మారుతున్న వాతావరణ మరియు సామాజిక పరిస్థితులకు అనుగుణంగా నాట్ల విధానంలో వరి సాగుకు ప్రత్యామ్నాయ విధానాలకు ఆచరించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. నాట్ల విధానంలో నారుమడి తయారీ, నారుపోయడం, నారు తీయడం, నారు మోయడం, నాట్లు వేయడం వంటి పనులకు కూలీల అవసరం ఎంతగానో ఉంది. ప్రస్తుతం కూలీల కొరత ఉండడం, కూలీల రేట్లు పెరగడంతో రైతుకు సాగు ఖర్చు పెరిగి వరి సాగు భారంగా మారింది. ఇటువంటి పరిస్థితుల్లో నేరుగా విత్తే వరి సాగు విధానం ఎంతగానో ప్రాచుర్యం పొందింది. ఈ పద్ధతిలో నారుమడి తయారీ, నారుపోయడం, నాట్లు వేయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి శ్రమ మరియు కూలీల ఖర్చు తగ్గుతుంది. కాలపరిమితి నాట్ల విధానంలో కన్నా 7-10 రోజులు తక్కువగా వస్తుంది.

దిగుబడులు నాట్ల విధానంలో కన్నా అధికంగా రావడంతో మన రైతాంగం నేరుగా విత్తే పద్ధతిపై మక్కువ చూపుతున్నారు. అయితే దాళ్వా పంటను ఎక్కువగా గోదావరి జిల్లాల్లోనూ, గుంటూరు, కృష్ణా, ఉత్తర కోస్తా జిల్లాల్లో నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో వేస్తారు. గోదావరి జిల్లాల్లో దమ్ము చేసిన మాగాణుల్లో నేరుగా విత్తే విధానం ఎక్కువగా ఆచరణలో ఉంది. గుంటూరు, కృష్ణా మరియు ఉత్తర కోస్తా జిల్లాల్లో దుక్కి చేసిన పొలాల్లో పొడి విత్తనాన్ని విత్తే విధానం ప్రాచుర్యం పొందింది. ఇప్పటి వరకు లభ్యమవుతున్న రకాలన్నీ నాట్లవిధానం కోసం రూపొందించబడినవి. అయితే అన్ని రకాలు నేరుగా విత్తే వరి సాగుకు అనుకూలం కాదు. ఎందుకంటే నేరుగా విత్తినప్పుడు చ.మీ. మొక్కల సాంద్రత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మధ్యస్థంగా పిలకలు పెట్టి, పొడుగాటి వెన్నలు గల రకాలను ఎంచుకోవాలి. బలమైన వేరు వ్యవస్థ దృఢమైన కాండం కలిగి ఉండాలి. అందుచే పంట చేనుపై పడిపోకుండా ఉంటుంది.

దాళ్వాలో 120-125 రోజుల్లోపే పంట చేతికి వచ్చే రకాలను సాగు చేయాలి. ముఖ్యంగా శాఖీయ దశలో త్వరగా పెరిగి కలుపును అణగదొక్కగల శక్తిని కలిగి ఉండాలి. అంతేకాకుండా గింజరాలిక తక్కువగా ఉండి 2-3 వారాల నిద్రావస్థ కలిగినదై ఉండాలి. అందువల్ల కోత దశలో పంట అకాల వర్షాలకు గురైన చేనుపై గింజ మొలకెత్తకుండా, రాలకుండా ఉంటుంది. దాళ్వాలో సాధారణంగా వచ్చే అగ్గితెగులును మరియు దోమపోటుని ఖచ్చితంగా తట్టుకునేదై ఉండాలి. కాబట్టి నేరుగా విత్తే విధానంలో సాగుచేసేటప్పుడు ఈ పైన చెప్పిన లక్షణాలున్న రకాలను వేసినట్లయితే రైతుకు పంట ఖర్చు తగ్గి అధిక దిగుబడులతోపాటు అధిక నికరాదాయం వస్తుంది. దాళ్వాలో నేరుగా విత్తే వరి సాగుకు అనువైన వరి రకాలు వాటి లక్షణాలను కింద వివరించడమైనది.

యంటియు - 3626 (ప్రభాత్‌) :

ఈ రకం కాలపరిమితి 125 రోజులు. అగ్గి తెగులును తట్టుకొంటుంది. ధాన్యం లావుగా ఉండడం వల్ల బొండాలు అనే పేరుతో పిలవబడుతుంది. గోదావరి జిల్లాలో ఎక్కువగా సాగులో ఉంది. ధాన్యం కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంది. మన రాష్ట్రంలో ఎక్కువగా ఉప్పుడు రవ్వకు వినియోగిస్తారు. పంట చేను పడిపోదు. గింజ లావుగా, బరువుగా ఉండడం వల్ల దిగుబడి సామర్ధ్యం ఎక్కువగా ఉంటుంది. ఎకరానికి 35 నుండి 40 క్వింటాళ్ళ ధాన్యం దిగుబడిని ఇస్తుంది.

యంటియు-1121 (శ్రీపద్ధతి) :

ఈ రకం 125 రోజుల్లో కోతకి వస్తుంది. దోమపోటుని మరియు అగ్గితెగులును సమర్థవంతంగా తట్టుకుంటుంది. కాండం దృఢంగా ఉండి చేనుపై పడిపోదు. పంటకాలం పూర్తయిన తరువాత దృఢంగా ఉన్న కారణంగా కోత ఆలస్యమయినప్పుడు కూడా పడిపోదు. 2 వారాల నిద్రావస్ధను కలిగి ఉంటుంది. గింజ రాలిక బాగా తక్కువగా ఉంటుంది. మొక్కలు ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. కంకిలో చివరి వరకు గింజలు తోడుకుంటాయి. గింజలు మధ్యంలో సన్నగా ఉంటాయి. బియ్యం పారదర్శకంగా పొట్ట తెలుపు లేకుండా ఉండును. దిగుబడి ఎకరానికి 35-40 క్వింటాళ్ళు వస్తుంది.

యంటియు - 1156 (తరంగిణి) :

ఈ రకం యొక్క కాలపరిమితి 115-120 రోజులు. దోమపోటును, అగ్గితెగులును బాగా తట్టుకోవడంచే రసాయనిక మందులకై ఖర్చు పెట్టనక్కర్లేదు. కాండం దృఢంగా ఉండి చేనుపై పడిపోదు. యంటియు 1010లో ఉన్న లోప లక్షణాలైన గింజ రాలిక మరియు చేనుపై పడిపోయే వంగడాలను సరిచేస్తూ అదే గింజనాణ్యతతో ఈ రకం రూపొందించబడింది. 2 వారాల నిద్రావస్థ కలిగి ఉన్నది. కంకులు పొడవుగా ఉండి పోటాకు నుండి పూర్తిగా బయటకు వచ్చి కంకిలో చివరి గింజ వరకూ తోడుకుంటాయి. ధాన్యం పొడవుగా, సన్నగా, తెలుపుగా ఉంటుంది. పొట్ట తెలుపు లేదు. ఎగుమతులకు అనుకూలముగా ఉంటుంది. అతి స్వల్పకాలంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన రకం. ఎకరానికి 35-40 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.

యంటియు - 1153 (చంద్ర) :

ఈ రకం 115- 120 రోజుల్లో కోతకి వస్తుంది. దోమపోటును, అగ్గి తెగులును తట్టుకుంటుంది. చేనుపై పడిపోదు. 2 వారాల నిద్రావస్ధను కలిగి ఉంటుంది. గింజ రాలిక బాగా తక్కువగా ఉంటుంది. ఈ రకం దేశంలోని వివిధ రాష్ట్రాల్లో (ఒరిస్సా, ఛత్తీస్‌ఘడ్‌, మధ్యప్రదేశ్‌, పంజాబ్‌, బీహార్‌, కర్ణాటక, తమిళనాడు, కేరళ) జాతీయ వంగడాల విభాగం ద్వారా 2015లో విడుదల చేయబడింది. ధాన్యం లావుగా, పొడవుగా తెలుపు రంగులో ఉంటుంది. బియ్యం పారదర్శరంగా, పొట్ట తెలుపు లేకుండా ఉండి అధిక నిండుగింజల దిగుబడినిస్తుంది. ధాన్యం దిగుబడి ఎకరాకు 35-40 క్వింటాళ్ళనిస్తుంది.

యన్‌.యల్‌.ఆర్‌ - 34449 :

ఈ రకం పంట కాలం 120-125 రోజులు. అగ్గి తెగులును అత్యంత సమర్థవంతంగా తట్టుకుంటుంది. పొట్టిరకం. చేనుపై పడిపోదు. గింజరాలిక తక్కువ. ధాన్యం మధ్య సన్నగా తెలుపు రంగులో ఉండును. 2 వారాల నిద్రావస్థ ఉన్నది. దాళ్వాకు అనుకూలమైన రకాల్లో సన్నగింజ రకం. దిగుబడి ఎకరాకు 35 క్వింటాళ్ళు.

పైన వివరించిన రకాలే కాకుండా దమ్ము చేసిన మాగాణుల్లో విత్తుకోవడానికి ప్రత్యేకంగా వంగడాలను మార్కెట్‌లోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్ధానంలో రూపొందించబడినాయి. ఈ రకాలు చిరు సంచుల ప్రదర్శనలో ఉన్నాయి. రకాల లక్షణాలను కూడా పొందుపరచబడ్డాయి.

చిరు సంచుల పరీక్షల్లో ఉన్న రకాలు :

యంటియు - 1210 :

ఈ రకం యొక్క పంట కాలం 120-125 రోజులు, దిగుబడి 35-40 క్వింటాళ్ళు. దోమ పోటును, అగ్గి తెగులును తట్టుకుంటుంది. కాండం దృఢంగా ఉండి చేనుపై పడిపోదు. గింజ మధ్యస్థ సన్నగా తెలుపు రంగులో ఉంటుంది. బియ్యం పొట్ట తెలుపు లేకుండా పారదర్శకంగా ఉంటుంది. గింజ రాలిక తక్కువ. 2 వారాల నిద్రావస్థ కలదు. 3వ స|| చారు సంచుల ప్రదర్శనలో ఉన్న రకం.

యంటియు - 1224 :

ఈ రకం యొక్క పంట కాలం 125 రోజులు, దిగుబడి 35 క్వింటాళ్ళు. దోమ పోటును మరియు అగ్గితెగులును కొంత వరకు తట్టుకొనును. మొక్క పొట్టిగా మద్యస్థ పొడవుగా ఉండి చేనుపై పడిపోదు. గింజలు మద్యస్థ సన్నంగా తెలుపు రంగులో ఉండును. బియ్యం బిపిటి 5204ను పోలి ఉండును. 3వ సం|| చిరు సంచుల ప్రదర్శనలో ఉంది.

యంటియు - 1211

ఈ రకం యొక్క పంట కాలం 120-125 రోజులు, దిగుబడి 35-40 క్వింటాళ్ళు. దోమ పోటును మరియు అగ్గితెగులును తట్టుకొనును. పంట చేనుపై పడిపోదు. పోటాకు పొడవుగా ఉంటుంది. గింజలు లావుగా ఉంటాయి. పొట్ట తెలుపు తక్కువ. గింజ రాలిక తక్కువ. 2 వారాల నిద్రావస్థ కలిగి ఉంది. 2వ సం|| చిరు సంచుల పరీక్షల్లో ఉన్న రకం.

యంటియు - 1217

ఈ రకం యొక్క పంట కాలం 120-125 రోజులు, దిగుబడి 35-40 క్వింటాళ్ళు. దోమ పోటును మరియు అగ్గితెగులును ఎండాకు తెగులును తట్టుకుంటుంది. కాండం దృఢంగా ఉండి పంట చేనుపై పడిపోదు. గింజ రాలిక తక్కువ. వెన్నులు మొక్క యొక్క ఎత్తుకు మధ్యలో ఉండును. పోటాకులు పొడవుగా ఉండి వెన్నులకు కప్పి ఉంచును. ధాన్యం లావుగా, పొట్టిగా ఉండి తెలుపు రంగులో ఉండును. బియ్యం పొట్టతెలుపు లేకుండా ఉండును.

పైన వివరించిన రకాల్లో ఏదో ఒక రకాన్ని విత్తన లభ్యతను బట్టి ఎంచుకోవాలి. రకంతో పాటు సాగులో కొన్ని మెళకువలను పాటించినట్లయితే ఆ రకం యొక్క పూర్తిస్థాయి దిగుబడులను పొందవచ్చును.

1. పొలమంతా సమానంగా ఎత్తు పల్లాలు లేకుండా చదును చేసుకోవాలి. దీంతో పొలమంతా నీరు సమానంగా పారి కలుపు మందులు మరియు ఎరువుల వినియోగ సామర్ధ్యం బాగుంటుంది.

2. ఎకరానికి సిఫార్సు చేసిన మోతాదు (12-15 కి/ఎ) ప్రకారమే విత్తనాలు వాడుకోవాలి. ఎక్కువ విత్తనం వాడితే మొక్కలు ఒత్తుగా ఉండి పోషకాల కోసం పోటీ ఏర్పడి బలహీనంగా ఉంటాయి. తక్కువ విత్తనం వాడితే పలుచగా సాంద్రత తక్కువగా ఉండి తక్కువ దిగుబడులు వస్తాయి.

3. సిఫార్సు చేసిన కలుపు మందులను సరైన మోతాదులో, సరైన సమయంలో వాడుకోవాలి.

4. నీరు పెట్టడానికి తీయడానికి కాలువలను ఏర్పాటు చేసుకోవాలి

5. విత్తిన 10 రోజుల వరకు ఆరు తడులనివ్వాలి.

6. పొలాన్ని మడులుగా విభజించుకొని విత్తనాలను అన్ని మడులకు సమానంగా వాడినట్లయితే మొక్కల సాంద్రత పొలమంతా సమానంగా ఉంటుంది.

7. నానబెట్టి మండెకట్టిన విత్తనాల మొలకను ఎక్కువగా పెరగనివ్వకూడదు. మొలక ఎక్కువగా పెరిగితే డ్రమ్‌సీడరు నుండి విత్తేటప్పుడు, చల్లేటప్పుడు మొలక విరిగిపోయే అవకాశం ఉంది.

8. ఈ విధంగా సరైన రకాన్ని ఎంపిక చేసుకొని సాగులో మెళకువులను పాటించినట్లయితే ఎకరానికి రూ. 3000-4000 (నాట్ల పద్ధతికన్నా) ఆదా అవడంతోపాటు 5-10 శాతం అధిక దిగుబడులు వస్తాయి.

డా|| చాముండేశ్వరి, శాస్త్రవేత్త (జన్యు మరియు ప్రజనన విభాగం),

డా|| పి.వి. సత్యనారాయణ, ప్రధాన శాస్త్రవేత్త (వరి),

డా|| బి.వి .యన్‌.యస్‌.ఆర్‌. రవి కుమార్‌, డా|| యం. గిరిజారాణి,

డా|| పి.వి. రమణారావు, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, మారుటేరు, ప.గో.జిల్లా.