పసుపు అల్లం జాతికి చెందిన దుంప. ఈ దుంప లోపలంతా పసుపు రంగులో ఉండడం వల్ల దీనికి పసుపు అని పేరు వచ్చిందని ప్రతీతి. వంటలకు సుగంధాన్ని అద్ది ఆహార పదార్థాలకు పోషకాలను అందించే పసుపు వంట ఇంటి ఔషధంగా పేరుపొందింది. ఆరు వేల సంవత్సరాల నుండి భారతీయ సంస్కృతిలో పసుపు ఒక ఔషధంగానూ, సౌందర్య సాధకంగానూ, వంటలో ముఖ్యమైన దినుసుగానూ, వస్త్ర సౌందర్యాన్ని పెంపొందించే అద్ధకంగానూ, జన జీవన స్రవంతిలో భాగమైంది. మన వంటింటి అల్మారాలో అందుబాటులో ఉండే సంజీవని లాంటి ఔషధాన్ని వదిలేసి ఏవేవో వెతుకుతుంటాం. పసుపు మనకు ప్రకృతి ప్రసాదించిన అమృతం లాంటి ఔషధం. ఆధ్యాత్మికంగా చూస్తే భౌద్దబిక్షువులు 2 వేల సంవత్సరాల క్రితమే పసుపుతో అద్దకం వేసిన వస్త్రాలను ధరించేవారు. హిందూ ధర్మశాస్త్రం ప్రకారం మంగళకరంగా ఉండేందుకు ఏ శుభకార్యాన్ని అయినా పసుపుతోనే ప్రారంభించడం ఆనవాయితి.

మనదేశంలో పసుపులేని, వాడని ఇల్లు లేదనేది నిర్వివాదాంశం. దేశంలో మహారాష్ట్రలోని సాంగ్లి నగరం ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన పసుపు వ్యాపార కేంద్రంగా ప్రసిద్ధికెక్కింది. ఆంధ్రప్రదేశ్‌లోని దుగ్గిరాల, తెలంగాణ రాష్రంలోని నిజామాబాద్‌ పసుపు వాణిజ్యానికి పేరెన్నికగన్నవి. పసుపులో ఉండే కర్క్యుమిన్‌ అనే పదార్ధం అత్యంత రోగనిరోధకమైనది, క్రిమిసంహారిణి కావడం వల్ల తాజాగా విడుదలైన కర్క్యుమిన్‌ శాతం అధికంగా కలిగిన సహజ సిద్దమైన పసుపు రకాల సాగు వేగం పుంజుకుంది. దానితోపాటు తక్కువ వ్యవధిలో, అత్యంత తక్కువ ఖర్చుతో సాగును సాకారం చేసుకునే లక్ష్యంతో దిగుబడవుతున్న పసుపు పంటపై ప్రస్తుతం కొన్ని బహుళజాతి కంపెనీలు, భారత్‌ అమెరికాలోని ఔషధ సంస్థలు ప్రత్యేక శ్రద్ధవహించి, రైతులను వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నాయి. ఇందుకు కారణం పసుపులో ఉన్న ఔషధ విలువలే. టాబ్లెట్ల తయారీ ద్వారా పసుపులోని రోగనిరోధక వ్యవస్థను రోగులకు దగ్గరకు చేర్చి వాణిజ్యంలో భాగస్వామ్యం చేసి విలువను జోడించడం వల్ల అటు రోగులకు, ఇటు పంట పండించే రైతులకు, పసుపు వాణిజ్యంలో కొనసాగే వర్గాలకు మేలు చేకూరుతుంది.

సాంప్రదాయాలను, సనాతనత్వాన్ని గుడ్డిగా హేళన చేసే బదులు పెద్దలు చెప్పిన మాటల్లో పరమార్థాన్ని ఏనాటికైనా గ్రహించక తప్పదు. ముఖ్యంగా హిందూ మతంలో స్త్రీలు పవిత్రంగా భావించే పసుపు వెనుక నిగూఢంగా దాగి ఉన్న యదార్థం ఇప్పుడిప్పుడే వెలికి వస్తుంది. ఔషధ మొక్క అయిన తులసికి పూజ చేసి, కాళ్ళకు పసుపు పారాణి అద్ధి ''ముత్యమంతా పసుపు ముఖమంత ఛాయ'' పాటపాడుకున్నట్లు 'ముత్యాలముగు'్గలాంటి సినిమాలో కనిపించే సన్నివేశాలు చూసి మనం ఎంతో పులకరించిపోతాం. కానీ ప్రపంచంలోనే అత్యంత ఔషధ గుణాలున్న పసుపుచేసే మేలు, మానవ శరీరానికి సమకూర్చే రోగనిరోధక శక్తిపై ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనలు ఆశ్చర్యం కలిగించక మానవు. సాధారణంగా మన ఇళ్ళలోనే చేతికో కాలుకో మరేదైనా అవయవానికో గాయమైనప్పుడు ముఖ్యంగా రక్తస్రావమైనప్పుడు ముత్యమంత పసుపును గాయానికి అద్దితే దానిలో ఉన్న ఔషధ గుణాలు వెంటనే పనిచేసి గాయం తీవ్రతను తగ్గిస్తాయి.

పసుపు - గుణగణాలు :

పసుపు దుంప రూపంలో మెట్ట ప్రాంతాల్లో సారవంతమైన భూముల్లో విరివిగా పండుతుంది. దుంపలపై ఉండే చెక్కుతీసి ఎండబెట్టి గృహస్థాయిలో తయారు చేసే పసుపును గృహ అవసరాలకు ముఖ్యంగా పూజలకు ఇంటిలో వంటలకు వాడుతుంటారు. అయితే వాణిజ్యపరంగా, ఔషధ పరంగా పసుపుకున్న విలువ అనాదిగా మనదేశంలో ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ, క్యాన్సర్‌, ఎయిడ్స్‌ వంటి భయంకర రోగాలను అరికట్టడంలో పసుపు ప్రభావాన్ని గమనించిన సహజ వైద్య శాస్త్రవేత్తలు, భారతీయ సంప్రదాయ, ఆయుర్వేద వైద్యులు దాన్ని ప్రాచుర్యంలోకి తెస్తున్నారు. నిత్యం వాతావరణంలో ప్రబలుతున్న కాలుష్యం మానవ జీవన విధానంలో వస్తున్న మార్పులు, రోగ నిరోధక వ్యవస్థపై ప్రభావం చూపించడంతో శక్తివంతంగా వ్యాధులను ఎదుర్కునేందుకు పసుపు వినియోగాన్ని పెద్దస్థాయిలో ముందుకు తీసుకువస్తున్నారు. మానవ శరీరంలో ఉన్న కలుషిత పదార్థాలను బయటకు పంపించివేసి, శరీరంలో ఎటువంటి ట్యూమర్లు, వాపులు ఉంటే వాటి ప్రభావాన్ని తగ్గించి వేయడంలో పసుపు గణనీయమైన పాత్ర వహిస్తుంది. శరీరంలో ఉన్న విషతుల్యమైన పదార్థాలను బయటకు పంపించేందుకు, సహజ సిద్ధంగా వచ్చే నొప్పులు, బాధల నుండి విముక్తి కలిగించేందుకు ఇక ఇంగ్లీషు మందులపై ఆధారపడకుండా, నేరుగా పసుపు వినియెగాన్నే ప్రోత్సహించే రోజులు దగ్గరికి వచ్చేశాయి. పసుపులో ఉండే బంగారు రంగులోని కర్క్యుమిన్‌, డిమిధాక్సి కర్క్యుమిన్‌, బిసిడీమిధాక్సి అనే పదార్థాలపై అత్యంత ఆసక్తికరంగా పరిశోధనలు జరిగాయి. పసుపు దుంపలో కేవలం 3-5 శాతమే ఉన్నప్పటికీ శరీరసౌందర్యాన్ని కాపాడడంలో, ఆరోగ్య రక్షణలో ఈ పదార్థం అత్యంత ముఖ్యపాత్ర పోషిస్తుంది. పసుపులో విటమిన్లు, లవణాలతో పాటు శరీర ఆరోగ్యానికి తోడ్పడే ఫైటిన్‌ ఫాస్ఫరస్‌ కూడా అధికంగానే ఉంటుంది.

పసుపు దుంప నుండి వివిధ ప్రక్రియల ద్వారా పసుపు పొడిని తయారు చేస్తారు. పసుపు రేణువుల్లో విటమిన్లు, లవణాలతో పాటు వివిధ జీవన ప్రక్రియలకు తోడ్పడే యాంటీబయోటిక్‌, క్యాన్సర్‌ నిరోధక, నొప్పులను తగ్గించే లక్షణాలు ఉండడంతో ఈ ప్రాచీన భారత ఔషధ సుగంధానికి మళ్ళీప్రపంచ వ్యాప్త గుర్తింపుతో పాటు దీన్ని పండించే రైతులు, వాణిజ్య వర్గాల భవిష్యత్‌ అద్బుతంగా మారే సూచనలు కనిస్తున్నాయి.

సాధారణంగా గుర్తించే వ్యాధులు - పసుపు ప్రభావం :

భారతీయ సహజ ఔషధ సూత్రీకరణల ప్రకారం కఫ, వాత, పిత్త సమస్యలను సంపూర్ణంగా తీర్చగల ఏకైక ఔషదం పసుపు మాత్రమే.

యుక్తవయసులో యువతీ, యువకులు ముఖంపై మొటిమల నివారణకు పసుపును జామ ఆకులతో కలిపి నూరి రాయాలి.

బాగా జలుబు, దగ్గు ఉన్నప్పుడు వేడి పాలలో కొద్దిగా పసుపు కలిపి తాగితే కపం నుండి ఉపశమనం లభిస్తుంది.

ఆహారంలో పసుపు వినియోగం ద్వారా రక్తాన్ని శుద్ధి చేసుకోవచ్చు.

దీర్ఘకాలంగా చక్కెర వ్యాధితో బాధపడేవారు అనేక పద్ధతుల ద్వారా పసుపు వినియోగించితే చక్కెరతోపాటు రక్తపోటు అదుపులో ఉంటుంది. వృద్ధాప్యంలో మతిమరుపు వ్యాధి (అల్జీమర్సుతో) బాధపడేవారు పసుపు వినియోగం ద్వారా మెదడు కణాలను పునరుజ్జీవింపచేసుకొని ఎక్కువకాలం జీవించవచ్చు.

సాధారణ చికిత్సలో భాగంగా చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడం, దెబ్బలు, గాయాలు తగిలినప్పుడు యాంటిబయోటిక్‌గా వినియోగపడడం, జీర్ణకోశసమస్యల నివారణ, శ్వాసకోశ వ్యాధుల నివారణ, రక్తంలో చెడు కొలస్ట్రాల్‌ మోతాదును తగ్గించడం, కాలేయ రక్షణ మొదలగు అన్ని వ్యాధులను పసుపును తగిన మోతాదుల్లో, వేడినీరు, పాలు, ఆహారపదార్థాలతో కలపి తీసుకోవడం ద్వారా వ్యాధులను నివారించుకోవచ్చు.

అంతే కాకుండా తీవ్రమైన రసాయన అవశేషాలు కలిగిన పండ్ల ఉత్పత్తులు, కూరగాయలు, ఆకు కూరలు, చేపలు, మాంసం, ఇతర జలచరాలను వండి ఆహారంగా మార్చుకునే ముందు పసుపు నీళ్ళతో కడిగి వినియోగించడం మనకు తెలిసిందే. ఇక అసలు విషయానికి వస్తే ఔషధంగా పసుపు వినియోగం కొరకు జరుగుతున్న పరిశోధనా ఫలితాలు, వివిధ రకాల దీర్ఘరోగాల నివారణలో తక్కువ ఖర్చుతో మంచి ఫలితాలు లభించే విషయాన్ని అమెరికా సంయుక్త రాష్ట్రాలతో సహా అనేక దేశాల్లోని పరిశోధనా సంస్థలు రుజువుచేస్తున్నాయి. ఇప్పటి వరకు జరిగిన 10 వేల పరిశీలనల్లో అద్భుతమైన ఫలితాలను గురించి 'గ్రీన్‌మెడ్‌ ఇన్‌ఫో' అనే సంస్థ సామాజిక మాధ్యమాల ద్వారా అనేక సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చింది. ఈ సంస్థకు చెందిన 'టర్మరిక్‌ రీసెర్చ్‌ బోర్డు' వెల్లడించిన పసుపును గురించిన సంచలానత్మక విషయాలు ఈ వ్యాసం ద్వారా మనం తెలుసుకుందాం...

ప్రపంచంలోనే ప్రముఖ ఔషధ ఖజానాగా బహుళజాతి కంపెనీలతో భారతీయ పురాతన ఔషధ మొక్క అయిన పసుపు ఎలా తలపడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

గ్రీన్‌మెడ్‌ ఇన్‌ఫో అనే ఈ అంతర్జాల సామాజిక మాధ్యమాల సంస్థ గతంలో ప్రచురించిన ఒక వ్యాసంలో ప్రపంచ ప్రాముఖ్యత గల సహజ ఔషధం గా పసుపు ప్రపంచంలో ఎలా ప్రాముఖ్యత సంతరించుకుందో వివరిస్తూ 600 దృష్టాంతాలను ప్రపంచం ముందుకుతెచ్చింది. దీనిలో 800 ఔషధ లక్షణాలను పొందుపరుస్తూ ప్రచురించిన వ్యాసం ప్రపంచంలోని లక్షలాది నెటిజనుల అభిమానాన్ని చోరగొంది. ఈ ఒక్క వ్యాసంతో బహుళజాతి ఔషధ సంస్థలు ఉలిక్కిపడ్డాయి. ఐతే పలు వ్యాధులకు సహజ ఔషధంగా పేటెంట్‌ హక్కులను పొంది ఎక్కడా తమ కంపెనీల కోట్లాది రూపాయల ఆదాయానికి పసుపు గండి కొడుతుందోనని అవి ఆందోళన చెందుతున్నాయి. పసుపు ఉపయోగాల వివరాలను ప్రపంచ మానవాళికి అందచేస్తూ అటు వైద్యం కొరకు ఖర్చు పెడుతున్న కోట్లాది రూపాయల ఖర్చును తగ్గించేందుకు, దీర్ఘరోగులకు, ఇటు పసుపు పండించే రైతులకు ఉపశమనం కలిగించేందుకు ఈ సమాచారాన్ని ప్రపంచ మానవాళికి అంకితం చేస్తూ అంతర్జాలంలో సామాజిక మాధ్యమాలను నిక్షిప్తం చేసిన వ్యాసాల్లోని మరికొన్ని విశేషాలను ఈ కింద పొందుపరుస్తున్నాము.

మారుతున్న మానవ జీవన శైలిలో డిప్రెషన్‌ లేక మానసిక కుంగుబాటు అనేది సర్వసాధారణమైనది. ఈ లక్షణాలు కనిపించగానే వైద్యుల సలహామేరకు తగిన మోతాదులో పసుపును సేవిస్తే ఉపశమనం కలుగుతుందని, డిప్రెషన్‌ తారా స్థాయికి వెళ్ళి హానికరమైన స్థితి ఏర్పడకముందే దాన్ని నియంత్రించవచ్చునని పరిశోధకులు వెల్లడిస్తున్నారు.

పసుపులోని కర్క్యుమిన్‌ లేక కర్క్యుమిన్‌ కలసి ఉన్న పదార్థాలను సేవించడం ద్వారా ఉదయం పూట రక్తంలో గ్లూకోజ్‌ పరిణామాన్ని గణనీయంగా తగ్గించివేసి చక్కెర వ్యాధిని నియంత్రించవచ్చునని కూడా నివేదికలో పేర్కొన్నారు.

ఆధునిక సమాజంలో స్త్రీ, పురుషులను అధికంగా వేదించే ఆస్ట్రియో ఆర్థరైటిస్‌ వ్యాధిని సకాలంలో నివారించడానికి పసుపు ఉపయోగ పడుతుందని కూడా నిర్థారించారు. అవయవాలలో వాపు తీవ్రమైన నొప్పి ఉన్న సమయంలో కూడా పసుపు ద్వారా ఉపశమనం పొందవచ్చు. చక్కెర, రక్తపోటుతో కలసి హృదయ సంబంధ వ్యాధుల నివారణకు పెక్కు సందర్భాలలో కర్క్యుమిన్‌ ఆధారిత పదార్థాల సేవన ద్వారా ముప్పును తప్పించుకునే అవకాశం ఉంది. ఇలా సర్వరోగ నివారిణిగా 800 రకాలుగా వ్యాధులపై పనిచేసే విధంగా పరిశోధనలో నిరూపితమైన అనంతరం బహుళ జాతి కంపెనీలు తయారు చేసే 14 కీలకమైన మందులకు పసుపు ప్రత్యామ్నాయంగా రూపొందినట్లు శాస్త్రజ్ఞులు అంగీకరించారు. అందుకే కొన్ని సంవత్సరాల నుండి అందరిదృష్టి పసుపు దానిలో ఇమిడి ఉన్న కర్క్యుమిన్‌ ఆధారిత పదార్థాలపై దృష్టి సారించారు. ప్రపంచంలో పెనువ్యాధుల నివారణలో తిరుగులేని ఔషధంగా ఈ బారతీయ ఉత్పత్తి ఇకపై బహుళజాతి కంపెనీలను ఢీకొట్టగలదని కనుగొన్నారు.

క్యాన్సర్‌ చికిత్సలో పసుపు పాత్ర :

వివిధ రకాలైన పర్యావరణ కాలుష్యం, మారిన ఆహారపు అలవాట్లు జీవన విధానం కారణంగా ప్రపంచ మానవాళికి పెను ప్రమాదంగా క్యాన్సర్‌ వ్యాధి విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. ఒక్కసారి క్యాన్సర్‌ వ్యాధి సోకితే మానవ మనుగడే కష్టమని భావిస్తున్న నేపధ్యంలో పసుపు ఆ రోగులపట్ల సంజీవనిగా మారింది. శరీరంలోని వివిధ అంగాలకు వచ్చిన క్యాన్సర్‌ వ్యాధిని నివారించడానికి పసుపుతో కూడిన అనేక రకాలైన మందులు మార్కెట్‌లోకి వచ్చాయి. క్యాన్సర్‌ వ్యాధిలో ప్రధానంగా కనిపించే కణుపులు, ట్యూమర్‌ల నివారణకు శాస్త్రవేత్తలు నవీకరించిన పద్ధతుల ద్వారా కర్క్యుమిన్‌ను వినియోగించి కొత్త రకం ఔషధాలను ప్రవేశపెడుతున్నారు. క్యాన్సర్‌ కణాలను ఒక సహజ పద్ధతిలో నియంత్రించేందుకు, కీమో తెరపి వంటి తీవ్రమైన చికిత్స సందర్భంలో సైడ్‌ఎఫెక్ట్స్‌ లేకుండా చికిత్స సాధ్యమని నివారణ కూడా నూటికి నూరుపాళ్ళు విజయవంతమవుతుందని ఒక సమాచారాన్ని గ్రీన్‌మెడ్‌ ఇన్‌ఫో ఆధారాలతో సహా నిరూపించింది.

తెలుగు రాష్ట్రాల్లో ఊపందుకున్న స్వల్పకాలిక పసుపు సాగు :

ప్రపంచస్థాయిలో పసుపుకు పెరిగిన వాణిజ్య విలువ, ఔషధ విలువల ప్రాముఖ్యత మరింత వెలుగులోకి వచ్చిన అనంతరం దీర్ఘకాలిక పసుపు పంట సాగు నుండి స్వల్పకాలిక రకాలవైపు రైతులు దృష్టిని సారిస్తున్నారు. కేరళలోని భారతీయ సుగంధ ద్రవ్యాల పరిశోధనా సంస్థ రెండు సంవత్సరాల క్రితం విడుదల చేసిన ప్రగతి (ఎసిసి-48) రకం పసుపు సాగు ప్రస్తుతం జోరందుకుంది. పసుపుకు అత్యంత విలువను, సుగంధాన్ని చేకూర్చే కర్క్యుమిన్‌ అధికశాతంగా ఉండే ఈ ప్రగతి రకాన్ని అభివృద్ధి చేసి దేశానికి అంకితం చేసిన ఘనత తెలుగు రైతులదే. ముఖ్యంగా గుంటూరు జిల్లాలోని గుండెమెడ గ్రామానికి చెందిన అభ్యుదయ పసుపు విత్తన రైతు పిడికిటి చంద్రశేఖర్‌ అజాద్‌ నేతృత్వంలోని రైతుల బృందం ఈ సేకరణ రకం పసుపు రకాన్ని అభివృద్ధి చేసి దేశ వ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తీసుకువచ్చింది. ఎసిసి-48తో పాటు ఎసిసి-79 రకం కూడా అత్యధిక కర్క్యుమిన్‌ శాతాన్ని కలిగి ఉండడం, లాంఛనంగా ఐఐఎస్‌ఆర్‌ సంస్థ దానికి నామకరణం చేసి అధికారికంగా విడుదల చేయునప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా పసుపు అత్యధికంగా పండించే తెలంగాణ రాష్ట్రంలో మంచి ప్రాచుర్యాన్ని సంపాదించుకుంది.

పసుపు పంటలో ప్రధానంగా ప్రబలే నులిపురుగులు (నెమటోడ్స్‌) ప్రభావం ఈ రకాల్లో తక్కువగా ఉండడం, సహజ అడవుల్లో స్వాభావికంగా సేకరించిన రకం కావడంతో సహజ ఉత్పాదనకు ప్రతీకగా నిలవడం, వాణిజ్య, ఔషధ విలువలు మెండుగా ఉండడం వీటి ప్రత్యేకతలు. తెగుళ్ళకు, బెట్టకు తట్టుకునే విదంగా సహజ రీతిలో సాగయ్యే పసుపు పంట ఉత్పాదన కూడా అధికంకావడంతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో రైతులు దీనిపట్ల ఆకర్షితులౌతున్నారు. 180 రోజుల్లో పంట కోతకు వచ్చి ఎక్కువ ప్రయాసలేకుండా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉత్పాదన తోడుకావడంతో రైతులు సాగుకు ముందుకువస్తున్నారు.

పసుపు వాణిజ్య, సాగు రంగంలోకి సాఫ్ట్‌వేర్‌, కార్పోరేట్‌ ఆసుపత్రులు :

ఎంతటి దీర్ఘవ్యాధినైనా నయం చేయగల పసుపు వాణిజ్యం, సాగు రంగంలోకి భారతీయ కార్పోరేట్‌ ఆసుపత్రులు, సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు దిగుతున్నాయి. హైదరాబాద్‌ కేంద్రంగా జాతీయస్థాయికి విస్తరించిన అపోలో గ్రూప్‌ వైద్య సేవా సంస్థలు ఈ రంగంలోకి ప్రవేశించాయి. కామారెడ్డి జిల్లా, దోమకొండ ప్రాంతంలో ఈ కంపెనీ ప్రయోగాత్మకంగా అత్యంత వాణిజ్య విలువలున్న పసుపు పంట సాగుకు ముందుకు వచ్చింది. మున్ముందు అపోలో ఆసుపత్రుల వైద్య సేవల్లో పసుపును టాబ్లెట్లు, వివిధ రూపాల్లో వినియోగించేందుకు కావలసిన పరిశోధనా సౌకర్యాలను ఏర్పాటు చేసుకొని, దూరదృష్టితో రోగుల సేవలో ముందుకు వెళ్ళడానికి సన్నాహకంగా రైతులకు ప్రోత్సాహకాలు ఇచ్చి సాగును సుస్థిరం చేస్తున్నది. అదే విధంగా అమెరికాకు చెందిన బేస్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ కూడా పసుపు సాగు దానిలోని ఔషధ విలువలతో మందుల తయారీకి ఏకంగా తెలంగాణలోని ఒక గ్రామాన్ని దత్తత తీసుకుంది. ఆ గ్రామంలో పైన వివరించిన విధంగా మంచి ఫలితాలను ఇస్తున్న ప్రగతి రకంతో పసుపును సాగుచేసేందుకు రైతులకు ప్రోత్సాహమిస్తుంది.

పసుపును వివిధ రూపాల్లో వినియోగించుకునేందుకు దాన్ని ముక్కలుగా కోసి ఎండబెట్టి ఎండిన ముక్కలను మర పట్టించి ఎవరికి వారే అమ్ముకునే అవకాశాన్ని కల్పించేందుకు కూడా సన్నాహకాలు ప్రారంభమయ్యాయి. పెద్ద పరిశ్రమలే కాకుండా గృహ అవసరాలకోసం ఎవరికి వారే నాణ్యమైన, ఆరోగ్యకరమైన పసుపును తయారు చేసుకునేందుకు గంటకు 200 కిలోలు ముక్కలు చేసే యంత్రం అందుబాటులోకి వచ్చింది. ఒకటి-రెండు ఎకరాల విస్తీర్ణంలో పసుపు పండించే రైతులకు తామే స్వంతగా తమ ఉత్పత్తులను ప్రాసెస్‌ చేసుకుని అమ్ముకునే విధంగా లభిస్తుంది.

పసుపుకు వాణిజ్య విలువ జోడించడంలో టిఎస్‌ ప్రభుత్వ పాత్ర :

ఇప్పటి వరకు గృహఅవసరాలకు, ఆద్యాత్మిక కార్యకలాపాలకు మాత్రమే వినియోగిస్తున్న పసుపులోని వాణిజ్య, ఔషధ విలువలు వెలికి వచ్చి, ప్రాచుర్యానికి నోచుకుంటున్న సందర్భంలో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విశేషమైన అధ్యయనం, కార్యాచరణ ప్రారంభించింది. కొద్దినెలల క్రితం జీడిమెట్లలోని సెంటర్‌ ఫర్‌ ఎక్కెలెన్స్‌ ప్రాంగణంలో శాస్త్రవేత్తలు, పసుపు వాణిజ్యంలో పాలుపంచుకుంటున్న రైతులు, ప్రభుత్వ అధికారులతో ఒక మేధోమధన సదస్సును నిర్వహించింది. ఐసిఎఆర్‌ సంస్థ అనుబంధమైన ఐఐఎస్‌ఆర్‌ శాస్త్రవేత్తలు, అధికారులు ఈ సదస్సులో పాల్గొన్నారు. వీరితోపాటు పసుపు విత్తన రైతులు ముఖ్యంగా కర్క్యుమిన్‌ అధికశాతం గల స్వాభావిక పసుపు విత్తన రైతులు ఈ సదస్సులో పాల్గొన్నారు. వీరితోపాటు అమెరికాకు చెందిన పసుపు ఔషధ విలువలను పెంచి పోషించడానికి, దాన్ని మానవాళి ఆరోగ్యానికి అంకితం చేయడానికి కంకణం కట్టుకున్న సాఫ్ట్‌వేర్‌ కంపెనీ అధిపతులు హాజరైనారు. పసుపుకు సంబంధించిన అన్ని రకాల విభాగాలు పాల్గొన్న ఈ సదస్సు భవిష్యత్‌ ఆశలను రేకెత్తించింది. తెలంగాణ ప్రభుత్వ హార్టికల్చర్‌ కమీషనర్‌ ఆధ్వర్యంలో ఎల్‌.వెంకట్రామి రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సు మంచి ప్రేరణనిచ్చింది.

ఉద్రిక్తతకు దారితీసిన పసుపు బోర్డు వ్యవహారం :

గతంలో మన్మోహన్‌సింగ్‌ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వం, జాతీయ వ్యవసాయ శాఖ నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటుకు సూచన ప్రాయంగా అంగీకరించింది. అప్పటి ప్రభుత్వం రద్దయిపోయి రాష్ట్రం విభజనకు గురైన సమయంలో కూడా దీనిపై ప్రముఖంగా చర్చనడిచింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన మోది ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని అమల్లోకి తీసుకురాలేదు. నిజామాబాద్‌ ఎంపిగా ఉన్న కెసిఆర్‌ కుమార్తె కల్వకుంట్ల కవిత అనేకసార్లు పార్లమెంటులోపల, వెలుపల దీనిపై విస్తారంగా ప్రభుత్వాన్ని నిలదీసినా ఫలితంలేకుండా పోయింది. దేశంలోనే పసుపుపంటను అత్యధికంగా పండించే నిజామాబాద్‌ కేంద్రంగా పసుపు బోర్డును ఏర్పాటు చేయాలని కోరుతూ ఇటీవల ఆర్మూరులో రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. అయినా ప్రభుత్వంలో చలనంలేకపోవడంతో రాస్తారోకోలు, జైల్‌భరో కార్యక్రమాలను నిర్వహించారు. ప్రభుత్వాల వైఖరికి నిదర్శనగా పసుపు రైతుల సంఘ సభ్యులు సుమారు 245 మంది కవితకు వ్యతిరేకంగా నామినేషన్లు వేసి పోటీకి సిద్ధమై సంచలనం సృష్టించారు. నేడు దేశంలోనే అతిపెద్ద బ్యాలెట్‌ పేపరు నియోజకవర్గంలోనే ఉండడం ఎన్నికల నిర్వహణకు చికాకు కలిగిస్తుంది.

- వై.వి. నరసింహారావు, అసోసియేట్‌ ఎడిటర్‌