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరియు తల్లి గొర్రెలు, పిల్లలు చాలా ఆరోగ్యంగా పెరుగుతాయి. కాని చాలా అరుదుగా కవలలు గొర్రెల్లో వస్తాయి. ఫ్లషింగ్‌ చేయడం వల్ల ఎదకు త్వరగా రావడం, సంయోగం ఫలితం కావడం వల్ల పిండ మరణాలు నివారించడం వంటివి జరుగుతాయి. ఫ్లషింగ్‌లో 250 గ్రా. దాణా మరియు 500 గ్రా. లెగ్యుం గడ్డిని ప్రతి రోజు ప్రతి గొర్రెకి ఖచ్చితంగా అందించాలి. ఫ్లషింగ్‌ వల్ల సంతానోత్పత్తి సామర్థ్యం 10-20 శాతం పెరుగుతుంది.

ఉన్ని/ బొచ్చు ఎక్కువ గొర్రెల్లో సంయోగానికి తీసుకోవలిసిన జాగ్రత్తలు :

దీనికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. అవి ఏమిటంటే

ట్యాగింగ్‌ :

ఉన్ని ఉండే గొర్రెల్లో సంయోగానికి ఉన్ని ఆడ్డుపడుతూ ఉంటుంది. కాబట్టి వాటికీ ట్యాగింగ్‌ చేసి కత్తరించాలి. అంతేగాక పోట్టేళ్లలో కూడా పురుషాంగం లేదా పెనిస్‌ చుట్టూ ఎక్కువగా ఉండే బొచ్చును కత్తరించాలి.

ఐయింగ్‌ :

సంతానోత్పత్తి సమయంలో కళ్ళ చుట్టూ ఉండే ఉన్ని లేదా బొచ్చును కత్తిరించడం.

రింగింగ్‌ :

సంతానోత్పత్తి సమయానికి ముందు ఉన్నిని తీసివేసే దాన్ని రింగింగ్‌ అంటారు. దీని వల్ల సంయోగం సులభంగా జరుగుతుంది.

క్రచ్చింగ్‌ :

ఉన్నిని గొర్రెలు మరియు పోట్టేల్లలో వాటి సంతానోత్పత్తి అవయవాల చుట్టూ మాత్రమే తీయడాన్ని క్రచ్చింగ్‌ అంటారు.

పొట్టేలును సంతానోత్పత్తికి ఎలా తయారు చేస్తారు?

పొట్టేలును సంతానోత్పత్తికి ఎంపిక గురించి గొర్రెల ఎంపిక విభాగంలో బాగా వివరించడం జరిగింది. పొట్టేళ్ళు సంయోగములో పాల్గొని ఉందా లేదా అని కింద విషయాల ద్వార గుర్తిస్తారు. ఏ ఏ పొట్టేళ్ళు సంయోగంలో పాల్గొన్నాయి అని తెలుసుకోవడానికి అద్దకాలను ఉపయోగిస్తారు. ఈ అద్దకాలను పొట్టేళ్ల చాతి భాగంలో పూస్తారు. ఎప్పుడైతే సంయోగం చెందినదో ఆ రంగును బట్టి కనిపెడతారు. అంతేగాక వివిధ రకాల రంగులను కూడా ఉపయోగిస్తారు. ఎందుకంటే ఏవేని సంతానోత్పత్తిని విజయవంతం చేయలేవో వాటిని తీసివేస్తారు. దీని కోసం 16-18 రోజులకొకసారి ఆ అద్దకాన్ని మారుస్తారు.

రాడ్లింగ్‌/రాడిల్‌:

మాములుగా పై పద్ధతిలో అద్ధకాన్ని పోట్టేళ్ళకు పూశారు. కాని ఇక్కడ ఆడ గొర్రెల వీపు వెనుక భాగంలో పూస్తారు. దీని వల్ల కూడా సంయోగంలో పాల్గొన్నప్పుడు ఆ రంగు అంటుకుంటుంది దాని ద్వార గుర్తిస్తారు.

గొర్రెల సంయోగంలో పద్ధతులు :

సంయోగమును మేటింగ్‌ అంటారు.

1. హ్యాండ్‌ మేటింగ్‌ :

ఒక పొట్టేలును ఒకటి నుండి మూడు గొర్రెలతో జత కలవడానికి వినియోగిస్తారు. ఈ పద్ధతి వలన గొర్రె పిల్లలు ఎప్పుడు పుడతాయో ఖచ్చితంగా చెప్పవచ్చును. మంచి సంతానోత్పత్తి గల పొట్టేళ్లను పొందవచ్చు. వాటిలో లోపాలు ఉన్నట్లయితే గమనించవచ్చును కూడా. యవ్వన దశలో ఉన్న గొర్రెలకు మంచి జతను కల్పించ వచ్చును. పొట్టేళ్ల సంతానోత్పత్తి సామర్థ్యాన్ని కూడా తెలుసుకునవచ్చు.

2. పెన్‌ మేటింగ్‌ :

20-25 గొర్రెలకు పాకలో ఒక గది లాగ ఏర్పాటు చేస్తే దాన్ని పెన్‌ అంటారు. ఈ పద్ధ్దతిలో ఆ పెన్‌లో ఉండే గొర్రెలకు ఒక పొట్టేలును రాత్రి పూట మాత్రమే పంపిస్తారు. దీని వల్ల గొర్రెలు పగటిపూట గడ్డి తినడానికి పోయినప్పుడు సంయోగానికి ఇబ్బంది పెట్టవు మరియు పోట్టేలుకు విశ్రాంతిని కలుగ చేసి సరైన పోషణ అందించడం ద్వార సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచవచ్చు.

3. ఫ్లోక్‌ మేటింగ్‌ లేదా పాశ్చర్‌ మేటింగ్‌ :

ఈ పద్ధతి ఎక్కువగా విస్తృత పద్ధ్దతిలో గొర్రెల పెంపకం చేపట్టే మందలో ఎక్కువగా ఉంటుంది. పొట్టేళ్లను పగలు రాత్రి రెండు పూటలా వదిలేస్తారు. దీని వల్ల జత కలవడానికి కూడా ఎక్కువ సమయం తీసుకుంటుంది. గొర్రెలకు మేత విషయంలో సరిగ్గా తినలేవు ఎందుకంటే పొట్టేళ్ళు సంయోగానికి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అంతేగాక పొట్టేళ్ళు కుడా ఇతర వాటితో పోటీని ఎదుర్కోనవలిసి వస్తుంది. సంతానోత్పత్తి అవకాశాలు తక్కువగానే ఉంటాయి.

4. కత్తిమ గర్భధారణ :

మంచి సంతానోత్పత్తి గల పొట్టేలు వీర్యాన్ని సేకరించి నాళికలుగా తయారు చేసి ద్రవ నత్రజనిలో ఉంచుతారు. వాటిని ఎదలో ఉన్న గొర్రెలకు కత్తిమ గర్భధారణ పరికరం ద్వారా వీర్యాన్ని గర్భంలోకి ఎక్కిస్తారు. దీన్నే కత్తిమ గర్భధారణ అంటారు. ఒకేసారి ఎన్ని గొర్రెలలైనా చూలి కట్టించవచ్చు. కొన్ని రకాల సుఖవ్యాధులను నివారించవచ్చు.ఈ పద్ధతి నిసహజ విధానంతో పోలిస్తే 60-70 శాతం ఫలవంతమైన సంతానోత్పత్తిని సాధించవచ్చు. మంచి పొట్టేలు వీర్యాన్ని కొన్ని సంవత్సరాల పాటు నిల్వ చేయవచ్చు.

చూడి నిర్ధారణ పరీక్షలు :

మలం ద్వారం ద్వారా చేయి వ్రేళ్ళు పెట్టి పొట్టనుచేతితో తడిమి చూడడం, ఆల్ట్రాసౌండ్‌, రేడియోగ్రఫి /ఎక్సరే, ప్రోజేస్టిరాన్‌ హార్మోన్‌ పరీక్ష

చూడి గొర్రెల్లో తీసుకోవలిసిన జాగ్రత్తలు ఏమిటి?

మంద నుండి వేరు చేయాలి. పొట్టేళ్ళతో కలవనీకూడదు, వేరుగా వసతి మరియు ఆరోగ్య రక్షణ కల్పించాలి, మంచి పోషణను అందించాలి, చలి లేకుండా చూసుకోవాలి. పోషణలో కాల్షియం వంటి మూలకాలు ఉండేట్లు చూసుకోవాలి. దీని వల్ల పిల్లలకు సరిపడాపాలు వస్తాయి. ఒకవేళ పోషకాహార లోపం వస్తే ప్రేగ్నన్సి టాక్షీమియా అనే వ్యాధి కూడా వస్తుంది. సరైన వ్యాయామాన్ని కూడా చేయిస్తే మంచిది. చివరి నెలలో నట్టల నివారణ మందులు తాపివ్వాలి. ఐరన్‌ టానికులును ఇవ్వాలి. దీని వల్ల రక్తహీనత ఉండదు

ఈనే సమయములో తీసుకోవలిసిన జాగ్రత్తలు ఏమిటి?

ఈనడానికి ముందు సమయం దాదాపుగా 20-50 నిమిషాలు ఉంటుంది. ఈనే ముందు అటు ఇటు తిరగడం, అరవడం చేస్తూ ఉంటుంది. ముందుగా యోని లేదా మానం నుండి పసుపు రంగు ద్రవాలు వస్తాయి. వచ్చిన ఒక గంట లోపు నీళ్ళ బుడ్డ ఒకటి కనిపిస్తుంది మరియు అది ఒక 10 నిమిషాల్లో పగిలిపోయి సాధారణంగా రెండు ముందర కాళ్ళు కనపడతాయి. తరువాత తల వస్తుంది. ఈ విధంగా రాకుండా ఈనటానికి కష్ట పడుతున్నట్లయితే పశు వైధ్యాదికారిని సంప్రదిచండి. ఈ విధంగా పిల్ల ఒక 15 నిమిషాలు లోపు బయట పడుతుంది. పిల్ల బయటికి వచ్చిన వెంటనే ఆ ద్రవాలను తల్లి నాకి వేస్తుంది. మరియు ఆ ముక్కు, నోరు, కళ్ళ దగ్గర ఉండే స్రావాలను కుడా తీసి వేయాలి. పరిశుభ్రపరచిన కత్తెర లేదా రేజర్‌ బ్లేడ్‌తో బొడ్డు కత్తరించాలి మరియు టించర్‌ అయోడిన్‌ పూసి వ్యాధులు రాకుండా చూసుకోవాలి. బొడ్డును ఎక్కువ వేలాడకుండా కత్తరించాలి ఎందుకంటే కుక్కలు, కాకులు వంటివి గాయాలు చేసే అవకాశం ఉండి. 24 గంటలలోపు ఆ మాయ పడిపోతుంది. పుట్టిన 20 నిమిషాలు లోపు పిల్లలకి తల్లి పాలు లేదా పొదుగును అలవాటు చేయాలి. తల్లి ఈనిన తరువాత వేడి నీటిని తాగాడానికి అందించాలి.

గొర్రెల సంతానోత్పత్తి అభివద్ధిలో అనుసరించవలిసిన నియమాలు

మందలో 20 ఆడ గొర్రెలకు 1 పొట్టేలు తప్పనిసరిగా ఉండాలి.

మంచిగా జత లేదా సంయోగం చేయాలంటే :

1. యుక్తవయసు పొట్టేలును శ రెండు నుండి మూడు ఈతలున్న గొర్రెతో

2. యుక్త వయసు గొర్రెను శ అంతకు మునుపే సంతానోత్పత్తి ఉపయోగించిన పోట్టేలుతో

ఇన్‌ బ్రీడింగ్‌ :

వాడిన పొట్టేళ్లను ప్రతి సారి అవే గొర్రెలకు, వాటికి పుట్టిన గొర్రెల సంతతికి వినియోగించడాన్ని ఇన్‌ బ్రీడింగ్‌ అంటారు. ఇలా చేయడం వలన మంచి పిల్లలు రావు మరియు ఆవ లక్షణాలు ఉన్న పిల్లలు పుడతాయి. దీన్ని వాడుక భాషలో చెప్పాలంటే మేనరికం అంటారు.

ఈ సంతానోత్పత్తికి ఉపయోగించే పొట్టేళ్లను రెండు సంవత్సరాలకు ఒకసారి మారుస్తూ ఉండాలి. దీన్నే విత్తనపు పొట్టేళ్ల మార్పిడి అంటారు. ఇది చేయడము వలన ఇన్‌ బ్రీడింగ్‌ లేదా మేనరికం తగ్గిపోతుంది.

సంతానోత్పత్తికి ఉపయోగించే ఆడ గొర్రెలను 18-24 నెలలు వయసు కలిగి ఉండాలి మరియు ఈతలు వేసిన గొర్రెల బరువులో కనీసం 75 శాతం ఉండాలి.

యుక్త వయసు ఆడ గొర్రెలను సంతానోత్పత్తి ఉపయోగిస్తే పిల్లల నష్టం ఎక్కువగా ఉంటుంది.

మాములుగా సంతానోత్పత్తి కాలాలు: సెప్టెంబర్‌-అక్టోబర్‌, ఫిబ్రవరి-మార్చి, మే-జూన్‌

90 శాతం గొర్రెలకు గర్భదారణ జరగాలంటే హ్యాండ్‌ మేటింగ్‌ పద్ధతిని ఆచరించండి. ఒక పొట్టేలును రెండు నుండి మూడు గొర్రెలతో సంయోగం చేయుట. మరియు 8-12 గంటల్లో రెండు సార్లు సంయోగంలో పాల్గొంటే గర్భదారణ కావడానికి మంచి అవకాశం ఉంటుంది.

1-2 సంవత్సరాలలో ఒక్కసారి కూడా పిల్లలను పుట్టించనట్లయితే దాన్ని వెంటనే వేరు చేయండి.

మంచి యాజమాన్య పద్ధతి ఏమిటంటే సంతానోత్పత్తి చేసే కాలం అంటే 15 మే -15 జూన్‌ వరకు తప్పించండి. ఎందుకంటే అప్పుడు గర్భము దాలిస్తే పిల్లలు ఖచ్చితంగా శీతాకాలములో పుడతాయి. దాని వల్ల పిల్లలకి జలుబు మరియు ఉపిరితిత్తులకి సంభందించిన వ్యాధులు సోకి పిల్లల మరణాలు ఎక్కువగా ఉంటాయి. మంచి పిల్లలుగా అభివద్ధి రావాలంటే తగినంత వేడి అవసరం.

ప్రారంభదశలో గర్భమున్న గొర్రెలకి వరుసగా రెండు రోజులు ఆకలితో తిండి లేనట్లయితే లోపలి పిండాలు కరిగిపోయే అవకాశం ఉంటుంది.

సంతానోత్పత్తికి అనుకూలమైన ఎదను కలిగించే పద్ధతులు :

1. ఎద ప్రేరణ కలుగచేయడం :

సంతానోత్పత్తి కాలములు ప్రారంభమయ్యే ముందు వ్యాసేక్టమి చేసిన లేదా కాయలు కొట్టించిన పొట్టేళ్లను ఆడ గొర్రెల మధ్య 10 రోజుల నుండి 15 రోజుల వరకు ఉంచడం. ఈ పద్ధతి వల్ల ఒకేసారి అన్నీ ఎదకు వచ్చే అవకాశం ఉంటుంది మరియు గర్భదారణ కూడా జరిపించవచ్చు.

2. సమకాలంలో ఎదకు తీసుకరావడం :

ఒకసారి అన్నీ గొర్రెలను ఎదకు తీసుకున్నట్లయితే కత్తిమ గర్భదారణ, సహజ గర్భదారణ చేపించడానికి చాలా సులువుగా ఉంటుంది. మరియు ఈనడం, పిల్లల సంరక్షణ వంటి జాగ్రత్తలు కూడా సులువుగా చేయవచ్చును. ఈ విధంగా ఒకేసారి అన్ని పిల్లలు వచ్చినప్పుడు ఆర్థికంగా లాభపడవచ్చు.

3. టెలి స్కోపింగ్‌ లేదా పొట్టేలు ప్రభావం లేదా ప్రేరణ :

సంతానోత్పత్తి కాలానికి ముందు వరకు మందలో ఆడ గొర్రెలను మాత్రమే ఉంచి, ఉన్నట్టుండి మగ వాటికి మందలో కలపడం వల్ల ఎక్కువ సంఖ్యలో గొర్రెలు ఎదకు వచ్చే అవకాశం ఉంటుంది. మగ వాటిని 2-3 నెలలు దూరంగా ఉంచాలి.

4. హర్మోనల్‌ పద్ధతి :

ప్రోజేస్టిరాన్‌ హార్మోను ఉండే పదార్థాలను మేత ద్వార ఇవ్వడం. ప్రోజేస్టిరాన్‌ హార్మోను ఉండే ఇంప్లాంట్‌ పరికరాలను యోని మార్గంలో ఉంచడం, 14 రోజుల తరువాత తీస్తే, 3 రోజులలోపు ఎదకు వస్తుంది. ప్రోస్ట గ్లామ్డిన్‌ ఎఫ్‌ 2 ఆల్ఫా 10 మి.గ్రా., 10 రోజుల వ్యవధి కాలంలో కండకి ఇంజక్షన్‌ రూపంలో ఇచ్చినట్లయితే 72-96 గంటల్లో ఎదకు వచ్చును.

పై పద్ధతులలో అన్నీ గొర్రెలను ఒకేసారి ఎదకు తీసుకు రావచ్చును.

డాక్టర్‌.జి.రాంబాబు, పశువైధ్యాధికారి, కడప, ఫోన్‌ : 9618499184