తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో మామిడి మరియు అరటి తరువాత అధిక విస్తీర్ణంలో సాగుబడి చేయబడే పండ్లతోట జామ పంట. చౌకగా దొరికే జామ పండ్లలో నారింజ పండు కంటే 2.5 రెట్లు ఎక్కువగా 'సి' విటమిన్‌ వతురియు 'ఎ' విటమిన్‌, పాంటోథీనిక్‌ ఆమ్లం, రైబోఫ్లేవిన్‌, నియాసిన్‌, భాస్వరం మరియు అధిక పోషక విలువలు కలిగి ఉండడం వల్ల దీన్ని ''ఉష్ణమండల ఆపిల్‌'' మరియు ''పేదవాడి యాపిల్‌ పండు'' అని అంటారు. తెలుగు రాష్ట్రాల్లో రైతులు దాదాపు 12,000 హెక్టార్లలో జామ పంటను సాగు చేస్తూ హెక్టారుకి సుమారు 15 మెట్రిక్‌ టన్నుల వరకు దిగుబడిని సాధిస్తున్నారు. దేశ ఉత్పత్తిలో దాదాపు 28 శాతం తెలుగు రాష్ట్రాల నుంచే వస్తోంది అనే విషయం ఈ రాష్ట్రాల్లో ఈ పంట యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తుంది.

జామ తోటల సాగులో అధిక దిగుబడి సాధించడానికి సకాలంలో సరైన సస్యరక్షణ చర్యలు చేపట్టడం ఎంతో ముఖ్యం. జామ సాగులో సాధారణంగా కనిపించే పండు ఈగ, పిండి నల్లి, పొలుసు పురుగు మరియు ఎండుతెగులు లాంటి చీడపీడలకు సంబంధించిన సస్యరక్షణ చర్యల గురించి మన రైతులకు చాలా వరకు అవగాహన ఉంది. అయితే గత 2 - 3 సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాలలో రైతులు జామ తోటల్లో మరియు నర్సరీలలో హఠాత్తుగా ఆకులు పచ్చబారి, మొక్కలు వాడిపోయి, చెట్టు ఎండిపోవడం లాంటి లక్షణాలున్న వింత తెగులును గమనించి ఆందోళణ చెందుతున్నారు. ఈ తెగులు పంట దిగుబడిని చాలా వరకు తగ్గిస్తుంది. ఈ తెగులు దేని వలన వస్తోంది? పోషకాల లోపం వలనా? లేదా నీటి ఎద్దడి వలనా? అని రైతులు తర్జన భర్జన పడుతున్నారు. ఈ విషయం పై జాతీయ వక్షారోగ్య యాజమాన్య సంస్థ శాస్త్రవేత్తలు చేసిన విస్తతమైన పరిశోధనల వల్ల ఈ వ్యాధికి కారణం మొక్క వేర్లను ఆశించే నులి పురుగులని తెలిసింది. ప్రత్యేకంగా మెలాయిడోగైన్‌ ఎంటిరోలోబి అనే కొత్త తెగకు చెందిన వేరు ముడి నులి పురుగు వల్ల వ్యాపిస్తుందని నిర్ధారించబడింది.

రైతుల నుంచి మరియు నర్సరీ పెంపక దారుల నుంచి సేకరించిన సమాచారాన్ని బట్టి ఈ నులి పురుగులు తెగులు సోకిన జామ అంట్ల ద్వారా విదేశాల నుంచి దిగుమతి అయి, ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలోకి తీసుకురాబడి జామ అంట్ల ద్వారా వచ్చి స్థిరపడి పంట నష్టం కలిగిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ తెగులు ఇంతకు ముందు మన దేశంలో కనిపించని మలాడోగైన్‌ ఎంటరోలోబి అనే కొత్త తెగకు చెందిన నులి పురుగు ద్వారా సంక్రమించడం మరియు విదేశీ జామ రకమైన ''తైవాన్‌ రకం''లో ఈ నులి పురుగు ఉధతి ఎక్కువగా ఉండటం మరియు దేశీయ రకాల్లో ఈ వ్యాధి ఉదతి తక్కువగా ఉండటం కూడా గమనించడమైనది.

జామ తోటల్లో ఈ మధ్య కాలంలో అధికంగా కనిపిస్తూ పంట దిగుబడిని తగ్గిస్తూ రైతుల సమస్యగా మారిన ఈ నులిపురుగుల తెగులు మరియు దాని యాజమాన్యం గురించి రైతులకి అవగాహన కలిగించడమే ఈ ప్రచురణ యొక్క ముఖ్య ఉద్దేశం. కింద సూచించిన విధంగా సకాలంలో సరైన ముందు జాగ్రత్తలు మరియు యాజమాన్య పద్దతులు చేపట్టి జామసాగులో నులి పురుగుల సమస్యను సమర్థవంతంగా అరికట్టవచ్చు.

నులి పురుగులు ఆశించిన జామ పంట లక్షణాలు :

ఆకులు పసుపురంగులోకి మారడం

కొమ్మలు, లేత చిగుర్లు వడలి పోవడం, నులిపురుగులు ఆశించిన తొలిదశలో భూమిలో తగినంత తేమ ఉన్నా మొక్కలు వాడిపోయినట్లు కనిపిస్తాయి.

కొమ్మలు ఎండిపోవడం

చెట్టు ఎదుగుదల లోపించడం, చెట్టు మోడుబారడం

పూత, పిందె రాలడం లేదా ఆలస్యం అవడం, వచ్చినా త్వరగా రాలిపోవడం.

ఈ లక్షణాలు కనిపించిన మూడు మాసాల్లో చెట్లు చనిపోవడం.

నీరు, ఎరువులు అందించినా మొక్క కోలుకోకపోవడం.

ఈ లక్షణాలు, పోషకలోపాల లక్షణాలు మరియు ఎండుతెగులు లక్షణాలు పోలివుండటం.

వేర్లు ముడులు ముడులుగా మారి, బుడిపెలని కలిగి వుండటం, వేరు వ్యవస్థ క్షీణించి ఉండటం.

నులిపురుగులు ఆశించిన వేరు భాగాల్లో ఎండు తెగులు శిలీంద్రం ఆశించి వేర్లు కుళ్ళిపోవడం.

ఈ విధమైన లక్షణాలు మొక్కల్లో కనిపించినట్లయితే నులిపురుగులు ఆశించివట్లుగా నిర్థారించవచ్చు.

పంట నష్టం :

ఈ నులి పురుగుల వలన ఒక సంవత్సరం నుండి నాలుగు సంవత్సరాల వరకు జామతోటల్లో 60-100 శాతం మరియు నర్సరీలలోనైతే 90-100 శాతం వరకు నష్టం వాటిల్లుతుంది.

సమగ్ర యాజమాన్య పద్ధతులు :

నులిపురుగుల వ్యాప్తిని నిరోధించుటకు గాను, దిగుమతి సంస్థలైన విమానాశ్రయాలు, పోర్టులు మరియు రోడ్డు రవాణా కేంద్రాలలో నులిపురుగులపై శాస్త్రీయమైన నిఘాను విధిగా నిర్వర్తించాలి.

నులిపురుగులు లేనివిగా నిర్ధారిందబడిన నర్సరీల నుంచి మాత్రమే ఆరోగ్యవంతమైన జామ అంట్లను కొనుగోలు చేయాలి.

జామ అంట్లు కట్టడానికి మరియు నర్సరీల్లో అంటు మొక్కలను పెంచడానికి నులిపురుగులులేని స్వచ్ఛమైన మట్టిని వాడుకోవాలి.

ఆకులు పచ్చబారి, వాడిపోయి, వేరుపై బొడిపెలు లాంటివి కలిగి ఉన్న మొక్కలను తోటల్లో నాటరాదు.

నర్సరీలలో నులిపురుగుల యాజమాన్యం :

ఒక టన్ను మట్టిలో 50-100 కిలోల వేప చెక్క పిండి లేదా గానుగ పిండి మరియు జీవ నియంత్రణ కారకాలైన పరుారిేసిల్లమ్‌ లిలాసినస్‌, సూడోమోనాస్‌ ఫోరిసిన్స్‌ మరియు టైకోడెర్మా హార్జియానమ్‌ ఒక్కో కిలో చొప్పున కలిపిన మట్టిని అంట్లు కట్టే ముందు సంచుల్లో నింపాలి.

కార్బోఫ్యూరాన్‌ 3జి లేదా ఫోరేట్‌ 10జి 5 కిలోలను ఒక టన్ను మట్టితో కలపాలి.

నారు మడులను, నారు మొక్కలను పెంచడానికి వాడే మట్టిని వేసవి కాలంలో తెల్ల పాలిథీన్‌ (25 శాతం) షీటుతో (45-60 రోజులు) కప్పి ఉంచి సోలరైజేషన్‌ ప్రక్రియ ద్వారా నులి పురుగులను నివారించవచ్చు.

డయాజోమెట్‌ గుళికలు ఎకరాకు 60 కిలోల చొప్పున వేసి, కలియబెట్టి పాలిథీ¸న్‌ షీటుతో కప్పి, ఒక వారం ఉంచి తరువాత షీిటుని తీసి, మట్టిని తిరిగి కలియబెట్టి 2-3 రోజుల తరువాత మొక్కలు నాటుకోవాలి. ఈ పద్ధతి ద్వారా నులిపురుగులను త్వరితగతిలో

నివారించవచ్చు.

వీలైనంత వరకు ఎయిర్‌ లేయరింగ్‌ పద్ధతిలో నులిపురుగులు లేని మట్టి లేదా కొబ్బరిపీచు లేదా వర్మిక్యులేట్‌ని వాడి జామఅంట్లను తయారు చేసుకోవాలి.

జామతోటల్లో నులిపురుగులు యాజమాన్యం :

వేసవిలో లోతుగా దుక్కులు దున్ని మట్టిని కలియబెట్టాలి.

కొత్తగా జామ తోటలు వేసే ముందు మట్టిని నులి పురుగులకై పరీక్ష చేయించుకోవాలి.

నులి పురుగులు ఉన్న భూమిలో మొక్కలు నాటే ముందు జీవనియంత్రణ కారకాలతో సమద్ధి చేయబడిన వానపాముల ఎరువు/వేపపిండి గుంటకి 5 కిలోల చొప్పున వేసుకొని అంట్లని నాటాలి.

ఒక టన్ను వానపాముల ఎరువు / పశువుల ఎరువు / వేప పిండిలో 5 కిలోల చొప్పున పర్పూరియోసిల్లమ్‌ బిలాసిపమ్‌, సూడోమోనాస్‌ ఫ్లోరోసెన్స్‌ మరియు ట్రైకోడెర్మా హార్జినియమ్‌ను కలిపి 30 రోజులు ఉంచి సమద్ధి చేసిన మిశ్రమాన్ని 3-4కిలోలు ఒక చెట్టుకు 6 నెలల వ్యవధిలో వేయాలి.

పైన సూచించిన జీవనియంత్రణ కారకాలతో ఉన్న వేపపిండి లేదా పశువుల ఎరువును 20 కిలోలను 200 లీటర్ల నీటిలో 2 రోజుల పాటు నానబెట్టి, 2-3 లీటర్లతో ఒక్కో చెట్టు మొదళ్ళు తడిపి నులి పురుగులను నివారించవచ్చు.

ఈ ద్రావణాన్ని వడకట్టి 15-20 రోజుల వ్యవధిలో డ్రిప్‌ పద్ధతిలో చెట్లకు పంపించడం ద్వారా నులిపురుగులను నియంత్రించవచ్చు.

జామ మొక్క మొదళ్ళల్లో బంతి నారు మొక్కలు నాటడం ద్వారా నులి పురుగులను నివారించవచ్చు.

కార్బోఫ్యూరాన్‌ లేదా ఫోరేట్‌ ఒక్కో చెట్టుకు 100 గ్రా. చొప్పున ఇసుకలో కలిపి సంవత్సరానికి రెండుసార్లు వేసుకోవాలి.

డా|| బి. వి. కె. భగవాన్‌, ప్రధాన శాస్త్రవేత్త, యం. లక్ష్మీనాగ నందిని, సహపరిశోధకులు (సస్యరక్షణ),

ఉద్యాన పరిశోధనా స్థానం, కొవ్వూరు, పశ్చిమ గోదావరి, ఫోన్‌ : 8247416087