పసుపు తవ్వకం, ఉడకబెట్టడంలో మెళకువలు

మనదేశంలో పండించే పంటల్లో పసుపు ప్రధానమైన ద్రవ్య పంట. పసుపు ఎక్కువగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో పండిస్తున్నారు. ప్రధానంగా కరీంగనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఒకటి రెండు నెలల్లో మార్కెట్‌లో పసుపు అమ్మకానికి వస్తుంది. పసుపుకు మంచి ధర రావాలంటే పసుపు తవ్వడం నుండి మార్కెట్‌కు పండే వరకు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం...

పసుపు తవ్వకం :

సాధారణంగా ఫిబ్రవరి, మార్చిలో తవ్వితీస్తారు. పసుపు పంట కాలం సుమారుగా 7-9 నెలలు ఉంటుంది. పంట కాలం పూర్తికాగానే మొక్కల ఆకులు పాలిపోయి ఎండిపోతాయి. ఈ దశలోనే దుంపలను, కొమ్ములను తవ్వి తీయాలి. ఒక వేళ ముందే దుంపలను తవ్వి తీస్తే దిగుబడి తగ్గిపోవడంతో పాటు కర్కుమిన్‌ శాతం కూడా తక్కువగా ఉంటుంది. పసుపు తవ్వే 2 రోజుల ముందు మొక్క ఆకులు, కాండాలను నేలమట్టానికి కోసివేయాలి. తరువాత తేలికపాటి నీటితడి ఇచ్చి 2 రోజుల తరువాత తవ్వడం ప్రారంభించాలి. భూమిలో మిగిలిపోయిన దుంపలను నాగలితో ఏరి వేయాలి. తరువాత పసుపును బాగా నీటిలో కడిగి శుభ్రపరచాలి. కోత సమయంలోనే కొమ్ములను ఏ మాత్రం దెబ్బలు తగలకుండా చూసుకోవాలి.

విత్తన కొమ్ము నిల్వ :

విత్తనం కొరకు కొమ్ములను కుప్పలుగా పోసి పసుపు ఆకులతో కప్పి మంచి గాలి, వెలుతురు ఉండే ప్రదేశంలో నిల్వ చేయాలి. విత్తన కొమ్ములను నేల లోపల తవ్వి ఇసుక మరియు వేప ఆకులను వేసి వాటి పై నుండి పసుపు కొమ్ములను గుంతల్లో నింపి గుంతపై భాగం పూర్తిగా పసువుల పేడ, ఆకులతో కప్పి వేయాలి. ఇలా చేసిన ప్రదేశాల్లో గాలి కొరకు 1 లేదా 2 గొట్టాలను లోనికి అమర్చి గుంతను కప్పి వేయడం చేయాలి. కొమ్ములను ముందుగా మాంకోజెబ్‌ 0.3 శాతం ద్రావణంలో ఇతర పొలుసు పురుగుల నివారణకు క్వినాల్‌ఫాస్‌ 0.075 శాతం ద్రావణంలో 20-30 నిమిషాలు ముంచి తీయాలి.

పసుపు ఉడకబెట్టడం :

పసుపును తవ్వి తీసిన తరువాత తల్లి దుంపలను, పిల్ల దుంపలను వేరు చేయాలి. తవ్విన రెండు మూడు రోజుల్లో ఉడకబెట్టాలి. ఉడకబెట్టడం ఆలస్యమైతే నాణ్యత తగ్గుతుంది. ఉడకబెట్టేటప్పుడు దుంపలను, కొమ్ములను వేరుగా ఉడకబెట్టాలి. ఉడకబెట్టడం ద్వారా పసుపు దుంపలు, కొమ్ముల్లో ఉన్న పిండి పదార్ధం గట్టిపడి రంగు సమానంగా వస్తుంది. పసుపు పచ్చి వాసన పోతుంది. పసుపు ఎండటానికి పట్టే సమయం కూడా తగ్గుతుంది. పసుపు తక్కువగా ఉడకబెడితే దుంపలు పెళుసుగా మారి విరిగిపోతాయి. పసుపును పెద్ద పెద్ద కడాయిలో నింపి ఉపకబెడతారు. బాగా నురుగు వచ్చి, మంచి సువాసన వచ్చేటప్పుడు మంటను తగ్గించి పసుపును దించాలి. పసుపు బాగా ఉడికితే చిన్న కర్రను కొమ్ములకు గుచ్చి చూడడం ద్వారా తెలుస్తుంది. ఇటీవల కాలంలో రైతులు స్టీమబాయిలర్లను వాడుతున్నారు. స్టీమ బాయిలర్లలో ట్రాక్టర్లపై 4 డ్రమ్ములు అమర్చబడి ఉంటాయి. డీజిల్‌ ద్వారా లేదా కరెంటు ద్వారా వేడి ఆవిరి ఉత్పత్తి చేయబడుతుంది. ఈ ఆవిరిని తగిన పీడనం వద్ద 4 డ్రమ్ముల్లోకి పంపడం ద్వారా పసుపు ఉడుకుతుంది. ఈ విధానం ద్వారా గంటకు 1 టన్ను పచ్చి పసుపును ఉడకబెట్టవచ్చు.

పసుపు ఆరబెట్టడం :

ఉడకపెట్టిన పసుపును చదునైన, శుభ్రమైన నేల లేదా టార్పాలిన్‌ షీటు లేదా సిమెంటు నేలలపై కుప్పగా పోయాలి. తరువాత 5 నుండి 7 వరుసల మందం ఉండేలా కుప్పను చేయాలి. పలుచగా పరిస్తే ఎండిన పసుపు రంగు చెడిపోతుంది. ఒక రోజు విడిచి రోజూ పసుపును మధ్యాహ్నం సమయంలో తిరగబెట్టాలి. రాత్రి పూట కొమ్ములను కుప్పలుగా చేసి తేమ నుండి వర్షం నుండి కాపాడడానికి టార్పాలిన్‌ షీట్లతో కప్పివేయాలి. మరలా ఉదయం ఆరబెట్టాలి. కొమ్ములను విరిస్తే కంచు శబ్దం వచ్చేవరకు ఎండబెట్టాలి. ఈ సమయంలో దుంపల్లో 7-8 శాతం తేమ ఉంటుంది. ఇలా రావడానికి 15-20 రోజుల సమయం పడుతుంది. సూర్యరశ్మితో నడిచే డ్రయ్యర్లను వాడి పసుపును ఎండబెట్ట వచ్చు. ఈ డ్రయ్యర్లలో పైన భాగం అతినీలలోహిత కిరణాలను నివారించే ప్లాస్టిక్‌షీట్లలో (200 మైక్రాన్ల మందం) కప్పబడి ఉంటుంది. ఎండ సమయంలో తక్కువ తరంగధైర్ఘ్యము గల కిరణాలుగా మారతాయి. ఇలా తక్కువ నుండి ఎక్కువ తరంగధైర్ఘ్యము గల కిరణాలుగా మారేటప్పుడు లోపల ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీనివల్ల పసుపు కొమ్ములు పూర్తిగా ఆవిరైపోతాయి. ఇలా ఎండిన పసుపు పచ్చి పసుపులో సుమారు 19-23 శాతం తూకం ఉంటుంది.

పసుపు పాలిషింగ్‌ :

ఎండబెట్టిన పసుపు వేర్లు, పొలుసులతో ఉండి చూడడానికి బాగుండదు. ఇలాంటి కొమ్ములను ఆకర్షణీయంగా తయారు చేయుటకొరకు పాలిషింగ్‌ చేయాలి. పాలిషింగ్‌ చేసిన పసుపు చూడడానికి బాగుండి మార్కెట్‌లో మంచి ధర లభిస్తుంది. ఇలా పాలిషింగ్‌ చేయడానికి సాధారణంగా గరుకు నేలపై పసుపు కొమ్ములను రుద్దాలి. దీనివల్ల చిన్న చిన్న వేర్లు, పొలుసులు పోతాయి. కానీ అంత ఆకర్షణీయంగా ఉండవు. కానీ డ్రమ్ముల్లో పాలిషింగ్‌ చేయడం ద్వారా పసుపు కొమ్ములు ఒక దానికొకటి రుద్దు కోవడం మరియు డ్రమ్ములోపలి పొరతో రాసుకోవడం వల్ల పాలిషింగ్‌ జరుగుతుంది. ఇలా చేయడం వల్ల సగం పాలిషింగ్‌ మాత్రమే జరుగుతుంది. పూర్తి పాలిషింగ్‌ కొరకు డ్రమ్ముల్లో పసుపు కొమ్ములను వేసి తిప్పేటప్పుడు పసుపు పొడిని గానీ, పసుపు పొడిని నీళ్ళలో కలిపి కానీ డ్రమ్ముల్లో పోసి తిప్పడం ద్వారా పూర్తి పాలిషింగ్‌ అవుతుంది. పసుపు కొమ్ములను ఆకర్షణీయంగా అవుతాయి.

పసుపు గ్రేడింగ్‌ :

ఇలా పాలిష్‌ చేసిన కొమ్ములను, దుంపలను సైజును బట్టి గ్రేడింగ్‌ చేసి మార్కెట్‌కు పంపడం ద్వారా మంచి ధర వస్తుంది.

ఎ. నిర్మల, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, ఉద్యాన విభాగం, కె. అరుణ, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, విస్తరణ విభాగం, వ్యవసాయ కళాశాల, రాజేంద్రనగర్‌, హైదరాబాద్‌, ఫోన్‌ : 8330940330