విత్తన అభివృద్ధిలో రాష్ట్రం దినదినాభివృద్ధి చెందుతూ ప్రపంచ దేశాలను సైతం తెలంగాణ విత్తనం వైపు ఆలోచింప చేసే విధంగా తన సత్తాను చాటుకుంది. నేడు రాష్ట్ర వ్యాప్తంగా విత్తన అభివృద్ధికి అనేక వసతులను కల్పించి వివిధ దేశాల విత్తన సంస్ధలకు వెసలుబాటు కల్పించి 400 పైగా కంపెనీలు విత్తన అభివృద్ధిలో పాలు పంచుకునేటట్లు చేసింది. గత ఏడాది విత్తన ఉత్పత్తి రాష్ట్రంతో పాటు ఇతర దేశాలకు 7 వేల క్వింటాళ్ళ పైగా ఎగుమతులు గావించింది. విత్తన ఉత్పత్తికి ఇక్కడి భూభాగం అనుకూలంగా ఉండడంతో దేశ వ్యాప్తంగా ఈ మూడేళ్ళ కాలంలో 150 పైగా విత్తన సంస్థలు వచ్చి చేరాయి. గతంలో రైతులు నాణ్యమైన విత్తనాల కోసం అనేక వ్యయ ప్రయాసల కోర్చి విత్తనాన్ని సాధించకునే స్థితి ఉండేది. నేడు రైతాంగానికి అందుబాటులోకి విత్తనం తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది.

రైతులకు మేలురకాలైన విత్తనాలను అందించే లక్ష్యంగా ఉత్పత్తి సంస్థలు పనిచేసే విధంగా ఎప్పటికప్పుడు అధికారుల నిఘా చర్యలు చేపట్టడంతో కొంతమేర విత్తన రంగంలో నెలకొని ఉన్న కల్తీని అరికట్టగలిగారు. విత్తన శుద్ధితో పాటు మేలైన విత్తనాలను అందించడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందు వరుసలో నిలిచింది.

ఇటీవల కాలంలో విత్తన రంగంలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆదర్శంగా నిలవడమే కాకుండా అధిక ఉత్పత్తిని చేసి ఎగుమతుల్లో సైతం తన సత్తాను నిరూపించుకున్న విత్తన సంస్థగా రాష్ట్రానికే దక్కింది. ఐక్యరాజ్య సమితిలో ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఎఒ) అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ బుకార్‌ టిజాని ప్రశంసలు తెలిపారు. ఇటలీ రాజధాని రోమ్‌లో జరిగిన అంతర్జాతీయ అగ్రిఇన్నోవేషన్‌ సదస్సులో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ ముఖ్యకార్యదర్శి పార్థసారధి, తెలంగాణ విత్తన ధృవీకరణ సంస్థ కేశవులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనరల్‌ బుకార్‌ టిజాని మాట్లాడుతూ తెలంగాణలో అనేక వినూత్నమైన కార్యక్రమాలు జరుగుతున్నాయని ఇతర దేశాలకు తెలంగాణ విత్తనం ఎగుమతి అవుతోందని తెలిపారు. అభివృద్ధి చెందుతున్న దేశాల రైతులకు నాణ్యమైన విత్తనం అందించేలా చేయాలన్నది ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఎఒ) నిబంధనలో ఒక కీలకమైన అంశమని తెలిపారు. భారత విత్తన పరిశ్రమ విస్తరిస్తుందని ఇప్పటికే ఆఫ్రికా దేశాలకు ఎగుమతులు చేస్తుందన్నారు. ఆఫ్రికా దేశాల్లో విత్తన అభివృద్ధి కోసం ఎఫ్‌ఎఒకు తెలంగాణ సహకారం అందించే దిశలో ఆలోచిస్తున్నట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్‌లో విత్తన పార్కును నెలకొల్పి 400 విత్తన కంపెనీలకు భాగస్వామ్యం కల్పించడం అభినందనీయమని కొనియాడారు.

అంతర్జాతీయ విత్తనోధ్యమంలో తాము తెలంగాణతో కలసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా విత్తన కొరతను అధిగమించే విధంగా ఉమ్మడిగా పనిచేయాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. విత్తన అభివృద్ధికి తన సహకారం ఎప్పుడూ ఉంటుందని తెలిపారు.

రోమ్‌ సదస్సులో రైతు బంధు :

రైతుబంధు, రైతుబీమా పథకాలు అన్నదాతకు సామాజిక ఆర్ధిక భద్రత కల్పించాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి. పార్థసారధి తెలిపారు. నవంబరులో ఇటలీ రాజధాని అయిన రోమ్‌లో ఐక్యరాజ్య సమితికి చెందిన ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఎఒ) నిర్వహించిన వ్యవసాయంలో వినూత్న ఆవిష్కరణల అంశంపై జరుగుతున్న అంతర్జాతీయ సదస్సులో పార్థసారధి ప్యానల్‌ స్పీకర్‌ ¬దాలో పాల్గొని ప్రసంగించారు. ఈ సదస్సులో అంతర్జాతీయంగా ఎంపికైన 20 విజయవంతమైన పథకాలను ప్రదర్శించారు. ఇందులో రైతుబంధుతో పాటు రైతు బీమా పథకాలు చేర్చడం గర్వకారణం. తెలంగాణ నాలుగున్నర ఏళ్ళ క్రిందట ఏర్పాటైన కొత్త రాష్ట్రమని వర్షాభావ పరిస్థితులతో, కరువు కాటకాలతో ఉంటుందని రాష్ట్రంలో ఎక్కువ మంది అల్పాదాయం కలిగిన సన్న చిన్నకారు రైతులేనని ఇటువంటి రైతులను ఆదుకునేందుకు రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టామని ఆయన తెలిపారు.

రైతుల అప్పులను నిరోధించాం :

రైతు బంధు పథకం ద్వారా రైతులు వడ్డీ వ్యాపారుల బారి నుండి తప్పించగలిగాం. ప్రతి రైతుకూ వ్యవసాయానికి అందే విధంగా రైతు బంధు పథకం పూర్తిస్థాయిలో అమలు చేయడం జరిగిందని ప్రతి రైతుకూ ఎకరాకు రూ. 4 వేల చొప్పున అందచేస్తున్నామని ఈ మొత్తం వ్యవసాయ సీజన్‌ ప్రారంభంలోనే విత్తనాలు, ఎరువులు, ఇతర సాగు ఖర్చుల కోసం ఉపయోగపడుతున్నాయని తెలిపారు. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో 51 లక్షల మంది రైతులకు రైతుబంధు పధకం ద్వారా రూ. 5200 కోట్లు ఇచ్చామన్నారు. రబీలో ఈ పథకం పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నామని వివరించారు.

రైతు బీమా ఆసరా :

రైతు చనిపోతే వారి కుటుంబాన్ని ఆదుకునేందుకు రైతుబీమా పథకాన్ని సర్కార్‌ తీసుకువచ్చిందని పార్థసారధి తెలిపారు. ఇప్పటి వరకు రైతు బీమా కింద లబ్దిపొందిన వారిలో 90 శాతం సన్న చిన్నకారు రైతులేనని స్పష్టం చేశారు. ఈ పథకాలను అమలుకోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకున్నామన్నారు. వ్యవసాయ, విస్తరణ అధికారులు (ఎఇఒ)కు ట్యాబ్‌లను ఇచ్చి చనిపోయిన రైతుకుంటుంబ సమగ్ర సమాచారాన్ని మరణ దృవీకరణ పత్రంతో పాటు వివిధ పత్రాలను అప్‌లోడ్‌ చేసేలా ఏర్పాటు చేశామన్నారు. రైతుకుటుంబాలకు 10 రోజుల్లోగా రూ. 5 లక్షల బీమా పరిహారం ఆ కుంబానికి అందేలా తగు ఏర్పాట్లు చేపట్టినట్లు వివరించారు. ఇప్పటి వరకు 3,520 రైతు కుటుంబాలకు బీమా పరిహారం అందించామన్నారు. రాష్ట్రంలో 28 లక్షల మంది రైతులకు బీమా సదుపాయం కల్పించామని తెలిపారు. 18-59 సం|| ఉన్న రైతులు ఎవరైనా ఏ కారణం చేత చనిపోయినా బీమా పరిహారం వస్తుందన్నారు. ఆయా పథకాలను సమర్ధవంతంగా అక్రమాలకు తావే లేకుండా అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఐక్యరాజ్య సభలో పలువురు అడిగిన ప్రశ్నలకు పార్ధసారధి సమాధానాలు ఇచ్చారు.

- ఎలిమిశెట్టి రాంబాబు,

అగ్రిక్లినిక్‌ ప్రతినిది, ఫోన్‌ : 9949285691