సంపాదకీయం

మహిళా సాధికారత ఘనత ఎన్‌టిఆర్‌దే!

దేశంలో మొట్టమొదటి సారిగా మహిళా సాధికారత, మహిళా హక్కుల పరిరక్షణ, మహిళా సంక్షేమానికి సాకారం చుట్టిన ఘనత తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు దేనని గర్వంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం సమాజంలో మహిళల హత్యలు, అరాచకాలు ప్రబలి మహిళాలోకం విలవిలలాడుతున్న సమయంలో పురుషులతో సమానంగా మహిళలకు ఆస్తి హక్కు కల్పించి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని కల్పించిన ఘనత డా|| ఎన్‌టిఆర్‌దేనని గుర్తుచేసుకోక తప్పనిస్థితి. అనాదిగా మహిళను ఆటవస్తువుగా చూపిస్తూ, చిన్నచూపుతో కించపరచే వ్యవస్థ నుండి ఆర్ధిక స్వావలంబన కల్పించి ఆస్తిహక్కుతో ఆదరించిన ఎన్‌టిఆర్‌ పూజనీయుడు. అంతేకాకుండా గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యాన్ని సాకారం చేయడంలో కూడా ఎన్‌టిఆర్‌ గణనీయమైన కృషిచేశారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ కల్పించి వారిని రాజ్యాధికారానికి చేరువ చేయడంలో ఆయన విజయం సాధించారు. మండల వ్యవస్థ ఏర్పాటు ద్వారా ఉమ్మడి రాష్ట్రంలో 1107 మండలాలను ఏర్పాటుచేసి మండల పరిషత్‌ అధ్యక్షులుగా, ఎంపిపి, జెడ్‌పిపి సభ్యులుగా అధిక శాతం మంది మహిళలను అధికారంలోకి తీసుకురావడం ద్వారా మహిళల ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపుచేశారు. పొదుపు సంఘాల ఏర్పాటు, డ్వాక్రా ఉద్యమాలు ఆ తరువాత ప్రాచుర్యంలోకి వచ్చి దేశ రాజకీయ స్థితిగతులను అమాంతం మార్చివేశాయి. మహిళా విశ్వ విద్యాలయాల ఏర్పాటు మరో ముందడుగు.

తెలుగు భాషాభిమాని అయిన ఎన్‌టిఆర్‌, పొట్టిశ్రీరాములు, తెలుగు విశ్వ విద్యాలయం, విజయవాడలో ఆరోగ్యవిశ్వ విద్యాలయాలను స్థాపించి, దానితోపాటు తిరుపతిలో పద్మావతి మహిళా విశ్వ విద్యాలయాన్ని నెలకొల్పి తెలుగు జాతి చరిత్రలో ఒక కొత్త చరిత్ర సృష్టించారు. మహిళలపై అత్యాచారాల నిరోధకానికి కృషి జరిపిన దేశంలోని అతికొద్ది ముఖ్యమంత్రుల్లో ఎన్‌టిఆర్‌ ఒకరు. ఆయన స్పూర్తిదాయక నాయకత్వం మహిళలకు పూర్తి ఆత్మవిశ్వాసాన్ని కలుగచేయగా, ఆయన సభలో ప్రసంగిస్తూ నా తెలుగింటి ఆడపడుచులని గర్వంగా సంభోదించి మహిళలను ఉత్తేజపరచేవారు. మద్యపాన వ్యసనం వల్ల ఆరోగ్యాన్ని కోల్పోయి ఆర్దికంగా దెబ్బతిని సర్వం కోల్పోతున్న కుటుంబాలలోని మహిళలకు ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చిన విధంగా మద్యపాన నిషేదాన్ని అమలుచేసి చరిత్రకెక్కారు. ఈ రకంగా మహిళా సేవలో బహుముఖ కర్తవ్యాలను నిర్వహించి ఆంధ్రుల అన్నగా ఎన్‌టిఆర్‌ గొప్పస్పూర్తిని రగిలించి మహిళాసాధికార స్పూర్తిగా ఉన్న ఆనాటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీని ధీటుగా ఎదుర్కొన్నారు. తాజాగా మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆతిద్యరాజధానిగా పేరొందిన హైదరాబాద్‌ చుట్టుపట్ల, మరికొన్ని జిల్లాలపరిధిలో జరుగుతున్న మహిళాహత్యలు క్షమార్హం కానివి. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో మహిళాతాసీల్దారును ఆఫీసు ప్రాంగణంలోనే పెట్రోలు పోసి దగ్దం చేయడం, పశుసంవర్ధక శాఖాధికారి, ప్రతిభావంతురాలు ప్రియాంకా రెడ్డిని దారికాచి, కిడ్నాప్‌ చేసి, దారుణంగా హత్యచేయడం, 24 గంటల్లోనే మరో హత్య జరగడం చాలా బాధాకరమైన అంశాలు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెంది, అంతరిక్షంలోకి సైతం మహిళలు దూసుకువెళ్ళి ఆకాశంలో సగం, భూమిపై సగంగా తమ సాధికారతను అంచల వారీగా పెంచుకుంటున్న నేపద్యంలో పురుషాధిక్య సమాజం వారిపై దాడులు చేయడం హత్య చేయడం ప్రగతి నిరోధకాంశమే. తల్లిగా, చెల్లిగా, సామాజిక బాధ్యత కలిగిన పౌరురాలిగా మగవాడితో సమానంగా దూసుకువెళుతున్న మహిళాలోకంపై దాడిచేసి, అవమానపరచి, హత్యలు చేసి, మానవ మృగాలు ఏం సాధించదలచుకున్నాయో ఈ ప్రతీప శక్తుల రెచ్చిపోయే ధోరణి సమాజానికి ఎంత హాని చేస్తుందో మనం ఆందోళనతో ఆవేదన వ్యక్తం చేయడం కాకుండా కలసిబతికే నవీన సమాజంలో స్త్రీ, పురుషులు తమ బాధ్యతలను, హక్కులను సరైన రీతిలో తెలుసుకొని తమ పరిధుల మేరకు వివక్షత లేని సమాజం కొరకు కృషి జరుపడానికి, మెరుగైన సమాజస్థాపనకు ప్రతి ఒక్కరూ నడుంకట్టాల్సిన అవసరం ఉంది.