విదేశీ బహుళ జాతి కంపెనీల నిధులతో నడుస్తున్న కొన్ని స్వచ్ఛంద సంస్థలు, జంతు ప్రేమికుల పేరుతో దేశీయ కోళ్ళ పరిశ్రమ మనుగడను దెబ్బతీస్తున్నాయని అఖిల భారత పౌల్ట్రీ పరిశ్రమ పెద్దలు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. పౌల్ట్రీ ఇండియా-2018 ప్రదర్శన, విజ్ఞాన సదస్సు ప్రారంభానికి ముందు హైదరాబాద్‌ నగరంలోని ఎన్‌-కె-ఎమ్‌ గ్రాండ్‌ ¬టల్‌లో నిర్వహించిన పత్రికా విలేకరుల సమావేశంలో ఇండియన్‌ పౌల్ట్రీ ఎక్విప్‌మెంట్‌ మాన్యుపాక్చరర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు హరీష్‌ గర్వారే తన ప్రారంభ ఉపన్యాసంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. మనదేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న కోళ్ళ పరిశ్రమ ఆర్థిక వ్యవస్థ బలోపేతంతో పాటు, పౌష్టికాహార సరఫరా కేంద్రంగా అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా పరిశ్రమ పెద్దలు విలేకరులకు వివరించారు.

గణనీయమైన వృద్ధిని సాధించడానికి రైతులతో పాటు, పారిశ్రామిక వేత్తలు పాటుబడుతున్న తీరును వారు వివరించారు. కోళ్ళ ఫారాల ప్రాంగణాలను ఖచ్చితమైన పరిశుభ్రత పద్ధతులతో ఆరోగ్యకరంగా ఉంచుతూ తద్వారా నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించడమే లక్ష్యంగా పరిశ్రమ పురోగమనం సాధ్యపడుతోందని అభిప్రాయం వ్యక్తం చేశారు. కోళ్ళను పెంచే సమయంలో సరైన వెలుతురు, వాటికి పౌష్టికాహారాన్ని అందించడం, ఆటోమేషన్‌ విధానాల ద్వారా ఫారాల యాజమాన్యాన్ని తామంతట తామే సుశిక్షితులైన రైతులు నిర్వహించి, రోగ నిరోధక యంత్రాంగాన్ని తామే శాస్త్రవేత్తలుగా మారి పరిరక్షించుకోవడం ద్వారా పరిశ్రమ ఇంత బహుళంగా విస్తరిస్తోందని వివరించారు.

ప్రపంచంలో అత్యధికంగా గుడ్లను ఉత్పత్తి చేసే దేశాల్లో మన దేశం తృతీయ స్థానంలో ఉండడం గర్వకారణమని, చైనా, బ్రెజిల్‌, అమెరికా సంయుక్త రాష్ట్రాల తరువాత 4వ అతిపెద్ద చికిన్‌ ఉత్పత్తి దేశంగా భారత్‌ నిలుస్తుందని తెలిపారు. మనదేశంలో ఇప్పుడు ఒక లక్ష కోట్ల రూపాయల మార్కెట్‌ కలిగిన పరిశ్రమగా నిలబడిందని అంచనా ఉన్నట్లు వెల్లడించారు. దేశపు పౌష్టికాహార భద్రత, ఆహార అవసరాలను తీర్చడంపై దృష్టి కేంద్రీకరించిన అతి ముఖ్యమైన రంగం పౌల్ట్రీ పరిశ్రమేనని అభివర్ణించారు.

భారత్‌ 2018 సం||నికి గానూ, బ్రాయిలర్‌ కోళ్ళ ఉత్పత్తి 7.5 శాతం వృద్ధి శాతాన్ని సాధించి మాంసం ఉత్పత్తి 4.9 మిలియన్‌ టన్నులకు చేరిందని, యాంత్రీకరణ ద్వారా ప్రాసెస్‌ చేయబడిన కోడి మాంసం కొరకు 15-20 శాతం డిమాండ్‌ పెరిగిందని, అదే విధంగా గుడ్ల ఉత్పత్తి 85 బలియన్‌ టన్నులుగా ఉంటుందని పరిశ్రమ పెద్దలు విడుదల చేసిన సమాచారంలో తెలిపారు. గత సంవత్సరంతో పోలిస్తే వృద్ధి శాతం 5కు పెరిగిందని వెల్లడించారు.

పరిశ్రమ ఎదుర్కొంటున్న పెనుసవాళ్ళు :

ఈ సందర్భంగా అసోసియేషన్‌ అధ్యక్షులు గర్వారే పరిశ్రమ ఎదుర్కొంటున్న పెను సవాళ్ళను, ప్రభుత్వ నిర్లిప్తతను ప్రశ్నించారు. కేజస్‌లో కోళ్ళ పెంపకాన్ని నిరసిస్తూ జంతు ప్రేమికులు పేరుతో కోర్టులో వేసిన వ్యాజ్యంపై సుదీర్ఘ వివరణ ఇచ్చారు. విదేశీ బహుళ జాతి సంస్థలకు దారి కల్పించి పటిష్టమైన స్వదేశీ మార్కెట్‌ను, రైతుల ప్రయోజనాలను దెబ్బతీసేందుకు దురుద్ధేశంతో వేసిన వ్యాజ్యాన్ని తాము దైర్యంగా ఎదుర్కొంటున్నామని, స్వచ్ఛంద సంస్థల మాట విని ప్రభుత్వం దీన్ని నిషేదిస్తే వచ్చే విపరిణామాలు దేశీయ ప్రయోజనాలకు గొడ్డలి పెట్టుగా మారతాయని ఆందోళన వ్యక్తం చేశారు.

2020 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ఒక వైపు ప్రధాన మంత్రి నరేంద్రమోడి ప్రకటన చేసిన సందర్భంలో ఆశయానికి ఈ పరిణామం తూట్లు పొడుస్తుందని తెలిపారు. చిన్న రైతులకు అత్యధికంగా చిక్కులు తెచ్చిపెట్టే ఈ వ్యాజ్యాన్ని ఎదుర్కొనేందుకు పరిశ్రమ అగ్రగణ్యులు కోర్టు వాయిదాల్లో తలమునకలౌతూ, న్యాయం కొరకు ప్రభుత్వ తలుపులు తడుతున్నారని వివరించారు. కేజస్‌ పై నిషేదం విధించితే 6.5 మిలియన్ల రైతులు లక్షలాది మంది ఉద్యోగులు ఉపాది కోల్పోయి రోడ్డున పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ప్రధాన పౌష్టికాహారంగా దేశ ప్రజల భోజన విస్తరిలో ప్రముఖంగా నిలుస్తున్న కోడి గుడ్లు, మాంసం ధరలు ఆకాశాన్ని అంటి పేదవాడి పౌష్టికాహారంపై పెనుప్రభావం చూపుతుందని గర్వారే వివరించారు.

కేజస్‌ నిషేదం వల్ల వంటనూనెల ధరలు పెరిగి, సోయా, పొద్దుతిరుగుడు, ఆముదం, నువ్వులు, పత్తి గింజలు, రైస్‌ బ్రాన్‌ సాగు చేసే రైతులకు నష్టం కలుగుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ ఉత్పత్తుల నుండి వంటనూనెలు తయారు చేసిన తరువాత మిగిలిన పిప్పిని డ్రై ఆయిల్‌ కేక్స్‌గా మార్చడం, వాటిని కోళ్ళ మేతగా వినియోగించడం చేస్తున్నారు. కోళ్ళు వాటిని ఇష్టంగా ఆరగించడం, రుచికరమైన బలవర్థకమైన ఆహారంగా స్వీకరించడం జరుగుతుంది. నూనెల వినియోగం ఖర్చు తగ్గి లాభపడుతున్న రైతులు ఇకపై నష్టపోతారని ప్రభుత్వానికి నివేదించినట్లు గర్వారే వివరించారు.

కోళ్ళ పరిశ్రమను రక్షించేందుకు రోజువారీ భోజనంలో పేదవాడికి గుడ్లు, మాంసం అందుబాటులో ఉంచేందుకు జాతీయ ఆహార భద్రతా పథకంలో, మద్యాహ్న భోజన పథకంలో, అన్ని పౌష్టికాహార పథకాల్లో వీటికి చోటు కలిపించాలని, ఖచ్ఛితంగా రేషన్‌కార్డుపై ఉచితంగా గుడ్లు , కోడి మాంసం లభించే అంశాన్ని జోడించాలని సమావేశంలో వక్తలు ప్రభుత్వాన్ని కోరారు. కోళ్ళ పరిశ్రమను రక్షించేందుకు తీసుకోవలసిన చర్యల గురించి మాట్లాడుతూ ఈ రంగం ప్రగతికి అవరోధంగా నిలిచిన జిఎస్‌టి ని దాణాపై ఉపసంహరించాలని, అనుబంధ పరిశ్రమల ఉత్పత్తుల పైన తొలగించాలని కోరారు. వ్యవసాయ రంగానికి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్‌ అందిస్తున్నట్లుగానే కోళ్ల రైతులకు కూడా ఈ పథకాన్ని వర్తింప చేయాలని కోరుతూ రైతులకు, పారిశ్రామిక వేత్తలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యధికంగా విద్యుత్‌ సబ్సిడీలను అందించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు.

ప్రభుత్వం తమ సమస్యలను సానుకూలంగా పరిశీలించి పరిశ్రమను రక్షించడానికి ముందుకు వస్తుందని, ప్రభుత్వ సహకారంతో నాణ్యమైన కోడిమాంసం, గుడ్లు ఉత్పత్తి చేసి పౌష్టికాహార జాతీయ భద్రతా లక్ష్యాలను నెరవేర్చేందుకు అంకిత భావంతో ముందుకు వెళ్లగలమని అన్నారు. లక్ష్య సాధనలో భారతీయ కోళ్ళ పరిశ్రమ ముందడుగు వేస్తూ తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉత్పత్తిని సాధించడానికి కృషి చేస్తూ ఈ రంగంలో పనిచేస్తున్న అందరితో పాటు మహిళలకూ జీవనోపాధితో పాటు, ప్రయోజనాలను కాపాడకలదని చెప్పారు. రైతులు, చిన్న, మధ్య తరహా వ్యాపారవేత్తల మనుగడకు ప్రభుత్వ పరంగా సానుకూలమైన చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. విలేకరుల సమావేశంలో పరిశ్రమ పెద్దలు చక్రధర రావు, రామిరెడ్డి, బాలస్వామితో సహా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పరిశ్రమ పెద్దలు కూడా పాల్గొన్నారు.

- అగిక్ల్రినిక్‌ డెస్క్‌