వచ్చే దశాబ్ధం లోపల పౌల్ట్రీ రంగంలో భారత్‌ అగ్రగామిగా నిలుస్తుందని ప్రముఖ శాస్త్రవేత్త డా|| వెరోనిక్‌ అక్వేరా తెలిపారు.

ప్రస్తుతం గుడ్ల ఉత్పత్తిలో 3వ స్థానంలోనూ, కోడి మాంసం ఉత్పత్తిలో 4వ స్థానంలో ఉన్న భారత్‌ అతి సమీప కాలంలోనే ఈ రెండు ఉత్పత్తి రంగాల్లో అగ్రస్థానానికి చేరుకొని ప్రపంచంలోనే పౌష్టికాహార రంగానికి నాయకత్వం వహించగలదని ఆమె తెలిపారు. నవంబరు 27న పౌల్ట్రీ ఇండియా-2018 ఉత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన విజ్ఞాన దినోత్సవ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ గుడ్లు, మాంసం ఎగుమతులకు సంబంధించి రసాయన అవశేషాల అడ్డంకిని కూడా అధిగమించి భారతదేశం యూరోపియన్‌ యూనియన్‌ దేశాలకు పౌల్ట్రీ ఉత్పత్తుల ఎగుమతులను ప్రారంభించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని వెల్లడించారు.

హైదరాబాద్‌లో ప్రతి సంవత్సరం జరిగే అంతర్జాతీయ పౌల్ట్రీ ప్రదర్శన ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుందని, ముఖ్యంగా దక్షిణ ఆసియా దేశాల పౌల్ట్రీ రంగంపై ఇది గొప్ప ప్రభావాన్ని చూపిస్తుందని తన ప్రసంగంలో పేర్కొన్నారు. జీరాఫుడ్‌ అనే ప్రఖ్యాత సంస్థకు సలహాదారిగా పనిచేస్తున్న వెరోనికా, రష్యా, ఇతర దేశాల్లో పౌల్ట్రీ రంగ అనుభవాలను సోదాహరణంగా వివరించారు.

హైదరాబాద్‌ నోవాటెల్‌లో రోజంతా జరిగిన మేథోమదన సదస్సులో గోద్రేజ్‌ టై సన్‌ ఫుడ్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ బలరాం సింగ్‌ యాదవ్‌ ఈ సదస్సుకు సంబంధించిన ముఖ్యసందేశాన్నిచ్చారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ వ్యవసాయ వాణిజ్య అభివృద్ధిలో పౌల్ట్రీ రంగ పాత్ర గురించి ప్రస్తుత పరిస్థితిలో ఆ రంగంలో గల విస్తృత అవకాశాల గురించి వివరంగా తెలియచేశారు. పౌల్ట్రీ రంగంలో భారత రైతులు సహజ శాస్త్రవేత్తలుగా ప్రదర్శిస్తున్న విజ్ఞానాన్ని, నైపుణ్యతను కొనియాడారు. ఎవ్వరి సహకారం లేకుండా భారతీయ రైతులు తమ కష్టం, మేధస్సుతో, మెరుగైన పరిజ్ఞానంతో అభివృద్ధి చేసుకున్న స్వయం సమృద్ధి వేదిక పౌల్ట్రీ రంగమని అభివర్ణించారు.

కేజ్‌ల నిషేదం ద్వారా వచ్చే సమస్యలు, రైతుల, సంబంధిత వర్గాల ప్రయోజనాల నష్ట తీవ్రతను మహారాష్ట్రకు చెందిన పశువైద్య విశ్వ విద్యాలయం ప్రధాన శాస్త్రవేత్త డా|| అజిత్‌రణడే పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా ఆహూతులకు తెలియచేశారు. కేజ్‌ల నిషేదం ద్వారా ఏర్పడే పరిణామాల నిజా నిజాలను, నష్టాలను కళ్ళకు కట్టినట్లు ఈ నివేదికలో పేర్కొన్నారు. ఈ సదస్సులో పాల్గొన్న పద్మశ్రీ అవార్డు గ్రహీత డా|| మందర్‌కరంజికర్‌ పౌల్ట్రీ వ్యాపార విస్తరణ అవకాశాలను నాయకత్వ ఆవశ్యకతను వివరించారు. బైటక్‌ పౌండేషన్‌ వ్యవస్థాపకులు కూడా కరంజీకర్‌ ఆధునిక వాణిజ్యం, సామర్ధ్యాల గురించి సంత్‌కబీర్‌దాస్‌ ప్రవచనాలను తెలియచెప్పి ఆహూతులను ఉత్తేజపరచారు.

పర్యావరణ హితమైన కోళ్ళ పెంపకాన్ని ప్రోత్సహించడానికి, బహిరంగ ప్రదేశాల్లో కోళ్ళ విసర్జితాలు, మాంస అవశేషాలు చేస్తున్న హానిని తగ్గించడానికి డా|| రణడే, డా|| కులకర్ణి అనే శాస్త్రవేత్తలు సంయుక్తంగా నిర్వహించిన పవర్‌పాయింట్‌ నివేదిక ఆహూతులను అకట్టుకుంది. ఒక కోడి జీవితకాలంలో అత్యున్నతంగా లభింపచేసే విలువకు అదనపు ఆదాయాన్ని రాబట్టి కోళ్ళ రైతులకు ఆదరువుగా ఈ వ్యర్థాలను వినియోగించి విద్యుత్‌ తయారీ, జీవన ఎరువులు, జీవరసాయనాల తయారీతో, రసాయన అవశేష రహిత పంటలు పండించే విధానాలను నివేదిక రూపంలో సోదాహరణంగా ప్రదర్శించారు. ఈ ప్రదర్శన వచ్చిన సమూహాన్ని బాగా ఆకట్టుకుంది.

సమగ్ర యాజమాన్యం ద్వారా బ్రాయిలర్‌ కోళ్ళ పెంపకం, మాంస ఉత్పత్తుల ఎగుమతుల గురించి డా|| జి.వి సుందరం వివరించారు. ఈ సందర్భంగా భారత కోళ్ళ పరిశ్రమను పతనం చేసేందుకు విదేశీ పోటీదారులు చేస్తున్న కుట్రలను విజయ్‌సర్ధానా అనే శాస్త్రవేత్త బహిరంగ లేఖ ద్వారా సదస్సులకు వివరించారు.

దేశ, విదేశాలకు చెందిన 1400 మంది ప్రతినిధులతోనూ, రైతులతోనూ, పారిశ్రామిక వేత్తలతోనూ సభాస్థలి కిక్కిరిసిపోయింది. మొత్తానికి పరిశ్రమకు చెందిన ఉత్పత్తిదారులు సంబంధిత వ్యాపారవేత్తలు, శాస్త్రజ్ఞులు, జాతీయ, అంతర్జాతీయ ప్రింట్‌్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా ఒకే వేదికపైకి తరలిరావడంతో సభాస్థలిలో పండుగ వాతావరణం కనిపించింది. ప్రపంచ వ్యాప్తంగా పల్లవిస్తున్న సాంకేతిక పరిజ్ఞానానికి ఈ విజ్ఞాన దినోత్సవం దర్పణంగా మిగిలిపోతుంది.

- వై.వి. నరసింహారావు, అసోసియేట్‌ ఎడిటర్‌