సేంద్రీయ ఉత్పత్తుల ధృవీకరణ - రైతులు పాటించవలసిన పద్ధతులు

ప్రపంచంలోని మొత్తం సేంద్రీయ వ్యవసాయంలో భారతదేశం 57.8 మిలియన్‌ హెక్టార్లను కలిగి ఉంది. భారత ప్రభుత్వం నియమించిన అశోక్‌ దాల్వాయ్‌ కమిటీ సేంద్రియ వ్యవసాయం పాటించడం వల్ల 30 శాతం పంట దిగుబడులు తగ్గుతున్నట్లు గుర్తించారు. తెలంగాణ రాష్ట్రంలో సేంద్రియ రైతులకు తోడ్పాటు అందించడానికి తెలంగాణ రాష్ట్ర సేంద్రియ మరియు ఉత్పత్తుల ధృవీకరణ సంస్థను తెలంగాణ ప్రభుత్వం 2016లో ఏర్పరచింది. ఈ సంస్థ జాతీయ సేంద్రియ ఉత్పత్తి ప్రమాణాలను పాటించి తక్కువ ఖర్చుతో ధృవీకరణ అందిస్తుంది. ప్రస్తుతం సిక్కిం, ఉత్తరాంచల్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లను సేంద్రియ రాష్ట్రాలుగా భారత ప్రభుత్వం గుర్తించింది. మానవ ఆహార వినియోగంపై పెరుగుతున్న చైతన్యం మరియు ఆరోగ్యకరమైన ఆహారం కోరుకునే వినియోగదారుల సంఖ్య గణనీయంగా ఉండటం వల్ల, రానున్న కాలంలో సేంద్రీయ ఆహార ఉత్పత్తులకు గిరాకి విపరీతంగా పెరుగుతుంది. మామూలు వ్యవసాయ ఉత్పత్తుల కన్నా సేంద్రియ ఉత్పత్తుల ధరలు 30 శాతం అధికంగా ఉన్నా, ఇవి నాణ్యంగా ఉండటమే కాకుండా ఎంతో రుచిగా ఉండడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది వినియోగదారులు సేంద్రియ ఉత్పత్తుల పట్ల ఆకర్షితులవుతున్నారు. సేంద్రియ ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్లో ఒక అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌లు మాత్రమే 87 శాతం అమ్మకాలు జరుపుతున్నాయి. మిగిలిన ప్రపంచమంతా 3 శాతం సేంద్రియ ఉత్పత్తుల అమ్మకాలతో సరిపెట్టుకుంటుంది.

భారత ప్రభుత్వం 2001 వ సంవత్సరంలో జాతీయ సేంద్రియ ఉత్పత్తి పథకం ద్వారా ''ఇండియన్‌ ఆర్గానిక్‌'' లోగోను ఏర్పరచి, తగిన నాణ్యత ఉత్పత్తి ప్రమాణాలను ఏర్పరచి అమెరికా, యూరోపియన్‌ మరియు స్విట్జర్లాండ్‌ దేశాలకు ఒకే ధృవీకరణ పత్రం ద్వారా ఎగుమతి చేసుకొనే అవకాశం కల్పించారు. మనదేశంలో ప్రస్తుతం 29 గుర్తింపు ఏజెన్సీలను భారత ప్రభుత్వం సేంద్రియ ఉత్పత్తుల జాతీయ ప్రణాళిక అమలుకు ఏర్పరచిన నోడల్‌ ఏజెన్సీ ఆహార, ప్రాసెస్‌ ఉత్పత్తుల అభివృద్ధి సంస్థ (ఎపెడా) పర్యవేక్షిస్తుంది. మనదేశంలో ప్రతి ఏడాది 600-700 మిలియన్‌ టన్నుల జీవ సంబంధిత వ్యర్థ పదార్థాలు అందుబాటులో ఉండటం వల్ల ప్రస్తుతం ఉన్న పోషక విలువ 0.3-0.4 శా 1-2 శాతం వరకు పెంచవచ్చు.

సేంద్రియ ధృవీకరణ అంటే :

వ్యవసాయ, పశు సంబంధిత ఉత్పత్తులకు గుర్తింపు పొందిన సంస్థలు నేల దున్నిన నాటి నుంచి పంటకోత, ప్రాసెసింగ్‌ వరకు వివిధ దశల్లో ఉత్పత్తి పద్ధతులను తనిఖీలు చేసి ఇచ్చే పత్రం సేంద్రియ ధృవీకరణ కోసం 3 సంవత్సరాల వరకు ఎలాంటి పురుగు మందులు, రసాయనాలు పంట క్షేత్రంలో వాడకూడదు. ఈ వ్యవధి ఏకవార్షిక పంటలకు 2 సంవత్సరాలు మరియు బహువార్షిక పంటలకు 3 సంవత్సరాలు. సేంద్రియ ధృవీకరణలో భాగంగా భూసార పరీక్షలు జరిపి మొక్కలకు కావల్సిన పోషక చార్టును తయారు చేసి దానికి అనుగుణంగా పోషక లోపాలను సరిదిద్ది నాణ్యమైన ఉత్పత్తులను రూపొందించవచ్చు.

దేశంలో అనేక ప్రాంత రైతులు సాంప్రదాయక సేంద్రియ వ్యవసాయాన్నే కొనసాగిస్తున్నారు. కాని గుర్తింపు పొందిన (సర్టిఫైడ్‌) సేంద్రియ వ్యవసాయ క్షేత్రాలు మనదేశంలో చాలా స్వల్పం. దీనివల్ల మనం సాలీనా కొన్ని కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని కోల్పోతున్నాం. సేంద్రియ పద్ధతుల ద్వారా ఆహారోత్పత్తిని చేయగోరే రైతులు ఎగుమతులు చేయాలంటే ధృవీకరణ తప్పనిసరి. ఏదైనా ఆహారోత్పత్తి సేంద్రియ ఉత్పత్తిగా గుర్తింపు పొందాలంటే సాగులో నిర్ధేశిత ప్రమాణాలు పాటించాలి. యూరోపియన్‌ యూనియన్‌, యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా సేంద్రియ ఉద్యమాల అంతర్జాతీయ సమాఖ్య (ఐఎఫ్‌ఒయం) నిర్ధేశిత సాగు ప్రమాణాలు సూచించింది. అన్ని దేశాలు కొద్దిపాటి తేడాతో ప్రస్తుతం ఈ ప్రమాణాలను పాటిస్తున్నాయి. దీని ప్రకారం నాటే విత్తనాల నుంచి యాజమాన్య పద్ధతులు, పంటమార్పిడి, ప్యాకింగ్‌ వరకు అనేక జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. వీటి ప్రధాన ఉద్ధేశం ఎట్టి పరిస్థితులలోను ఆహార పదార్థాలలోనికి ఎలాంటి రసాయనిక అవశేషాలు రాకుండా సాగు ద్వారా పర్యావరణానికి నష్టం కలుగకుండా చూడడం.

రైతులకు ఎంతో ఉపకరించే ఈ తరహా సేద్యంలో కొన్ని సాంకేతిక ప్రతిబంధకాలు రైతులకు చిరాకు కలిగిస్తుండడం నేడు ఒక సమస్యగా మారుతోంది. సేంద్రియ ఉత్పత్తులకు ధృవీకరణ పొందడంలో ఎదురవుతున్న సమస్యపై ప్రభుత్వాలు దృష్టిసారించాయి. ఈ మధ్యకాలంలో సేంద్రియ వ్యవసాయంలో కీలకమైన సర్టిఫికేషన్‌ బాధ్యతను వ్యవసాయశాఖ తీసుకొంది. సేంద్రియ వ్యవసాయం ద్వారా పండించే ఉత్పత్తులకు దృవీకరణ చేయాలంటే అదనంగా ఖర్చవుతుంది. దీనివల్లగ్రూపులుగా ఏర్పడిన రైతులు ఖర్చు తగ్గించు కోవచ్చు. అయితే క్షేత్రస్థాయిలో ఈ ప్రక్రియ రైతులకి సులభంగా అందుబాటులోకి రాకపోవడం నేటికీ పెద్దలోపమే. ఎందుకంటే సర్టిఫికేషన్‌ పొందడంలో డాక్యుమెంటేషన్‌ పరంగా ఇబ్బందులు ఆర్థిక భారంగా ఉన్నాయి. దీనికి తోడు సేంద్రియ క్షేత్రంగా మార్చాలంటే ఎక్కువ సమయం పడుతుంది.

ఈ నేపధ్యంలో ఎలాంటి పద్ధతుల్ని పాటిస్తే మన రైతులు సేంద్రియ ఉత్పత్తులను లాభసాటి ధరలకు ఎగుమతి చేసుకోగలరో, సేంద్రియ వ్యవసాయంలోగల రాయితీలను, సబ్సీడిలను, సాగు పద్ధతులను రైతులకు చేరవేయడం ప్రస్తుతం విస్తరణ అధికారుల ముందు ఉన్న ప్రధాన కర్తవ్యం. క్రమం తప్పకుండా జరిగే బయటి వ్యక్తుల్లో జరిగే క్షేత్ర తనిఖీలు పంట మొత్తం కాల పరిమితిలో 3 సార్లు జరుపుతాయి. దీనిలో పంట వేయక ముందు అంతర పంటలు, ప్రధాన పంటల అంచనా వేయబడ్డ దిగుబడిని రికార్డు చేస్తారు. పంట పొలంలో పనిచేసే కూలీల వయసు 15 సంవత్సరాల పైబడి ఉండాలి. బాల కార్మికులను కూలీలుగా వాడితే పంట ధృవీకరణ చేయబడదు. పంట కోత సమయంలో ప్రత్యేకమైన దుస్తులు ధరించాలి. ఎందుకంటే పంట నాణ్యతకు ఇతర అవశేషాలు, మానవ వెంట్రుకలు కలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అదే విధంగా పంటకోత తర్వాత కాటన్‌ సంచుల్లో నిల్వ చేయాలి.

రైతులు పాటించాల్సిన సేంద్రియ ప్రమాణాలు :

సమాంతర ఉత్పత్తికి తావులేదు. అనగా రైతు తన పొలంలో బి.టి., వంగడాలు వేయకూడదు.

పాక్షిక ఉత్పత్తికి వీలు లేదు.

బఫర్‌జోన్‌ జన్యుమారక క్షేత్రాలకు 400 మీటర్ల దూరంలో మాత్రమే సేంద్రియ పంటను పండించాలి.

జన్యుమార్పిడి పంటలను సాగుచేయరాదు.

సేంద్రీయ ధృవీకరణ పద్ధతులు :

ప్రపంచ వ్యాప్తంగా సేంద్రీయ ఉత్పత్తులు ధృవీకరణలో మూడు రకాల పద్ధతులను పాటిస్తున్నారు. అవి

1. వ్యక్తిగత ధృవీకరణ మూడవ పార్టీ విధానం ధృవీకరణ

2. చిన్న, సన్నకారు బృందాల ధృవీకరణ

3. భాగస్వామ్య హామీ పథకం (పి.జి.యన్‌)

వ్యక్తిగత ధృవీకరణ మూడవ పార్టీ విధానం ధృవీకరణ :

ఇది విశ్వ వ్యాప్తంగా గుర్తింపుపొందిన ధృవీకరణ విధానం. ఇది వ్యక్తులకు మరియు పెద్ద రైతులకు సరిపోతుంది. ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది. దీనిలో టెక్నికల్‌ సపోర్ట్‌, శిక్షణ, డాక్యుమెంటేషన్‌, ఉత్పత్తి అన్నీ రైతే చూసుకుంటాడు. ఈ అంచనా విధానంలో ఆ ప్రాంతం బయట నుంచి వచ్చిన వ్యక్తి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి బహిరంగ తనిఖీలు జరిపి తన నివేదికను అందిస్తారు. అయితే ఈ ధృవీకరణ విధానం పి.జి.యన్‌ కింద స్థానిక బృందంగా ఏర్పడడానికి వీలు లేని, మారుమూలు ఉండే వ్యవసాయ క్షేత్రాలకే ఉపయోగకరంగా ఉంటుంది. ఈ మూడవ పార్టీ విధానంలో తెలంగాణ రాష్ట్ర సేంద్రీయ ఉత్పత్తుల ధృవీకరణ సంస్థ, వేదిక్‌ సేంద్రియ సర్టిఫికేషన్‌ ఏజన్సీ, టి,క్యూ సర్ట్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రైతులకు సేవలందిస్తున్నాయి.

చిన్న, సన్నకారు బృందాల ధృవీకరణ :

చిన్న, సన్నకారు రైతులు బృందాల వారిగా ఏర్పడి అంతర్గత నియంత్రణ వ్యవస్థ అనే విధానం ద్వారా ధృవీకరణ చేస్తారు. ఈ బృందాలు రైతు సమాఖ్యల ద్వారా గాని స్వచ్ఛంద సంస్థల సహకారంతో గాని, సహకార సంఘాల ద్వారా గాని ఉత్పత్తి, మార్కెటింగ్‌ ప్రాసెసింగ్‌, విలువ జోడింపు చేస్తారు. దీనిలో సమన్యాయకర్తలు అంతర్గత తనిఖీలు చేస్తూ రైతు పర్యవేక్షకులు క్షేత్ర అధికారులకు, రైతులకు, బహిరంగ తనిఖీదారులకు సంధానకర్తగా వ్యవహరిస్తారు. ఈ సమన్వయ కర్త నాటే విత్తనాలు భూమి ఎంపిక నుంచి యాజమాన్య పద్ధతులు, పంటమార్పిడి, ప్యాకింగ్‌ వరకు అనేక జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది వీరి ప్రధాన ఉద్ధేశ్యం ఎట్టి పరిస్థితులలోను ఆహార పదార్ధాలలోనికి ఎలాంటి రసాయన అవశేషాలు రాకుండా సాగుద్వారా పర్యావరణానికి నష్టం కలుగకుండా చూడడం. దీనితో పాటు సమన్వయకర్త పుస్తక నిర్వహణ, సమావేశాలు రైతులకు శిక్షణ నిర్వహిస్తారు. దీని వల్ల ధృవీకరణ సంస్థకు ధృవీకరణ ఖర్చు చాలా వరకు తగ్గుతుంది. దీని వల్ల బృందం మొత్తానికి ఒకేరకమైన ధృవీకరణ పత్రం జారీ చేస్తారు.

అంతర్గత నియంత్రణ వ్యవస్థ నెలకొల్పటంలో దశలు :

వ్యక్తిగత ఉత్పత్తిదారులను సంఘాలుగా ఏర్పరచుట.

కార్యక్రమ ప్రోత్సాహక సంస్థలో (రైతు సమాఖ్య, స్వచ్ఛంద సంస్థ) వ్యక్తిగత రైతు యొక్క ఒప్పందం.

గ్రూపు ధృవీకరణ గురించి అవగాహన కల్పించుట.

అంతర్గత నియంత్రణ వ్యవస్థను నిర్వహించుటలో అర్హత కలిగిన సిబ్బందిని గుర్తించుట.

అంతర్గత నియంత్రణ వ్యవస్థ యొక్క విధానాలు, పద్ధతులతో మాన్యువల్‌ను రూపొందించుట.

విధానాలు, పద్ధతులు అమలు పరచుట.

ప్రతి ఒక్క రైతు వారి రోజు వ్యవసాయ కార్యకలాపాల వివరాలను సేంద్రియ క్షేత్ర డైరీలో నమోదు చేయుట.

ప్రతి పంట కాలంలో ప్రతి రైతు యొక్క అన్ని క్షేత్రాలు అంతర్గత తనిఖీదారులతో రైతు పర్యవేక్షణలో తనిఖీ చేయుట.

అంతర్గత నియంత్రణ వ్యవస్థలో భాగమైన సిబ్బందితో అప్రూవల్‌ కమిటిని ఏర్పాటు చేయుట.

అంతర్గత తనిఖీ నివేదికలలో పేర్కొనబడిన అంశాల ఆధారంగా ప్రతి రైతు యొక్క సేంద్రీయ వ్యవసాయ స్థాయిని గుర్తించుట మరియు సంగ్రహణ నివేదికలు రూపొందించుట.

ఆమోదించబడిన రైతుల నివేదిక అమలు చేయుట.

సేంద్రీయ వ్యవసాయ ప్రణాళికను అభివృద్ధి పరచి ప్రతి రైతు ఈ ప్రణాళికను అమలు పరచడాన్ని రుజువు చేయుట.

అంతర్గత తనిఖీ :

సభ్యులందరి యొక్క ప్రమాణాల అనుసరణను తనిఖీ చేయుటకు చేపట్టే ప్రక్రియ అంతర్గత తనిఖీ. అంతగర్గత తనిఖీలు సంవత్సరంలోగా రెండుసార్లు అంటే ప్రతి పంటకాలంలో ఒకసారి అందరి రైతుల యొక్క క్షేత్ర సందర్శన, గృహ సందర్థన, గోదాముల నిర్వహణ, ఇతర రైతు పర్యవేక్షకులచే లేదా క్షేత్రస్థాయి సిబ్బందితో చేపడతారు. అంతర్గత తనిఖీలు పంట యొక్క వేరు వేరు దశలలో చేపట్టవలసి ఉంటుంది. అనగా నాటే విత్తనాలు, యాజమాన్య పద్ధతులు, పంట మార్పిడి, ప్యాకింగ్‌, పంట పెరుగుదల దశలలో చేయవలసి ఉంటుంది. అంతర్గత తనిఖీ చేపట్టుటకు 3,4 రోజుల ముందుగా రైతులకు సమాచారం అందించవలెను. ఈ పద్ధతిలో సంఘంలోని ఒక రైతు ఉల్లంఘనకు పాల్పడినట్లయితే మొత్తం గ్రూపు ధృవీకరణ కోల్పోతుంది. కాబట్టి గ్రూపులోని అందరి సభ్యుల యొక్క ప్రయోజనాల కొరకు సంఘం ఉల్లంఘనను జరగకుండా జాగ్రత్తలు వహించవలసి ఉంటుంది.

భాగస్వామ్య హామీ పథకం (పి.జి.యస్‌) :

ఈ విధానంలో గ్రామ ప్రజలందరూ కలిసి సేంద్రియ సాగు పద్ధతులు పాటించే విధంగా సామాజిక కట్టుబాట్లు విధించుకుంటారు. సేంద్రియ సాగు చేసే ప్రతి ఒక రైతు వద్ద ఒక రికార్డు పుస్తకం ఉంటుంది. ఈ రికార్డు పుస్తకంలో తమ సేంద్రియ పంట సాగు వివరాలను నమోదు చేస్తారు. ఈ రికార్డు పుస్తకాలను వినియోగదారులు ఏ సమయంలోనైనా పరిశీలించవచ్చు. గ్రామ ప్రజలు గుంపులుగా ఏర్పడి ఒక్క గుంపును వేరొక గుంపు కట్టుబాట్ల ప్రకారం గమనించి నిర్ధారణ చేసే విధంగా ఉంటుంది. రైతులు తమ పంటలను తామే సేంద్రియ ఉత్పత్తులుగా ప్రకటించుకోవడం ద్వారా నిర్ధారణ ఖర్చులు (సర్టిఫికేషన్‌) తగ్గి వినియోగదారునికి ఉత్పత్తులు చౌకగా లభిస్తాయి. ఇది ఒక ప్రత్యామ్నాయ నిర్ధారణ పద్ధతి.

భారతదేశంలో సేంద్రియ రైతులు అవలంభించే ప్రధాన ధృవీకరణ విధానంగా ఇది రూపుదిద్దుకుంది. దీనిలో అత్యంత ఖర్చుతో కూడుకున్న మూడవ పార్టీ తనిఖీల భారం నుంచి రైతులు విముక్తం కానున్నారు. ఇది మూడవ పార్టీ విధానంతో పోలిస్తే నాణ్యత హామీ విషయంలో ఎంతో నమ్మదగ్గ సమర్థమైన విధానం. ఆర్గానిక్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా చేపట్టే మూడవ పార్టీ తనిఖీల విధానంలో బయట నుంచి ధృవీకరణ చేసేవారు స్వయంగా సేంద్రియ రైతులై ఉండాలి. ఒక గ్రామంలో లేదా కొన్ని గ్రామాల్లో బృందాలుగా సంఘటితమై పనిచేయగల రైతులు, గిరిజనులు, స్థానిక ప్రజలకు మాత్రమే ఈ ధృవీకరణ విధానం వర్తిస్తుంది. బృందాల్లో చేరలేని వ్యక్తిగత రైతులు ఆర్గానికి ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా వారి క్షేత్ర అంచనాదారుల ద్వారా మూడవ పార్టీ ధృవీకరణను ఎంచుకోవలసి ఉంటుంది. ఈ పద్ధతిలో చిన్న సన్నకారు రైతులు, ప్రాసేసర్స్‌, వ్యాపారులు కలిసి ధృవీకరణలో పాల్గొంటారు. దీనిలో కూడా అన్ని సేంద్రియ ప్రమాణాలను, డాక్యుమెంట్లను నిర్వహిస్తారు. కానీ నిర్ణయాలు మాత్రం కేంద్రీకృతంగా గ్రామంలోనే చేయబడి దేశవాళీ మార్కెట్‌కు మాత్రమే పరిమితమై మూడవ పార్టీ ధృవీకరణ చేసే అవకాశం ఉన్నది. ప్రాంతీయ మండలిని జాతీయ సమన్వయ కమిటీ, వ్యవసాయ మంత్రిత్వ శాఖచే గుర్తింపు పొందిన వినియోగదారుల సంఘాలు స్వచ్ఛంద సంస్థలతో కలిపి రెండు సంవత్సరాల కొకసారి ఏర్పరుస్తారు. ప్రాంతీయ మండలి రాష్ట్ర, జోనర్‌ స్థాయిలో పర్యవేక్షిస్తుంది. ఈ పద్ధతిలో ఖర్చు చాలా తక్కువ .

పి.జి.యస్‌ వల్ల లాభాలు :

దీనిలో విధానాలు చాలా సరళమైనవి. పత్రాలు మౌళికమైనవి. అన్ని పత్రాలు సంబంధిత రైతుల భాషలో ఉంటాయి.

క్షేత్ర తనిఖీ దారులు అక్షరాస్యులు కాని సందర్భంలో వీడియో ద్వారా తనిఖీ చేయడానికి, జవాబులను మౌఖికంగా రికార్డు చేసే అవకాశం కల్పిస్తుంది.

క్షేత్ర తనిఖీ దారులు అదే గ్రామంలో ఉంటారు. కాబట్టి తనిఖీ చేసే క్షేత్రంలో రోజువారీ జరిగే పనుల గురించి అవగాహన ఉన్న వ్యక్తులే క్షేత్ర తనిఖీ చేసినట్లు అవుతుంది.

ధృవీకరణ ప్రక్రియ అందుబాటులో లేని సన్న, చిన్న తరహా రైతులకు ఈ విధానం బాగా సరిపోతుంది.

పట్టణాలలో ఉంటూ తమ సేవలకు పెద్ద మొత్తంలో రుసుము వసూలు చేసే ధృవీకరణ దారుల అవసరం ఉండదు.

పి.జి.యస్‌ వ్యక్తిగత జ్ఞానం, నమ్మకం మీద ఆధారపడి ఉండును. వ్యవసాయ క్షేత్రం, కుటుంబం గురించి పరిచయం లేని ధృవీకరణ చేసే తనిఖీలలో ఉండేటంత కాగితం పని పి.జి.యస్‌లో ఉండదు.

ఈ కారణాల వల్లే కాకుండా ఇతర కారణాల వల్ల కూడా సేంద్రియ వ్యవసాయ క్షేత్ర ధృవీకరణకు ప్రపంచ వ్యాప్తంగా సేంద్రియ వ్యవసాయ ఉధ్యమాల అనుభవాల నుంచి పి.జి.యస్‌ విధానం వచ్చింది. ఈ పి.జి.యస్‌ను అంతర్జాతీయ సేంద్రియ వ్యవసాయ ఉధ్యమాల సమైక్య కూడా గుర్తించింది.

భారత ప్రభుత్వం పరంపరాగత్‌ కృషి వికాస యోజన పథకం ద్వారా సేంద్రియ వ్యవసాయం చేసే రైతులకు ఆర్థిక ప్రోత్సాహం అందిస్తుంది. తెలంగాణలో వ్యవసాయ శాఖ, ఏకలవ్య ఫౌండేషన్‌, సెంటర్‌ ఫర్‌ సస్టేనబుల్‌ అగ్రికల్చర్‌, మైసూరు గ్రీన్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, శ్రీశ్రీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ సైన్స్‌ & టెక్నాలజీలకు చెందిన 1086 మంది రైతులను భాగస్వామి హామీ పథకంలో ధృవీకరణకు వాడుకోవచ్చు.

భాగం సహాయ వివరాలు

లక్షిత ప్రాంతాలలో సేంద్రియ వ్యవసాయ 10,000/-

సముదాయాన్ని ఏర్పరచటం కోసం

సమావేశాలు జరపడం, రైతులతో చర్చలు

జరపడం

రైతులు సేంద్రియ వ్యవసాయ పొలాలను 10,000/-

సందర్శించడం

శిక్షణ (3 సార్లు) 60,000/-

పి.జి.యస్‌ ధృవీకరణ, 1,150/- నాణ్యతా నియంత్రణపై శిక్షణ

రైతుల ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ 10,000/-

మట్టినమూనా సేకరణ, పరీక్షలు 11,970/-

(సాలీనా - 3,990/-)

డాక్యుమెంటేషన్‌ (సాలీనా - 5,000/-) 15,000/-

బృందసభ్యుల పర్యవేక్షణ (సాలీనా - 1200/-) 3,600/-

జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన 1,60,000/- ప్రయోగశాలలో అవశేషాల విశ్లేషణ

ధృవీకరణ చార్జీలు 2,000/-

ధృవీకరణ కోసం పాలనాపరమైన ఖర్చులు 59,950/-

నేలను సేంద్రియంగా మార్చడం కోసం 1,50,000/-

(సాలీనా ప్రతి ఎకరానికి - 1,000/-)

పంటల విధానాన్ని ప్రవేశ పెట్టడం 75,000/-

(సాలీనా ఎకరానికి - 500/-)

సేంద్రియ ఉత్పాదకాల తయారీ యూనిట్ల 75,000/-

ఏర్పాటు (ఎకరానికి - 1500/-)

జీవ నత్రజనిని స్థిరీకరించే మొక్కలు 1,00,000/-

కొనుగోలు, నాటడం

చెట్ల కషాయాలు, ద్రావకాలు ఉత్పత్తి చేసే 50,000/-

యూనిట్ల ఏర్పాటు

జీవ ఎరువుల ద్రవ సముదాయం కొనుగోలు 75,000/-

ఫాస్ఫేట్‌ ఎరువుల వాడకం 50,000/-

వర్మి కంపోస్టు యూనిట్‌ ఏర్పాటు 2,50,000/-

వ్యవసాయ పరికరాల కొనుగోలు 45,000/-

(సాలీనా - 15,000/-)

పి.జి.యస్‌ లోగో, ¬లోగ్రామ్‌తో ప్యాకింగ్‌ 1,50,000/-

మెటీరియల్‌ ముద్రణ (2వ&3వ సంవత్సరం)

సేంద్రియ ఉత్పాదన రవాణా (2వ సంవత్సరం) 1,20,000/-

సేంద్రియ మేళా నిర్వహణ (2వ సంవత్సరం) 36,330/-

మొత్తం ఖర్చు 15,30,350/-

సేంద్రియ ధృవీకరణలో వివిధ దశలు - వాటి అనుసరణ క్రమం :

సేంద్రియ ధృవీకరణ పత్రం కొరకు ఉత్పత్తి దారులు అన్ని వివరములతో నమూనా దరఖాస్తుతో ధృవీకరణ సంస్థకు దరఖాస్తు చేసుకోవాలి.

ధృవీకరణ సంస్థ ఆ దరఖాస్తును పరిశీలించి ఏమైనా సందేహాలు ఉంటే అడిగి నివృత్తి చేసుకుంటుంది.

దృవీకరణకు అగు ధృవీకరణ ఖర్చు, ప్రయాణ ఖర్చు, తనిఖీ ఖర్చు, ప్రయోగశాల ఖర్చు వివరాలను తగు అంగీకార నిమిత్తం పంపుతారు. దీనిపై ఉత్పత్తిదారులు తమ అంగీకారం తెలుపవలసి ఉంటుంది.

ఉత్పత్తిదారుడు, ధృవీకరణ సంస్థల మధ్య వ్రాతపూర్వక అంగీకారం జరుగుతుంది.

పంటను ఏవిధంగా పండించాలి. ఎలాంటి నాణ్యతా ప్రమాణాలను ఉత్పత్తిదారుడు ధృవీకరణ పాటించాలని సంస్థ తెలుపుతుంది.

ఉత్పత్తిదారులు ధృవీకరణ ఖర్చులో 50 శాతం పైకమును ముందుగానే చెల్లించాలి.

తనిఖీ తేదీలు నిర్ణయించబడుతాయి.

అనుమానం ఉన్న యెడల ఆకస్మిక తనిఖీలను జరిపి పైరు లేదా పంట, నేల, వాడిన ఉపకరణములు మరియు ఉత్పత్తుల నమూనాలను సేకరించి ప్రయోగశాలకు పంపి విశ్లేషిస్తారు.

పూర్తి తనిఖీ వివరములను ధృవీకరణ కమీటికీ నివేదిస్తారు.

తరువాత ధృవీకరణ సంస్థకు మిగిలిన 50 శాతం పైకమును చెల్లించాలి.

ధృవీకరణ మంజూరు చేయబడుతుంది.

ధృవీకరణ నిర్ణయాలకు ఉత్పత్తిదారుడు సంతృప్తి పడనిచో ధృవీకరణ సంస్థలో వ్రాత పూర్వకంగా 30 రోజులలో ఫిర్యాదు చేయాలి. తరువాత దృవీకరణ కమిటీ తగు నిర్ణయం తీసుకుంటుంది.

ఉత్పత్తిదారుడు ధృవీకరణ ముద్రతో ఉత్పత్తులను విడుదల చేసి మార్కెటింగ్‌ చేయవచ్చును.

ఈ విధంగా ధృవీకరణ పొందిన సేంద్రియ రైతుల స్పూర్తితో రాష్ట్రంలోని సేంద్రియ పద్ధతుల ద్వారా వ్యవసాయం చేస్తున్న రైతులు వివిధ పద్ధతులైన వ్యక్తిగత ధృవీకరణ, చిన్న సన్నకారు బృందాల ధృవీకరణ, భాగస్వామ్య హామీ పథకాలలో తమకు అనుకూలమైనది పాటించి మెరుగైన లాభాలు పొందగలరు.

డా|| పి.ప్రశాంత్‌, డా|| వి. లక్ష్మీ నారాయణమ్మ, డా|| యమ్‌. జగన్‌మోహన్‌ రెడ్డి, ఎలక్ట్రానిక్‌ వింగ్‌, ఎ.ఆర్‌.ఐ, రాజేంద్రనగర్‌, ఫోన్‌ : 9553153149