సంపాదకీయం

పంట సాయం సరే... ప్రణాళికలేమంటాయి

భూమి గుండ్రంగా ఉంటుందనే వాస్తవాన్ని ఎవరైనా గ్రహించక తప్పదు. అతి అవసరమైన, అతి పురాతనమైన ఉత్పత్తి ప్రక్రియ, ప్రపంచ ఉనికికి, మానవాళి మనుగడకి ప్రధానమైన వ్యవసాయ వృత్తి మళ్ళీ అందరి దృష్టినీ ఆకర్షించడం ప్రారంభమైంది. లాభాపేక్ష లేకుండా, తనంటూ స్వార్ధం లేకుండా సకల చరాచర జీవజాలానికి ఆహారం అందిస్తున్న అన్నదాత వైపు ఇప్పుడు ఎవరైనా తిరిగి చూడాల్సిందే. ఎవరు కాదన్నా ఏ సహకారం లేకున్నా రేయింబవళ్ళు కష్టపడి తిండి సంపాదించిపెట్టే రైతన్నకు ఉందిలే మంచి కాలమంటూ ఊరింపులు ప్రారంభమైనాయి. రైతు బంధువని ఒకళ్ళు, పంట సాయమని మరొకళ్ళు, వేరు వేరుగా ఏ పేరు పెట్టుకున్నా రైతు సాధికారతకు జీ హుజూర్‌ అనక తప్పని సరి పరిస్థితుల్లో అన్ని పార్టీల్లోని ఏలిన వారు, ఏలడానికి ముందుకు వచ్చే వాళ్ళు తప్పనిసరిగా రైతు ఖాతాల్లోకి నగదు బదిలీ చేసే ప్రక్రియ ప్రారంభమైంది. ఒక విధంగా ఇది రైతు విజయమే. స్వాతంత్య్రానంతరం సస్య విప్లవానికి శ్రీకారం చుట్టి దేశ ఆహార భద్రతతో పాటు, శాంతి భద్రతల పరిరక్షణకు అండగా నిలిచిన రైతన్న మళ్ళీ తన తిరుగులేని ప్రభావాన్ని 20 ఏళ్ళ అనంతరం చూపెడుతున్నాడు. ఇది సంతోషదాయక పరిణామమే అయినప్పటికీ మిగిలిన వర్గాల్లాగానే తానూ ఓటు బ్యాంకు రాజకీయాలకు పరిమితం కాకుండా ఇంకా విశాలమైన ప్రయోజనాల కొరకు రైతు తన కర్తవ్యాలను, కార్యదీక్షను సంఘటితంగా అంకితం కావలసిన అవసరం ఎంతైనా ఉంది. అధికారంలోకి రాగానే తర తరాలుగా రైతు సేద్యం చేసుకుంటున్న భూములను ఏదో పప్పుబెల్లాల ఆశలు పెట్టి నయాజమీందారులైన పెట్టుబడి వర్గాలకు, కార్పోరేట్‌ కంపెనీలకు దఖలు పరచే ప్రభుత్వాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. 2013 భూసేకరణ చట్టాన్ని సవరించి ఆశ్రిత పెట్టుబడి దారులకు రైతన్నల భూములను అప్పగించే ప్రయత్నాన్ని భారత ప్రజలు తిప్పికొట్టిన విషయాన్ని రేపటిపాలకులు మరచినా రైతు మరువకూడదు. విమానాశ్రయాలు, రహదారులు, మౌలిక సౌకర్యాలు, విద్యాలయాలు, కార్పోరేట్‌ కంపెనీలకు వేల ఎకరాలను కట్టబెట్టే దుష్పరిపాలనకు కాకుండా భూములను బాధ్యతాయుతంగా అవసరాల మేరకే సేకరించి ఆహార భద్రతను కాపాడే ప్రభుత్వాలకే రైతన్నలు తన ఓటు వేయాలి.

అంతేకాదు తాత్కాలిక ప్రయోజనాలకు స్వస్తి చెప్పి స్వామినాధన్‌ కమీషన్‌ సిఫార్సుల మేరకు రైతుకు అన్ని కాలాల్లో, అనుకూల, ప్రతికూల పరిస్థితుల్లో సైతం ప్రయోజనం కలిగే రైతు హిత కార్యక్రమాలను చేపట్టాలి. 2014 ఎన్నికల్లో ప్రభుత్వాలు చేసిన ప్రమాణాల్లో ముఖ్యమైనది. ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి ప్రకృతి వైపరీత్యాల సమయంలోనూ, డిమోనిటైజేషన్‌ వంటి అనాలోచిత నిర్ణయాల సందర్భంలోనూ ఆదుకునేందుకు ఆ నిధిని వినియోగించడం తప్పనిసరి అవసరం. అంతే కాదు మొదటి సస్య విప్లవం విజయవంతం కావడానికి దోహదపడిన విత్తన సాధికారతను తిరిగి రైతుకు అప్పగించడం, మార్కెట్‌ దళారీ వ్యవస్థను రద్దు చేసి తాను పండించిన పంటకు అందరి ఉత్పత్తి దారుల్లాగానే తన ధరను తానే నిర్ణయించుకునే అవకాశాన్ని రైతులకు కల్పించడం అత్యవసరం. నీటి పారుదల రంగంలో నదుల అనుసంధానానికి కృషి చేస్తూనే మధ్య, చిన్న తరహా నీటి వనరుల అభివృద్ధికి ప్రత్యేక కృషి జరగాలి. దానితో పాటు భూమితో పనిలేని వ్యవసాయం, ప్రతి బిందువును సేద్యపు బంధువుగా తయారు చేసే సూక్ష్మ సేద్య వ్యవస్థను మరింత పటిష్టం చేసి, కరువు సీమలను ఆకుపచ్చ అందాలతో తీర్చిదిద్దాలి. ఆ మాటకొస్తే 70 ఏళ్ళ స్వాతంత్య్ర అనంతరం కూడా వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్‌ను కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టలేదు. ఈ ప్రాధాన్యతా రంగానికి అత్యంత శోభ చేకూర్చే జాతీయ వ్యవసాయ విధానం రూపకల్పన జరుగలేదు. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని పలుకుతున్న ప్రగల్భాలు మీడియా వరకే వినిపిస్తున్నాయి. ఆచరణసాధ్యమైన అందరికీ అనుకూలమైన నిర్ణయాలు తీసుకొని రైతుకు సాంఘిక, ఆర్థిక, సామాజిక భద్రతను పెంపొందించే పథకాలను రూపొందించి, రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల అనుసరణలో రైతుల ప్రాతిపదికను చొప్పించి రైతులను, రైతు కూలీలను కూడా సామాజిక న్యాయబాధ్యతలోకి చేర్పించాలి.