సంపాదకీయం

ఈ ఏడూ సాగుకు ఎదురీతేనా?

దేశంలోనూ, ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ రైతులు ఆరుద్ర కార్తె ప్రవేశించిన సందర్భంలో కూడా ఇంకా వాన జల్లులకై ఎదురు చూస్తున్నాడు. తీవ్ర వేసవి తాపంతో నెర్రలిచ్చిన భూమాత వరుణుని కరుణ కొరకు ఎడతెగని ఎదురుచూపులు చూస్తుంది. ఐదు కార్తెలు ముగిసిపోయి ఆరవ కార్తె ప్రవేశించినప్పటికీ ఎక్కడా వర్షాల జాడ కనపడడం లేదు. ఖరీఫ్‌ సాగు ఊపందుకోవడం అటుంచి అసలు ప్రారంభమే కాలేదు. చెరువులు, బోర్లలో నీటి మట్టాలు అట్టడుగుకు వెళ్ళిపోయాయి. జూన్‌ రెండవ వారంలో అక్కడక్కడా జల్లులు కురిసినా భారీ వర్షాలకు రైతులు నోచుకోలేదు. దానికి తోడు పూర్తి బకాయిలు చెల్లిస్తేనే కొత్త పంట రుణాలు అందిస్తామని బ్యాంకర్లు తెగేసి చెబుతున్నారు. పలుచోట్ల మాఫీ ఆశతో బకాయి కట్టేందుకు రైతులు ముందుకు రావడం లేదు. రోహిణి, మృగశిర కార్తెల్లో చినుకు జాడ లేక నిరాశే మిగిలింది. ఆరు కార్తెలు పోతే ఆరుద్రే దిక్కు అనుకొని రైతులు భారీ వర్షాల కోసం నోరు తెరచి ఆకాశం వంక ఆశగా చూస్తున్నారు. ఈ ఆఖరు కార్తెలో నారు పోయకుంటే ఇక ఈ సీజన్‌లో పంట దిగుబడి పడిపోతుందని ఆందోళన చెందుతున్న నేపధ్యంలో అడపాదడపా కొన్ని చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. జూన్‌ తరువాత విత్తనాలు వేసినా పంటలకు తెగుళ్ళు, పురుగుల బెడదలతో దిగుబడి ప్రయోజనం చేకూరదని సర్వత్రా రైతాంగం ఆందోళన చెందుతుంది. వాస్తవానికి గత కొన్నేళ్ళుగా అపసవ్యంగా ఉన్న వాతావరణ స్థితిగతులు పంటలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుండడంతో వ్యవసాయం సంక్షోభ స్థితిని అధిగమించ లేకపోతుంది. ప్రపంచ వ్యాప్తంగా వాతావరణంలో అసాధారణ పరిస్థితులు ఏర్పడడం, అతివృష్టి, అనావృష్టి దిగుబడులపై ప్రభావాన్ని చూపించడం మనం చూస్తూనే ఉన్నాం. ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా జిల్లాలు గత సంవత్సరం రెండు సార్లు పెనుతుఫాన్ల భీభత్సానికి నష్టపోవడం, రైతుల పంట పొలాలు, ఆస్తులు నష్టానికి గురికావడం మనం చూసాము.

ఈ సందర్భంలోనే మానవ తప్పిదం లేకుండా, ప్రాణ నష్టాన్ని నివారించినా పంటలను మాత్రం కాపాడుకోలేక పోవడం దురదృష్టకరం. ముఖ్యంగా రెండుసార్లు ఉత్తరాంద్రపైనే ప్రకృతి ప్రకోపించడం, సముద్రుని కన్నెర్రకు ఉద్దానం ప్రాంతంలో విలువైన కొబ్బరి, జీడిమామిడి, వరి ఇతర ఆహార వాణిజ్య పంటలకు నష్టం జరగడం తెలిసిందే. రాయలసీమ, ఇతర మెట్ట ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు రైతులను తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేశాయి. తెలంగాణ ప్రాంతంలో గత దశాబ్ద కాలంగా వానదేవుడు కరుణించక పోవడంతో రైతులు దీనావస్థలు చెప్పనలవికానివి. సాగు నీటి సమస్యతోపాటు తాగునీటి సమస్య కూడా జోడై ప్రజల హాహాకారాలు మిన్నంటుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రద్రేశ్‌లో కుప్పం నుండి ఇచ్ఛాపురం వరకు ఎక్కడా భూగర్భ జలమట్టాలు తగినంతగా లేకపోవడం కొన్ని ప్రాంతాల్లో కలుషిత జలాలతో కిడ్నీ వ్యాధులు, ఫ్లోరోసిస్‌ వ్యాప్తి చెంది ప్రజలు తీవ్ర కష్ట, నష్టాలకు గురౌతున్నారు. పంట పొలాలను నాశనం చేసుకొని చేపలు, రొయ్యల సాగుకు రైతులు మొగ్గుచూపడంతో ఆహార భద్రతకు ప్రమాదం ఏర్పడడంతో పాటు ఈ కృత్రిమ జలచరాల పెంపకం ద్వారా లాభాలు ఆర్జించాలన్న దురాశ పెరిగి, తాగు, సాగు నీరు, భూగర్భ జలాలు కలుషితం కావడంతో పాటు క్యాన్సర్‌ వంటి భయంకరమైన దీర్ఘ రోగాలు ప్రజలను కష్టాలపాలు చేస్తున్నాయి. సుభిక్షమైన తమిళనాడు- చెన్నై నగరాల్లో త్రాగునీరు లభించక రేషన్‌ విధించడం, మహారాష్ట్రలోని లాటూరు జిల్లా మొత్తం నీటి కటకటతో శాంతి భద్రతల సమస్య ఏర్పడి 144 సెక్షన్‌ విధించడం, పంటల సాగుకు నీరు లభించక పొలాలు బీడుబారడం వంటి సమస్యలకు తాత్కాలిక దిద్దుబాట్లు కాకుండా శాశ్వత వనరుల ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీర్ఘకాలిక నీటి యాజమాన్య పద్ధతులను రూపొందించడం వంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలి.