సంపాదకీయం

మిరప రైతు మొరవిందాం!

అసలు ప్రాధమికంగా రైతు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వాలు పూర్తిస్థాయిలో దృష్టిసారించకపోవడంతో ఏర్పడుతున్న అనర్థాలు ఎంతో పెట్టుబడి పెట్టి, శ్రమకోర్చి పండిన పంట దళారుల పాలు కావడం తప్ప రైతులకు ఒరిగిందేమీ లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గిరాకీ దృష్ట్యా, ఒక సీజను కాకపోతే మరో సీజన్‌లో కలసిరాకపోతుందా అనే ఆశతో ఎప్పటికప్పుడు ఎదురుదెబ్బలు తిన్న రైతు మిరప సాగుపై వ్యామోహాన్ని వదులుకోవడం లేదు. మిరప పంటను పండించే గ్రామాల పరిస్థితిని చూస్తే నిత్యం కలుపుతో పోరాటం, పురుగులు, తెగుళ్ళతో పడుతున్న ఆరాటం అంతా ఇంతా కాదు. జోరీగలాగా రొద చేస్తూ, పవర్‌ స్త్రేయర్ల ద్వారా విష పదార్థాలను పురుగులపై ప్రయోగించే నెపంతో అవశేషాలను ప్రతిఫలింపచేసి అటు వినియోగదారునికి విషాన్ని పంచుతూ ఇటు రైతుకు విషాదాన్ని నింపుతున్న మిరప పంట కధ అనంతమైనది. ఆవేదన అంతం కానిది. ఇటీవల అఖిల భారత వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘం దీనిపై పెద్ద ఎత్తున ఆందోళనను నిర్వహించి హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో సమావేశం ఏర్పాటును తన గోడును సమాజానికి వినిపించడానికి చేసిన ప్రయత్నం సత్ఫలితాలను ఇవ్వలేదు. తెలంగాణలోని ఖమ్మం, వరంగల్‌లోని ఎనుమాముల మార్కెట్‌లో గత సీజన్‌లో రైతులు చేసిన ఆందోళనలు, తత్ఫలితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మార్కెటింగ్‌ శాఖా మంత్రి హరీష్‌రావు చొరవతో క్వింటాలుకు రూ. 1500/- మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం ప్రకటించి రైతులకు న్యాయం చేయాలని భావించినా మార్కెట్‌లలో దళారీల పలుకుబడి ముందు ఆ మొత్తాలు రైతుల చేతికి అందకపోవడం, ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్లు మనకు పరిస్థితి అర్థమవుతుంది.

ప్రపంచ వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్య రాజధాని గుంటూరు మిరప మార్కెట్‌లో కూడా ఇదే పరిస్థితి నెలకొన్నా, అక్కడి మార్కెట్‌ యాజమాన్యం చొరవతో ముఖ్యంగా గాప్‌ ఉత్తమ వ్యవసాయ పద్ధతుల అనుసరణీయ విధానం కొంత వరకు రైతులకు లాభించడం గమనార్హం. అసలు విషయానికి వస్తే ఒక వంక పెట్టుబడి ఖర్చులు పెరిగిపోవడం, మరో పక్క ప్రకృతి వైపరిత్యాలు, ఇంకో పక్క వాతావరణ సమతుల్యత లోపించి పురుగులు, తెగుళ్ల దాడులతో దిగుబడి తగ్గిపోయి రైతులు కుదేలవ్వడం, తెచ్చిన పెట్టుబడికి వడ్డీలు సైతం చెల్లించలేక ఆత్మాహుతులు చేసుకోవడం మానవ సమాజానికి పెనుసవాలుగా, మానవత్వానికి మచ్చగా మిగిలిపోతుంది. మిరపలో నూతన నీటి యాజమాన్య పద్ధతులు, ముఖ్యంగా ప్లాస్టిక్‌ మల్చింగ్‌ వినియోగం దాదాపు ఇప్పుడు అన్ని జిల్లాల్లో అందుబాటులోకి వచ్చింది. దానివల్ల అన్ని కాలాల్లోనూ ముఖ్యంగా ఉష్ణోగ్రత అతి తక్కువగా ఉండే శీతల ప్రాంతాలైన ఉత్తర తెలంగాణ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో సాగు చేయడానికి, దానితోపాటుగా వ్యాధుల బారి నుండి పంటను రక్షించుకోవడానికి, తక్కువ నీటితో, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫల సాయం సాధించుకోవడానికి అవకాశం ఏర్పడింది. ఏదో రకంగా ఉత్పత్తి సాధనలో ముందుకుపోతూ ఉన్నా, రసాయన అవశేషాల నుండి పంటను కాపాడుకున్నా, ఎక్కువ ఉపాధినిచ్చే ఈ పంట మనుగడను చిరకాలం కొనసాగించడానికి రైతులు సమిష్టి వ్యవసాయం చేయడం, మ్యాక్స్‌ సొసైటీలు, వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పాటు ద్వారా ధరలపై సాధికారతను సాధించే అవకాశం ఉంది. దానికితోడు ప్రతి రాజకీయ పార్టీ ఎన్నికల్లో చేస్తున్న వాగ్ధానాల మేరకు ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి ఆపదసమయంలో రైతులను ఆదుకోవాలి...