విత్తన బ్రహ్మ ‘కొంగర రమేష్‌

ఆయన విద్యావంతుడు కాదు, ధనవంతుడూ కాదు, సాధారణ మధ్యతరగతి రైతు కుటుంబీకుడు. గుంటూరు జిల్లా, పెదకాకుమాను గ్రామానికి చెందిన కొంగర రమేష్‌, తన సృజనాత్మకశక్తి, సామాజిక బాధ్యతను రంగరించి విత్తన ఉత్పత్తి రంగంలో తలపండిన శాస్త్రవేత్తలకే ‘‘దిక్సూచి’’గా మారారు. చిన్నతనంలో తండ్రి కాకుమాను గ్రామ పంచాయితీ సర్పంచ్‌గా ఉన్న సమయంలో ఉన్న కొద్దిపాటి వ్యవసాయాన్ని పట్టించుకోలేదు. దీనితో బాల్యంలోనే విద్యాభ్యాసానికి స్వస్తిచెప్పి, వ్యవసాయంపై దృష్టి కేంద్రీకరించిన రమేష్‌ బాపట్ల వ్యవసాయ కళాశాల శాస్త్రజ్ఞుల సహచర్యంతో విత్తనరంగంలో ‘‘ఏకలవ్యుడి’’లా ముందుకు వెళ్ళారు. వ్యవసాయరంగంలో ఒడిదుడుకులు కష్టనష్టాలను చూస్తూ, తన అనుభవాలను రంగరించి విత్తనాల తయారీకి నడుంకట్టారు. గుంటూరుజిల్లాలో ప్రధాన వాణిజ్య పంటగా ఉన్న పత్తిసాగులో ముందుకు వెళ్ళే రైతులకు అవరోధంగా ఉన్న పత్తివిత్తనాలపై దృష్టి సారించారు. ప్రారంభంలో మొక్కజొన్న, సజ్జవిత్తనాలను ఉత్పత్తి చేసిన రమేష్‌ తన ప్రతిభతో పత్తిలో సెలక్షన్‌ 1, సెలక్షన్‌ 2, సెలక్షన్‌ 3 అనే మూడు రకాల విత్తనాలను ఉత్పత్తి చేశారు. రికార్డు స్థాయిలో ఎకరాకు 24 క్వింటాళ్ళ దిగుబడిని సాధిస్తుండడంతో సుదూర ప్రాంతాలైన వరంగల్‌, నల్గొండ, ఖమ్మం, కృష్ణా జిల్లాల మెట్ట ప్రాంతాల రైతులు ఆకర్షితులయ్యారు.

1990 సంవత్సరంలో ‘‘రెడ్‌ టాప్‌ – 365’’ అనే మిర్చి విత్తనాన్ని తయారు చేసి, వేసవి ఉష్ణోగ్రతలను తట్టుకునే విధంగా, దిగుబడి అధికమయ్యేందుకు కృషి చేశానని, ఈ రకం మిర్చికోత సమయంలో వస్తున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని, ఇటీవల గుత్తులు గుత్తులుగా పండే పాండవ అనే మిరపరకాన్ని అభివృద్ధి చేశానని తెలిపారు. ఈ పాండవ రకం తక్కువ కారం ఉండి, ఎక్కువ రంగుతో మంచి నాణ్యమైన కాయలను ఇస్తుంది. ఈ రకం విత్తనాలను ఎకరానికి 60 వేలనుండి లక్ష మొక్కలు వచ్చేటట్లు ఎదబెట్టుకోవాలి. ఒక్కొక్క మొక్కకు 40 నుండి 50 కాయలు కాపు వచ్చి ఒకేసారి కోత కోయడానికి వీలవుతుంది. ఈ రకాన్ని చీదీూGR సంస్థలో రిజిస్టర్‌ చేశానని తెలిపారు. రోజు రోజుకి పెరుగుతున్న కోత కూలీల ఖర్చుని దృష్టిలో ఉంచుకొని పెసర, మినుములాగ పండిరచగలిగే ఈ పాండవ రకాన్ని రైతులకు అందుబాటులోకి తెచ్చానని తెలిపారు. ప్రముఖ నిర్మాణసంస్థ నవయుగ విశ్వేశ్వరరావు ఉదారస్వభావంతో విశాఖ సమీపంలోని తర్లుపాడులో ఇచ్చిన 40 ఎకరాల ప్రాంగణంలో సాంప్రదాయ వ్యవసాయం చేస్తున్న కొంగర రమేష్‌ 15 రకాల మధురమైన మామిడి ఫలాలను పరపరాగ సంపర్కం ద్వారా మామిడి హైబ్రీడ్స్‌ను అభివృద్ధి చేశారు. రమేష్‌ అభివృద్ధి చేసిన మామిడి రకాలలో ముఖ్యమైనవి మూడిరటిని ఇక్కడ ప్రస్తావిస్తున్నాం

మొదటి రకం : ఇంకా నామకరణం చేయని ‘‘ఆరు’’ రకం మామిడి ఫలం

దీని ప్రత్యేకతలు :

– ఇమాంపసంద్‌ | చిన్న రసాలతో క్రాస్‌ చేయించి సృష్టించిన మేలురకం మామిడి

– కాయ తోలు పలుచగా ఉండి, అరటి పండు లాగ వలుచుకోవచ్చు.

– రసం కాయగానూ, టేబుల్‌ రకంగానూ వినియోగించుకోవచ్చు.

– 20 టి.ఎస్‌.ఎస్‌. (సాలిబుల్‌ షుగర్‌) ఉండడంతో అద్భుతమైన రుచి

– మంచి సువాసనతో పాటు మధురమైన రుచి

– అన్ని రకాల కంటే ముందు ఏఫ్రిల్‌లోనే పక్వానికి వస్తుంది.

– సాధారణ మామిడి చెట్ల కంటే భిన్నంగా ఎకరానికి 200 మొక్కలు వేయవచ్చు.

రెండోరకం :ఆమ్రపాలి | చిన్నరసాలను క్రాస్‌చేసి అభివృద్ధిపరచినవి.

దీని ప్రత్యేకతలు :

– మంచిరంగు, రుచి వీటి స్వంతం

– చెట్టుకాపు విపరీతంగా ఉంటుంది.

– చెట్టు సన్నగా, పొడుగ్గా ఉంటుంది

– మే మధ్యలో కాయ కోతకు వస్తుంది.

– ఈ రకాన్ని రసం కొరకు విశిష్టంగా ఉపయోగించుకోవచ్చు.

మూడోరకం : తోతాపురి | ఇమాంపసంద్‌ క్రాస్‌ చేస్తే వచ్చిన రకం

– మిగిలిన ఫలాల్లాగానే రంగు, రుచి

– జూన్‌ 15 నాటికి అంటే కాపు ఆఖరుకి పంట వస్తుంది

– కాయ ఎక్కువకాలం నిల్వ ఉండి టేబుల్‌ వెరైటీగా పేరొందింది.