ఈ సంవత్సరం పంటల మలిదశలో విస్తారంగా కురిసిన వర్షాలు ఖరీఫ్‌ పంటలను బలోపేతం చేసి రైతుల్లో ఉత్సాహాన్ని నింపినప్పటికీ క్షేత్ర స్థాయిలో కలుపు నివారణ సమస్యగా మారింది. వివిధ పంటల్లో కలుపు మొక్కలను సమూలంగా నివారించనందువల్ల ఈ కలుపు మొక్కల విత్తనాలు భూమిలో రాలి, రబీ పంటల్లో ప్రధాన సమస్యగా మారడానికి అవకాశం ఉంది. సుస్థిరమైన దిగుబడులు సాధించడానికి సమగ్రపోషక యాజమాన్యంతో పాటు సమగ్ర కలుపు నివారణ కూడా ప్రధానమైనది.

పంట దిగుబడులను తగ్గించే కారకాలను చూసినట్లయితే కేవలం కలుపు మొక్కల ద్వారా 30-50 శాతం వరకు నష్టం జరుగుతుంది. ఒక్కోసారి కలుపు మొక్కల వల్ల 100 శాతం నష్టం రావడానికి కూడా అవకాశం ఉంది.

తెలంగాణలో రబీలో ప్రధానంగా వరి, వేరుశనగ, పప్పుశనగ, మొక్కజొన్న, మినుము, పెసర పంటలను సాగు చేస్తున్నారు. ఈ పంటల్లో దుక్కి తయారీ నుండి సమగ్ర కలుపు యాజమాన్యం పాటించడం ద్వారా పంట సున్నిత దశల్లో కలుపు వల్ల పోటీ లేకుండా చేసి అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంది.

ఈ పంటను రబీలో కూడా 1.75 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. పంటను విత్తిన 45 రోజుల వరకు కలుపు నివారణకు కీలక దశగా పరిగణిస్తాం.

విత్తిన వెంటనే అట్రాజిన్‌ ఎకరానికి 800 గ్రా. (తేలిక నేలలు) నుండి 1000 గ్రా. (బరువు నేలలో)లేదా పెండిమిధాలిన్‌ ఎకరానికి 1 లీ. నుండి 1.25 లీ. లేదా ఆక్సీప్లోర్‌ఫెన్‌ ఎకరానికి 250 మి.లీ. తేమగల నేలలో 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. 25-30 రోజులప్పుడు అంతరకృషి చేసినట్లయితే కలుపును సమూలంగా నివారించుకోవచ్చు.

పైరు మరియు కలుపు మొలకెత్తిన తరువాత 15-20 రోజుల సమయంలో ఎకరానికి టెంబోట్రియోన్‌ (లాడిస్‌) 115 మి.లీ + 400 గ్రా. అట్రాజిన్‌ మిశ్రమాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసినట్లయితే అన్ని రకాల కలుపు మొక్కలను నివారించవచ్చు.

ఒకవేళ పొలంలో వెడల్పాకు కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నట్లయితే 2, 4-డి సోడియం సాల్ట్‌ ఎకరానికి 400 గ్రా. చొప్పున కలిపి పిచికారి చేయాలి.

రబీలో పప్పుశనగ 1.2 లక్షల హెక్టార్లలో పెసర, మినుము పంటలను 2000 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. విత్తిన తరువాత 25-30 రోజుల వరకు కలుపు సున్నిత దశ

విత్తిన వెంటనే ఎకరానికి ఒక లీటరు పెండిమిథాలిన్‌ లేదా అలాక్లోర్‌ 1.5 లీటర్లు, 200 లీటర్లు నీటిలో కలిపి తేమగల నేలపై పిచికారి చేసుకోవాలి. విత్తిన 20-25 రోజులప్పుడు గడ్డిజాతి మొక్కలు ఎక్కువగా ఉంటే ఎకరానికి ఫినాక్సాప్రాప్‌ ఇథైల్‌ 250 మి.లీ. లేదా క్విజలాఫాప్‌ఇథైల్‌ 400 మి.లీ. లేదా ప్రొపాక్విజాఫాప్‌ 250 మి.లీ. ఏదో ఒక దానికి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.

గడ్డిజాతి మరియు వెడల్పాకు కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నప్పుడు ఎకరానికి 250 మి.లీ. ఇమాజితాపిర్‌ను పంట మొలకెత్తిన 15-20 రోజుల మధ్యన పిచికారి చేయాలి. ఈ మందు పిచికారి చేసినప్పుడు మినుము, పెసర పైరు పెరుగుదల తాత్కాలికంగా ఒక వారం ఆగిపోతుంది. పప్పుశనగలో ఇమాజితాపిర్‌ మందును వాడరాదు. కలుపు మొక్కలు 2-3 ఆకుల దశలో ఉన్నట్లయితే నివారణ సమర్థవంతంగా ఉంటుంది.

బంగారు తీగ సమస్యగా ఉన్న ప్రాంతాల్లో నాణ్యమైన విత్తనాన్ని కొనుగోలు చేయాలి. ఎందుకంటే బంగారు తీగ విత్తనాల్లో (కల్తీ విత్తనం) వస్తుంది. విత్తిన వెంటనే పెండిమిథాలిన్‌ ఎకరాకు 1.0-1.25 లీటర్ల మందును పిచికారి చేసుకొని మళ్ళీ 15-20 రోజుల తరువాత ఇమాజితాపిర్‌ 250 మి.లీ. మందును పిచికారి చేసుకోవాలి.

రబీలో వేరుశనగ 1.5 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేయబడుతుంది. విత్తిన తరువాత 45 రోజుల వరకు కలుపుకు సున్నిత దశ, కలుపును సకాలంలో నివారించనట్లయితే పొలం గట్టిపడి ఊడలు దిగడానికి అడ్డంకిగా మారి తద్వారా దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది.

విత్తిన వెంటనే ఎకరానికి 1.0-1.25 లీటర్ల పెండిమిథాలిన్‌ లేదా 1.5 లీటర్ల అలాక్లోర్‌ లేదా 200 మి.లీ. ఆక్సిఫ్లోర్‌ పెన్‌లలో ఏదో ఒక మందును తేమగల నేల మీద పిచికారి చేసుకోవాలి.

విత్తిన 15-20 రోజులకు పొలంలో అన్ని రకాల కలుపు ఉన్నట్లయితే ఎకరానికి 300-400 మి.లీ. ఇమాజితాపైర్‌ లేదా 40 గ్రా. ఇమాజితాపైర్‌ + ఇమాజామాక్స్‌ మందు మిశ్రమాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.

గడ్డిజాతి మొక్కలు ఎక్కువగా ఉంటే ఎకరానికి క్వజాలాఫాప్‌ ఇథైల్‌ 400 మి.లీ. లేదా ప్రొపాక్విజాఫాప్‌ 250 మి.లీ. లేదా ఫానాక్సాప్రాప్‌ ఇథైల్‌ 250 మి.లీ. ఏదో ఒక మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. విత్తిన 45 రోజుల తరువాత ఎలాంటి అంతర సేద్యం చేయకూడదు. అలాచేయనిచో ఊడలు దెబ్బతిని దిగుబడులు తగ్గుతాయి.

మన రాష్ట్రంలో రబీలో వరి పంటను అత్యధికంగా 5.4 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగుచేస్తున్నారు. ఈ మధ్య విస్తారంగా కురిసిన వర్షాల వల్ల కూడా రబీ విస్తీర్ణం పెరగడానికి అవకాశం ఉంది. సాధారణంగా నవంబరులో రైతాంగం రబీ పంటకు నారు పోసుకుంటారు. ప్రధాన పంటతో పాటు నారుమడిలో కూడా కలుపు నివారణ చాలా ముఖ్యం.

నారుమడిలో బ్యూటాక్లోర్‌ 50 మి.లీ. లేదా ప్రెటిలాక్లోర్‌+సేఫనర్‌ 25 మి.లీ. ఏదైనా ఒక దాన్ని ఎకరాకు సరిపడా నారుమడికి 5 లీటర్ల నీటిలో కలిపి విత్తిన 8-10 రోజులకు పిచికారి చేసుకోవాలి. లేదా బిస్‌పైరిబాక్‌ సోడియం అనే కలుపు మందును 0.5 మి.లీ. ఒక లీటరు నీటికి కలిపి విత్తిన 8-10 రోజులకు పిచికారి చేసుకోవాలి.

నారుమడిలో ఊద, ఒడిపి వంటి గడ్డిజాతి కలుపు ఉన్నట్లయితే విత్తిన 15-20 రోజులకు సైహలోపాప్‌-పి బ్యుటైల్‌ అనే కలుపు మందును 1.5 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.

కలుపు మందులను వేరుగా నిల్వ చేసుకోవాలి. లేదా రైతు పొరపాటున పురుగు మందుకు బదులు లుపు మందు పిచికారి చేయడం జరిగి పంట నష్టపోయే అవకాశం ఉంటుంది.

విత్తిన వెంటనే వాడే కలుపు మందులను వెనుకు నడుస్తూ పిచికారి చేయాలి.

విత్తిన వెంటనే వాడే కలుపు మందులను ఫ్లాట్‌ఫాన్‌ లేదా ప్లడ్‌జడ్‌ నాజిల్‌ను ఉపయోగించి పిచికారి చేయాలి.

ఏ పంటకు సిఫార్సు చేసిన కలుపు మందులను ఆ పంటలోనే నిర్ధారించిన మోతాదులో మాత్రమే వాడాలి.

కలుపు మందులు పిచికారి చేసేటప్పుడు చుట్ట కాల్చడం, నీరు తాగడం, తినడం వంటి పనులు చేయకూడదు.

ఒక ఎకరాకు 200 లీటర్ల మందు నీరు వాడాలి.

పై మెళకువలు పాటించడం ద్వారా రబీ పంటలో పైరు సున్నిత దశల్లో కలుపును నివారించి అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంది.

బి. మాధవి, సేద్య విభాగ శాస్త్రవేత్త, ఎన్‌. నవత, సేద్య విభాగ శాస్త్రవేత్త, బి. రాజు, మృత్తిక శాస్త్రవేత్త,

పి. మధుకర్‌ రావు, సేద్య విభాగ శాస్త్రవేత్త, ఆర్‌. ఉమారెడ్డి, సహపరిశోధనా సంచాలకులు,

పి. రవి, మృత్తిక, శాస్త్రవేత్త, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, జగిత్యాల, పొలాస