ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా రాష్ట్రాల్లో హైబ్రిడ్‌ పుచ్చను చాలామంది రైతులు, ఆధునిక పద్దతుల్లో విస్తారంగా సాగుచేస్తున్నారు. ఎక్కువగా హైబ్రిడ్‌ రకాలు సాగులో ఉన్నాయి. మాములుగా నవంబర్‌, డిసెంబర్‌ మాసాల్లో పుచ్చ పంటను సాగు చేసేవారు. అయితే హైబ్రిడ్‌ రకాలు, కొత్త రకం సస్యరక్షణ మందులు వచ్చాక మార్చి నుంచి మేనెల వరకు తప్ప సంవత్సరంలో మిగిలిన కాలమంతా ఈ పంటను హైబ్రిడ్‌ రకాలతో సాగుచేస్తున్నారు. మార్చి నుంచి మే నెలల్లో అధిక ఉష్ణోగ్రతలు, గాలిలో తేమ తక్కువగా ఉన్నందున ఈ పంట సాగుకు అనుకూలం కావు. ఈ శీతోష్ణ పరిస్థితుల్లో వైరస్‌ తెగుళ్ళ ఉధతి ఎక్కువగా ఉండి, కాయల వద్ధి, నాణ్యత తక్కువగా ఉంటుంది.

రకాలు :

పెద్ద సైజు కాయలు :

ఈ రకాల కాయలు 4 కిలోల పైన ఉంటాయి. ఎన్‌.ఎస్‌ -295, అపూర్వ, మధుబాల, మోహిని రకాలున్నాయి. వీటిలో యెన్‌. ఎస్‌-295 రకాన్ని ఎక్కువగా సాగు చేస్తున్నారు.

చిన్న సైజు కాయలు :

ఈ రకం కాయలు 2-4 కిలోల వరకు ఉంటాయి. అరుణ్‌, కిరణ్‌ రకాలున్నాయి. వీటిలో అరుణ్‌ రకాన్ని ఎక్కువగా సాగు చేస్తున్నారు.

పంటకాలం :

75-90 రోజులు. ఎకరాకు 325-350 గ్రా. విత్తనం అవసరం.

పొలం తయారీ :

ఆధునిక పద్ధ్దతిలో ఈ పంట సాగుకు భూమిని తయారు చేయాలి. పొలాన్ని బాగా దుక్కిచేసి 3 అడుగుల వెడల్పుతో ఎత్తు బోదెలు చేయాలి. బోదె మధ్యలో గాడిచేసి ఎకరానికి 5 టన్నుల పశువుల ఎరువు, 200 కిలోల ఆముదం పిండి, 20 కిలోల యూరియా, 150 కిలోల సూపర్‌ ఫాస్ఫేట్‌, 50 కిలోల మ్యురేట్‌ ఆఫ్‌ పొటాష్‌, 20 కిలోల మెగ్నీషియం సల్ఫేట్‌, 10 కిలోల బోరాన్‌ వేసి గాడిని మట్టితో నింపి బోదె పై భాగాన్ని చదును చేయాలి. ఉదజని సూచిక 5.5-6.6 ఉండాలి.

ప్లాస్టిక్‌ ముల్చింగ్‌ :

బోదెల్లో ఎరువులు వేసి గాడిని మట్టితో నింపిన తరువాత ఇన్‌ లైన్‌ డ్రిప్‌ లేటరల్‌ పైపుల్ని బోదెల మధ్యలో ఉంచాలి. ఆ తరువాత 30 మైక్రాన్ల మందం గల ప్లాస్టిక్‌ షీటును ఎత్తు బోదెలపై పరచాలి. రెండు చివరలు బాగా లాగి, ముడతలు లేకుండా చేసి పక్కల చివరలను, షీటు చివర్లకు మట్టిని ఎగదోయాలి. దీని వల్ల ప్లాస్టిక్‌ షీటు గాలికి లేచిపోదు. అయితే ఈ మధ్య కాలంలో బోదెలు చేసేందుకు ప్లాస్టిక్‌ షీటును బోదేలపై పరిచేందుకు ప్రత్యేక యంత్రాన్ని ఉపయోగిస్తున్నారు. ఈ యంత్రాన్ని ట్రాక్టరుకు తగిలించి ప్లాస్టిక్‌ రోల్‌ను పనిముట్లలో పెట్టి ముందుకు పోతుంటే వెనుక భాగంలో బోదెలు చేయడం, ప్లాస్టిక్‌ షీటుబోదెలపై పరచడం, షీట్‌ చివరలకు మట్టి ఎగదోయడం ఒకేసారి జరుగుతుంది. ఈ పరికరమే బోదేల్లోకి సేంద్రియ ఎరువులైన ఆముదం/వేపపిండి పంపడం, లేటరల్‌ పైపును బోదెపైన పరచడం, ప్లాస్టిక్‌ షీట్‌ పైన నిర్ధారించిన దూరంలో రంధ్రాలు చేసేందుకు మార్కింగ్‌ ఇవ్వడం కూడా ఒకేసారి చేస్తుంది. ఈ పనిముట్లకు, ప్లాస్టిక్‌ షీట్లకు ఉద్యానశాఖవారు రాయితీ ఇస్తున్నారు.

60 కిలోల బరువు తూగే ఒక రోల్‌ (బండిల్‌) లో 400 మీటర్లు ప్లాస్టిక్‌ షీటు ఉంటుంది. సుమారు 5.5 రోలు అనగా 2200 మీటర్లు పొడవు ప్లాస్టిక్‌ షీటు ఒక ఎకరానికి సరిపోతుంది. ఒక్కో రోలు రూ. 1500-1700 చొప్పున 5.5 రోలులకు రూ. 8250 నుంచి 9350 వరకు ప్లాస్టిక్‌ మల్చింగ్‌కు ఖర్చవుతుంది. ఈ ప్లాస్టిక్‌ షీటునే జాగ్రత్తగా వాడుకుంటే రెండు తక్కువ కాలపు పంటలకు ఉపయోగపడుతుంది.

విత్తనం నాటే పద్దతి :

బోదేలపై ప్లాస్టిక్‌ షీటును పరచిన తరువాత పుచ్చ పంటకు 1.25 అడుగుల దూరంలో లేటరల్‌ పైపుకు ఇరువైపులా పి.వి.సి పైపు సహాయంతో రంధ్రాలు చేయాలి. లేటరల్‌ పైపుకు ఇరువైపులా కాకుండా త్రిభుజాకరంలో రంధ్రాలు చేయాలి. ఈ రంధ్రాల్లో ఒక్కో విత్తనం నాటాలి. వారానికి విత్తనాలు మొలకెత్తుతాయి. మొలకెత్తని రంధ్రాల్లో మళ్ళీ విత్తుకోవాలి.

పుచ్చ మొలకల్ని ప్రోట్రేలలో షేడ్‌ నెట్ల కింద పెంచి, ప్రధాన పొలంలో బోదేలపై ప్లాస్టిక్‌కు చేసిన గుంతల్లో నాటవచ్చు. దీనివల్ల పొలంలో మొక్కలన్నీ ఒకేసారి బతికి ఒకే స్థాయిలో పెరుగుతాయి. అయితే ఈ పద్ధతిలో ఖర్చు ఎక్కువగా ఉంటుంది.

ఎరువుల యాజమాన్యం :

నాటిన 12 వ రోజు నుంచి 65 రోజుల వరకు, రోజూ ఇన్‌ లైన్‌ డ్రిప్‌ ద్వార నీటిలో కరిగే ఎరువులు, ఫెర్టిగేషన్‌ పట్టికలో చూపిన విధంగా ఇవ్వాలి.

మొక్కల వయసు (రోజులు) నీటిలో కరిగే ఎరువు పేరు ఎకరానికి రోజు ఇవ్వాల్సిన మోతాదు(కి.) ఎన్ని దఫాలు పంటకాలంలో వేయాల్సిన ఎరువులు (కి.)
12- 250 12:61:0 1.5 14 21.5
26-40 19:19:19 1.5 15 22.5
41-50 0:52:34 1.5 10 15
51-65 13:0:45 1.5 15 22.5

గమనిక :

ప్రతి 10 రోజులకు ఒకసారి సుక్ష్మ పోషక పదార్థాల మిశ్రమాన్ని (ఫార్ముల-4) ను డ్రిప్‌ ద్వార ఎకరానికి 1.5 కిలోల చొప్పున పంపాలి.

మొదటిసారి కాయల కొత తరువాత 13:0:45 ను రోజూ ఎకరానికి 1.5 కిలోల చొప్పున వారం రోజులు వదిలితే ఆలస్యంగా ఏర్పడిన చిన్న కాయలు బాగా పెరుగుతాయి.

పుచ్చ, మొక్కలు 2-4 ఆకుల దశలో 1 లీ.నీటికి 2 గ్రా. బోరాన్‌ను కలిపి మొక్కలపై పిచికారి చేస్తే ఆడ పూలు ఎక్కువగా పుట్టి, దిగుబడి పెరుగుతుంది.

నీటి యాజమాన్యం :

విత్తనం నాటిన వెంటనే బోదె పూర్తిగా తడిచేల సుమారు 3 గంటలు డ్రిప్‌ ద్వార నీళ్ళు వదలాలి. మరుసటి రోజు నుంచి, 10 రోజుల వరకు రోజు 30 నిముషాలు డ్రిప్‌ ద్వార నీరు వదలాలి. చలి కాలంలో రెండు రోజులకు ఒకసారి నీరు వదలాలి. విత్తనం నాటిన 10 రోజుల నుంచి ప్రతి 3 రోజులకు 15 నిముషాలు పెంచుతూ నీరు వదలాలి. పూత దశలో తేమ చాల తక్కువగా ఉండాలి కాబట్టి 30 నిముషాలు నీరు వదలాలి. ఈ సమయంలో ఎక్కువ నీరు వదిలితే పుచ్చలో పిందెలు నల్లగా మారి రాలిపోతాయి. కాయలు అరకిలో బరువుకు చేరుకున్నప్పటి నుంచి పరిపక్వ దశకు చేరుకునే వరకు, బోదెలు మాత్రమే తడిచే విధంగా 2 గంటలు నీటిని వదలాలి. కోతకు 7 రోజుల ముందు నుంచి, ప్రతి రోజు, అర గంట తగ్గించాలి. ఇలా చేయకుంటే, పండ్లలో, పగుళ్ళు రావడం, మెత్తబడి తీపి తగ్గిపోతుంది. ఈ సమస్య దోసలో ఎక్కువగా ఉంటుంది.

సస్య రక్షణ :

పుచ్చలో చీడ పీడల సమస్య ఎక్కువే. తోటలో నిత్యం పరిశీలిస్తూ సోకిన పురుగు తెగులను బట్టి మందులు చల్లాలి. ఒకే సారి ఒకే మందు వాడకుండా మర్చి, మర్చి వాడాలి.

పురుగులు :

పెంకుపురుగులు :

మొలకెత్తిన 3 వారల వరకు వీటి తాకిడి ఎక్కువ. నివారణకు 1 లీ. నీటికి 2 మి .లీ. ప్రోఫెనోఫాస్‌ కలిపి పిచికారి చేయాలి.

పాము పొడ :

సన్న పురుగులు ఆకుల్లోకి తొలుచుకొని పోయి లోపల కణజాలాన్ని తిన్నప్పుడు వంకర టింకర చారలు ఆకు పైభాగాన ఏర్పడతాయి. నివారణకు 2 మి.లీ. ట్రైజోఫాస్‌ లేదా 0.4 మి.లీ. స్పైనోసాడ్‌ 1 లీ. నీటికి కలిపి పిచికారి చేయాలి.

ఎర్ర నల్లి :

ఆకుల అడుగు భాగాన చేరి రసం పీల్చడం వల్ల ఆకులు మడతపడి పసుపు రంగుకు మారి ఎండుతాయి. పొడి వాతావరణంలో వీటి తీవ్రత ఎక్కువ. నివారణకు 1 లీ. నీటికి 2 మి.లీ. ఇథియాన్‌ లేదా ప్రోపార్గైట్‌ లేదా 5 మి.లీ. డైకోఫల్‌ కలిపి పిచికారి చేయాలి.

లద్దె పురుగులు, పచ్చ పురుగులు :

ఇవి ఆకుల్ని నష్ట పరుస్తాయి. పిందెలను, కాయలను ఆశించి, తోలుపై మచ్చలను గారను లోతు తక్కువగా ఉండే గుంతల్ని చేస్తాయి. ఈ కాయలు రవాణాకు తట్టుకోలేవు నిల్వ శక్తి తగ్గుతుంది. కాయలు దూర ప్రాంతం రవాణాకు పనికి రావు. నివారణకు, కోరాజిన్‌ 0.5 మి.లీ. లేదా ఇమామెక్టిన్‌ బెంజోఏట్‌ 0.5 గ్రా. లేదా 0.4 మి.లీ. స్పైనోసాడ్‌ను 1 లీ. నీటిలో కలిపి పిచికారి చేయాలి.

పండు ఈగ :

గుడ్ల నుంచి వెలువడిన సన్నని పిల్ల పురుగులు కాయల్లోకి రంధ్రాలు చేసుకుని లోపలికిపోయి కండను తింటాయి. ఫలితంగా కాయలోని కండ కుళ్ళుతుంది. నివారణకు క్యులూర్‌ ఎరతో తయారు చేసిన బోనులను ఎకరానికి 10 చొప్పున పొలంలో 2 అడుగుల ఎత్తులో కర్ర సహాయంతో కట్టాలి. ఈ ఎరకు మగ ఈగలు ఆకర్షించబడి బోను లోపలికి పోయి పురుగు మందు ప్రభావానికి చనిపోతాయి. బోనులోని క్యులూర్‌ ఎర కలిగిన కార్డు బోర్డు ముక్క పై 6-7 చుక్కల నువాన్‌ పురుగుల మందును వేయాలి. మళ్ళీ వారం తరువాత ఈ మందునే వదలాలి. ఈ ఎరను 4 వారాల తరువాత అవసరమైతే మార్చాలి.

రసం పీల్చే పురుగులు :

తామర పురుగులు, పేనుబంక, తెల్లదోమలు, దీపపు పురుగులు మొక్కల భాగాల నుంచి ముఖ్యంగా ఆకుల నుంచి రసాన్ని పీల్చి బాగా నష్టపరుస్తాయి. తామర పురుగులు మొవ్వుకుళ్ళును, పేనుబంక మొజాయిక్‌ వైరస్‌ తెగుళ్ళను వ్యాప్తి చేస్తాయి. వీటి నివారణకు పలు రకాల మందులను పిచికారి చేసి వైరస్‌ తెగుళ్ళ వ్యాప్తిని, రసం పీల్చడం వల్ల కలిగే నష్టాలను నివారించాలి.

నివారణ :

పుచ్చ నాటే ముందు పొలం చుట్టూ సజ్జ, మొక్కజొన్న, జొన్న లాంటి వాటిని దగ్గరగా నాటాలి.

పొలంలో మొలకెత్తిన పది రోజులకు ఎకరానికి 30 చొప్పున జిగురు పట్టించిన పసుపు రంగు అట్టలను లేదా రేకులను పంటకు అడుగు ఎత్తులో కర్రకు దారంతో బిగించాలి.

ఒక లీటరు నీటికి 2 మి.లీ. డైమిథోయేట్‌ లేదా ఫిప్రోనిల్‌ లేదా మిథైల్‌ డెమెటాన్‌ లేదా 0.4 గ్రా. అసిటామిఫ్రిడ్‌ లేదా 0.5 మి.లీ. ఇమిడాక్లోప్రిడ్‌ లేదా 1.5 గ్రా. పెగాసిస్‌ లేదా 2 మి.లీ. మితాక్సిఫేనోజైడ్‌ (ఇంట్రాప్రిడ్‌) కలిపి మందులు మార్చుతూ పిచికారి చేయాలి.

శిలీంద్ర రోగాలు :

బూజుతెగులు :

ఆకులకింది భాగాన శిలీంద్రం సోకినందున ఆకుల పైభాగాన పసుపు మచ్చలు ఏర్పడుతాయి. చివరగా ఆకులు పండుబారి ఎండుతాయి. ఇది చాల తొందరగా పొలంలో వ్యాప్తి చెందుతుంది. నివారణకు లీటరు నీటికి 1 గ్రా. రిడోమిల్‌ ఎం.జడ్‌ లేదా 2.5 గ్రా. మాంకోజెబ్‌ లేదా 1 గ్రా. డైమితోమార్ఫ్‌ (అక్రోబాట్‌) లేదా ట్రెబుకోనజోల్‌ + ట్రైఫ్లాక్సి స్ట్రోబులిన్‌ (నేటివో) కలిపి పిచికారి చేయాలి.

బూడిద తెగులు :

ఆకులు, తొడిమలు, తీగలు, కాయలపై తెల్లని బూడిద లాంటి శిలీంద్రం ఆశించి ఆకులు పసుపు రంగుకు మారి ఎండిపోతాయి. నివారణకు 1 లీ. నీటికి 1 మి.లీ. కెరాథియాన్‌ లేదా 1 మి.లీ. అజాక్సిస్ట్రోబిన్‌ (అమీస్టార్‌) లేదా 1 మి.లీ. క్రెసాక్జిమ్‌ మిథైల్‌ (ఎర్గాన్‌) లేదా 1 గ్రా. మైకోబుటానిల్‌ (ఇండెక్స్‌) లేదా 1 మి.లీ. అజాక్సిస్ట్రోబిన్‌ + ట్రిబ్యుకొనజోల్‌ (కస్తోడియా) కలిపి పిచికారి చేయాలి.

వైరస్‌ తెగుళ్ళు (బడ్‌ నెక్రోసిస్‌) :

తామర పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఆకులపైన, తోడిమలపైన గోధుమరంగు మచ్చలు ఏర్పడి తీగలు చివర నుంచి ఎండతాయి. పూత నల్ల బడుతుంది.

మొజాయిక్‌ :

పేనుబంక ద్వారా వ్యాపిస్తుంది. ఆకులపైన పసుపు, ఆకుపచ్చని మచ్చలు ఏర్పడుతాయి. ఆకులు చిన్నగా, గుబురుగా ఏర్పడి తీగల చివర్లు పైకి లేచి ఉంటాయి.

నివారణ :

పొలంలో పొలం చుట్టుపక్కల కలుపు లేకుండా చేయాలి.

తెగులు సోకిన మొక్కల్ని ప్రారంభంలోనే తీసి కాల్చి వేయాలి.

పొలం దగ్గర బెండ, టమాటా, మిరప పంటలు సాగు చేయకూడదు.

రసం పీల్చే పురుగులకు ముఖ్యంగా ఈ తెగుల్లను వ్యాప్తి చేసే తామర పురుగులు, పేనుబంక పురుగులను సకాలంలో గుర్తించి నివారించాలి.

పక్వ దశ :

కాయల తొడిమల దగ్గరున్న నులితీగలు ఎండి ఉండాలి. కాయల కింది భాగంలో ఉండే నేల మచ్చ పసుపు రంగుకు మారి ఉండాలి. కాయను చేతితో కొడితే డొల్ల శబ్దం రావాలి. పక్వానికి చేరిన పండ్లను సకాలంలో కోయాలి. కోయడం ఆలస్యమైతే లోపలి కండ రంగు తియ్యదనం తగ్గుతాయి. కండ కరిగి మెత్తబడి నీరు కారుతుంది. దీనివల్ల పండ్ల లోపల ఖాళీ ఏర్పడి బరువు తగ్గుతుంది.

మార్కెటింగ్‌ :

పుచ్చ పెద్ద సైజు అనగా 4 కిలోల కంటే ఎక్కువ బరువు ఉండే కాయలు స్థానిక మార్కెట్లకు అనగా దగ్గరలో ఉన్న పట్టణాలకు లారీల్లో గాని, చిన్న ట్రక్కుల్లోగాని ఎలాంటి ప్యాకింగ్‌ లేకుండా పోసి రవాణా చేస్తారు. రైతులే నేరుగా పట్టణ మార్కెట్లకు ఏజెంట్ల ద్వార అమ్ముతారు.

చిన్న సైజు కాయలు (2-4 కిలోల బరువుండేవి) :

పొలం వద్దనే గ్రేడింగ్‌ చేసి ఎలాంటి లోపాలు లేనివి అనగా పురుగులు సోకని, నిర్దిష్ట ఆకారం కలిగి వంకర లేనివి, బరువు బాగా ఉన్నవి ముఖ్యంగా అరుణ్‌ రకం కాయల్ని లారీల్లో లేదా చిన్న ట్రక్కుల్లో చుట్టూ అట్టపెట్టెలు పెట్టి కాయలతో నింపి దూర ప్రాంతాలైన ఢిల్లీ, ముంబై, కలకత్తా, చెన్నై, బెంగుళూరు లాంటి నగరాలకు రావణా చేస్తారు. ఈ ప్రాంతాల నుంచి వ్యాపారస్తులు వారి ఏజెంట్లను పోలాల వద్దకు పంపి కాయలను తెంపి పైన తెలిపిన విధంగా గ్రేడింగ్‌ చేసి రవాణా చేస్తారు. కాయల కోతకు ముందే రైతులతో ఒప్పందం చేసుకుంటారు.

దిగుబడి :

ఎకరాకు 20-25 టన్నులు దిగుబడి వస్తుంది

ఆదాయం :

సాధారణంగా కిలోకు 10-20 రూ. చొప్పున లభిస్తుంది. సరాసరిన కిలోకు 8 రూ. చొప్పున 20 టన్నులకు 1,60,000/- ఆదాయం లభిస్తుంది. ఎకరాకు సాగు ఖర్చు 70,000/- పోను 90,000/- నికరంగా మిగులుతుంది.

ఎస్‌. ఎం. శైలజ, హార్టికల్చర్‌ రీసెర్చ్‌ అసోసియేట్‌, డా. ఎం. కవిత, ఇంఛార్జ్‌ హెడ్‌ కె.వి.కె పెరియవరం.