సంపాదకీయం

ఉద్యాన వనం... అభివృద్ధి ఉద్యమం

ప్రపంచమంతా ఆహార భద్రతకై అర్రులు చాస్తున్న రోజులివి. 2050 నాటికి ప్రపంచ జనాభా 600 కోట్లకు,భారత జనాభా 150 కోట్ల మందికి పైగా చేరుకోనున్నది. ఇటు చూస్తే ప్రకృతి వనరులు తరిగిపోతున్నాయి. మానవ తప్పిదాలతో పరమ పూజనీయమైన ప్రకృతి ప్రకోపించి విలయాలకు దారితీస్తుంది. మానవ జాతిపై పగబట్టి ప్రతీకారం తీర్చుకుంటున్నట్లు కనిపిస్తుంది. పైరు పచ్చని దేవుని భూమిగా పరిగణించబడే మన కేరళ రాష్ట్రంలో కని,వినీ ఎరుగని జల విలయం కన్నీటి సంద్రాన్ని తలపిస్తుంది. పర్యావరణ శాస్త్రవేత్తలు,భూమాతకు పచ్చని రంగులద్దే హరిత సైనికులు ఎంత మొత్తుకున్నా,ఆవేదన పడినా వినిపించుకోని మానవ సమాజం ఇకనైనా కళ్ళు తెరవక తప్పదు. నిత్యం ఆకుపచ్చ నీలి,తెల్ల విప్లవాలతో కళకళలాడే ఆ దేవ భూమికే అంత గతిపడితే ఎడారులు,కొండలు,తొండలు కూడా ప్రవేశించని కఠిన శిలావృతాలుగా ఉన్న భూమికి దిక్కేమిటి. ఈ విలయాలను మనం ఎదుర్కోలేమా? పరిష్కారాలు లేవా? ఒక వైపు దారుణమైన కరువు పరిస్థితులు,మరో వైపు అతి భయంకరమైన వర్షాలు,వరదలు,భూ ప్రకంపనాలు,సునామీలు,తుఫాన్లు,తైఫూన్లు ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న నేపద్యంలో మానవుడు తాను నివశించే ప్రకృతిని నందనవనం చేసుకోవడం తప్ప మరో మార్గం కనిపించడంలేదు. ఆ సేతు హిమాచలమే కాదు..ప్రపంచం మొత్తం ప్రకృతి విషవలయంలో చిక్కుకున్న నేపధ్యంలో పచ్చని వనాలు,ఎడారులను సైతం సస్యశ్యామలం చేయగలిగిన ఆవిష్కరణలు నేటి అవసరం.గత 10 ఏళ్ళుగా రాజస్థాన్‌లోని థార్‌ ఎడారిలో భూగర్భజలాలను ఒడిసిపట్టి,చుక్క చుక్కను ఒక మొక్క పెంచేందుకు చేస్తున్న అవిశ్రాంత పోరాటం ఆకుపచ్చని విప్లవానికి బాటలు వేస్తున్న వైనం కనిపిస్తుంది. ఇంతకాలం కేవలం కలపను మాత్రం ప్రసాదించే భారీవృక్ష అడవుల్లో అతి ప్రకృతి సహజంగా పండ్ల తోటల పెంపకం,బహువార్షిక పంటల ప్రయోగాలు విజయవంతం చేసుకొనే ప్రక్రియకు ఇంకా పదునుపెట్టాలి.

కాల గమనంలో అనేక పద్ధతుల్లో మానవుడు తనకు తాను నాశనం చేసుకుంటూపోతున్న స్వయం తప్పిదాలను సరిచేసుకొని ఇక ప్రకృతి మాత ఆశీస్సులను పొందేందుకు ఇప్పుడు నడుంకట్టకపోతే ఇక మానవ మనుగడ ప్రశ్నార్ధకమైపోయే రోజులు దగ్గరికి వచ్చాయి. అదేదో ప్రళయం వస్తుందని పురాణాలు వల్లె వేసుకుంటున్న మనం ఇప్పుడు క్యుములోనింబస్‌ మేఘాలతో క్షణాల్లోనే కురిసే లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహాన్ని ఏ వాగులూ,ఏ నదులూ సరిపోక మానవ ఆవాసాలపైనా,పశుగణంపైనా ప్రకోపాన్ని వ్యక్తం చేస్తే శవాల గుట్టలు,పశుకళేబరాల దుర్ఘందాలతో సుక్షేత్రమైన పంట పొలాల్లో ఇసుకమేట వేసి దిబ్బలైపోతే...ఇన్నేళ్ళ ప్రగతి,మానవ వికాసం కాలగర్భంలో కలసిపోతే ఇక ఎక్కడి మనుగడ? అని అందరూ ప్రశ్నించుకునే సమయం ఆసన్నమైంది. నదీ తీరాల్లో ఆవాసాల కొరకు,రవాణా పేరుతో విమానాశ్రయాలు,వందల ఎకరాల్లో బస్టాండ్లు,రైలు మార్గాలు,విద్యుత్‌,తింతితపాల,క్షణాల్లో ప్రపంచాన్ని చుట్టివచ్చే మొబైల్‌ సౌకర్యాల కొరకు ప్రమాదకరమైన రేడియేషన్‌తో కూడిన టవర్ల ఏర్పాటు కొరకు వేలాది ఎకరాల భూమిని సేకరిస్తున్నారు. విద్యాలయాలు. సాఫ్ట్‌వేర్‌ కంపెనీల పేర్లతో,ఉపాది సాకుతో సారవంతమైన భూములను కొత్తరకం భూస్వాములకు దారాదత్తం చేస్తున్నాము. ఈ పద్ధతి జోరును తగ్గించుకొని భూమిపై వ్యవసాయం చేసుకుంటూ,ఉపాది పొందుతూ,ఆహార భద్రతకు రక్షగా నిలబడుతున్న రైతులు,రైతు కూలీల హితం కోరి పాలకులు తమ విధానాలను మార్చుకోవాలి. ఊరు,వాడ,పచ్చని సిరులతో,పంట పొలాలతో,ఉద్యానశోభతో కళకళలాడే జీవసమాజాన్ని,జీవ వైవిద్య పరిరక్షణ దక్షకులుగా నిరూపించుకొని మనకు మనం కాపాడుకోవాలి. అందుకోసం అందరం ఉద్యానబాటపడదాం..మెరుగైన సమాజం కొరకు ఆకుపచ్చ విప్లవ సైనికులుగా ఉద్యమిద్దాం..రండి! కదలిరండి!!