మనం తీసుకొనే ఆహారంలో పోషకాలన్నీ సరిపడా ఉన్నప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం. కేవలం పోషకాలున్న పదార్ధాలు తీసుకోవటం మాత్రమే సరిపోదు. మనం తినే ఆహారంలో పోషకాలు నష్ట పోకుండా, సులభంగా జీర్ణమయ్యే పద్ధతుల్లో వండినదై ఉండాలి. కూరగాయలు చల్లటి ప్రదేశంలో నిలువ చేయాలి. వేడి వాతావరణంలో ఉంచడం వల్ల విటమిన్లు నశిస్తాయి.

కూరగాయలను తొక్క తీయక ముందు కడగాలి.

కూరగాయల తొక్కల కిందనే విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. కనుక తొక్కను వీలైనంత పలుచగా తీయాలి. సొరకాయ, గుమ్మడికాయ వంటివి శుభ్రంగా ఉన్నట్లయితే తొక్క తీయనవసరం లేదు.

కూరగాయలను చాలా పెద్ద ముక్కలుగా గానీ, మరీ చిన్న ముక్కలుగా గానీ కోయకూడదు. పెద్ద ముక్కలు ఉడికేందుకు చాలా సమయం పడుతుంది. కనుక పోషక విలువలు నష్టపోయే ప్రమాదం ఉంది. చిన్న ముక్కలు ఉడికే ప్రక్రియలో ఖనిజాలు, విటమిన్లు నశిస్తాయి.

కోసిన కూరగాయ ముక్కలను నీటిలో ఎప్పుడూ నానబెట్టకూడదు. కూరగాయలు నల్లబడకుండా నీటిలో వేసినప్పుడు, వీలైనంత తక్కువ నీటిలో వేయాలి. ఈ నీటిని కూరగాయలను వండేందుకు వాడవచ్చు.

కూరగాయలను వీలైనంత తక్కువ నీటిలో, తక్కువ సేపు ఉడికించాలి. వండేటప్పుడు మూతపెట్టాలి. దాని వాల్ల పోషక విలువలు నశించవు. కాబట్టి ప్రెషర్‌ కుక్కర్‌లో వండే పద్ధతి మంచిది.

ఏ వంటకం ఐనా వండిన వెంటనే తినడం మంచిది. తిరిగి వేడిచేయడం వల్ల విటమిన్లు నశిస్తాయి.

బంగాళాదుంపలు, కందగడ్డ, చిలగడ దుంపలను తొక్కతోనే ఉడికించాలి. ఉడికిస్తున్నప్పుడు తొక్క చిట్లినట్లయితే ఎక్కువ సేపు ఉడికించకూడదు. దానివల్ల విటమిన్లు నశించవచ్చు.

ఆకు కూరలను బాగా కడిగిన తరువాత కోయాలి. ఆకుకూరలను ముఖ్యంగా ప్రెషర్‌ కుక్కర్‌లోనే ఉడకబెట్టడం మంచిది. ముల్లంగి, క్యారెట్‌, బీట్‌ రూట్‌, నూల్‌ కోల్‌, కాలీఫ్లవర్‌ కూరగాయలకు ఉండే ఆకుల్లో అనేక పోషక పదార్ధాలు ఉంటాయి. భుజియ, పప్పు, చపాతీల వంటి వాటి తయారీలో ఈ ఆకులను వాడవచ్చు లేక సలాడ్‌ మాదిరిగా వాటిని తినవచ్చు. బీటాకెరోటిన్‌ ఎక్కువగా ఉన్న క్యారెట్‌ లేదా ఆకుకూరలను ఎక్కువ సేపు వేయించకూడదు.

టమాటాలు, దోసకాయలు, క్యాబేజీ, ముల్లంగి, క్యారెట్‌, ఉల్లిపాయలు మొదలైన వాటిని పచ్చిగా తినవచ్చును. వీటిలో పోషకపదార్ధాలు, విటమిన్లు అధికంగా ఉంటాయి. అయితే వీటిని తినేందుకు ముందుగా శుభ్రమైన నీటిలో బాగా కడగాలి. నీటిలో బాగా కడగడం వల్ల వాటికి గల మురికి మరియు క్రిమినాశక రసాయనాలు పోవడంతో పాటు ప్రమాదకరమైన బాక్టీరియా కూడా పోతుంది.

వంటసోడా వాడడం వల్ల బి గ్రూప్‌ విటమిన్లు నశిస్తాయి. కాబట్టి వంటసోడాను వాడకూడదు.

చింతపండు, నిమ్మరసం, టమోటాలను ఆకుకూరలు ఇతర కూరగాయలతో పాటు వండడం వల్ల విటమిన్లు నశించవు.

జల్లించని ముడి గోధుమపిండిని వాడటం వల్ల వాటిలోని బి-కాంప్లెక్స్‌ విటమిన్లు పొందవచ్చును.

వంటకు శుభ్రమైన నీటినే వాడాలి.

వాడడానికి ముందు గింజధాన్యాలను ఎక్కువ సార్లు కడగకండి.

మొలకెత్తిన లేదా పులియపెట్టిన ఆహారం తినడం మంచిది.

వాడగా మిగిలిన నూనెను మళ్ళీ మళ్ళీ వేడిచేయకండి.

అయోడైజడ్‌ ఉప్పును వాడిన వెంటనే డబ్బా మూతను గట్టిగా బిగించాలి.

- సి. సింధు, డా|| ఎం. కవిత, డి. వినోద్‌ నాయక్‌, డా|| పి. మంజరి,

డా|| ఎల్‌. రంజిత్‌ కుమార్‌, ఎస్‌. ఎం. శైలజ, కషి విజ్ఞాన కేంద్రం, పెరియవరం, నెల్లూరు జిల్లా, ఫోన్‌ : 9492891392