పంట ఉత్పాదకతను పెంచడానికి విత్తన నాణ్యత ఎంతో కీలకమైనది. నాణ్యమైన విత్తనాన్ని వాడడం ద్వారా 15-20 శాతం అధిక దిగుబడులను సాధించవచ్చు. నాణ్యమైన విత్తనం అనేది ప్రణాళికాబద్ధంగా శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానంతో ఉత్పత్తులు నిర్ధేశించిన నాణ్యతాప్రమాణాలు కలిగి ఉంటుంది. నాణ్యమైన విత్తనం అంటే జన్యు స్వచ్ఛత, మంచి మొలక శాతంతో పాటు మంచి భౌతిక స్వచ్ఛత, వివిధ రకాల తెగుళ్ళు, పురుగులు ఆశించకుండా ఉండాలి. రైతులు సాధారణంగా తమకు తాముగా ఉత్పత్తి చేసుకున్న విత్తనాలను ఇతర రైతుల నుండి లేదా వివిధ ప్రభుత్వ / ప్రభుత్వేతర సంస్థల నుండి కొనుగోలు చేసిన విత్తనాలను వినియోగిస్తుంటారు. సుమారు 25 శాతం విత్తనాలను రైతులు సొంతగా తయారు చేసుకొని వాడతారు. మిగిలిన 75 శాతం విత్తనాన్ని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నుండి కొని వినియోగిస్తారు. ప్రభుత్వ, ప్రైవేటు విత్తనోత్పత్తి సంస్థలు నాణ్యమైన విత్తనాన్ని ఉత్పత్తి చేసినప్పటికీ అది రైతులకి చేరే సమయానికి ఏదో ఒక దశలో కల్తీ బారిన పడుతుంది.

రైతులు తాము కొనుగోలు చేసినా లేదా తమ పొలంలో పండించిన విత్తనాలను విత్తడానికి ముందే కొన్ని పరీక్షలను నిర్వహించి విత్తన నాణ్యతను తమ స్థాయిలో తెలుసుకోవచ్చు.

వాటిలో ముఖ్యమైన పరీక్షలు :

లక్షణాలు గమనించడం :

విత్తనాల రంగు, పరిమాణం, ఆకారాన్ని బట్టి విత్తన నాణ్యతను అంచనా వేయడం పురాతన కాలం నుండి ఆచరిస్తున్న పద్ధతి. నాణ్యమైన విత్తనంలో అన్ని గింజలూ ఒకే రకంగా ఉంటాయి.

భౌతిక స్వచ్ఛత నిర్థారణ :

విత్తనంలో ఇతర పంటల విత్తనాలు, కలుపు విత్తనాలు, పగిలిన/ గట్టి పడిన విత్తనాలు, తాలు గింజలు, మట్టి పెడలు, ఎండిన ఆకులు, రెమ్మలు మొదలైనవి ఉండకూడదు. నాణ్యమైన విత్తన శాతం ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువగా దాని భౌతిక స్వచ్ఛత ఉంటుంది. విత్తన భౌతిక శుద్ధత, మొలకశాతం కలసి మొలక సాంద్రతను ప్రభావితం చేస్తాయి. విత్తనాలను బాగా శుభ్రపరచడం ద్వారా వాటి భౌతిక నాణ్యతను పెంచవచ్చు.

విత్తనంలో తేమ శాతాన్ని తెలుసుకునేందుకు...

రైతులు వారి అనుభవంతో వివిధ రకాలుగా విత్తన తేమ శాతాన్ని అంచనా వేస్తారు. వాటిలో గింజను పంటితో కొరికినప్పుడు వచ్చే ధ్వనిని గమనించడం, అరచేతితో విత్తనాలను నలిపి చూడడం, పిడికిలిలో విత్తనాలను కదలించినప్పుడు వచ్చే శబ్దం వినడం వంటివి సాధారణంగా ఉపయోగిస్తుంటారు.

మొలక శాతం పరీక్ష :

ఇది క్షేత్ర స్థాయిలో అవసరమైన విత్తన మోతాదును తద్వారా మొక్కల సాంద్రతను నిర్ణయిస్తుంది. అందువల్ల నిర్ధేశించిన మోతాదు కన్నా ఎక్కువ మొలక శాతం కలిగిన విత్తనాలను విత్తితేనే సరైన మొక్కల సాంద్రత ఉంటుంది. తద్వారా విత్తన మోతాదు తగ్గి వాటి కొనుగోలుకయ్యే ఖర్చు తగ్గుతుంది. విత్తన మొలక శాతాన్ని వివిధ పద్ధతుల ద్వారా రైతులు పరీక్షించుకోవచ్చు.

పేపరు పద్ధతి :

ఒక మందపాటి పేపరు లేదా ఏదైనా బట్టను తడిపి 100 విత్తనాల చొప్పున సమాన దూరంలో పరచాలి. పేపరును/బట్టను మడత పెట్టి తేమ కోల్పోకుండా పాలిథీన్‌ కవరును చుట్టాలి. ఇలా 400 విత్తనాలను 4 భాగాలుగా పరీక్షించాలి. విత్తనాలు మొలకెత్తే వేగాన్ని బట్టి 7-14 రోజుల్లోపు మొలకెత్తిన విత్తనాలను లెక్కించాలి. కాండం, వేరు ఆరోగ్యంగా ఉన్న వాటిని మాత్రమే మొలకెత్తిన విత్తనాలుగా పరిగణించాలి. మొలకెత్తని, కుళ్ళిపోయిన లేదా బూజుపట్టిన విత్తనాలను లెక్కించరాదు. పంటలను బట్టి కనిష్ట మొలకశాతం మారుతుంది.

మొక్కజొన్నలో 90 శాతం గోధుమ, శనగ, చెరకులో 35 శాతం, వరి, కుసుమ, నువ్వులు, బాసిర్న్‌, బర్పీవ్‌, ఉలవ, జనుములో 80 శాతం చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, హైబ్రీడ్‌ పత్తిలో 75 శాతం పొద్దుతిరుగుడు, పొగాకు, వేరుశనగ, ఆముదం, సోయా, ఉల్లి, వంగ, టమాటా, క్యాబేజి, తోటకూర, మెంతి పంటల్లో 70 శాతం పత్తి, బెండ, కాలిఫ్లవర్‌లో 65 శాతం తీగజాతి కూరగాయలు (దోస, గుమ్మడి, కాకర, సొర, పొట్ల, బీర) మిరప పంటల్లో 60 శాతం కనిష్ట మొలక శాతం ఉండాలని నిర్దేశించారు.

మట్టి లేదా ఇసుక పద్ధతి :

ఒక ట్రేలో మెత్తటి మట్టి లేదా ఇసుక తీసుకొని తడిపి అందులో విత్తనాలను నాటాలి. పేపరు పద్ధతిలో వలే 400 విత్తనాలను పరీక్షించి అదే విధంగా లెక్కించాలి.

విత్తన సామర్ధ్యం తెలుసుకునే పరీక్షలు :

బాహ్య వాతావరణం నుండి ఒత్తిడిని తట్టుకొని విత్తనం మొలకెత్తడాన్ని దాని మొలకసామర్ధ్యం నిర్ణయిస్తుంది. ఎక్కువ సామర్ధ్యం కలిగిన విత్తనాలు నీటి ఎద్దడి పరిస్థితుల్లో చీడపీడల ప్రభావం కలిగిన క్షేత్రాల్లోనూ మొలకెత్తి దిగుబడులను పెంచుతాయి.

విత్తన పరిమాణం :

పెద్ద పరిమాణంలో ఉన్న విత్తనాలు తక్కువ పరిమాణం గల విత్తనాల కన్నా సమర్ధవంతమైనవిగా గుర్తిస్తారు. విత్తనంలో ఎక్కువ భాగం సాధారణ పరిమాణంగల విత్తనాలు ఉన్నప్పుడు వాటిలో జీవశక్తి కూడా ఎక్కువ ఉంటుంది. అందువల్ల జల్లెడ సాయంతో కావలసిన పరిమాణం గల విత్తనాలను ఎంపిక చేసి ఉపయోగించుకోవచ్చు.

ఇటుక కంకర పరీక్ష :

ఈ పరీక్షలో మొదట ఒక ట్రేలో ఇసుకను తీసుకొని దానిపై విత్తనాలను పెట్టి విత్తనాలపై 2-3 మి.మీ. పరిమాణం గల ఇటుక ముక్కలను 3 సెం.మీ. మందంతో పోసి నీరు చల్లాలి. ఎక్కువ సామర్ధ్యం గల విత్తనాలు త్వరగా మొలకెత్తుతాయి. 7-10 రోజుల వ్యవధిలో మొలక శాతాన్ని లెక్కించాలి. మొక్కలు ఎక్కువగా బయటకు రాగలిగితే ఆ రాశి నాణ్యమైనదిగా గుర్తించవచ్చు. ఈ పద్ధతిని చిన్న సైజు విత్తనాలు గల పంటల్లో అవలంభిస్తారు.

కోల్డ్‌ టెస్ట్‌ :

మొక్కజొన్న, జొన్న, సోయా చిక్కుడు వంటి పంటల్లో విత్తన సామర్ధ్యాన్ని తెలుసుకునేందుకు ఈ పద్ధతిని ఉపయోగించవచ్చు. మొలకశాతం పరిక్షల్లో లాగా పేపరు లేదా బట్టలు లేదా మట్టి / ఇసుక పోసిన ట్రేలో పెట్టిన విత్తనాలను ప్రిజ్‌లో పెట్టడం ద్వరా 5-100 సెం. ఉష్ణోగ్రతకు గురిచేసి, వారం రోజుల తరువాత మామూలు ఉష్ణోగ్రతలో ఉంచి 5 రోజుల తరువాత మొలకశాతం లెక్కించాలి.

విత్తన ఆరోగ్య పరీక్షలు :

శిలీంద్రాలు ఆశించిన విత్తనాలు రంగు మారిపోయి, బూజు పట్టి నాణ్యత లేకుండా ఉంటాయి. విత్తనంలో చీడల కారకాలు కనిపిస్తాయి. మొలకశాతం పరిక్షల్లో బూజు పెరుగుదలను గమనించవచ్చు. కొన్ని శిలీంద్రాలను విత్తనశుద్ధి ద్వారా నియంత్రించవచ్చు. చీడపీడల కారకాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ విత్తనాన్ని వాడకపోవడం మంచిది.

తెగులు సోకిన విత్తనాలు వేరు చేసేందుకు :

1. గోధుమలో నులి పురుగులు ఆశించిన విత్తనాలు, సజ్జలో తేనె బంక తెగులు సోకిన విత్తనాలను చెరగడం ద్వారా వేరుచేయవచ్చు.

2. విత్తనాలను 12-20 శాతం ఉప్పునీటిలో ముంచినప్పుడు తెగులు సోకిన విత్తనాలు తేలికగా ఉండి పైకి తేలుతాయి. వీటిని మంచి విత్తనాల నుండి వేరు చేయవచ్చు.

3. విత్తనంలోని పిండానికి హాని కలగకుండా, మొలకశాతం తగ్గకుండా నిర్థిష్ట ఉష్ణోగ్రత గల వేడి నీటిలో నిర్థిష్ట సమయం ముంచడం ద్వారా విత్తనాల లోపం, బయట ఉన్న రోగకారకాలను నియంత్రించవచ్చు.

క్షేత్ర స్థాయిలో పరీక్ష :

విత్తన మొలకశాతం పరీక్ష పరిస్థితులు క్షేత్ర పరిస్థితులకు భిన్నంగా ఉంటాయి. కాబట్టి క్షేత్రస్థాయిలో విత్తన మొలక సామర్థ్యం తెలుసుకునేందుకు ఈ పరీక్షలు చేయాలి. ఇందులో 400 విత్తనాలను తీసుకొని 100 విత్తనాల చొప్పున నాలుగు భాగాలుగా చేసి భూమిలో నాటాలి. 7-10 రోజుల తరువాత మొలకలను లెక్కించాలి. నాణ్యమైన విత్తనంలో మొలకశాతం ఎక్కువగా ఉంటుంది.

రైతులు విత్తన నాణ్యతను పరిక్షించుకోవడం వల్ల సరైన విత్తన మోతాదును ఉపయోగించి నిర్మిత మొక్కల సాంద్రతతో పాటు అధిక దిగుబడులను పొందే అవకాశం ఉంటుంది.

వి. మణి చందన, వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాల అధ్యాపకురాలు