సాధారణ నామం బ్రౌన్‌ టాప్‌ మిల్లెట్‌, వ్యవహారిక నామం అండుకొర్రలు, గ్రామినే కుటుంబానికి చెందిన పంట. అండుకొర్రలు గడ్డి జాతికి చెందినది. ఇది స్థానికంగా భారతదేశానికి చెందిన పంట. ఆఫ్రికా, భారతదేశం, చైనా, ఆస్ట్రేలియా, అరేబియా, పశ్చిమ ఆసియాలో గింజ మరియు గడ్డి కొరకు ఈ పంటను సాగుచేస్తున్నారు. ఇది 1915 సంవత్సరంలో అమెరికా దేశానికి పరిచయం చేయడం జరిగింది. అప్పటి నుండి ఎక్కువగా ఈ పంటను పక్షులకు మేతగా వేయడం జరిగింది.

భారతదేశంలో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ మరియు తమిళనాడులో పండిస్తున్నారు. కర్ణాటకలో చిత్రదుర్గ, రాయచూర్‌ ప్రాంతాల్లో, ఆంధ్రప్రదేశ్‌లో అనంతపురంలో ఈ పంటను పండించడం జరుగుతుంది.

అండుకొర్రలు సమశీతోష్ణ వాతావరణ పరిస్థితులకు అనుకూలమైన పంట. ఇది బెట్ట పరిస్థితులను చాలా సమర్ధవంతంగా తట్టుకోగలదు. 70-85 రోజుల్లో కోతకు వస్తుంది. అన్ని రకాల నేలల్లో ముఖ్యంగా మైదాన ప్రాంతాలు, ఏటవాలు ప్రాంతాలు మరియు ఎత్తైన ప్రాంతాలకు కూడా అనుకూలమైన పంట. సుమారుగా 2000-2500 మీ. ఎత్తులో కూడా పెరుగుతుంది. ఇది 400 -1500 మి.మీ. వర్షపాతం గల ప్రాంతాల్లో కూడా పండించబడుతుంది. దీని కాల వ్యవధి తక్కువగా ఉండి బెట్టను తట్టుకోగలగడం వల్ల అనుకూల వాతావరణ పరిస్థితుల్లో దీన్ని కంటింజెంట్‌ క్రాప్‌గా ఉపయోగించవచ్చు.

ఇవి నిటారుగా గానీ లేదా నేలపై పాకుతూ పెరుగుతుంది. నేల తగిలినచోట వేర్లు, పిలకలు పెడుతుంది. ఈ పంట వేర్లు, పిలకలు పెడుతుంది. ఈ పంట వేర్లు నేలను అల్లుకుంటూ పెరుగుతూపోవడం వల్ల కవర్‌క్రాప్‌గా ఏటవాలు ప్రాంతాల్లో ఖాళీ ప్రదేశాల్లో నేలకోత గురికాకుండా కాపాడుతుంది. అంతేకాకుండా సమస్యాత్మక భూముల్లో వీటిని వేసినట్లయితే నేలలో అధికంగా ఉన్న భారలోహాలైనటువంటి లెడ్‌ వంటి ధాతువులను తగు మోతాదులో వీటి కాండం మరియు వేర్లలో దాచగలదు. అందువల్ల ఈ పంటను కలుషితమైన నేలల్లో సవరణకు కూడా వాడతారు.

అండుకొర్రలను బాతులు, లేవిపక్షులు, టర్కీ పక్షులు, పావురాలు వంటి పక్షలకు ఆహారంగా వాడుతారు. అంతేకాకుండా ఇది పశుగ్రాసంగా ప్రసిద్ధి చెందిన పంట. దీని యొక్క అతితక్కువ గ్లెసిమిక్‌ ఇండెక్స్‌, పోషక విలువలు మరియు అధిక పీచుపదార్థం వల్ల దీన్ని మధుమేహం వ్యాధిగ్రస్తులకు అద్భుతమైన ఆహారంగా పరిగణిస్తున్నారు.

యాజమాన్య పద్ధతులు :

అనుకూల వాతావరణం :

అండుకొర్రలు వేడి మరియు పొడి వాతావరణంలో అనుకూల పంటగా మరియు నీటి ఎద్దడిని కూడా బాగా తట్టుకునే గుణం ఉండడం వల్ల తక్కువ వర్షపాత ప్రాంతాల్లో (400-500 మి.మీ.) పండించవచ్చు. నీడలో కూడా పెరిగే గుణం ఉండడం వల్ల దీన్ని ఉద్యాన తోటల్లో (మామిడి, జీడి, చింత) అంతర పంటగా వేయవచ్చు.

నేలలు :

తేలికపాటి ఇసుక నేలల్లో, ఒండ్రు నేలల్లో బాగా పెరుగుతుంది. నేలలో ఉదజని సూచిక 5-6.5 ఉన్న భూముల్లో బాగా పండుతుంది. బాగా నీరు ఉండే ప్రాంతాల్లో లేక ఎడారి ప్రాంతాల్లో పెరగడం వల్ల పంటకాలంలో రెండుసార్లు వానపడితే సరపోతుంది.

కాలం :

దీన్ని సంవత్సరం పొడవునా పండించవచ్చు. జూన్‌-జులైలో వర్షాధారంగా నీటిపారుదల సదుపాయం గల వారు రబీలోను, వేసవిలోనూ పండించవచ్చు.

రకాలు :

అడ్డుకొర్రల్లో రెండు రకాలను గమనించవచ్చు. ఒక రకంలో పుష్పగుచ్ఛం తెరచుకొని ఉంటుంది. మరో రకంలో పుష్పగుచ్ఛం కుచ్చువలె ఉంటుంది.

విత్తే దూరం :

వరుసల మధ్య 45-60 సెం.మీ. మొక్కల మధ్య 10 సెం.మీ. దూరం ఉండేటట్లు విత్తుకోవాలి. లేదా వెదజల్లుకునే పద్ధతిలో కూడా వేయాలి కానీ విత్తిన 15 రోజుల్లోగా ఒత్తుగా ఉన్న చోట కొన్ని మొక్కలు పీకి పలుచన చేయాలి మరియు ఖాళీగా ఉన్న ప్రదేశంలో మొక్కలు నాటాలి. ఈ పద్ధతి చేసేటప్పుడు నీటితడి ఇవ్వడం అవసరం.

విత్తన మోతాదు :

వరుసల్లో నాటడానికి ఎకరానికి 2-2.5 కిలోల విత్తనం సరిపోతుంది. వెదజల్లుటకు 3-3.5 కిలోల విత్తనం అవసరం.

ఎరువులు :

ఎకరాకు పశువుల ఎరువు 2 టన్నులు విత్తడానికి 2-3 వారాల ముందుగా వేసుకోవాలి. 16 కిలోల నత్రజని, 8 కిలోల భాస్వరం ఎరువును వాడాలి. నత్రజనిని రెండు సమభాగాలుగా చేసి ఆఖరి దుక్కిలో సగం, మిగిలిన సగభాగం 25-30 రోజుల తరువాత వేసుకోవాలి.

నీటి యాజమాన్యం :

వర్షాధార పంటకు నీటి అవసరం ఉండదు. కానీ దుబ్బుచేసే దశలో కరువు పరిస్థితులు ఏర్పడినట్లయితే ఒక నీటితడి పెట్టుకోవాలి. రబీలో వేసవిలో పండించే పంటకు నీటితడులు పెట్టాలి. పూతదశ నుండి గింజకట్టే దశ వరకు నీటి ఎద్దడికి గురికాకుండా చూడాలి.

కలుపు యాజమాన్యం :

విత్తనం నాటిన తరువాత 25 రోజుల వరకు కలుపు రాకుండా నివారించినట్లయితే అధిక దిగుబడి సాధించవచ్చు. ఆ తరువాత పంట మొత్తం నేలపై అల్లుకొని పెరగడం వల్ల ఎటువంటి కలుపు సమస్య ఉండడం.

పంట కోత :

అండు కొర్ర పంట 70-85 రోజులకు కోతకు వస్తుంది. కంకిలో అన్ని గింజలు ఒకేసారి పక్వానికి రావు. అదే విధంగా ఒక మొక్కపైన ంకులన్నీ ఒకేసారి పక్వానికి రావు. అదేవిధంగా ఒక మొక్కపైన కంకులన్నీ ఒకేసారి పక్వానికి రావు. అందువల్ల సుమారు 70-80 శాతం పైరు పక్వానికి వచ్చినప్పుడు కోత కోసుకోవాలి. కోత ఆలస్యం చేసినట్లయితే కంకి నుండి గింజలు రాలిపోవడం జరుగుతుంది. ఉదయం పూట తేమతో కూడిన వాతావరణంలో (అంటే ఎండారక మునుపు) పంటకోత చేపట్టినట్లయితే గింజరాలడం తగ్గుతుంది. పంటను మొక్కల మొదళ్ళ దగ్గర కోసుకొని, ఎండబెట్టి మార్పిడి చేసుకోవాలి. గింజను తగినంత తేమశాతం వచ్చే వరకు ఎండలో ఉంచాలి.

పురుగులు-తెగుళ్ళు :

ఆకుమచ్చ తెగులు :

నీటి ఎద్దడి మరియు పోషక పదార్థాలు మొక్కకు అందినప్పుడు ఈ తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటుంది.

లక్షణాలు :

ఈ శిలీంద్రం మొక్క అన్ని భాగాలను ఆశిస్తుంది. ఆకులపై చిన్న చిన్న గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. గాలిలో తేమ శాతం అధికంగా ఉన్నప్పుడు ఈ మచ్చలు పెద్దవై ఒకదానితో ఒకటి కలసి ఆకులు ఎండి రాలిపోతాయి. వెన్నుపై గింజ నిండుకోక తాలు గింజలు ఏర్పడతాయి.

నివారణ :

మాంకోజెబ్‌ 2.5 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

పాముపొడ తెగులు :

ఈ వ్యాధి రైజోక్టోనియా సొలాని అనే శిలీంద్రం ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ తెగులు దుబ్బు చేసే దశ నుండి ఏ దశలోనైనా ఆశించవచ్చు. ఆకుల మీద, కాండం మీద చిన్న చిన్న గోధుమ రంగు మచ్చలు ఏర్పడి అవి క్రమేపి పెద్దవై పాముపొడ వంటి మచ్చలుగా మారతాయి.

నివారణ :

హెక్సాకనజోల్‌ 2 మి.లీ. లీటరు నీటికి లేదా ప్రొపికొనజోల్‌ 1 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.

తుప్పు తెగులు :

ఆకుల అడుగు భాగంలో మరియు పైభాగాలపై పసుపు లేదా నారింజ రంగులో ఉండే బొబ్బల వంటి మచ్చల ఏర్పడతాయి.ఈ మచ్చలు క్రమంగా గోధుమ రంగు నుండి ముదురు గోధుమ రంగుకు మారతాయి. పై ఆకులపై తెగులు ఉధృతి ఎక్కువ. తెగులు ఉధృతి ఎక్కువ. చల్లటి వాతావరణం, అధిక తేమ బాగా అనుకూలం.

నివారణ :

పొలం గట్లపై కలుపు లేకుండా శుభ్రం చేయాలి. విత్తేముందు కిలో విత్తనానికి 2.5 గ్రా. మాంకోజెబ్‌తో విత్తనశుద్ధి చేయాలి. మాంకోజెబ్‌ 3 గ్రా. లేదా ట్రైడిమార్ఫ్‌ 1 మి.లీ. లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.

అండుకొర్రల దిగుబడి :

గింజ దిగుబడి 7-8 క్వింటాళ్ళు / ఎకరానికి, పశుగ్రాసం దిగుబడి 30-40 క్వింటాళ్ళు / ఎకరానికి

విలువాధారిత ఉత్పత్తులు :

అండు కొర్రలతో ఇడ్లీ, అట్లు, పాయసం, అప్పం, పులావు అన్నం వంటి అనేక పదార్థాలను తయారు చేయవచ్చు.

అండుకొర్రల్లోని పోషక విలువలు (100 గ్రాముల్లో) :

కార్బోహైడ్రేట్‌లు (గ్రా.) 71.3

మాంసకృత్తులు (గ్రా.) 11.5

కొవ్వు (గ్రా.) 1.8

శక్తి (కిలో కేలరీలు) 338

పీచుపదార్ధం (గ్రా.) 12.5

ఖనిజ పదార్థాలు (గ్రా.) 4.2

కాల్షియం (మి.గ్రా.) 0.01

పాస్ఫరస్‌ (మి.గ్రా.) 276

ఐరన్‌ (మి.గ్రా.) 0.65

యం. త్రివేణి, డా|| టి.ఎస్‌.కె పాత్రో, డా|| ఎన్‌. అనూరాధ, పి. జోగారావు, ఎస్‌. రాజ్‌కుమార్‌, బి. దివ్యసుధ, వ్యవసాయ పరిశోధనా స్థానం, విజయనగరం