కోళ్ళ ఫారంలో వివిధ రకాల జీవుల వల్ల కలిగే రోగాలను గమనించవచ్చు. వీటి నుండి కోళ్ళని కాపాడుకోగలిగితే, కోళ్ళ పెరుగుదల మరియు ఉత్పత్తిని పరిరక్షించవచ్చు. కోళ్ళను ఈ జీవుల ద్వారా సంక్రమించే రోగాలు మరియు ఇతర హానికరమైన ప్రభావాల నుండి కాపాడే వ్యవస్థని జీవ సంరక్షణ (బయోసెక్యూరిటీ) అంటారు.

కోళ్ళను రోగాల నుండి కాపాడటానికి ముఖ్యంగా 3 విషయాలపై శ్రద్ధ వహించాలి.

1. కోళ్ళఫారం పరిశుభ్రత

2. సకాలంలో టీకాలు వేయటం

3. రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఇమ్యూన్‌ బూస్టర్‌ ద్రావణం లేదా మల్టీ-విటమిన్‌ ఇవ్వటం. ఈ 3 విషయాలు జాగ్రత్తగా పాటించినట్లయితే చాలా వరకు కోళ్లను రోగాల బారి నుండి కాపాడి, రోగాల నుండి నియంత్రించవచ్చు.

ముఖ్యమైన విషయాలు :

ఫారంలో అవాంచిత వ్యక్తులను రానివ్వకూడదు మరియు వచ్చిన వాళ్ళ పేర్లు రికార్డు చేసుకోవాలి. సాధారణంగా మందులు అమ్మేవాళ్ళు మరియు కోడి పిల్లలు అమ్మే వాళ్ళు ఫారంలో వస్తూ ఉంటారు. వాళ్ళ ద్వారా వేరే ఫారంలో ఉన్న రోగాలు మన ఫారంలోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ఒకే ఫారంలో అనేక వయసు గల కోళ్లు ఉన్నప్పుడు ముందుగా తక్కువ వయసు ఉన్న కోళ్లను సందర్శించి ఆ తరువాత పెద్ద వయసు గల కోళ్ళను సందర్శించాలి.

బయట మనుషులను కోళ్ళ షెడ్‌లోకి అనుమతించకూడదు.

ఒకవేళ వేరే ఫారం నుండి పరికరాలను తీసుకొనివస్తే గనుక, వాటిని శుభ్రంగా కడిగి మరియు డిసిన్ఫెక్టన్ట్‌ ద్వారా తుడిచిన తరవాతే ఫారంలో వాడాలి.

వాహనాలు కోసం డిసిన్ఫెక్టన్ట్‌ (1 గ్రా. పొటాషియం పర్మాంగనేట్‌ 1 లీటరు నీళ్ళలో కలిపి తయారుచేసుకోవచ్చు) స్ప్రే చేయాలి.

ఫారం చుట్టూ కంచె ఖచ్చితంగా ఉండాలి.

గేట్లు మరియు తలుపులను ఎప్పుడూ లాక్‌ చేసి ఉంచాలి.

మీ కోళ్ళు తప్ప వేరే పక్షులను (పావురాలు, బాతులు వంటివి) ఫారంలో ఉంచరాదు. ఫారంలో ఆవులు, గేదలు వంటి వేరే పశువులు పెంచినట్లయితే వాటి గహవసతి చుట్టూ కంచె కట్టి, అక్కడికి వచ్చి, పోయే దారి వేరేగా ఉండాలి.

ఫారం లోపలకి పెంపుడు కుక్కలను మరియు పిల్లులని రానివ్వకూడదు.

ఫారంలో ఎలుకలు మరియు పందికొక్కులను నియంత్రించటానికి ఎల్లప్పుడూ జాగ్రత్తలు తీసుకోవాలి. వాటి మూలంగా సాల్మొనెల్లా, ఇకోలై వంటి సూక్ష్మజీవులు సంక్రమించే అవకాశం ఉంటుంది.

ఫారం చుట్టూ గడ్డి, ఎండు ఆకులు, చెత్త లేదా పాత సామానులు ఎలుకులకు నివాసంగా పని చేస్తుంది.

ప్రతి ఫారంలో మరుగు దొడ్డి మరియు చేతులు కడుక్కునే సౌకర్యం ఉండాలి. షెడ్‌ బయట ఒక వాష్‌ బేసిన్‌ పెట్టించుకోవాలి మరియు చేతులు కడుక్కోవటానికి డెట్టాల్‌ హ్యాండ్‌ వాష్‌ పెట్టుకోవాలి. షెడ్‌ లోపలికి వెళ్ళే ముందు మరియు బయిటకి వచ్చిన తరువాత ప్రతిసారీ చేతులు కడుక్కోవాలి.

ఫారంలో వేసుకోవటానికి ప్రత్యేకంగా బట్టలు మరియు గం బూట్లు ఉంచుకోవాలి మరియు కాలానుకూలంగా వాటిని శుభ్రంచేయాలి.

ఫారం బయట ఒక ఫుట్‌పాథ్‌ నిర్మించి దాంట్లో పొటాషియం పర్మాంగనేట్‌ ద్రావణం నింపాలి. ఫారంలో ప్రవేశించేటప్పుడు మరియు నిష్క్రమించేటప్పుడు ఈ ద్రావణంతో కాళ్ళుకడుక్కోవాలి. ఈ ద్రావణాన్ని ప్రతి 4-5 రోజులకు మారుస్తూ ఉండాలి.

పౌల్ట్రీ ఫారంలో అనుసరించాల్సిన పారిశుద్య కార్యక్రమం :

పౌల్ట్రీ ఫారంలో క్రమం తప్పకుండా పారిశుద్ద్యం పాటించడమే వ్యాధుల నివారణకు ఏకైక మార్గం. ఒక మంచి హేచరీ నుంచి కోడిపిల్లలను సేకరించడమే ఆరోగ్యవంతమైన ఫారంకి పునాది. పరిశుభ్రతను కాపాడుకోగలిగితే మనం చాలా వరకు అనారోగ్యాలను నియంత్రించవచ్చు. దీని కొరకు ఒక నాణ్యమయిన డిసిన్ఫెక్టన్ట్‌ (క్రిమిసంహారక) కొని పూర్తి భారం దాని మీద వదిలేయకూడదు. షెడ్‌ని శుభ్రం చేయకుండా డిసిన్ఫెక్టస్ట్‌ వాడినట్లయితే దాని ప్రభావం ఉండదు. అందువల్ల కింద ఉన్న జాగ్రత్తలను పాటించవలసిన అవసరం ఎంతైనా ఉంది. కానీ లిట్టర్‌ మార్చకుండా, అదే లిట్టర్‌ మళ్ళీ మళ్ళీ ఉపయోగిస్తే కనుక ఈ జాగ్రత్తలు పనికి రావు.

ఒక కోళ్ళ బ్యాచ్‌ అయిపోయాక కొత్త కోళ్లను తెచ్చే ముందు అన్ని పాత కోళ్ళను తీసేయాలి.

ఒకవేళ ఫారంలో పేలు, పురుగులు వంటి సమస్యలు ఉంటే గనుక, నాణ్యమైన కీటకనాశినితో షెడ్‌ని శుభ్రంగా కడగాలి. ఇది కోళ్ళను తీసేసిన వెంటనే చేయాలి లేదంటే ఆ పురుగులు షెడ్‌లో కీటకనాశిని చేరని మూలల్లో మరియు పగుళ్ళలో దూరుతాయి మరియు కొత్త కోళ్ళకు సంక్రమిస్తాయి.

ఫారంలో నుండి కోళ్ళను తీసేసిన తరవాత, ఫారంలో ఎలులను నియంత్రించేందుకు ఒక కార్యక్రమం నిర్వహించాలి.

అన్ని రకాల దాణా ఫారంలో నుండి తీసేయాలి. ఒకవేళ ఒక బ్యాచ్‌కి వాడిన దాణా తరవాత బ్యాచ్‌కి వాడాలి అనుకుంటే గనుక పాత బ్యాచ్‌లో దాణా వల్ల వచ్చిన రోగాలను బాగా గమనించి వ్యవస్థీకృత పద్ధతిలో వాడుకోవాలి.

కోళ్ళ కొత్త బ్యాచ్‌ తెచ్చే ముందు పాత బ్యాచ్‌కి వాడిన లిట్టర్‌ పూర్తిగా తొలిగించాలి. వాహనం నుండి కూడా పూర్తిగా లిట్టర్‌ శుభ్రంగా తీసేయాలి.

దుమ్ము, ధూళి, మట్టిని షెడ్లో నుండి తుడిచేయాలి. కోళ్ళ షెడ్లో వాటికి వాడే మందులు పెట్టటానికి షెల్ఫ్‌ మరియు అల్మరా నిర్మిస్తారు. వాటిని కూడా బాగా శుభ్రం చేసుకోవాలి. గోడలు, స్తంభాలు మరియు పరదాలకు ఉన్న ధూళిని కూడా శుభ్రం చేయడం మర్చిపోకూడదు.

ఏ పాత్రలను అయితే కడగటం కుదరదో వాటిని సూర్యకాంతిలో ఎండ బెట్టాలి, లేదా, ఫ్యూమిగేషన్‌ చేసేటప్పుడు షెడ్‌లో ఉంచాలి.

షెడ్‌ నుండి లిట్టర్‌ని పూర్తిగా తొలగించిన తరవాత, ప్రెషర్‌ పైపులతో షెడ్‌ ఫ్లోర్‌ బాగా కడగాలి. ఒక మంచి డిటర్జెంట్‌ ఎంపిక చేసుకుని ఫ్లోర్‌ను, గోడలను మరియు పై కప్పుని కూడా కడగాలి. షెడ్లో ఫ్యాన్లు ఉన్నట్లయితే వాటిని ముందు పాలిథీన్‌ షీట్‌తో కప్పేసిన తరవాత జాగ్రతగా పై కప్పుని కడగాలి.

షెడ్లో పరదాలు ఉంటే కనుక వాటిని కూడా బాగా కడగాలి.

విద్యుత్‌ అమరికలు ఉన్న స్థానాలని నీళ్లతో జాగ్రతగా కడగాలి.

నీళ్ళ ట్యాంక్‌ సౌకర్యం ఉన్న ఫారంలో, ట్యాంకులను పూర్తిగా ఖాళీ చేసి వాటిని డిటర్జెంట్‌తో శుభ్రంగా కడిగి ఆ నీళ్ళను డ్రింకింగ్‌ సిస్టం నుండి బయిటకి పోనివ్వాలి. డ్రింకింగ్‌ సిస్టం నుండి పూర్తిగా డిటర్జెంట్‌ పోయేంతవరకూ నీళను పోనివ్వాలి.

విర్కొన్‌ ఎస్‌ మందుని నీళ్ళ ట్యాంక్‌లో 10 గ్రా./ఒక లీటరు నీళ్ళ చొప్పున కలిపి, మొత్తం డ్రింకింగ్‌ సిస్టం నుండి వెళ్ల నివ్వాలి. ఇలా చేయటం వల్ల డ్రింకింగ్‌ సిస్టం నుండి జిడ్డు మరియు మురికిని పూర్తిగా తొలగించటమే కాకుండా నీళ్ళ ద్వారా కలిగే రోగాలను కూడా నియంత్రించవచ్చు.

ఫారంలో వాడే గిన్నెలను డిటర్జెంట్‌ తో శుభ్రంగా కడిగిన తరవాత విర్కొన్‌ ఎస్‌ ద్రావణంలో 15 నిమిషాలు ముంచాలి మరియు ఎండలో పూర్తిగా ఆరబెట్టాలి.

బ్రూడర్‌ గార్డ్‌, ఫీడర్‌ మూత వంటి వసతులను కూడా బాగా శుభ్రం చేసిన తరువాతే కొత్త కోళ్ళ బ్యాచ్‌కి వాడాలి.

షెడ్‌కి వచ్చి, పోయే దారి, మేడ మీద మరియు మురికి కాలువలో షెడ్‌ కడిగిన నీళ్లు నిలువ ఉండ కూడదు.

షెడ్‌కి ఏమైనా రిపేర్‌ పని ఉన్నా, మురికి కాలువ శుభ్రం చేయటం వంటి పనులు ఏమైనా ఉన్నా అవి ఈ సమయంలో చేసుకోవాలి. షెడ్లో కోళ్ళు ఉన్నప్పుడు ఇటువంటి పనులు చేయటం కష్టమే కాకుండా కోళ్ళు కూడా ఒత్తిడికి గురవుతాయి.

షెడ్‌ని కడిగిన తరవాత తడి శుభ్రంగా ఆరనివ్వాలి. ఆరిన తరవాత షెడ్‌లో క్రిమిసంహారక మందు స్ప్రే చేయాలి. స్ప్రే చేయటానికి విర్కొన్‌ ఎస్‌ మందుని 10 గ్రా./ఒక లీటరు నీటికి చొప్పున కలిపి, నీటి యొక్క ఉష్ణోగ్రత సుమారుగా 300 సెం. ఉండాలి. ఈ విధంగా తయారు చేసిన 1 లీటరు ద్రావణం 3 చ.మీ. స్థలంలో స్ప్రే చేయటానికి సరిపోతుంది.

10,000 చ.అ.లకు 100 గ్రా. విర్కొన్‌ ఎస్‌30 లీటరు నీళ్ళలో కలిపి స్ప్రే చేయాలి (ఈ మోతాదు వైరస్‌ సంక్రమణ ఎక్కువ ఉన్న కోళ్ళ ఫారంలో వాడాలి). సామాన్య ఫారంలో 30 గ్రా. విర్కొన్‌ ఎస్‌ 30 లీటర్ల నీళ్ళలో కలిపి స్ప్రే చేస్తే చాలు.

ఈజాగ్రత్తలు పాటించగలిగితే కనుక పాత కోళ్ళ బ్యాచ్‌లో వ్యాపించిన అతి సూక్ష్మజీవుల (వైరస్‌) వల్ల కలిగే రోగాలను (గంబోరో, కొక్కెర, మేరేక్స్‌) 80 శాతం వరకు నివారించవచ్చు.

ఇవన్నీ చేసిన తరవాత, ''ఫ్యూమిగేషన్‌'' చేయటం అత్యంత అవసరం.

ఫ్యూమిగేషన్‌ పద్ధతి :

ఫ్యూమిగేషన్‌కి ఫార్మలిన్‌ అనే రసాయనాన్ని వాడతారు. ఈ రసాయనం నుండి నిరంతరంగా ఫార్మాల్డిహైడ్‌ ఆవిరి వస్తూ ఉంటుంది. ఈ పద్ధతి నిర్వహించే ముందు కొన్ని భద్రతా చర్యలను తప్పకుండా పాటించాలి

వాతవరణంలో తేమ శాతం 70-80 శాతం ఉండాలి.

షెడ్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 210 సెంటిగ్రేడ్‌ ఉండాలి. ఇంతకన్నా తక్కువ ఉష్ణోగ్రత ఉంటే కనుక ఫార్మాల్డిహైడ్‌ ఆవిరి ఉత్పత్తి అవదు. అందువల్ల చలి కాలంలో ఫ్యూమిగేషన్‌ చేయాలి అనుకుంటే గనుక పగటి వేళ చేయాలి.

షెడ్‌ని కడిగిన వెంటనే ఫ్యూమిగేషన్‌ చేయటం మంచిది. ఎందుకంటే కడిగిన తరవాత షెడ్‌లో తేమ శాతం పెరిగి పోతుంది.

షెడ్‌ని పూర్తిగా సీల్‌ చేసేయాలి. ఎక్కడ నుండి కూడా, కొంచం కూడా గాలి బైటకి రాకూడదు. ఇలా 24 గంటలు వరకు ఉండేట్టుగా జాగ్రత్త వహించాలి.

ఫ్యూమిగేషన్‌ చేసే విధానాలు :

1. ఫార్మలిన్‌ మరియు పొటాషియంపర్మాంగనేట్‌ :

ఈ పద్ధతిలో తీవ్ర రసాయనిక చర్యల వల్ల వేడి మరియు ఫార్మలిన్‌ వాయువు ఉత్పత్తి అవుతుంది. 25 క్యూబిక్‌ మీటరు ప్రాంతానికి 1 లీటరు ఫార్మాలిన్‌ సరిపోతుంది. ఇందులో 3:2 నిష్పత్తిలో పొటాషియం పర్మాంగనేట్‌ కలపాలి. అంటే 1 లీటరు ఫార్మలిన్లో 625 గ్రా. పొటాషియం పర్మాంగనేట్‌ కలపాలి. ఈ రసాయనిక చర్య తీవ్రత ఎక్కువ ఉంటుంది గనుక ఒక పాత్రలో ముక్కాల లీటరు కన్నా ఎక్కువ వేయకూడదు. ఈ రసాయనిక చర్య కొరకు ఏ పాత్ర అయితే నిర్ధారించారో ఆ పాత్ర లోతు ఫార్మలిన్‌ స్థాయి కన్నా 3 ఇంతలు ఉండాలి. పాత్ర వ్యాసము దాని లోతు అంత ఉండాలి. ఇలా చేయటం వల్ల రసాయనిక చర్యలో ఉత్పత్తి అయ్యే బుడగలు బైటకి రాకుండా ఉంటాయి. ఈ పాత్ర మట్టి లేదా ధాతుది అయి ఉండాలి. ఉదాహరణకు 1700 క్యూబిక్‌ మీటరు ప్రాంతానికి 68 లీటరు ఫార్మాలిన్లో 45 కిలోల పొటాషియం పర్మాంగనేట్‌ కలపాలి.

ఈ పద్ధతి విధానం :

షెడ్‌ పరిమాణాన్ని క్యూబిక్‌ అడుగులలో కొలవాలి (అంటే పొడవుIవెడల్పుIఎత్తు).

షెడ్‌ని పూర్తిగా మూసేసి బయిటకి వెళ్ళే ఒక మార్గం మాత్రమే విడిచి పెట్టాలి.

ఇప్పుడు పాత్రలో 760 గ్రాముల పొటాషియం పర్మాంగనేటు తీసుకోవాలి.

ఇటువంటి పాత్రలు ఒక్కొక్కటి 10 అడుగుల దూరంలో పెట్టాలి (ఉదాహరణకు 100 అడుగుల పొడవు ఉన్న షెడ్‌లో 9 పాత్రలు పెట్టాలి).

ఇప్పుడు ఇద్దరు మనుషులు ముఖం పైన గుడ్డ కట్టుకుని, లెదర్‌ బూట్లు మరియు చేతి తొడుగులు మరియు కళ్ల జోడు పెట్టుకుని ఫార్మలిన్‌ని ఒక బాల్చలో తీసుకుని సిద్ధంగా ఉండాలి. ఫార్మలిన్‌ని పాత్రలోకి వేయటానికి ఒక కొలిచే గరిటి (1.25 లీటరు)కూడా తీసుకోవాలి. ఈ గరిటికి ఒక పక్క హేండిల్‌ మరియు ఇంకో పక్క కొలిచే చిప్ప ఉండాలి. హేండిల్‌ 1 మీటరు పొడువు ఉంటే మంచిది.

ఇప్పుడు రెండు చివరల నుండి మనుషులు కొలిచే గరిటితో ఫార్మలిన్‌ని పూర్వంగా పెట్టిన పొటాషియం పర్మాంగనేట్‌ పాత్రలో వేయాలి. ఈ పని ఎంత వేగంగా అయితే అంత వేగంగా చేయాలి. కాని నిర్ధారించిన ఫార్మలిన్‌ తక్కువ అవకుండా పడాలి.

ఇప్పుడు షెడ్‌లో నుండి బయిటకి వచ్చి పూర్తిగా షెడ్‌ని మూసివేయాలి.

ఫార్మలిన్‌ ఫ్యూమిగేషన్‌ :

ఈ పద్ధతిలో సమాన మోతాదులో ఫార్మలిన్‌ని నీళ్లలో కలపాలి. ఈ విధంగా కలిపినప్పుడు ఫార్మల్డిహైడ్‌ ఆవిరి ఉత్పత్తి అయ్యి అన్ని రకాల రోగ కారక క్రిములను నాశనం చేస్తుంది. 28 మి.లీ. నీళ్లు ఫార్మాలిన్లో 28 మి.లీ. లీటరు కలిపితే 25 క్యూబిక్‌ మీటరు గదికి సరిపోతుంది. ఫార్మల్డిహైడ్‌ ఆవిరి మరియు ఈ రసాయనిక చర్యలో ఉత్పత్తి అయ్యే ద్రావణం ప్రాణాంతకమైనవి కనుక, ఈ పనిని ఎంత త్వరగా చేయగలిగితే అంత త్వరగా చేయాలి, ఎక్కువ సేపు ఈ రసాయనాల సంపర్కంలో ఉండకూడదు మరియు పని అయిపోయేక శుభ్రంగా కాళ్లు, చేతులు కడుక్కోవాలి.

- డా|| పి.మంజరి, శాస్త్రవేత్త, కృషి విజ్ఞాన కేంద్రం, పెరియవరం

డా|| ఇక్బాల్‌ హైదర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, పశువైద్య కళాశాల, గన్నవరం

డా|| ఎల్‌.రంజిత్‌ కుమార్‌, శాస్త్రవేత్త, కృషి విజ్ఞాన కేంద్రం, పెరియవరం

శ్రీ విద్యా రాణి ఎన్‌., శాస్త్రవేత్త, కృషి విజ్ఞాన కేంద్రం, పందిరిమామిడి