నీరు అనుగ్రహిస్తే సుజలాం.. సుఫలాం.. ఆగ్రహిస్తే విళయం... ప్రళయం... మన పొరుగున ఉన్న తమిళనాడులో వర్షాభావం రాజస్థాన్‌లో కరువు, తెలంగాణలో మిషన్‌ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టులు, ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం, తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం. భౌగోళిక స్వరూపాలను మనం మార్చలేం కాని ఉన్న వనరులను ఒడిసిపట్టి అనువుగా పెట్టుకోగలం. తెలుగు రాష్ట్రాల్లో పుష్కలంగా ఉన్న వనరు నీరు. దీన్ని ఒడిసిపట్టి అదుపులో పెట్టి మనకు కావలసినట్లు ఉపయోగించుకోవడానికి చేస్తున్న మహా ప్రయత్నమే మిషన్‌ కాకతీయ ద్వారా గొళుసు కట్టు చెరువుల అనుసంధానం.

వర్షమే ఆధారమైన తెలంగాణ సేద్యానికి చిన్న నీటి వనరులే ఆదరువు. మిషన్‌ కాకతీయను అధ్యయనం చేసిన నీతి అయోగ్‌, నాబార్డ్‌, అంతర్జాతీయ నీటి యాజమాన్య సంస్థ దీని పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు. దీనివల్ల 2013-14 లో 51.5 శాతంలో అదనంగా సాగుభూమి అందుబాటులోకి వచ్చింది. వరి సాగు విస్తీర్ణం 49.2 శాతం -62.1 శాతానికి పెరిగింది, రబీ వరిలో విస్తీర్ణం 7.2 శాతం, దిగుబడి 19.6 శాతం పెరిగింది. ప్రత్తిలో 11.6 శాతం దిగుబడి పెరిగింది. 12-14వ శతాబ్ధంలో కాకతీయుల కాలం నుండి తెలంగాణలో వేలకొలది గొళుసుకట్టు చెరువులు నిర్మించారు. ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి చెరువులను నింపుకొని, చెరువు అలుగుపై నుంచి పారే నీటిని క్రింద నున్న గొలుసుకట్టు చెరువులకు తరలించుకుంటూ త్రాగు, సాగునీటి అవసరాలను తీర్చుకోవచ్చు. 2013-14 లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో గల 46,531 చెరువుల కుంటల కింద 10.17 లక్షల హెక్టార్ల సాగు భూమి కలిగి 265 బిలియన్‌ క్యూబిక్‌ ఫీట్‌ల నిల్వ సామర్థ్యాన్ని కృష్ణా, గోదావరి బేసిన్‌లో కలిగి ఉంది.

ఇప్పటికే వివిధ చెరువుల అభివృద్ధి పథకాల ద్వారా ప్రభుత్వ, ప్రపంచ బ్యాంకు, జపాన్‌ ఇంటర్నేషనల్‌ బ్యాంకు, నాబార్డ్‌, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా నిధులు పొందిన గ్రామ చెరువుల్లో నిర్వహణను ఇంకా మెరుగ్గా కొనసాగించాలంటే ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి. చాలావరకు ఈ చెరువుల్లో ప్రభుత్వ ఆర్థిక సహాయం అందినంత వరకే సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. తరువాత ఈ చెరువులో కలుపు నిండడం, కాలువలు పూడుక పోవడం, నిర్వహణ లోపాల వల్ల చెరువు పాడవుతుంది. తదనంతరం నిర్వహణ లోపాలను సరిదిద్దడానికి ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛంధంగా, ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు, యువత, మత్స్యకారులు, భూగర్భ జల వినియోగదారులు, కల్లుగీత కార్మికులు, పశువుల కాపరులు, ఇటుక తయారీ దారులు, బాతులు పెంచేవారు, రైతు కూలీలు, మహిళలను సంఘటితం చేసి సుస్థిర అభివృద్ధి సాధించాలి.

చెరువు అభివృద్ధి మరియు యాజమాన్య దశలైన ముందస్తు ప్రణాళిక తయారీ దశ, ప్రణాళిక తయారీ దశ, ప్రణాళిక అమలు దశ, పంట ప్రణాళిక దశల్లో నీటి వినియోగదారులను మాత్రమే కాక లబ్దిదారులందరిని భాగస్వామ్యం చేయడం వల్ల పారదర్శకత పెరిగి చెరువును సమర్ధవంతంగా వినియోగించుకోవచ్చును. అంతేగాకుండా లబ్దిదారులు స్వచ్ఛంధ సంస్థల పాత్రలను ప్రణాళిక దశలోనే వాడుకోవడం వల్ల లబ్దిదారులందరు స్వతహాగా పాల్గొని తమ చెరువు అనే భావనను పెంపొందించుకుంటారు.

చెరువుల నీటి వాడకం :

2014లో ప్రారంభించిన మిషన్‌ కాకతీయ వల్ల 27,713 చెరువులను పునర్వినియోగంలోకి తెచ్చి 2.88 లక్షల కొత్త ఆయకట్టును స్థిరీకరించడం జరిగింది. అంతేగాకుండా రైతులు పూడిక తీసిన చెరువు మట్టిని వాడటం వల్ల 35-50 శాతం రసాయనిక ఎరువుల వాడకం తగ్గింది. అదే విధంగా భూగర్భజలాల లభ్యత 6.91 నుండి 9.02 కు పెరిగింది. చేపలు ఉత్పత్తి 36-39 శాతం పెరిగింది. ఈ మిషన్‌ కాకతీయ ప్రస్తుతం పంట దిగుబడులు, భూగర్భ జలాల లభ్యత, పంట విస్తీర్ణం, చేపల ఉత్పత్తిలో గణనీయమైన మార్పు సృష్టించినప్పటికి భవిష్యత్తులో ఈ క్రింది చర్యలు తీసుకోవాలి.

వ్యవసాయ ప్రణాళిక :

ప్రతి చెరువులోని మట్టిని పరీక్ష చేసి పొలాల్లో తోలటానికి అనుకూలంగా ఉన్న పూడికే పొలాలకు తరలేలా ట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి. ప్రతి చెరువు గట్టు మీద పూడిక మట్టి ప్రాధాన్యతను తెలియజేసేలా మట్టి గుణగణాలను తెలియపరిచేలా బోర్డును ఏర్పాటు చేయాలని గ్రామ సభల ద్వారా రైతులకు వివరించాలి.

సాధారణంగా ఖరీఫ్‌ సీజన్‌లో జూలై నుంచి నవంబర్‌ వరకు 300-450 మి.మీ. వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో చెరువు సమీప ప్రాంతాల్లో బోరు బావుల సాంద్రత తగ్గడం వల్ల, నీటి లభ్యత తగ్గుతుంది. కాబట్టి ఈ ప్రాంతాల్లో వాల్టా యాక్ట్‌ను ఉపయోగించి చెరువు నీటి వాడకంపై నియంత్రణ పెంచాలి.

చెరువు వినియోగదారుల సంఘాల్లో రైతులను మాత్రమే సభ్యులుగా కాకుండా చెరువు ఆధారిత మత్స్యకారులు, బట్టలు ఉతికేవారు, భూగర్భజల వినియోగదారులు, రైతు కూలీలు, పశువులు పెంచేవారు, మహిళలు, గిరిజనులు, దళితులు, కల్లుగీత కార్మికులు, బాతులు పెంచే వారికి ప్రాతినిద్యం కల్పించాలి.

భూమి లేని రైతులుకు చెరువు శిఖ భూముల్లో పట్టాలివ్వడం నిర్మూలించాలి. అంతేగాకుండా చేపల సంఘాల వారు నీటి విడుదలను అడ్డుకోవడాన్ని కూడా క్రమబద్దీకరించాలి. చెరువు పరీవాహ ప్రాంతాల్లో అటవీ విస్తీర్ణాన్ని పెంచడం, రియల్‌ఎస్టేట్‌ వెంచర్లను, గ్రానైట్‌ క్వారీలకు చెరువు పరీవాహక ప్రాంతాల్లో అనుమతి ఇవ్వకూడదు.

శాఖల సమన్వయం :

సాగు నీటి శాఖ, పంచాయితీ రాజ్‌, గ్రామీణ అభివృద్ధి, వ్యవసాయ, మత్స్య, ఉద్యానవనం, వెటర్నరీ శాఖల మధ్య సమన్వయాన్ని ఏర్పరచి రైతులతో, స్వచ్ఛంధ సంస్థలతో ఎప్పటికప్పుడు సమాచార మార్పిడి జరిగేటట్లు చర్యలు తీసుకోవాలి. ఈ విధంగా సమర్థవంతమైన నీటి సమాచార వ్యవస్థను ఏర్పరచుకోవడం వల్ల భూగర్భజలాలు అడుగంటి పోవుటకు కారణాలు, చెరువుల నిర్వహణ లోపాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు వీలవుతుంది.

వాతావరణ ప్రణాళిక :

గ్రానైట్‌ క్వారీల వల్ల చెరువుల ఆయకట్టు ప్రాంతంలో సోడియం, పొటాషియం, క్లోరిన్‌, ఫ్లోరైడ్స్‌ వల్ల నీటి క్షారత్వం పెరగడంతో పాటు నీటి ప్రవాహ వేగం తగ్గి చెరువుల కింద రైతులు తక్కువ పంట దిగుబడిని పొందుతున్నారు.

వాల్టా చట్టం (వాటర్‌ అండ్‌ ల్యాండ్‌ ట్రీస్‌ యాక్ట్‌)ను కఠినంగా అమలు పరచడం వల్ల చెరువు పరివాహక, ఆయకట్టు ప్రాంతాల్లో బోరు బావుల సంఖ్యను తగ్గించి భూగర్భ జల మట్టాలను పెంచవచ్చును. దీనివల్ల చెరువు ఆయకట్టు ప్రాంతాల్లో 20-30 శాతం బోరుబావుల్లో నీటి మట్టం పెరిగే అవకాశం ఉంది.

సామాజిక, ఆర్థిక ప్రణాళిక :

చెరువుల పునరుద్ధరణకు స్వచ్ఛంధంగా భూ విరాళాలను సర్కారుకు అందించాలనుకునే, విదేశాల్లో నివసిస్తున్న ఆ ప్రాంత వ్యక్తులు తమ గ్రామాల్లోని చెరువుల అభివృద్ధి కోసం ఆర్థిక సహాయం చేసి దత్తత తీసుకోవడం వల్ల వారి ఇష్ట ప్రకారం ఆ చెరువుకు పేరు పెట్టవచ్చును. దీనివల్ల వారి కుటుంబ సభ్యులకు సమాజంలో సరైన గుర్తింపు లభిస్తుంది.

చెరువుల అభివృద్ధిలో ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యాలను ఏర్పరచాలి.

రైతుల నుంచి వసూలు అయ్యే శిస్తుతో సంబంధం లేకుండా ప్రభుత్వం క్రమబద్ధంగా కొంత బడ్జెట్‌ చెరువు అభివృద్దికి కేటాయించాలి.

నీటి సంఘాలకు ఎన్నికలు క్రమబద్ధంగా రెండు సంవత్సరాల కొకసారి 1/3 సభ్యులను ఎన్నుకొనేటట్లు చేయడం లేదా 5 సంవత్సరాల కొకసారి ఎన్నికలు జరిపేటట్లు చట్టంలో మార్పులు తేవాలి. ప్రభుత్వం చెరువు వినియోగదారుల లేదా నీటి సంఘాలకు ఎన్నికలు తక్షణమే నిర్వహించి వారికి మెరుగ్గా అధికారాలు, ఆర్థిక వనరులు కల్పించాలి.

నీటి సంఘాలకు కార్యాలయంతో పాటు, కంప్యూటర్‌, ఫర్నీచర్‌, నీరు కంటి, మీటింగ్‌హాల్‌, రికార్డుల నిర్వహణ కోసం బడ్జెట్‌ కేటాయించాలి.

చెరువుల నిర్వహణను పూర్తిగా గ్రామ పంచాయితీలకు ఇవ్వడం వల్ల నిర్వహణ సులభతరమవుతుంది.

చెరువు నిర్వహణా కార్యక్రమాల్లో సివిల్‌ పనులకే కాకుండా నీటి యాజమాన్యం, ప్రజాభాగస్వామ్యం, జీవన ప్రమాణాల పెంపు, అవగాహన శిక్షణా కార్యక్రమాలు, వ్యవసాయ వ్యాపార కార్యక్రమాలను ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు స్వచ్ఛంద సంస్థలను కూడా భాగస్వామ్యం చేయాలి.

వర్షాధారిత చెరువులను రిజర్వాయరులకు, కాలువలకు, ఎత్తిపోతల పథకాలకు కలపడం వల్ల నీటి వినియోగం పెరిగి చెరువుల ద్వారా అభివృద్ధి సుస్థిరమవుతుంది.

చిన్న తటాకములు, జలాశయాల నిర్వహణలో ప్రభుత్వం, ప్రజలు నిర్లక్ష్యం వహించడం వల్ల చెరువులో పూడిక మట్టి పెరిగిపోయింది. అంతే గాకుండా వాణిజ్య అవసరాల కోసం చెరువు భూములను దుర్వినియోగం చేసారు.

నిధులను సరైన సమయంలో గ్రామ పంచాయితులకు, కాంట్రాక్టరులకు, స్వచ్ఛంధ సంస్థలకు, నీటి సంఘాలకు విడుదల చేయాలి. కాంట్రాక్టరుల పాత్రను వీలైనంత వరకు తగ్గించి వినియోగదారుల సంఘాలకు ఇవ్వాలి.

సామాజిక వనాలను చెరువు కట్ట, చెరువు శిఖ భూముల్లో ఏర్పరచాలి.

రెవెన్యూ శాఖ అధికారుల ద్వారా గ్రామస్తులు చెరువు వాస్తవ సరిహద్దులను జి.ఐ.యస్‌ (జియో పోజిషనల్‌ ఇన్‌ఫర్‌మేషన్‌ సిస్టమ్‌) ద్వారా గుర్తించి కబ్జా దారులపై, అక్రమదారులపై నిరంతర పర్యవేక్షణ చేయవచ్చును.

పంట ప్రణాళిక :

సాధారణంగా చెరువు ఆయకట్టు ప్రాంతంలో 90 శాతం వరకు వరి మాత్రమే సాగు చేస్తున్నారు. చెరువుల సమర్థ వినియోగం వల్ల చెరువు ఇన్‌ఫ్లుయెన్స్‌ జోన్‌లో భూగర్భ జలాల పెరుగుదల ఉండడం వల్ల విలువ ఆధారిత పంటలైన కూరగాయల సాగు, పండ్ల సాగు, వాణిజ్య పంటలైన ప్రత్తి, మొక్కజొన్న సాగు పెంచవచ్చు.

చెరువుల సమర్థ యాజమాన్యం వల్ల నీటి నిలువ సామర్థ్యం పెరిగి, నీటి లీకేజిలు తగ్గి, పశుసంపద, నర్సరీ, వ్యవసాయేతర ఆదాయం, మార్కెటింగ్‌ సదుపాయాలు మెరుగవడం జరుగుతాయి. దీనివల్ల అంతిమంగా రైతులకు నికరాదాయం పెరుగుతుంది.

నూతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి భూగర్భ జలాల పెంపుదలతో పాటు, సూక్ష్మసేద్యం, తుంపర సేద్యం, సమిష్టి భూగర్భ జల యాజమాన్యాన్ని చెరువు ఇన్‌ఫుయన్స్‌జోన్‌లో అమలుపరచటం వల్ల చెరువు పూర్తి స్థాయి మట్టం పెంచవచ్చు.

చెరువు పురురుద్ధరణ కార్యక్రమాలు ప్రజల భాగస్వామ్యంతో చేయడం వల్ల నీటి నిల్వ సామర్థ్యం పెరిగి నీటి సీపేజ్‌ నష్టాలను తగ్గించి చెరువు పూర్తి స్థాయి మట్టం పాటించడం వల్ల ఆయకట్టు దిగువ రైతులకు పంట పెరుగుదలకు కావలసిన కనీస నీటి సదుపాయాన్ని కల్పించవచ్చు. ఈ విధంగా ఆయకట్టు దిగువ రైతులకు నమ్మకం కల్పించినప్పుడు రైతు సంఘాలు వివిధ కార్యక్రమాల్లో పాల్గొని విశ్వాసం చూరగొని చురుగ్గా పాల్గొంటారు. దీనికోసం కాలువలకు సిమెంట్‌ లైనింగ్‌, వాటర్‌ హయసింథ్‌, రబ్బరు, తుంగ, కలుపు మొక్కలను తొలగించి గ్రామాల్లో మెరుగైన వాతావరణాన్ని కల్పించవచ్చు.

వేసవికి ముందు పూడిక తీసిన మట్టి నమూనాల్లో లవణీయతను, క్షారత్వాన్ని గమనించిన తరువాతనే రైతులు చెరువు మట్టిని తమ పొలాల్లో వాడేటట్లు ప్రోత్సహించాలి. ఒకవేళ చెరువు మట్టి లవణీయత అధికంగా ఉండి వ్యవసాయానికి ఉపయోగపడకపోతే ఇటుకల తయారీలో వాడుకునేటట్లు గ్రామ యువతను, చిరు పారిశ్రామిక వేత్తలను, మహిళలను ప్రోత్సహించాలి.

ప్రజల భాగస్వామ్యంతోనే ప్రభుత్వ కార్యక్రమాలు విజయవంతం అవుతాయి. కావున చెరువు ద్వారా లబ్ది పొందే రైతులు, మహిళలు, గొర్రెల, మేకల కాపరులు, చాకలివారు, ఇటుక బట్టీ తయారీ దారులు, స్వతహాగా చెరువు యాజమాన్యంలో భాగస్వామ్యులు అయ్యేటట్లు చేయాలి. అంతేకాకుండా స్వచ్ఛంద సంస్థలను, ప్రజా ప్రతినిధులను కూడా పంట ప్రణాళికలో, అభివృద్ధిలో భాగస్వాములను చేసి కాంట్రాక్టరుల పాత్రను విస్తృతంగా తగ్గించాలి. నీటి సంరక్షణ, భూగర్భ జలాల పరిరక్షణ, అనుకూల జీవనం, సుస్థిర అభివృద్ధి పట్ల ప్రజలను చైతన్య పరచాలి. టెండర్ల విధానాల్లో పారదర్శకత ఉండేలా చూడాలి.

రైతులకు వ్యవసాయ సంబంధిత డాక్యుమెంటరీలు, షార్ట్‌ ఫిలిమ్స్‌, రేడియో ద్వారా అందించే ప్రత్యేక కార్యక్రమాలు, కళాబృందాల ద్వారా జానపద గేయాలను ఆధునిక టెక్నాలజీతో మిళితం చేసి అందించాలి. దీనివల్ల ఒక ప్రజా ఉద్యమంవలే రైతులు, విద్యార్థులు, మహిళలు చెరువు అభివృద్ధిలో భాగస్వామ్యులు అవుతారు.

ఈ విధంగా ప్రజల జీవితాలను ప్రభావితం చేసే గొళుసుకట్టు చెరువుల అనుసంధానాన్ని ప్రజల భాగస్వామ్యంతో భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్ళినట్లయితే మిషన్‌కాకతీయ విజయవంతం అవుతుంది.

డా|| పి.ప్రశాంత్‌, కె. శేఖర్‌, డా|| వి. లక్ష్మీనారాయణమ్మ, ఎలక్ట్రానిక్‌ వింగ్‌, ఎ.ఆర్‌.ఐ, రాజేంద్రనగర్‌, ఫోన్‌ : 8008888962, 9553153149