పశుగ్రాసాలు, పాడి పరిశ్రమాభివృద్ధికి పునాది. పాడిపరిశ్రమపై ఆధారపడే ప్రతి పాడి రైతు పచ్చిమేత తప్పని సరిగా సాగుచేసుకోవాలి. తమకున్న భూమిలో కనీసం 10వ వంతు భూమిని పశుగ్రాసాల సాగుకు ప్రత్యేకంగా కేటాయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పశుగ్రాసాల రకాలను 4 రకాలుగా వర్గీకరించవచ్చు- ధాన్యపు జాతి, పప్పుజాతి, గడ్డి జాతి, చెట్టు జాతి

ఈ పశుగ్రసాల్లో పంటకాలాన్ని బట్టి రెండు రకాలుగా ఉంటాయి. ఏకవార్షిక మరియు బహువార్షిక. ఏకవార్షిక పశుగ్రాసం ఒక సంవత్సర కాలంలో పంట పూర్తయి పశుగ్రాస దిగుబడి 3-4 కోతలు వస్తుంది. దీనికి వ్యతిరేకంగా బహువార్షిక పశుగ్రాసాలు ఒకసారి నాటితే 5-6 సంవత్సరాల పాటు పలుకోతల్లో పశుగ్రాస దిగుబడి వస్తుంది. నీటిపారుదల సౌకర్యం ఉన్న సందరాÄ్భల్లో బహువార్షిక పశుగ్రాసం సాగు చేసుకోవచ్చు.

ధాన్యపు జాతి పశుగ్రాసాలు :

జొన్న :

జొన్నని ముఖ్యంగా ధాన్యం కోసం మరియు పశుగ్రాసం కోసం సాగు చేస్తారు. ఇది కరువు తట్టుకునే రకం.

రకాలు :

ఏకవార్షిక (ఖరీఫ్‌) : పూసాచరిహైబ్రీడ్‌-106, హర్యానాజోవార్‌-513, పంత్చరి-4

బహువార్షిక : పూసాచరి-615, పంత్చరి-6, కో.ఎఫ్‌.ఎస్‌.29, కో.ఎఫ్‌.ఎస్‌.31

అనువైన భూములు : మెట్ట ప్రాంతాలు మరియు నీరు నిల్వ చేసే పల్లపు భూములు తప్ప అన్నిరకాల నేలలో సాగు చేయవచ్చు.

హెక్టారుకు విత్తనం మోతాదు : ఏకవార్షిక రకాలుకి 10 కిలోలు మరియు బహువార్షిక రకాలకి 25 కిలోల విత్తనాలు అవసరం అవుతాయి.

సాగు పద్ధతి : ఏకవార్షిక రకాలు సాగు చేయటానికి మొక్కల మధ్య ఒక అడుగు దూరం ఉండాలి మరియు బహువార్షిక రకాలు మొక్కల మధ్య 1.5 అడుగు దూరం ఉండాలి.

ఎరువులు :

ఒక హెక్టరకు 100 కిలోల నత్రజని, 60 కిలోల భాస్వరం మరియు ప్రతి కోత తరువాత 50 కిలోల నత్రజని అవసరం అవుతుంది.

నీటి తడి :

వేసవిలో వారంలో 1-2 సార్లు తడిపెట్టాలి

మొదటి కోత సమయం :

ఏకవార్షిక రకాల్ని నాటిన 60-65 రోజుల తరవాత (50% పూత దశలో) కోయవచ్చు. బహువార్షిక రకాల్ని నాటిన 60 రోజుల తర్వాత కోయాలి. తదుపరి కోతలు ప్రతి 45 రోజుల తర్వాత తీసుకోవాలి.

సంవత్సరంలో కోతల సంఖ్య :

6-7 కోతలు

మేత దిగుబడి :

ఒక ఎకరానికి 70-80 టన్నులు దిగుబడి పొందవచ్చు.

సూచనలు :

అలసంద మరియు పిల్లి పెసరలను మిశ్రమ పంటగా సాగు చేయడం మంచిది. జొన్నని ఎండు చొప్ప మరియు పాతరగడ్డి (సైలేజి) తయారీలో కూడా వాడతారు.

పోషక విలువలు :

జొన్నలో 8.5-10 శాతం మాంసకత్తులు మరియు 19.8-25.6 శాతం పీచు పదార్ధాలు కలిగి ఉంటాయి.

మొక్కజొన్న :

మొక్కజొన్న ఏకవార్షిక పంట. ఇది కరువు తట్టుకునే రకం. నీటిపారుదల సౌకర్యం ఉంటే సంవత్సరం పొడువునా పెరుగుతుంది.

రకాలు : ఆఫ్రికన్‌ టాల్‌, విజయ్‌, మౌతి, గంగ-5, జవహర్‌, ఏ.పి.ఎఫ్‌.ఎమ్‌.-8

అనువైన భూములు : ఒండ్రు నేలలు అనుకూలంగా ఉంటాయి. ఇసుక నేలలు, చౌడు నేలలు, నీరు నిలిచే నేలలు పనికి రావు.

హెక్టారుకు విత్తనం మోతాదు : 8 కిలోలు అవసరం.

సాగు పద్ధతి :

విత్తనాన్ని 5 సెం.మీ. దూరంలో విత్తాలి. మొక్కల మధ్య 75 18 సెం.మీ. దూరం లేదా 60-22 సెం.మీ ఉండాలి.

ఎరువులు :

ఒక హెక్టారకు 60-120 కిలోల నత్రజని, 40-60 కిలోల భాస్వరం, 40-60 కిలోల పోటాష్‌, 20 కిలోల జింక్‌ అవసరం.

నీట ితడి :

నాటిన వెంటనే నీరు పెట్టాలి. వారంలో 3-4 సార్లు తడి పెట్టాలి.

కోత సమయం :

విత్తిన 60-70 రోజులు తరవాత కోత తీసుకోవచ్చు.

మేత దిగుబడి :

ఆఫ్రికన్‌ టాల్‌ ఒక ఎకరానికి 24-28 టన్నులు దిగుబడిని ఇస్తుంది.

సూచనలు :

అలసంద మరియు పిల్లి పెసరలను మిశ్రమ పంటగా సాగు చేయడం మంచిది. మొక్కజొన్నని ఎండు చొప్ప, పాతరగడ్డి (సైలేజి) తయారీలో కూడా వాడతారు.

పోషక విలువలు :

మొక్కజొన్నలో 50 శాతం పిండి పదార్థాలు, 8-10 శాతం మాంసకత్తులు మరియు 38 శాతం పీచు పదార్ధాలు కలిగిఉంటాయి.

సజ్జ :

సజ్జ కరువు మరియు అధిక ఉష్ణోగ్రతని తట్టుకుని తక్కువ సారవంతమైన నేలలో కూడా సహజంగా పెరుగుతుంది.

రకాలు : ప్రోఅగ్రో, ఏ.పి.ఎఫ్‌.బి.-2, కో-8, అవికా బజారాచారి, ఎఫ్‌.బి.సి-16

అనువైన భూములు : అన్ని రకాల నేలలు సాగు చేసుకోవచ్చు ముఖ్యంగా ఇసుక మరియు చవుడు నేలలు అనువైనవి.

హెక్టారుకు విత్తనం మోతాదు : 5 కిలోల విత్తనాలు అవసరమైతాయి.

సాగు పద్ధతి :

సజ్జ పశుగ్రాసం సాగు చేసినప్పుడు సాళ్ల మధ్య 1.5 అడుగులు దూరం ఉండాలి మరియు రెండు మొక్కలు మధ్య 0.5 అడుగు దూరం ఉండాలి.

ఎరువులు :

ఒక హెక్టరకు 8-10 టన్నుల పశువుల ఎరువు, 60-80 కిలోల నత్రజని, 20 కిలోల జింక్‌ సల్ఫేట్‌ అవసరం.

నీటి తడి : వారంలో ఒక సారి తడి పెట్టాలి.

కోత సమయం :

విత్తిన 50-55 రోజుల్లో కోతకి అనువుగా ఉంటుంది.

మేత దిగుబడి :

ప్రోఅగ్రో (మల్టీకెట్‌) రకం ఎకరానికి 30 టన్నుల దిగుబడి ఇస్తుంది.

సూచనలు :

అలసంద మరియు పిల్లి పెసరలను మిశ్రమ పంటగా సాగు చేయడం మంచిది.

పోషక విలువలు :

సజ్జలో 2.5-5 శాతం మాంసకత్తులు మరియు 36 శాతం పీచు పదార్ధాలు కలిగి ఉంటాయి.

పప్పుజాతి పశుగ్రాసాలు

అలసంద :

అలసంద ఏకవార్షిక పంట. ఇది ఏడాది పొడవునా సాగు చేయడానికి అనుకూలంగా ఉంటుంది.

రకాలు : యూ.పి.సి.-625, కో (ఎఫ్‌.సి) 8, రష్యన్జైంట్‌, ఈ.సి.4216

అనువైన భూములు : అన్ని రకాల నీరు నిలవని భూముల్లో సాగు చేయవచ్చు.

హెక్టారుకు విత్తనం మోతాదు : 20-25 కిిలోల విత్తనాలు అవసరం.

సాగు పద్ధతి : అలసంద సాగు చేయటానికి సాళ్ల మధ్య 1-1.5 అడుగుల దూరం ఉండాలి.

ఎరువులు :

ఒక హెక్టారకు 120 కిలోల నత్రజని, 80 కిలోల భాస్వరం కావాలి.

నీటి తడి :

15 రోజుల్లో ఒక సారి తడి పెట్టాలి.

కోత సమయం :

విత్తిన 80-85 రోజుల్లో కోతకి వస్తుంది.

మేత దిగుబడి :

యూ.పి.సి.625 రకం ఒక హెక్టారుకి 35-40 టన్నుల దిగుబడి ఇస్తుంది.

సూచనలు :

చలికాలంలో దిగుబడి ఎక్కువగా ఉంటుంది. పంట 50 శాతం పూత దశలో ఉన్నప్పుడు కోయాలి.

పోషక విలువలు :

అలసంద పశుగ్రాసంలో 15-17 శాతం మాంసకత్తులు మరియు 36 శాతం పీచు పదార్ధాలు ఉంటాయి.

పిల్లి పెసర :

పిల్లి పెసర అలసంద ఏకవార్షిక పంట.

అనువైన భూములు :

అన్నిరకాల తేమగల భూమిలో సాగు చేయవచ్చు.

హెక్టారుకు విత్తనం మోతాదు :

30-40 కిలోల విత్తనాలు అవసరం అవుతాయి.

సాగు పద్ధతి :

నాటేటప్పుడు రెండు సాళ్ల మధ్య 0.5 అడుగుల దూరం ఉండాలి.

ఎరువులు :

ఒక హెక్టారకు 50 కిలోల సూపర్‌ ఫాస్ఫేట్‌ 20 కిలోల మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ మరియు 20 కిలోల యూరియ అవసరం అవుతాయి.

నీటి తడి :

15 రోజుల్లో ఒకసారి తడిపెట్టాలి.

కోత సమయం :

విత్తిన 50-60 రోజుల్లో కోత తీసుకోవాలి.

మేత దిగుబడి :

ఒక హెక్టారకు 10-15 టన్నుల దిగుబడి పొందవచ్చు.

సూచనలు :

పంట 50 శాతం పూతదశలో ఉన్నప్పుడు కోయాలి.

పోషక విలువలు :

పిల్లి పెసరలో 15-17 శాతం మాంసకత్తులు మరియు 60 శాతం పిండి పదార్థాలు ఉంటాయి.

బర్సీం :

బర్సీం చలికాలంలో సాగు చేసే పప్పు జాతి పశుగ్రాసం.

రకాలు : బి.ఎల్‌.-180 హెచ్‌.ఎఫ్‌.బి.-600, జె.బి.-5

అనువైన భూములు : ఇసుక నేలలో తప్ప అన్ని రకాల నేలలో సాగు చేయవచ్చు. నీటి పారుదల ఉన్న, కాల్షియం మరియు భాస్వరం అధికంగా లభ్యమయ్యే రేగడి నేలలు సాగుకి అనుకూలమైనవి.

హెక్టారుకు విత్తనం మోతాదు : 25 కిలోలు విత్తనాల్ని వెదజల్లి సాగు చేసుకోవాలి.

ఎరువులు :

ఒక హెక్టారకు 20 టన్నుల పచ్చి రొట్ట లేదా పశువుల ఎరువు, 20 కిలోల నత్రజని మరియు 80 కిలోల భాస్వరం అవసరం అవుతాయి.

నీటి తడి :

15 రోజుల్లో ఒక సారి తడి పెట్టాలి.

కోత సమయం :

విత్తనం నాటిన 50 రోజుల్లో మొదటి కోత తీసుకోవచ్చు. తదుపరి పెరుగుదలను బట్టి 5-6 సార్లు కోత తీసుకోవచ్చు.

మేత దిగుబడి :

ఒక హెక్టారకు 80 టన్నుల దిగుబడి పొందవచ్చు.

సూచనలు :

నాటే ముందు విత్తనశుద్ధి చేసుకుంటే తెగుళ్ళు నివారణ చేయవచ్చు మరియు ఎక్కువ దిగుబడి పొందవచ్చు.

పోషక విలువలు :

బర్సీం పశుగ్రాసంలో 20 శాతం మాంసకత్తులు మరియు 62 శాతం పిండి పదార్థాలు ఉంటాయి.

స్టైలో :

ఇది వేసవి కాలంలో సాగు చేసే బహువార్షిక పప్పు జాతి పశుగ్రాసం. ఇది కరువు తట్టుకునే రకం.

రకాలు : స్టైలోసన్తేసూక్రాంతి, స్టైలోసన్తేస్స్కేబరా

అనువైన భూములు : అన్ని రకాల నేలలో సాగు చేయవచ్చు.

హెక్టారుకు విత్తనం మోతాదు : 5-6 కిలోల విత్తనాల్ని వెదజల్లాలి.

ఎరువులు :

మొదటి సంవత్సరంలో ఒక హెక్టారకు 120 కిలోల పోటాష్‌ మరియు 40 కిలోల నత్రజని ప్రతి సంవత్సరం అవసరం.

నీటి తడి :

15 రోజుల్లో ఒక సారి తడి పెట్టాలి.

కోత సమయం :

విత్తిన 65-70 రోజుల్లో కోత తీసుకోవచ్చు.

మేత దిగుబడి :

ఒక హెక్టారుకి 25-30 టన్నుల దిగుబడి పొందవచ్చు. మొదటి సంవత్సరంలో పెరుగుదల తక్కువగా ఉండటం వల్ల దిగుబడి తక్కువగా ఉంటుంది.

సూచనలు :

పంట పూతదశలో ఉన్నప్పుడుకోయాలి. ఒకసారిసాగు చేస్తే 4-5 సంవత్సరాల వరకు పశుగ్రాసం లభిస్తుంది.

పోషక విలువలు :

స్టైలో పశుగ్రాసంలో 15-18 శాతం మాంసకత్తులు మరియు 60 శాతం పిండి పదార్థాలు ఉంటాయి.

లుసర్న్‌ :

లుసర్న్‌ వేరులు లోతుగా ఉంటాయి. ఇది బహువార్షిక పశుగ్రాసం. ఇది అన్ని రకాల వాతావరణాలను తట్టుకునే రకం.

రకాలు : ఆనందు లుసర్న్‌-3, ఆర్‌.ఎల్‌.-88, కో-1, ఎల్‌.ఎల్‌. కంపోసిట్‌-3

అనువైన భూములు : సారవంతమైన మరియు నీరు నిలువని భూములు లుసర్న్‌ సాగుకి అనువైనవి.

హెక్టారుకు విత్తనం మోతాదు : వెదజల్లే విధానంలో 20-25 కిలోల విత్తనాలు అవసరం అవుతాయి.

ఎరువులు :

మొదటి సంవత్సరంలో ఒక హెక్టారకు పచ్చి రొట్ట ఎరువు 20-25 టన్నులు, 120 కిలోల భాస్వరం మరియు 20 కిలోల నత్రజని అవసరం. తదుపరి ప్రతి సంవత్సరం 40 కిలోల పొటాష్‌ మరియు 80 కిలోల భాస్వరం అవసరం అవుతాయి.

నీటి తడి :

నాటిన కొత్తలో వారానికి ఒక సారి తడి పెట్టాలి. తదుపరి 15 రోజుల్లో ఒక సారి తడి పెట్టాలి.

కోత సమయం :

విత్తిన 55-60 రోజుల్లో కోత తీసుకోవచ్చు.

మేత దిగుబడి :

ఒక హెక్టారకు 70-90 టన్నుల దిగుబడి పొందవచ్చు. మొదటి సంవత్సరంలో పెరుగుదల తక్కువగా ఉండటంవల్ల దిగుబడి తక్కువ ఉంటుంది.

సూచనలు :

ఒక సారి సాగుచేస్తే 3-4 సంవత్సరాల వరకు పశుగ్రాసం లభిస్తుంది.

పోషక విలువలు :

లుసర్న్‌లో 16-25 శాతం మాంసకత్తులు, 20-30 శాతం పీచు పదార్థాలు మరియు విటమిన్‌-ఎ ఎక్కువగా ఉంటుంది.

డా|| పి.మంజరి, శాస్త్రవేత్త, పశువైద్య విభాగం - కె.వి.కె., పెరియవరం, డా|| ఎల్‌. రంజిత్‌ కుమార్‌, శాస్త్రవేత్త, కీటకశాస్త్ర విభాగం - కె.వి.కె., పెరియవరం,

ఎన్‌. శ్రీ విద్యా రాణి, శాస్త్రవేత్త, విస్తరణ విభాగం - కె.వి.కె., పందిరిమామిడి, చె. సింధు, రీసెర్చ్‌ అసోసియేట్‌, గహ విజ్ఞాన విభాగం - కె.వి.కె., పెరియవరం,

డి. వినోద్‌ నాయక్‌, రీసెర్చ్‌ అసోసియేట్‌, విస్తరణ విభాగం - కె.వి.కె., పెరియవరం