వర్షా కాలం ప్రారంభమయ్యి తొలకరి చినుకులు పడగానే నేలను తయారు చేసి వివిధ రకాల కూరగాయలను పండించటం ప్రారంభిస్తాం. మనం నిత్యం తినే కూరగాయల్లో ఎటువంటి పోషకాలు ఉంటాయి వాటి వల్ల మనకు కలిగే ప్రయోజనాలు తెలుసుకోవటం ద్వారా పిల్లలు, పెద్దలు వారి ఆహారంలో కూరగాయల ప్రాముఖ్యతను గుర్తించి రోజూ వాటిని వినియోగంలోకి తీసుకువస్తారు.

గుమ్మడి :

తెలుగు వారికి ఇష్టమైన, శుభ ప్రదమైన కూరగాయ గుమ్మడి. దీన్ని ప్రపంచ వ్యాప్తంగా సాగుచేస్తారు. గుమ్మడితో భారతీయులు కూరలు, పులుసులు వంటివి తయారు చేసుకుంటారు. గుమ్మడి గింజలను కూడా వేయించుకుని తింటారు. పాశ్చాత్యులు గుమ్మడితో ప్యూరీ, సూప్‌, సలాడ్స్‌, కొన్ని రకాల మిఠాయిలు తయారు చేసుకుంటారు. గుమ్మడి గింజల నుంచి తీసిన నూనెను కూడా పాశ్చాత్యులు వినియోగిస్తారు.

పోషకాలు :

గుమ్మడిలో పీచు పదార్ధాలు, చక్కెర, పిండి పదార్ధాలు, స్వల్పంగా ప్రోటీన్లు ఉంటాయి. ఇందులో విటమిన్‌-ఎ, బీటా కెరోటీన్‌, విటమిన్‌-బి1, బి2, బి3, బి6,విటమిన్‌-సి, విటమిన్‌-ఇ, విటమిన్‌- కె వంటి విటమిన్లు, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్‌, ఫాస్ఫరస్‌, పొటాషియం, సోడియం, జింక్‌ వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.

ఆరోగ్య లాభాలు :

గుమ్మడి ప్రోస్టేట్‌ వాపును తగ్గిస్తుంది. గుమ్మడి గింజలు మలబద్దకాన్ని నివారించి, ప్రేగులను శుభ్రపరుస్తాయి. గుండె జబ్బులు, ఊపిరితిత్తుల సమస్యలను తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర నిల్వలను క్రమబద్దం చేస్తుంది. ఆయుర్వేదంలోనూ గుమ్మడిని రకరకాల చికిత్సల్లో ఉపయోగిస్తారు.

పొట్లకాయ :

పొట్లకాయలు భారత సహా అన్ని ఆసియా దేశాల్లోనూ, ఆఫ్రికా, ఆస్ట్రేలియాల్లోనూ వాడుకలో ఉన్నాయి. భారత్‌లో పొట్లకాయలతో రకరకాల కూరలు వండుకుంటారు. కొన్ని దేశాల్లో పొట్లకాయలు బాగా పండిన తరువాత వాటి గుజ్జును టమాటా గుజ్జుకు ప్రత్యామ్నాయంగా కూడా ఉపయోగిస్తారు. ఆఫ్రికాలోని కొన్న ప్రాంతాల్లో పొట్ల మొలకలను, ఆకులను కూడా తింటారు.

పోషకాలు :

పొట్లకాయల్లో పీచు పదార్ధాలు, స్వల్పంగా ప్రొటీన్లు, పిండి పదార్ధాలు, విటమిన్‌-ఎ, బీటా కెరోటిన్‌, విటమిన్‌-బి1, బి2, బి3, బి6, బి9, విటమిన్‌-సి వంటి విటమిన్లు, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్‌, ఫాస్ఫరస్‌, పొటాషియం, సోడియం, జింక్‌ వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.

ఆరోగ్య లాభాలు :

పొట్లకాయలు కడుపు ఉబ్బరాన్ని తొలగిస్తాయి. వీటిలో పుష్కలంగా ఉండే పీచు పదార్ధాలు మలబద్దకాన్ని నివారిస్తాయి. ఇవి మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి.

కాకరకాయ :

భారత ఉపఖండ ప్రాంతంతో పాటు దక్షిణాసియా, ఆగ్నేయాసియా, ఆఫ్రికా ప్రాంతాల్లో కాకరకాయలను విరివిగా పండిస్తారు. కాకరకాయలతో రకరకాల కూరలు, పులుసులు, సూప్స్‌, సలాడ్స్‌, వంటివి తయారు చేసుకుని తింటారు. చిరకాలంగా వాడుకలో ఉన్న కాకరకాయను ఆయుర్వేద తదితర సంప్రదాయ చికిత్సా పద్దతుల్లోనూ వివిధ వ్యాధులను నయం చేయడం కోసం వినియోగిస్తారు.

పోషకాలు :

కాకరకాయలో విటమిన్‌-ఎ, బీటాకెరోటిన్‌, విటమిన్‌-బి1, బి2, బి3, బి6,బి9, విటమిన్‌-సి, విటమిన్‌-ఇ, విటమిన్‌-కె వంటి విటమిన్లు, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్‌, ఫాస్ఫరస్‌, పొటాషియం, సోడియం, జింక్‌ వంటి ఖనిజ లవణాలు, పీచు పదార్ధాలు ఉంటాయి.

ఆరోగ్య లాభాలు :

కాకరలోని హైపోగ్లెసిమిక్‌ పదార్ధం ఇన్సులిన్‌ స్థాయిని నియంత్రించి, చక్కెర జబ్బును అదుపు కేస్తుంది. సోరియాసిస్‌ సహా పలు చర్మవ్యాధుల నివారణకు ఉపయోగపడుతుంది. డయేరియా వంటి జీర్ణకోశ వ్యాధుల చికిత్సలోనూ ఆయుర్వేద వైద్యులు కాకరను ఉపయోగిస్తారు.

బీరకాయ :

భారత్‌ సహా అన్ని ఆసియా దేశాల్లోనూ, కొన్ని ఆఫ్రికా దేశాల్లోనూ బీర కాయలు విరివిగా పండుతాయి. పుష్కలంగా పీచు పదార్ధాలు కలిగి, తేలికగా జీర్ణమవుతుంది. బీరకాయలతో కూరలు, పచ్చళ్ళు చేసుకుంటాము. కొన్ని చోట్ల బీరకాయ పచ్చి ముక్కలనే సలాడ్లలో వాడతారు.

పోషకాలు :

బీర కాయల్లో పుష్కలంగా పీచు పదార్ధాలు, విటమిన్‌-ఎ, బీటా కెరోటిన్‌, విటమిన్‌-బి1, బి2, బి3, బి6, బి9, విటమిన్‌-సి వంటి విటమిన్లు, జింక్‌, ఐరన్‌, మెగ్నీషియం వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.

ఆరోగ్య లాభాలు :

బీర కాయలు స్థూలకాయాన్ని నివారిస్తాయి. ఎసిడిటీ, అల్సర్లు వంటి సమస్యలను నివారిస్తుంది. మరియు జీర్ణకోశాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. రోగనిరోధక శక్తిని కూడా పెంపొందిస్తుంది.

దొండకాయ :

దొండకాయ ఆసియా, ఆఫ్రికా దేశాల్లో విరివిగా పండుతుంది. భారత్‌లో దొండకాయలతో కూరలు, వేపుళ్ళు వండుకుంటారు. వంటల కోసం సాధారణంగా మన దేశంలో లేత దొండకాయలను ఉపయోగిస్తారు. కొన్ని దేశాల్లో బాగా పండిన దొండకాయలను కూడా వంటల్లో ఉపయోగిస్తారు. ఇండోనేసియా, ధాయ్‌లాండ్‌ వంటి దేశాల్లో ఎర్రగా పండిన దొండకాయలతో పాటు, దొండ ఆకులను కూడా తింటారు.

పోషకాలు :

దొండకాయల్లో పీచు పదార్ధాలు, బీటా కెరోటీన్‌, విటమిన్‌-బి1, బి2, బి3, బి6, బి9, విటమిన్‌-సి, వంటి విటమిన్లు ఉంటాయి. స్వల్పంగా పిండి పదార్ధాలు, పుష్కలంగా పీచు పదార్ధాలు ఉంటాయి. కాల్షియం, మెగ్నీషియం, ఐరన్‌, ఫాస్ఫరస్‌, పొటాషియం, సోడియం, జింక్‌ వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.

ఆరోగ్య లాభాలు :

దొండకాయలు రక్తహీనతను నివారిస్తాయి. రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. జీర్ణకోశానికి మేలు చేస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిని అదుపు చేస్తాయి.

సొరకాయ :

సొరకాయ నీటి శాతం ఎక్కువగా ఉండే కూరగాయ. దీన్ని ఆనపకాయ అని కూడా అంటారు. ఆసియా, ఆఫ్రికా, యూరప్‌, అమెరికా ప్రాంతాల్లో దీన్ని విరివిగా పండిస్తారు. మన దేశంలో సొరకాయను నేరుగా కూరగా వండుకోవడమే కాకుండా సాంబారు, పులుసు, పప్పు వంటి వంటకాల్లో విరివిగా వాడతారు. ఉత్తరాదిలో దీనితో మిఠాయిలు కూడా తయారు చేస్తారు. పలు దేశాల్లో సొరకాయ జ్యూస్‌ను సేవిస్తారు.

పోషకాలు :

సొరకాయలో స్వల్పంగా పిండి పదార్ధాలు, పీచు పదార్ధాలు, నామ మాత్రంగా ప్రోటీన్లు ఉంటాయి. వీటిలో విటమిన్‌-బి1, బి 2, బి3, బి5, బి6, బి9, విటమిన్‌- సి వంటి విటమిన్లు, కాల్షియం, ఐరన్‌, మెగ్నీషియం, జింక్‌, మాంగనీస్‌, పొటాషియం, ఫాస్ఫరస్‌ వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.

ఆరోగ్య లాభాలు :

బరువు తగ్గాలనుకునే వారికి సొరకాయ చక్కగా ఉపయోగపడుతుంది. ఇది తేలికగా జీర్ణమవుతుంది. జీర్ణాశయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కిడ్నీ సమస్యలను నివారిస్తుంది.

చిక్కుడుకాయ :

చిక్కుడు కాయలను దాదాపు ప్రపంచమంతటా సాగు చేస్తారు. చిక్కుడుకాయలు లేతగా ఉండగానే కోసి, వంటల్లో వాడతారు. ముదిరిన చిక్కుడు కాయల నుండి గింజలను వేరుచేసి, వాటిని ఎండబెట్టుకుని వంటకాల్లో వాడతారు. ఇక లేలేత చిక్కుడు ఆకులను పాలకూర మాదిరి ఆకుకూరలా ఉపయోగిస్తారు. ప్రోటీన్లు పుష్కలంగా ఉండటంతో కూరగాయల్లో చిక్కుడు కాయలు బలవర్ధకమైనవి.

పోషకాలు :

చిక్కుడుకాయల్లో పిండి పదార్ధాలు, ప్రోటీన్లు, స్వల్పంగా కొవ్వులు, పీచుపదార్ధాలు, విటమిన్‌-బి1, బి 2, బి3, బి5, బి6, బి9, విటమిన్‌- సి, విటమిన్‌ -కె వంటి విటమిన్లు, కాల్షియం, ఐరన్‌, మెగ్నీషియం, జింక్‌, మాంగనీస్‌, పొటాషియం, ఫాస్ఫరస్‌ వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.

ఆరోగ్య లాభాలు :

రక్తహీనతను అరికట్టి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. క్యాన్సర్ను నిరోధిస్తాయి. కండరాలకు, ఎముకలకు బలాన్నిస్తాయి. వార్ధక్య లక్షణాలను అరికడతాయి. కంటిచూపును మెరుగుపరుస్తాయి. మెదడుకు మేలు చేస్తాయి. పక్షపాతం, గుండెపోటు వంటి జబ్బుల ముప్పును తగ్గిస్తాయి.

గోరు చిక్కుడు :

భారత దేశంలోని పశ్చిమ, వాయువ్య ప్రాంతాల్లోనూ, పాకిస్థాన్‌లోనూ గోరు చిక్కుడు విరివిగా పండుతుంది. దీన్ని గోకరకాయ అని కూడా అంటారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ దీని సాగు జరుగుతోంది. అమెరికా, మెక్సికో, ఆఫ్రికా, ఆస్ట్రేలియా వంటి ప్రాంతాల్లోనూ గోరు చిక్కుడు పంట విస్తారంగానే పండుతోంది. కరువు పరిస్థితులను తట్టుకుని మరీ గోరు చిక్కుడు మొక్కలు పెరుగుతాయి. గోరు చిక్కుడును కూరలు తదితర వంటలతో పాటు, గోరు చిక్కుడు జిగురును రకరకాల ఆహార ఉత్పత్తుల్లో ఉపయోగిస్తారు.

పోషకాలు :

గోరు చిక్కుడులో ప్రోటీన్లు, స్వల్పంగా పిండి పదార్థాలు, పీచు పదార్థాలు, విటమిన్‌-ఏ, విటమిన్‌-బి1, బి 2, బి3, బి5, బి6, బి9, విటమిన్‌- సి, విటమిన్‌-కె వంటి విటమిన్లు, కాల్షియం, ఐరన్‌, మెగ్నీషియం, ఫాస్ఫరస్‌ వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.

ఆరోగ్య లాభాలు :

రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి. రక్తపోటును అదుపులో ఉంచుతాయి. ఎముకలకు, కండరాలకు బలాన్నిస్తాయి. రక్తహీనతను నివారిస్తాయి. జీర్ణకోశాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. స్థూలకాయాన్ని అరికడతాయి.

క్యాబేజీ :

క్యాబేజీ దాదాపు ప్రపంచ వ్యాప్తంగా లభిస్తుంది. ఆకుపచ్చ, ముదురు ఊదారంగుల్లో దట్టమైన ఆకుల బుట్టలా ఉండే క్యాబేజీలో పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి. క్యాబేజితో రకరకాల వంటకాలు తయారు చేసుకోవడమే కాకుండా, క్యాబేజీ తురుమును పక్కిగానే సలాడ్లు వంటి వాటిలో కలిపి తింటారు. కొన్ని ప్రాంతాల్లో క్యాబేజీని ఊరవేస్తారు.

పోషకాలు :

పిండి పదార్థాలు, చక్కెర, ప్రోటీన్లు, పీచు పదార్థాలు, విటమిన్‌-బి1, బి 2, బి3, బి5, బి6, బి9, విటమిన్‌- సి, విటమిన్‌ - కె వంటి విటమిన్లు, కాల్షియం, ఐరన్‌, మెగ్నీషియం, జింక్‌, మాంగనీస్‌, పొటాషియం, ఫాస్ఫరస్‌ వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.

ఆరోగ్య లాభాలు :

క్యాబేజీ జీర్ణకోసానికి మేలు చేస్తుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. స్థూలకాయాన్ని అరికడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఎముకలకు బలాన్నిస్తుంది. చర్మానికి, కంటికి మేలు చేస్తుంది.

టమాటా :

టమాటా సాంకేతికంగా పండు అయినప్పటికి మన దేశంలో కూరగాయగానే వాడటం అలవాటు. అందువల్ల దీన్ని కూరగాయనే పరిగణిస్తారు. టమాటాలు దాదాపు ప్రపంచవ్యాప్తంగా పండుతాయి. వీటిని కూరలు, పచ్చళ్ళు, సలాడ్లతో పాటు ఎక్కువకాలం నిల్వ ఉండే సాస్‌, కేచప్‌ వంటి వాటి తయారీలోనూ వాడతారు. వివిధరకాల వంటకాలకు అలంకరణ కోసం కూడా టమాటా ముక్కలను వాడతారు.

పోషకాలు :

టమాటాలో స్వల్పంగా పిండి పదార్థాలు, చక్కెర, విటమిన్‌-ఏ, విటమిన్‌-బి1, బి3, బి6, విటమిన్‌-సి, విటమిన్‌-ఇ, విటమిన్‌- కె, బీటాకెరొటీన్‌ వంటి విటమిన్లు, కాల్షియం, ఐరన్‌, మెగ్నీషియం, జింక్‌, మాంగనీస్‌, పొటాషియం, ఫాస్ఫరస్‌ వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.

ఆరోగ్య లాభాలు :

టమాటాలు గుండే జబ్బులను, చక్కెర జబ్బును, రక్తహీనతను నివారిస్తాయి. జుట్టును, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. స్ధూలకాయాన్ని అరికడతాయి.

దోసకాయ :

దోసకాయలు ఆసియా, ఆఫ్రికా, అమెరికా ప్రాంతాల్లో విరివిగా పండుతాయి. వీటిలో చాలా రకాలు ఉన్నాయి. ఆకుపక్క రంగులో పొడవుగా కనిపింకే కీర దోసకాయలను సాధారణంగా పచ్చిగానే తింటారు. వీటిని సలాడ్లు వంటి వాటిలో వాడతారు. పాశ్చాత్య దేశాల్లో వీటిని ఉప్పు నీటిలో ఉరవేసి కూడా తింటారు. పసుపుగా గుండ్రంగా ఉండే దోసకాయలను వివిధ రకాల వంటకాల్లో ఉపయోగిస్తారు.

పోషకాలు :

దోసకాయల్లో స్వల్పంగా పిండి పదార్థాలు, ప్రోటీన్లు, విటమిన్‌-బి1, బి 2, బి3, బి5, బి6, బి9, విటమిన్‌- సి, విటమిన్‌-సి, విటమిన్‌- కె వంటి విటమిన్లు, కాల్షియం, ఐరన్‌, మెగ్నీషియం, జింక్‌, మాంగనీస్‌, పొటాషియం, ఫాస్ఫరస్‌ వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.

ఆరోగ్య లాభాలు :

దోసకాయల్లో నీటి శాతం ఎక్కువ. ఇవి డీహైడ్రేషన్లు దూరం చేస్తాయి. మెదడుకు మేలు చేస్తాయి. కడుపు మంట, అల్సర్లు వంటి బాధలను తగ్గిస్తాయి. స్థూలకాయాన్ని అరికడతాయి. రక్తపోటును అదుపు చేస్తాయి. గుండె సమస్యలను నివారిస్తాయి.

బెండకాయ :

బెండకాయలను భారత్‌తో పాటు దాదాపు ప్రపంచంలోని అన్నీ ప్రాంతాల్లోనూ సాగు చేస్తారు. బెండకాయలతో కూరలు, వేపుళ్ళు, పులుసులు వంటి వంటకాలను తయారు చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో బెండకాయలను పచ్చిగాను, ఊరవేసుకుని కూడా తింటారు.

పోషకాలు :

బెండకాయల్లో స్వల్పంగా పిండి పదార్థాలు, ప్రొటీన్లు ఉంటాయి. విటమిన్‌-ఎ, విటమిన్‌-బి1, బి 2, బి3, బి9, విటమిన్‌- సి, విటమిన్‌-ఇ, విటమిన్‌-కె వంటి విటమిన్లు, కాల్షియం, ఐరన్‌, మెగ్నీషియం, జింక్‌, పొటాషియం, ఫాస్ఫరస్‌ వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.

ఆరోగ్య లాభాలు :

బెండకాయలు రక్తహీనతను నివారిస్తాయి. జీర్ణకోసానికి మేలు చేస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి. కంటిచూపును, ఎముకల శక్తిని మెరుగుపరుస్తాయి.

వంకాయ :

వంకాయలను దాదాపు ప్రపంచవ్యాప్తంగా వినియోగిస్తారు. వంకాయల్లో నానా రకాలు ఉన్నా, పోషక విలువలు అన్నింట్లోనూ దాదాపు ఒకేలా ఉంటాయి. వంకాయలతో భారతీయులు రకరకాల కూరలు, పచ్చళ్లు, పులుసులు వంటివి చేసుకుంటారు. నేరుగా వాటిని కాల్చుకుని కూడా తింటారు. ఇతర దేశాల్లోనూ వంకాయలతో రకరకాల వంటకాలు చేసుకుంటారు. వాటిని ఊరబెట్టి కూడా తింటారు.

పోషకాలు :

వంకాయల్లో స్వల్పంగా పిండి పదార్థాలు, చక్కెర, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్‌- బి1, బి2, బి3, బి6, బి9, విటమిన్‌-సి, విటమిన్‌- ఇ, విటమిన్‌-కె వంటి విటమిన్లు, కాల్షియం, ఐరన్‌, మెగ్నీషియం, మాంగనీస్‌, ఫాస్ఫరస్‌, పొటాషియం వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.

ఆరోగ్య లాభాలు :

వంకాయలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. జీర్ణకోశాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఫలితంగా స్థూలకాయాన్ని, గుండె జబ్బులు, రక్త పోటు ముప్పును నివారిస్తాయి.

కాలీఫ్లవర్‌ :

కాలీఫ్లవర్‌ దాదాపు ప్రపంచవ్యాప్తంగా సాగుతోంది. ఇందులో ఎక్కువగా లేత పసుపు రంగులోనివే కనిపిస్తాయి. అయితే, ఉదా, నారింజ, ఆకుపచ్చ రంగుల్లో కూడా కాలీఫ్లవర్‌ రకాలు ఉన్నాయి. కాలీఫ్లవర్‌ రకరకాల వంటకాల్లో ఉపయోగిస్తారు. కొన్ని చోట్ల కాలీఫ్లవర్‌ తురుమును పచ్చిగానే సలాడ్లలో వాడతారు.

పోషకాలు :

పిండి పదార్థాలు, చక్కెర, ప్రొటీన్లు, పీచు పదార్థాలు విటమిన్‌-బి1, బి 2, బి3, బి5, బి6, బి9, విటమిన్‌- సి, విటమిన్‌-కె వంటి విటమిన్లు, కాల్షియం, ఐరన్‌, మెగ్నీషియం, జింక్‌, మాంగనీస్‌, పొటాషియం, ఫాస్ఫరస్‌ వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.

ఆరోగ్య లాభాలు :

గుండెకు, మెదడుకు మేలు చేస్తుంది. క్యాన్సర్‌ను నివారిస్తుంది. జీర్ణకోసానికి రక్షణ ఇస్తుంది. అకాల వార్థక్యాన్ని నివారిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. స్థూలకాయాన్ని అరికడుతుంది.

బంగాళా దుంప :

బంగాళా దుంప అనేది దుంప జాతికి చెందిన ఒక రకం కూరగాయ. 17 వ శతాబ్ధం వరకు దక్షిణ అమెరికా మినహా ప్రపంచ దేశాలాంతటికీ బంగాళదుంప పరిచయం లేదు. భారతదేశానికి బ్రిటీష్‌ వారు బంగాళ దుంపను తీసుకు వచ్చారు. ఆలుగడ్డ అని, ఉర్లగడ్డ అని రాకరకాల పేర్లతో బంగాళ దుంపను పిలుస్తూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తవుతున్న ఆహార పంటల్లో వరి, గోధుమ, మొక్కజొన్న తరువాత బంగాళ దుంప నాలుగో స్థానంలో ఉంది. బంగాళ దుంపలతో వంటల్లో ఎన్నో రకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఫ్రై, కూరలు, చిప్స్‌, ఇందులో కొన్ని. డయాబెటిక్‌ పేషెంట్స్‌ బంగాళా దుంపను తక్కువగా తీసుకుంటే మంచిది.

పోషకాలు :

బంగాళ దుంపలో పిండి పదార్థాలు, మాంసక తులు ఎక్కువ. విటమిన్‌ సి, బి6, కె లాంటి విటమిన్లు బంగాళాదుంపలో ఎక్కువగా లభిస్తున్నాయి. పొటాషియం ఇందులో ఎక్కువగా లభించే ఖనిజ లవణం. కాల్షియం, ఫాస్ఫరస్‌ లాంటివి కూడా తగు మోతాదుల్లో లభిస్తాయి.

ఆరోగ్య లాభాలు :

బంగాళ దుంపలో సమద్ధిగా లభించే విటమిన్‌-సి, పొటాషియం లాంటి పోషక పదార్థాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో బాగా తోడ్పడతాయి. రక్తపోటును నియంత్రిచడంలో, గుండె ఆరోగ్యానికి. మెదడు పనితీరు చురుగ్గా ఉండటానికి కూడా బంగాళాదుంప ఉపయోగపడుతుంది. క్రీడాకారులు తక్షణ శక్తి కోసం బంగాళ దుంపను తమ డైట్‌లో చేర్చుకుంటూ ఉంటారు.

కంద :

కంద భూమిలోపల పెరిగే ఒక రకం దుంప. పూర్వం కంద మూలాలను ప్రధాన ఆహారంగా తీసుకునే వారని తేల్చారు. కంద గడ్డ అన్న పేరుతో దీన్ని ఎక్కువగా పిలుస్తుంటారు. భారతదేశమంతటా కంద దడ్డ సాగు విస్తరించి ఉంది. ఇందులో సుమారు 14 జాతులు ఉన్నాయి. వీటిని ఎక్కువగా కూరల కోసం వాడుతున్నారు. అదేవిధంగా చిప్స్‌ కూడా తయారు చేస్తున్నారు.

పోషకాలు :

కందలో పిండి, పీచు పదార్థాలు ఎక్కువ. విటమిన్‌-సి, విటమిన్‌-కె ఎక్కువగా లభించే విటమిన్లు, పోటాషియం, ఫాస్ఫరస్‌, కాల్షియం, మెగ్నీషియం లాంటి ఖనిజ లవణాలు కందలో లభిస్తున్నాయి.

ఆరోగ్య లాభాలు :

కందలో విటమిన్‌-సి ఎక్కువ. జ్వరం, ప్లూలతో పాటు ఇన్ఫెక్షన్లకు ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది. తక్షణ శక్తిని ఇవ్వడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో కంద బాగా ఉపయోగపడుతుంది. జుట్టు బాగా పెరగటానికి ఇది ఉపయోగపడుతుంది.

బీట్‌ రూట్‌ :

యూరప్‌లో పుట్టిన బీటు దుంప ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉంది. ఆకతిని బట్టి ఇందులో చాలా రకాలున్నాయి. ఎరుపు రంగులో ఉండే ఈ దుంపను కూరగాయగా, జ్యూస్‌గా ఎక్కువగా వాడుతూ వస్తున్నారు. బీట్‌రూట్‌ దుంపలు కొంచెం తీపి, కొంచెం వగరు రుచిని కలిగి ఉంటాయి.

పోషకాలు :

బీట్‌రూట్లో పిండి, చక్కెర పదార్థాలు ఎక్కువ. విటమిన్‌-ఏ, సి ఇందులో ఎక్కువగా లభించే విటమిన్లు. పొటాషియం, ఫాస్ఫరస్‌, మెగ్నీషియం, కాల్షియం లాంటివి బీట్‌రూట్‌లో ఎక్కువగా లభించే ఖనిజ లవణాలు.

ఆరోగ్య లాభాలు :

కాలేయం పనితీరు బాగుండటానికి బీట్‌రూట్‌ బాగా ఉపయోగపడుతుంది. రక్తనాళల్లో రక్తం గడ్డకట్టకుండా ఉండటానికి బాగా తోడ్పడుతుంది. ఒంట్లో రక్తం తక్కువ ఉన్నవారు బీట్‌ రూట్‌ తీసుకుంటే ఫలితం కనిపిస్తుంది. కొలెస్ట్రాళ్ళు, రక్తపోటును తగ్గించడంలో కూడా బీట్‌ రూట్‌ బాగా ఉపయోగపడుతుంది.

కర్ర పెండలం :

కర్ర పెండలం చేదుగా, తియ్యగా ఉండే రకం దుంపలు. దక్షిణ అమెరికాలో పుట్టిన ఈ దుంపలు ప్రస్తుతం ప్రపంచమంతటా విస్తరించి ఉన్నాయి. ముఖ్యంగా అమెరికాలో ఏటా ఒక పంటగా కర్ర పెండలంను సాగు చేస్తూ వస్తున్నారు. కర్ర పెండలంతో స్వీట్లు, కూరలు చాలానే చేస్తున్నారు.

పోషకాలు :

కర్రపెండలంలో పిండి, పీచు పదార్థాలు ఎక్కువ. చక్కెర పదార్థాలు కూడా తగు మోతాదుల్లో లభిస్తాయి. కర్ర పెండలంలో విటమిన్‌-సి ఎక్కువ మోతాదులోనే లభిస్తుంది. పొటాషియం, జింక్‌, కాల్షియం లాంటి ఖనిజ లవణాలు కర్ర పెండలంలో లభిస్తున్నాయి.

ఆరోగ్య లాభాలు :

తక్షణ శక్తిని అందించటంలో కర్రపెండలం బాగా ఉపయోగపడుతుంది. కొలస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఎముకలు, దంతాలు బలంగా ఉండటానికి, మలబద్దకం తగ్గడానికి, బరువు తగ్గడానికి, రక్తపోటును నియంత్రించటానికి కర్రపెండలం బాగా ఉపయోగపడుతుంది.

చామ దుంప :

ఆసియా దేశాల్లోనే పుట్టిన చామ దుంప ప్రస్తుతం ప్రపంచమంతటా విస్తరించి ఉంది. భారతదేశంలో పెద్ద ఎత్తున చామను సాగు చేస్తున్నారు. చామ మొక్కకు కాండం అంటూ ఉండదు. చిత్తడి నెలల్లో, కాలువల వెంట చామ ఎక్కువగా పండుతుంది. గుత్తులు గుట్టులుగా చామ దుంపలు పెరుగుతాయి. చామను నేరుగా తింటే నోరు పాడవుతుంది. ఉడకబెట్టి, కూరలుగా వండి చామను వాడుతుంటారు.

పోషకాలు :

చామ దుంపలో పిండి, పీచు పదార్థాలు ఎక్కువ. విటమిన్‌-సి, బి6, ఈ ఎక్కువగా లభించే విటమిన్లు, కాల్షియం, ఐరన్‌, ఫాస్ఫరస్‌ లాంటి ఖనిజ లవణాలు చామ దుంపల్లో లభిస్తున్నాయి.

ఆరోగ్య లాభాలు :

క్రీడాకారులకు తక్షణం శక్తి నిచ్చే ఆహారంగా చామదుంపను చెప్పుకోవచ్చు. తక్కువ క్యాలరీ ఆహారం అవ్వడం వల్ల చామ దుంపలను బరువు తగ్గాలనుకునే వారు తమ డైట్‌లో చేర్చుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. అజీర్తి, హైపర్‌ టెన్షన్‌, కండరాలు బలహీనతకు ఇది మంచి ఔషధంగా పని చేస్తుంది.

క్యారెట్‌ :

కాస్త తియ్యటి రుచి ఉండి నేరుగా తీసుకోగలిగే దుంప క్యారెట్‌. క్యారెట్‌ను పండ్ల జాబితాలోనే కలిపేయడం ఎక్కువగా చూస్తూంటాం. నారింజ రంగులో ఉండే క్యారెట్‌ యూరప్‌ దేశాల్లో పుట్టి ప్రస్తుతం ప్రపంచమంతటా విస్తరించిది. క్యారెట్లు కూరల్లో, స్వీట్స్‌లో, రకరకాల వంటకాల్లో వాడుతూ వస్తున్నారు.

పోషకాలు :

క్యారెట్‌లో పిండి, పీచు పదార్థాలతో పాటు చక్కెర కూడా ఎక్కువే పోలేట్‌, నియాసిన్‌, విటమిన్‌-ఎ మరియు సి, ఇందులో ఎక్కువగా లభింఛే విటమిన్లు. సోడియం, ఫాస్ఫరస్‌, కాల్షియం లాంటివి క్యారెట్‌లో లభించే ఖనిజ లవణాలు.

ఆరోగ్య లాభాలు :

ఉడకబెట్టి తినే క్యారెట్‌తో క్యాన్సర్ను నిరోధించవచ్చు. కంటి చూపు మెరుగవ్వడానికి క్యారెట్‌ అద్భుతంగా పనిచేస్తుంది. పక్షవాతం, కొలెస్ట్రాల్‌ తగ్గించటానికి కూడా ఇది తోడ్పడుతుంది. మగవారిలో వీర్య కణాల కదలికను వేగవంతం చేయడానికి క్యారెట్‌ ఉపయోగపడుతుంది.

చిలకడ దుంప :

అన్నివేళల్లో, చవక ధరల్లో లభించే దుంపల్లో చిలకడ దుంపను చెప్పుకోవచ్చు. తియ్యటి రుచి కలిగి ఉండే ఇవి రకరకాల రంగుల్లో లభ్యమవుతూ ఉంటాయి. అమెరికాలో చిలకడ దుంప మూలాలు ఉన్నాయి. ప్రపంచమంతటా వీటి సాగు విస్తరించి ఉంది. వీటితో చాలా రకాల వంటలు చేస్తున్నారు.

పోషకాలు :

చిలకడ దుంపలో పిండి, చక్కెర పదార్థాలు ఎక్కువ. విటమిన్‌-ఎ, సి, బి6, డి ఇందులో బాగా లభించే విటమిన్లు. పొటాషియం చిలకడ దుంపల్లో ఎక్కువగా లభించే ఖనిజ లవణం. ఇవి కాక కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్‌ లాంటివి కూడా బాగానే లభిస్తున్నాయి.

ఆరోగ్య లాభాలు :

అల్సర్‌ను తగ్గించటానికి చిలకడ దుంప బాగా ఉపయోగపడుతుంది. డి విటమిన్‌ లోపం ఉన్నవారు చిలకడ దుంపను డైట్‌లో చేర్చుకోవచ్చు. రోగనిరోధక శక్తిని పెంచడంలో, జలుబుతో సహా కొన్ని ఫ్లూలను నిరోధించటానికి కూడా చిలకడ దుంప పనికొస్తుంది.

డా|| యం. భవ్యమంజరి, డా|| రమావత్‌ బాలాజీ నాయక్‌, డా|| బి. వెంకట రాజ్‌ కుమార్‌, బి. క్రాంతి కుమార్‌,

పి. విజయ్‌ కుమార్‌, డా|| యం. శ్వేత, కషి విజ్ఞాన కేంద్రం, రుద్రూరు, ఫోన్‌ : 99896 23830, 94401 04717