సజ్జలు చాలా రుచికరమైన, ఆరోగ్యకరమైన, శక్తినిచ్చే ఆహార ధాన్యాలు, ఇటు ఆసియా నుండి అటు ఆఫ్రికా వరకు సజ్జలు అనాదిగా పండుతున్నాయి. ఆఫ్రికాలోనే పుట్టి క్రీ.పూ 2000 నాటికి మన దేశానికి వచ్చి ఉంటాయని చరిత్రకారులు ప్రోత్సహిస్తున్నారు. ''సజ్జకం'' అనే తెలుగు పదానికి మనోహరమైన అని అర్థం. సజ్జలు చూడడానికి ముత్యాల్లాగా ఉండి, అంతమనోహరమైనవి కాబట్టే ఆ పేరు వచ్చింది.

సజ్జల వల్ల పోషక విలువల రూపంలోనే కాకుండా ఇతర ఉపయోగాలు కూడా ఉన్నాయి. సజ్జ మొక్కలు మొలిచిన నేల సారవంతమౌతుందని శాస్త్రవేత్తలు చెపుతున్నారు. సోయా చిక్కుడు పండించే ప్రాంతాల్లో ఆ పంటలకు చీడపీడలు సోకకుండా భూమిలోంచి మొక్కలలోకి ప్రవేశించే కొన్ని రకాల పురుగులు (నెమటోడ్స్‌)ని రానీయకుండా ఉండేందుకు సజ్జల్ని అంతర పంటగా వేయడం మంచిదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

సజ్జల వల్ల కలిగే ప్రయోజనాలు :

బహుళ ప్రయోజనకారి, ఎన్నో ఔషధ గుణాలున్న ధాన్యం వీటిని ఉదయం పూట అల్పాహారంగానో మరో రూపంగా తీసుకుంటే మొలలు, రక్తపోటు, టి.బి, క్షయవ్యాధి, చక్కెర వ్యాధి వంటి వాటిని బాగా అదుపులో పెట్టుకోవచ్చు.

సజ్జలు బాగా జీర్ణమవుతాయి. అలాగే వీటివల్ల ఎలాంటి అలర్జీలు కలుగవు.

ఈ ధాన్యం మలబద్దకం, కడుపులోని అల్సర్లపై బాగా ప్రభావం చూపించి వాటిని తగ్గిస్తుంది.

పైటిక్‌ ఆమ్లం, నియాసిన్‌ అధికంగా ఉండడం వల్ల శరీరంలోని కొవ్వును తగ్గిస్తుంది.

వీటిలో పీచుపదార్ధం ఎక్కువగా ఉండడం వల్ల చెక్కర వ్యాధితో బాధపడుతున్న వారికి చాలా మేలు చేస్తుంది. ఎందుకంటే శరీరంలోని గ్లూకోజ్‌ శాతాన్ని క్రమబద్దీకరించి సాధారణ స్థాయిలో ఉంచుతుంది.

సజ్జలతో చేసిన జావ, గంజి వంటివి తాగడం వల్ల శరీరంలోని వేడి తగ్గుతుంది.

అన్ని ధాన్యాలలోకి ఇనుము ధాతువును అధికంగా కలిగి ఉండడం వల్ల దీనివడకం రక్తహీనతతో బాధపడేవారికి, స్త్రీలకు, పసిపిల్లలకు, వృద్ధులకు చాలా ఉపయోగకరం.

సజ్జ గింజల్లో ''కెరోటిన్‌'' అనే పదార్ధం పుష్కలంగా అభించడం వల్ల కంటి చూపుకు చాలా మంచిది. అదే వరిలో ఈ కెరోటిన్‌ అసలు ఉండదు.

బరువు తగ్గాలనుకునేవారు అధిక శాతంగా వీటితో చేసిన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల వారికి త్వరగా ఆకలి కలుగదు. (ఎందుకంటే అధిక పీచు పదార్ధం ఉండడం వల్ల) వారు ఎక్కువగా క్యాలరీలు తీసుకోకుండా సహాయపడుతుంది.

సజ్జ ఆహారం పదార్థాలు తీసుకుంటే గుండె సంబంధిత, ఎసిడిటీ సమస్యలను కూడా నియంత్రించవచ్చు.

ఫాస్పరస్‌ ఎక్కువగా లభ్యమయ్యే కారణంగా ఇవి మనశరీరంలోని రక్తకణాల నిర్మాణంలో బాగా తోడ్పడుతుంది.

సజ్జల్లో ఉన్న ''లిగ్నిస్‌'' క్యాన్సర్‌, గుండెపోటు రాకుండా శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.

సజ్జల్లో మెగ్నీషియం అధికంగా ఉన్నందున, షుగర్‌ (టైప్‌-2) రాకుండా నియంత్రిస్తుంది.

సజ్జల్లో గల పోషక విలువలు :

మాంసకృత్తులు 11.8 గ్రా.

పండి పదార్థాలు 67.1 గ్రా.

కొవ్వు పదార్థాలు 4.8 గ్రా.

పీచు పదార్ధాలు 1.2 గ్రా.

కాల్షియం 42 మి.గ్రా.

ఇనుము 8 మి.గ్రా.

జింక్‌ 3.1 మి.గ్రా.

రైబోఫ్లెవిన్‌ 0.25 మి.గ్రా.

నియాసిన్‌ 2.3 మి.గ్రా.

థైమిన్‌ 0.33 మి. గ్రా.

కెరోటిన్‌ 132 మి.గ్రా.

శక్తి 361

సజ్జలతో వంటలు :

1. సజ్జ మసాలా రొట్టె :

కావలసిన పదార్థాలు : సజ్జ పిండి-90 గ్రా., బియ్యం పిండి-10 గ్రా., ఉల్లిపాయలు-15 గ్రా., పచ్చిమిర్చి-5 గ్రా., అల్లం-15 గ్రా., జీలకర్ర-5 గ్రా , నూనె-20 గ్రా., నీళ్ళు సరిపడినంత, కరివేపాకు-5 గ్రా.,

తయారీ విధానం : పిండిలో తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, కరివేపాకు రుచికి తగినంత ఉప్పు, సరిపడా నీళ్ళు పోసి చపాతీ ముద్దవలె కలుపుకోవాలి. ఈ పిండిని చపాతీ లాగా వత్తి పెనం పై కొంచెం నూనె వేసి రొట్టెను రెండు వైపులా దోరగా వేయించుకోవాలి.

2. సజ్జ పకోడీ :

కావలసిన పదార్థాలు : సజ్జ పిండి-అరకప్పు, సెనగ పిండి లేదా గోధుమ పిండి, ఉల్లి తరుగు, క్యారెట్‌ తురుము, పచ్చిమిర్చి తరుగు, మిరపకారం, ఉప్పు, కొద్దిగా నీళ్ళు వేసి పకోడీల పిండి మాదిరిగా కలిపి పక్కన ఉంచాలి.

తయారీ విధానం : స్టౌమీద బాణీలో నూనె కాగాక కలిపి ఉంచుకున్న పిండిని పకోడీలుగా వేయాలి. బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించి పేపర్‌ టవల్‌ మీదకు తీసుకుపోవాలి. సజ్జ పకోడీలను టమాటా సాస్‌, చిల్లీ సాస్‌లతో తింటే రుచిగా ఉంటుంది.

3. సజ్జ లడ్డు :

కావలసిన పదార్థాలు : సజ్జ పిండి-400 గ్రా., బెల్లం-300 గ్రా., యాలకుల పొడి-20 గ్రా., ఎండు కొబ్బరి-100 గ్రా., అటుకులు-100 గ్రా., నెయ్యి-200 గ్రా.

తయారీ విధానం : ఒక బాండీలో కొంచెం నెయ్యి వేసి పిండిన వేయించుకోవాలి. తురిమిన బెల్లం, ఎండు కొబ్బరి, యాలకుల పొడిలను పిండిలో వేసి బాగా కలుపు కోవాలి. మిగిలిన నెయ్యిని వేడిచేసి పిండిలో పోసి లడ్డూలు చుట్టుకోవాలి.

4. సజ్జ హల్వా :

కావలసిన పదార్థాలు : సజ్జ పిండి- ఒక కప్పు, బెల్లం పొడి లేదా పటిక బెల్లం పొడి-ఒక కప్పు, నెయ్యి-2 టేబుల్‌ స్పూన్లు, యాలకుల పొడి-అరటీస్పూను, జీడిపప్పు-తగినన్ని, కిస్‌మిస్‌-తగినన్ని

తయారీ విధానం : స్టౌ మీద బాణీలో ఒక టీ స్పూను నెయ్యి వేసి కరిగాక సజ్జ పిండి వేసి దోరగా వేయించాలి. మూడు కప్పుల నీళ్ళలో పటిక బెల్లం పొడి వేసి కలుపుతుండాలి. (బెల్లం పొడి వాడుతుంటే మందపాటి పాత్రలో కొద్దిగా నీళ్ళు, బెల్లం పొడి వేసి లేత పాకం పట్టాలి. ఆ పాకాన్ని వేయించుకుంటున్న పిండిలో వేసి కలియబెట్టాలి.) బాగా ఉడుకుతుండగా యాలకుల పొడి జత చేయాలి. కమ్మని వాసన వచ్చి హల్వాలా తయారయ్యే వరకు కలిపి దింపేయాలి. ఒక పెద్ద ప్లేట్‌కి నెయ్యి పూసి, ఆ ప్లేట్‌లో హల్వా పోసి సమానంగా సర్థాలి. చిన్న బాణీలో నెయ్యి వేసి కరిగాక, జీడిపప్పులు, కిస్‌మిస్‌ వేసి వేయించి తీసివేయాలి. తయారు చేసుకున్న హల్వా మీద అలంకరించి వేడి వేడిగా అందించాలి.

5. సజ్జ పెసరట్టు :

కావలసిన పదార్థాలు : సజ్జలు-ఒక కప్పు, పెసలు-ఒక కప్పు, బియ్యం-గుప్పెడు, జీలకర్ర-అరటీస్పూను, ఇంగువ-పావు టీ స్పూను, తరిగిన పచ్చిమిర్చి-4, అల్లం తరుము-2 టీ స్పూన్లు, ఉప్పు-తగినంత, నూనె లేదా నెయ్యి-అట్లు కాల్చడానికి తగినంత

తయారీ విధానం : ఒక పాత్రలో సజ్జలు, పెసలు, బియ్యం వేసి శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి నాలుగు గంటల పాటు నానబెట్టి ఒంపేయాలి. గ్రైండర్‌లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. అల్లం తురుము, పచ్చిమిర్చి తరుగు, ఉప్పు, జీలకర్ర, ఇంగువ జత చేసి, మూత పెట్టి గంట సేపు నాననివ్వాలి. స్టౌ మీద పెనం ఉంచి వేడయ్యాక కొద్దిగా నెయ్యి వేయాలి. గరిటెడు పిండి తీసుకొని పెనం మీద సమానంగా పరచాలి. రెండు వైపులా నెయ్యి వేసి దోరగా కాల్చి ప్లేట్‌లోకి తీసుకోవాలి. కొబ్బరి చట్నీ, అల్లం చట్నీలతో తింటే రుచిగా ఉంటాయి.

- డా. యం. భవ్య మంజరి, డా. ఆర్‌.టి.వి. బాలాజీనాయక్‌, డా. యం శ్వేత,

డా|| బి.వి రాజ్‌కుమార్‌, పి. విజయ్‌ కుమార్‌, డి. క్రాంతి కుమార్‌,

కృషి విజ్ఞాన కేంద్రం, రుద్రూరు, ఫోన్‌ : 9989623830