ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా ప్రభుత్వాలు పనిచేసినప్పుడే ప్రజల్లో మంచి సార్ధకత ఉంటుందని 'అగ్రిక్లినిక్‌' సంపాదకులు, పర్చూరు నియోజకవర్గ శాసన సభ్యులు ఏలూరి సాంబశివరావు అసెంబ్లీలో రైతు సమస్యలపై తమ గళాన్ని వినిపించారు. రైతు పక్షాన తన వాణిని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళడంలో ఏలూరి చేసిన కృషి ఎనలేనిది. కాలం కలసిరాక, పెట్టిన పెట్టుబడులు తీరక రైతులు అనునిత్యం సమస్యల వలయాలలో చిక్కిపోతున్నారని ఇటువంటి రైతాంగానికి ప్రభుత్వం భరోసాను అందించేందుకు స్పష్టమైన హామీలను ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవలసిన అవసరం, ఆవశ్యకత ఈ సభలో చోటుచేసుకుందని ఈ వేదిక ద్వారా ఈ రాష్ట్ర రైతాంగానికి నేటి ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన ఇస్తూ రైతు పక్షాన నిలబడుతుందనే అభయాన్ని అందిస్తుందని యావత్‌ రైతాంగం ఎదురుచూస్తున్న తరుణంలో ఈ సభ ముగిసేనాటికి రైతాంగానికి స్పష్టమైన హామీతోకూడిన నిర్ణయాన్ని ప్రకటించాలని ఏలూరి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వాలు మారినా రైతుల పట్ల వివక్షత లేని సుపరిపాలన అందించిన నాడే రైతులకు మేలు జరుగుతుందని అన్నారు.

రాష్ట్రంలో చిన్న సన్నకారు రైతాంగంతో పాటు కౌలు రైతులు సుమారు 80 శాతం పైగా వ్యవసాయం పైనే జీవనం సాగిస్తున్నారని ప్రకాశం జిల్లాలోని పర్చూరు నియోజకవర్గం పూర్తిగా వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తుందని అన్నారు. పర్చూరు నియోజకవర్గ ప్రజలు సాగు, తాగు నీరు కోసం నిత్యం ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని ఉమ్మడి ఆంధ్రద్రేశ్‌గా ఉన్ననాటి నుండే ఈ ప్రాంతం సాగు నీరు లేక అష్టకష్టాలు పడుతున్న రైతాంగం తమ గోడును వెల్లబోస్తూనే ఉన్నారు. నేటికీ సాగు నీటి సమస్య పరిష్కారం కాకుండానే ఉంది.

ఇటీవల కాలంలో రాష్ట్రం ఏర్పాటు అనంతరం నియోజకవర్గంలోని ప్రధాన సమస్య అయినా సాగు, తాగు నీటి సమస్య పరిష్కారం కోసం అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయకత్వంలో దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రణాళికలను సిద్ధం చేయడం జరిగిందని చంద్రబాబు ముందుచూపుతో జలయజ్ఞాన్ని నిర్వహించడం వల్ల ఈ ప్రాంత రైతాంగానికి సాగు, తాగు నీరు సమస్యను కొంత మేరకు పరిష్కారం చూపామని తెలిపారు. రైతులు ఎదుర్కొంటున్న గిట్టుబాటు ధరను కల్పించడంలో అప్పటి ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడడం జరిగిందని వివరించారు. ఆనాటి ప్రభుత్వం అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికీ రైతులను రుణమిముక్తి చేయాలనే సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా 54 లక్షల మందికి రూ. 24 వేల కోట్లకు పైగా రుణమాఫీ చేసిందన్నారు. ప్రభుత్వం తీవ్ర ఆర్ధిక లోటు కారణంగా రైతులకు రుణమాఫీ ఒకేసారి చెల్లింపు సాధ్యంకాకపోవడంతో 5 ఏళ్ళలో 5 విడతలుగా వడ్డీతో సహా చెల్లించాలని నిర్ణయించింది. తదనుగుణంగానే మూడు విడతలుగా రూ. 16 వేల కోట్లకు పైగా చెల్లించిందని 4-5 విడతలకు సంబంధించి మరో రూ 7.50 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని వాటికోసం ప్రభుత్వం ప్రత్యేక జీవో ఇచ్చి కొంత సర్దుబాటు చేసిందని రాజకీయ పార్టీలకు అతీతంగా పారదర్శకంగా టిడిపి ప్రభుత్వం రైతులకు రుణమాఫీ అమలు చేసిందని గుర్తు చేశారు.

ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతు రుణాల పెండింగ్‌ల ఊసే పట్టించుకోలేదని తక్షణమే రైతులకు చెల్లించాల్సిన పెండింగ్‌ రుణాలను వడ్డీతో సహా చెల్లించాలని ఎమ్మెల్యే ఏలూరి చట్టసభలో తన వాణిని బలంగా వినిపించారు. ఈ ప్రభుత్వ విధానాలు చూస్తుంటే రైతులు ఆందోళన చెందుతున్నారని రుణమాఫీ బకాయిలు చెల్లించరేమోననే అనుమానం రైతుల్లో రేకెత్తుతుందని ప్రభుత్వంలో ఏ పార్టీవారు ఉన్నా రైతుల పక్షాన నిలవాల్సిన అవసరం ఎంతో ఉందని ప్రభుత్వాలు మారినా ఏ పార్టీ అధికారంలో ఉన్నా రైతుల పక్షాన ఉండి తీరాల్సిందే. రైతులను విస్మరించిన ప్రభుత్వాలు ఎంతో కాలం మనుగడ సాగించలేవని చరిత్ర చెబుతందని అన్నారు. నేడు రైతాంగం సాగు నుండి వైదొలగే పరిస్థితులు నెలకొని ఉన్నాయని ఇదే కొనసాగితే రానున్న రోజుల్లో వ్యవసాయ రంగం కుంటుబడే పరిస్థితి ఉందని అన్నారు. దేశానికి అన్నం పెట్టేదే రైతని అటువంటి రైతుకు అన్ని విధాలా ప్రోత్సాహాన్ని అందించి సముచిత గౌరవం కల్పించిన నాడే రాష్ట్రం, దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించగలుగుతుందని ఏలూరి తెలిపారు. గత కొన్ని సంవత్సరాల నుండి రైతాంగాన్ని పాలకులు విస్మరిస్తూ రావడం వల్ల ఆశించిన మేర వ్యవసాయ ఉత్పత్తుల ఉత్పత్తి పెరిగిన జనాభాకు అనుకూలంగా పెరగలేకపోయిందని జనాభా అవసరాలకు అనుగుణంగా నేడు ఉత్పత్తులు లేకపోవడంతో ఇతర రాష్ట్రాల, దేశాల నుండి దిగుమతి చేసుకునే దుస్థితి ఏర్పడిందని ఒకప్పుడు అన్నపూర్ణగా పిలవబడిన ఆంధ్రప్రదేశ్‌ రాను రానూ వ్యవసాయ రంగం నుండి వైదొలిగే పరిస్థితికి నెట్టివేయబడుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. వ్యవసాయ రంగాన్ని ఉత్పాదక రంగంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని వ్యవసాయ రంగంలోకి యువతన ప్రోత్సహించే విధంగా నూతన పథకాలను ఏర్పాటుచేయాలని రైతులకు పంట రుణాలతో పాటు నూతన వ్యవసాయ పద్ధతులకు అనుగుణంగా రుణ సౌకర్యం కల్పించాలని గిట్టుబాటు ధర కొరకు ప్రత్యేక విధానం తీసుకురావాలని ఇప్పటి వరకు రైతులపై ఉన్న రుణాలను రద్దుచేసి రైతులను రుణ విముక్తులను చేసి పార్టీలకు అతీతంగా రైతాంగానికి అండగా నిలవాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఏలూరి అడిగిన ప్రశ్నకు వ్యవసాయ శాఖా మంత్రి కన్నబాబు సానుకూలంగా స్పందించారు. 4-5 విడతల్లో ఉన్న రుణమాఫీని ప్రభుత్వం పరిశీలిస్తుందని వివరించారు.

-

అగ్రిక్లినిక్‌ డెస్క్‌