మనకు సహజ వనరులు అపారంగా ఉన్నాయి. వీటిని సమర్థవంతంగా వినియోగించుకుంటే పంటల సాగులో అధిక దిగుబడులు సాధించవచ్చు. పెరుగుతున్న జనాభా అవసరాలు తీర్చడానికి అందుబాటులో ఉన్న వనరుల్ని సద్వినియోగం చేసుకుని సగటు దిగుబడులను పెంపొందించుకోవాలి. అలాగే పరిమిత సాగు భూమిలో అంతర పంటల సాగు ద్వారా పంటల ఉత్పత్తుల్ని గణనీయంగా పెంచుకోవాల్సిన అవసరముంది. అందువల్ల అంతర పంటల ప్రయోజనాలు, ఆవశ్యకతను తెలుసుకుందాం...

సాధారణంగా రైతులు ఒక పంటను ఒకకాలంలో సాగుచేస్తూ ఉంటారు. అతివృష్టి, అనావృష్టి, చీడ, పీడల బెడద వల్ల ఆ పంట నష్టపోతే రైతు జీవనభృతిని నష్టపోతాడు. మన రాష్ట్రంలో చాలా ప్రాంతాలలో 750 మి.మీ నుండి 1100 మి.మీ వర్షపాతం కురుస్తుంది. సరైన అవగాహనతో, నేర్పుతో రెండు లేదా మూడు పంటలను ఒకేసారి సఫలీకృతంగా సాగు చేయవచ్చు. రెండు కాని అంతకంటే ఎక్కువ పంటలను ఒక నిర్దిష్టమైన నిష్పత్తిలో సాగుచేస్తే వాటిని అంతర పంటలు అంటాం. ఏ నిష్పత్తిలో లేదా క్రమం పాటించకుండా రెండు, మూడు పంటలను వెదజల్లి సాగుచేస్తే మిశ్రమ పంట అంటాం. ఆ అంతర పంటల క్రమంలో ఒకటి ప్రధాన పంట, రెండవది అంతరపంట.

అంతర పంట సాగులో ప్రయోజనాలు :

రైతు తన పొలం నుండి ఒకేసారి ఎక్కువ దిగుబడి పొందవచ్చు.

ఒక పంట నష్టపోతే రెండవ పంట నుండి రాబడి సంపాదించి నష్టాన్ని భర్తీ చేయవచ్చు.

సహజ వనరులైన నేల, నీరు, సూర్యరశ్మిని, పంటల మధ్యనున్న ప్రదేశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

పోషక పదార్ధాల వినియోగం.

కలుపు మొక్కలు రాకుండా నివారించవచ్చు.

నేలకోతను అరికట్టవచ్చు.

భూసారాన్ని పెంచవచ్చు (ఉదా: పుష్పజాతి మొక్కలను, గడ్డిజాతి ధాన్యపు మొక్కలతో పెంచడం వల్ల)

పంటల నాణ్యతను పెంచవచ్చు.

సరైన పద్ధతిలో సరైన పంటల్ని ఎన్నుకొని అంతర పంటలుగా పండించడం ద్వారా ప్రధాన పంటపై ఆశించే చీడపీడలను అరికట్టవచ్చు. ఉదా : సోయా చిక్కుడు + ప్రత్తి, కొర్ర + పత్తి.

ఎలాంటి పంటలను అంతర పంటలుగా ఎన్నుకోవాలి?

ఒక పంట మరో పంట దిగుబడిని పెంపొందించే విధంగా ఉండాలి కానీ తగ్గించే విధంగా ఉండకూడదు. పోషక పదార్ధాలు, నీరు, వెలుతురు విషయంలో పంటల మధ్య పోటీ ఉండకూడదు.

నేల నుండి పోషక పదార్ధాలు నీరు గ్రహించే లోతులో వ్యత్యాసం ఉండే వేళ్ళ నిర్మాణం కలిగిన పంటలను ఎన్నుకోవాలి.

వేర్వేరు కాల పరిమితులలో ఉన్న పంటలను, పుష్పజాతి పంటలను కలపడం వల్ల పోషక పదార్ధాల ఆవశ్యకతలో తేడావల్ల కీలకదశల్లో పోటీ ఉండకుండా ఆరోగ్యంగా పెరుగుతాయి. ఉదా : కంది + మొక్కజొన్న

ఒక పంటను రెండవ పంట పెరగడానికి ఆధారంగా పెంచవచ్చు.

బహుళ వార్షిక పంటలైన ఉద్యానవన పంటల మధ్య ప్రదేశాల్లో నాలుగైదేళ్ళ వరకు అంతర ప్రదేశాల్లో పంటలు పండించవచ్చు.

పంటల పెరుగుదలకు సంబంధించి పొడవు, పొట్టి వ్యత్యాసాలను బట్టి, రెండు కంటే ఎక్కువ పంటలను వివిధ అంతస్తులలో పండించవచ్చు. ఉదా :కోకో + కొబ్బరి + మిరియాలు + అనాస

ఒక పంటపై ఆశ్రయించే పురుగుల నిర్మూలనకు మరో పంటపై ఆ పురుగులను తినే సహజ శత్రువులను పెంపొందించడానికి కూడా అంతర పంటలను పెంచవచ్చు. ఉదా : పత్తి + మినుము / పెసర / కొర్ర / సోయాచిక్కుడు.

ప్రధాన పంటలను ఆశించే పురుగులను అంతర పంటపై ఆకర్షించి చీడ, పీడల బారి నుండి ప్రధాన పంటను రక్షించవచ్చు. ఉదా : బంతిని పత్తిలో కలపడం వల్ల బంతిపై శెనగపచ్చ పురుగు గ్రుడ్లు పెడుతుంది. జాగ్రత్తగా గమనించి నిర్మూలించవచ్చు. అదే విధంగా ఆముదాన్ని లద్దె పురుగు నిర్మూలించేందుకు ఎర పంటగా వినియోగించవచ్చు.

అంతర పంటగా కంది :

మెట్ట సేద్యంలో మొదటి పంటగా వేరుశనగ, జొన్న, సజ్జ, మొక్కజొన్న, వరి, పెసర, మినుము మొదలైన పంటలు పండిస్తుంటారు. ఈ పంటల తరువాత సాధారణంగా భూమిని ఖాళీగా ఉంచడం లేదా ఆర్థికంగా, ప్రయోజనంగా లేని ఉలవను వేస్తూ ఉంటారు. దీనికి బదులు మొదటి పంటతోపాటు కందిని అంతర పంటగా పండించుకోవచ్చు.

కంది పంట ప్రయోజనాలు :

కంది వేర్లు లోతుగాపోయి భూమి లోపలి పొర నుండి పోషక పదార్ధాలను తీసుకుంటుంది.

కందివేర్ల నుండి వచ్చిన పిసిడికి ఆమ్లం భూమిలో ఉన్న కరగని భాస్వరాన్ని కరిగించి మొక్కలకు అందిస్తుంది.

కంది నుండి రాలిన ఆకులు కుళ్ళి సేంద్రియ ఎరువుగా మారి, భూసారం పెరుగుతుంది.

కంది లెగ్యూమ్‌ జాతికి చెందిన పంట కావడం వల్ల వాతావరణం లోని నత్రజనిని స్థిరీకరించి భూసారాన్ని పెంచుతుంది.

అన్నింటికంటే ముఖ్యమైన లక్షణం కంది పెరుగుదల క్రమం. కంది దీర్ఘకాలిక పంట (5-6 నెలలు). కంది మొదటి రెండు నుండి మూడు నెలల పెరుగుదల చాలా నెమ్మదిగా ఉంటుంది. అందుచేత ప్రధాన పంట పెరుగుదలపై నీడవల్ల గానీ, పోషక పదార్ధాల ఆవశ్యకతపై గానీ ప్రభావం చూపించదు. ప్రధాన పంటను కోసిన తరువాత అంతర పంట అయిన కంది ప్రధాన పంటగా మారి పెరుగుతుంది.

మెట్ట వ్యవసాయంలో రెండవ పంట ఏ పంట పండించాలన్నా సమస్య తీరుతుంది.

సరైన సస్య రక్షణ చర్యలు పాటిస్తే ఎకరానికి 5-6 క్వింటాళ్ళు పండించవచ్చు. పప్పుదినుసుల కొరత తగ్గించడంలో తోడ్పడవచ్చు.

అంతరపంటల సేద్యంపై ప్రభావం చూపే అంశాలు :

1. నేల స్థితి :

నేల భౌతికస్థితి / తేలిక / మధ్యస్థ / బరువు నేలలు, నీటి పారుదల వసతి, పోషక పదార్ధాలను, నీటిని నిల్వ ఉంచుకునే శక్తి, నేల లోతు, రసాయన స్థితి (కారుచౌడు, ఆమ్ల సమస్యలు) బట్టి ఏ పంటలను ఎన్నుకోవాలో తెలుస్తుంది. భూసార పరిక్ష తప్పక చేయించుకోవాలి.

2. వాతావరణం :

వాతావరణంలో అంతరపంటల సేద్యంపై ప్రభావం చూపేది వర్షపాతం. ఎంత వర్షం కురిసేది, ఏ క్రమంలో కురిసేది కూడా ముఖ్యమైన అంశాలే. వర్షపాతాన్ని బట్టి కీలక దశల్లో పంటలు నీటి ఎద్దడికి గురికాకుండా ప్రణాళికాబద్ధంగా పండించుకోవాలి.

3. చీడ పీడల తాకిడి :

ప్రధాన పంట, అంతర పంటలపై ఒకే రకమైన పురుగులు ఆశిస్తే రెండు పంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. చీడ పీడల తాకిడి, క్రమం, దృష్టిలో పెట్టుకుని అంతర పంటలను ఎన్నుకోవాలి.

4. అంతర పంటల ఉద్దేశం :

సరైన యాజమాన్య పద్ధతులు పాటించి ప్రధాన పంటలోను, అంతర పంటలో కూడా దిగుబడి తగ్గకుండా లబ్ది పొందవచ్చు. ఒక్కొక్కసారి ఒక నిర్ధిష్టమైన ఉద్దేశ్యంతో అంతర పంటను పండించడం జరుగుతుంది. ఉదా : పత్తిలో మినుము / పెసర / కొర్ర / సోయా చిక్కుడు లాంటి పంటలను అంతర పంటలుగా పండిస్తే ప్రత్తి పంటపై ఆశించి రసం పీల్చే పురగులు తినడానికి ఉపయోగపడే అక్షింతల పురుగులు, సాలీళ్ళు వృద్ధి చెందుతాయి.

భూసారాన్ని పెంచడానికి పచ్చిరొట్ట పంటలను, పండ్లజాతి వృక్షాల మధ్య పెంచడం గమనిస్తూ ఉంటాం.

నేల కోతను అదుపు చెయ్యడానికి దగ్గరగా, ఒత్తుగా పెరిగే పంటలను గడ్డిజాతి పంటతోబాటు పండించాలి.

ఉద్యానపంటల్లో మొదటి నాలుగేళ్ళ మధ్య అంతర విస్తీర్ణం చాలా ఎక్కువ. ఆ ప్రాంతాన్ని సద్వినియోగం చెయ్యడానికి ఉద్యాన పంటపై పెట్టుబడిలో కొంత రాబడి సాధించడానికి అంతర పంటలు పండించవచ్చు.

ప్రధాన పంటలో దిగుబడి తగ్గకుండా చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు :

సేంద్రియ ఎరువు వీలైనంత ఎక్కువగా వినియోగించి భూమి, భౌతిక, రసాయనిక స్థితిని సంరక్షించాలి.

నిర్ణయించిన మోతాదులో ప్రధాన పంట, అంతర పంట విత్తనాన్ని నిర్దేశించిన నిష్పత్తిలో, వరుసల్లో నాటాలి.

పంటల పోషక పదార్ధాల ఆవశ్యకతను బట్టి ఎరువుల మోతాదులను నిర్ణయించాలి. పోషక పదార్ధాలు ఎప్పుడు ఎంత మోతాదులో వేయాలో తెలుసుకుని ఉండాలి.

నీటి వసతి ఉన్నప్పుడు పంటల కీలక దశల్లో తప్పక నీరు అందించాలి.