2019-20 వ్యవసాయ పంచాంగం

చాంద్రమాన సంవత్సరాల క్రమంలో ఈ సంవత్సరం పేరు శ్రీ వికారినామ సంవత్సరం. 06-04-2019 తేది శనివారం రేవతి నక్షత్రంలో ప్రారంభమయ్యే ఈ రోజునే తెలుగు వారందరు ఉగాది పండుగను జరుపుకుంటారు. ఆరు రుచుల ప్రసాదాన్ని స్వీకరించి కొత్త పంచాంగ ఫలితాలను విని కొత్త సంవత్సరం సకలశుభాలు కలగాలని ఇష్ట దేవతలను ప్రార్థిస్తారు.

ఈ వికారినామ సంవత్సరమునకు రాజు శని అందువల్ల వర్షాలు సకాలంలో పడక అకాల వర్షాలు కురిసి రైతులు ఇబ్బందులు పడుదురు. నల్లరేగడి భూములు బాగుగా పండుతాయి. రైతులకు మధ్యమ ఫలితాలను పొందుతారు. నువ్వులు, నూనెగింజలు, అపర ధాన్యాలు బాగా పండుతాయి. రైతులకు శ్రమవల్ల ఫలితం దక్కుతుంది. రాజకీయ స్థిరత్వం కలుగుతుంది.

మంత్రి రవి వల్ల రాజకీయ నాయకులు ఒకరినొకరు నిందించుకుంటారు. ధాన్యం, మిర్చి, మినుములు, శనగ, వెండి, బంగారం, నూలు, ఉల్లి, పత్తి ధరలు హెచ్చుతగ్గులుగా ఉండును. రైతులు నిరాశను పొందుదురు. స్త్రీలకు రాజకీయ చైతన్యం కలుగును. ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువగా ఉంటాయి. గోధుమల ధర పెరుగును.

సైన్యాధిపతి శని వల్ల దేశంలో భయాందోళనలు ఎక్కువగును. వ్యాపారవేత్తలు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. సరిహద్దులో కలకలం, ప్రాణనష్టం అయినా విజయం వైపు నడుస్తారు. నల్లని ధాన్యముల ధరలు ఎక్కువగును. నల్లరేగడి, ఇసుక నేలలు సారవంతమై మంచి పంటల నందించగలవు. ఇరు రాష్ట్రములందు నల్లని ధాన్యముల ధరలు పెరుగును.

ధాన్యాధిపతి చంద్రుడు పంటలు బాగా పండుతాయి. సకాలంలో వర్షాలు పడడంవల్ల భూములు బాగుగా సారవంతమగును. వరి, పత్తి, మిర్చి, పసుపు, పొగాకు పంటలు అధికంగా పండుతాయి. మామిడి, చెరకు పంటలు మిశ్రమ ఫలితాలను అందిస్తాయి. పాడిపరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి. గోధుమలు, అవిశలు, గానుగలు, సజ్జలు, ఉలవలు, ఆముదాలు, మినుములు, శనగలు, పెసలు, చింతపండు, మొక్కజొన్న మొదలగు పంటలు రైతులకు ఆగష్టు వరకు లాభదాయకం. ఆవాలు, కాఫీ గింజలు, ధనియాలు, ఇత్తడి, సిమెంటు, కలప ధరలు పెరుగుతూ, తరుగుతూ ఉంటాయి. కందిపప్పు, పచారి దినుసులు, మెంతులు, ఖర్జూరం, జీడిపప్పు, మిరియాలు వంటి పంటలు బాగుగా పండినా దళారుల వల్ల రైతులు ఇబ్బందులు పడతారు.

అర్ఘాధిపతి శని వల్ల నల్లరేగడి భూములయందు నల్లని ధాన్యాలు నువ్వులు, ఉలవలు, మినుమలు, ఆవాలు, అవిశెలు బాగా పండును. తెలంగాణ, రాయలసీమ, ఇతర ప్రాంతాల యందు ఖనిజ సంపదవల్ల విశేష లాభాలు పొందుతారు. బొగ్గు, చర్మం, సీసం, పలకరాళ్ళ క్వారీలు సంపదలను వృద్ధి చేయును. వ్యాపారులకు ఆనందము కలుగును. పల్లెల్లో, పట్టణ శివారు ప్రాంతాల్లో దొంగతనాలు జరుగును. ఆహార ధాన్యములు, పాల ఉత్పత్తులు పెరుగును. వింత వ్యాధులు కలుగును. ఖర్చులు పెరుగును. అయినా వాటిని తట్టుకొని ప్రజలు ముందుకు సాగెదరు.

మేఘాధిపతి శని వల్ల ఇరు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పంటలకు అనుకూలంగా పడును. కొన్ని కొన్ని ప్రాంతాలందు వర్షాలు సామాన్యంగా ఉండును. అయినా పంటలకు అనుకూలములై ఈ సంవత్సరం పంటలు బాగా పండి రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. మెట్ట భూములు కూడా బాగా పండుతాయి. మిర్చి, గోధుమ, చెరకు, గోగు, జనుము, కంది, ప్రొద్దు తిరుగుడు, అరటి, వరి ధాన్యాలు బాగా ఫలసాయం అందించగలవు. మాగాణి పంటలు అనుకూలంగా ఫలిస్తాయి.

రసాధిపతి శుక్రుడు వల్ల కుంకుమ పువ్వు, కర్పూరం, అగరు, చందనం, అత్తరు, వట్టివేళ్ళు, మోదుగ పువ్వు మొదలగు వాటి ధరలు అధికముగా ఉండును. వెల్లుల్లి, జీలకర్ర, మెంతులు, అల్లం ధరలు హెచ్చుతగ్గులుగా ఉండును. రసాయన పదార్థాలు, దుంపకూరలు, కందమూలాలు, పొట్టు ధాన్యం, పూల ధరలు విపరీత మగును. ఔషధాల ధరలు హెచ్చుతగ్గులుగా ఉంటాయి. సుగంధ ద్రవ్యముల ధరలు నిలకడగా ఉంటాయి. నూనె ధరలు, పెట్రోలు, డీజిల్‌, ఇతర అయిల్‌ ధరలు సామాన్యంగా ఉంటాయి.

సస్యాధిపతి బుధుడు వల్ల అన్నిరకాల ధాన్యాలు సమృద్ధిగా పండును. పురుగు వ్యాధులు సోకి పంట నష్టమగును. రైతులు అప్రమత్తంగా ఉండవలెను. తెలంగాణ, ఆంధ్రప్రాంతములందు వడగండ్ల వర్షాలు కురియును, పిడుగులు పడును. మందులు, లోహాల ధరలు పెరుగును. తినుబండారముల వ్యాపారములు ఎక్కువగును. ప్రజలు అనారోగ్యం పాలగుదురు. పంటలు నిల్వ ఉంచిన వారికి మంచి గిరాకి వచ్చును. రైతులు తాము పండించిన పంటలకు మంచి లాభాలను పొందగలరు.

నీరాసాధిపతి బుధుడు అగుట వల్ల ఇప్పచెల్లు ఫలించును. పచ్చలు ధర పలుకును. వ్యాపారములందు ఆటుపోట్లు ఎక్కువగును. పెసలు, కూరగాయలు, వివిధ ధాన్యములు బాగుగా ఫలంచును. ధాన్యాల నిల్వదారులు లాభపడెదరు. క్రొత్త క్రొత్త వైద్యాలు, వ్యాధుల చేత ప్రజలు అయోమయంలో పడెదరు. ఏది తినాలో తెలియక తికమకతో ఉంటారు. కర్పూరం, చందనం ధరలు పెరుగును, నూతన పరిశ్రమలు విరివిగా నెలకొల్పుతారు. నౌకావ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ప్రభుత్వ శాఖలందు కొత్త పోకడలు ఎక్కువగును.

పశుపాలకుడు బలరాముడు పాల ఉత్పత్తి అధికం. పాడి పంటలు అభివృద్ధి చెందుతాయి. రకరకాల పాలపిండి పదార్ధములచేత పాలు కలుషితమగును. పశువులకు దాణా విస్తారంగా లభించును. కోళ్ళ పరిశ్రమ సామాన్యం. మత్స్య పరిశ్రమ లాభసాటి మత్తుమందుల వినియోగం ఎక్కువగును. అగ్రవర్ణముల వారికి ప్రభుత్వావకాశములు పెరుగును.

స్థాన రక్షకుడు, పలు పరిశ్రమలు నిరాటంకంగా సాగును. పశుదాన, పాడి పరిశ్రమలు అనుకూలం వర్షాకాలం, చలికాలంలో అనారోగ్యాలు సంభవించును. ప్రభుత్వం పశువుల వైద్యముల యందు శ్రద్ధ చూపును. పశువులకు అంటువ్యాధులు సోకును.

ఈ సంవత్సరం ప్రజలకు సుఖదుఃఖములు, కష్టనష్టములు సమాంతరముగా ఉంటాయి. అన్ని విషయములయందు ప్రజలు చైతన్యవంతులై అభివృద్ధికి బాటలు వేసుకుంటారు. వికారిలో విజయం సాధిస్తారు.

ఆదాయం వ్యయం రాజపూజ్యం అవమానం
మేషం 14 14 3 6
వృషభం 8 8 6 6
మిధునం 11 5 2 2
కర్కాటకం 5 5 5 2
సింహం 8 14 1 5
కన్య 11 5 4 5
తుల 8 8 7 1
వృశ్చికం 14 14 3 1
ధనుస్సు 2 8 6 1
మకరం 5 2 2 4
కుంభం 5 2 5 4
మీనం 2 8 1 7

ది. 16-7-2019 మంగళవారం చంద్రగ్రహణం సంభవించును

ది. 26-12-2019 గురువారం సూర్యగ్రహణం సంభవించును

ది. 5-5-2019 ఆదివారం నుండి 12-5-2019 వరకు డొల్లు కర్తరి

ది. 12-05-2019 బుధవారం నుండి 29-5-2019 బుధవారం వరకు నిజ కర్తరి సంభవించును

ది. 15-12-2019 ఆదివారం నుండి 12-1-2020 ఆదివారం వరకు గురుమౌఢ్యమి సంభవించును

ది. 9-7-2019 మంగళవారం నుండి 19-9-2019 గురువారం వరకు

శుక్రమౌఢ్యమి సంభవించును

1 తూము వర్షం, 2 తూముల గాలి, 9 వీసముల కధికమగు ఫలసాయం కలుగును.

ఆంధ్ర, తెలంగాణ ప్రాంత ప్రజలకు

పాఠక మహాశయులకు

ఈ వికారి నామ సంవత్సరం సర్వతోముఖాభివృద్ధి నొసగలదు

వారు ఆనందనందనంలో విహరించగలరు.

కృషితో నాస్తి దుర్భిక్షం

సర్వేజనాః సుఖినో భవంతు !!