పుట్టిన రోజు పండుగే అందరికీ.. పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికి? పర్చూరు నియోజక వర్గ ప్రజలు, ప్రజా ప్రతినిధి ఏలూరి సాంబశివరావు మధ్య ఉన్న అనుబంధం ఈ వాక్యానికి అనుగుణమైనదే. తెలుగు దేశం పార్టీ నియోజక వర్గ ఇన్‌చార్జిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి నేటి వరకు ప్రజలను, వారి సమస్యలను తనవిగా భావించి, నిరంతర ప్రజా సేవలో తరిస్తున్న ఏలూరి జన్మదినం గణతంత్ర దినోత్సవం రోజునే కావడం, యాదృచ్ఛికమే అయినప్పటికీ ఆ అనుబంధం మాత్రం అపూర్వమైనది. ఎంతో మంది ప్రజా ప్రతినిధులను చూస్తున్నాం, కానీ ఇలా తన జన్మదినాన్ని వేలాది మంది అభిమానుల మధ్య జరుపుకున్న దృష్టాంతాలు తక్కువ. సమాజమే దేవాలయం - పజలే దేవుళ్ళు గా భావించి నిరంతరం ప్రజల కోసమే పనిచేస్తూ, ప్రజాస్వామ్య స్ఫూర్తిని పటిష్టం చేస్తూ వారి కొరకే జన్మించినట్లు ముందుకు దూసుకువెళ్ళడం కూడా నిజంగా అరుదైన విషయమే.

గతంలో ఎంతో మంది ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ చక్రం తిప్పిన నేతలు ప్రాతినిధ్యం వహించిన పర్చూరు నియోజకవర్గంలో మొక్కుబడిగా పర్యటిస్తూ, ఎన్నిక అనంతరం ప్రజల ముఖం చూడడానికే ఇష్టపడని నేతలు రాజ్యమేలిన నేపధ్యంలో ఆ వైఖరికి భిన్నంగా సంపూర్ణ ప్రజాస్వామ్య స్పూర్తి, పారదర్శక వైఖరితో నిత్యం అనుబంధం పెంచుకున్న సాంబశివరావు తన పుట్టిన రోజు కూడా తాను నమ్మిన ప్రజానికం మధ్య తనకు అధికారం కట్టబెట్టిన ఓటరు దేవుళ్ళ సాక్షిగా జరుపుకోవడం నిజంగా అభినందించదగ్గ విషయం. ఒక పరిణతి కలిగిన రాజనీతిజ్ఞుడిగా, ఒక పట్టుదల కలిగిన రైతుబిడ్డగా, ఒక విద్యాధికుడైన రైతు నిపుణునిగా, నిరాడంబరత, నిజాయితీలే కొలబద్దగా తాను అనుసరిస్తున్న ప్రజా జీవిత పథానికి సంకేతంగా జన్మదినాన్ని కూడా జరుపుకోవడం విశేషం.

ఒక్కసారి ఎమ్మెల్యే పదవిని పొందగానే అట్టహాసంగా, అతి వైభోగంగా జీవన శైలిని మార్చుకొని, తాము ప్రత్యేక తరహా పౌరులమనే అహంభావంతో నేటి ప్రజాస్వామ్య వ్యవస్థ బ్రష్టు పట్టిన నేపధ్యంలో సాంబశివరావు విసూత్న శైలిలో తనదైన కార్యాచరణతో ముందుకు వెళ్ళడానికి దర్పణంగా ఈ జన్మదిన వేడుకలను మనం చూడవచ్చు. రోజువారీ జీవితంలో ఎదురయ్యే ఎన్నో ఒడిదుడుకులతో పేదలు, బలహీన వర్గాలు, మహిళలు, యువకులు పడుతున్న కష్టాల నివారణ కొరకు ఈ రోజును కూడా అంకితం చేశారు ఏలూరి. దానికి ప్రతి రూపంగానే తాను ఎప్పటినుండో సొంత ఖర్చుతో నిర్వహించే ఉచిత కంటి వైద్య శిబిరం, పెద్దలు, మహిళల ఆరోగ్య స్థితిగతులను మెరుగుపరచేందుకు వైద్య పరీక్షలు, అవసరానికి, ప్రమాదాల్లో గాయపడిన వారికి ఉపశమనం కలిగించేందుకు కావలసిన రక్తసేకరణ, రక్తదాన శిబిరాల నిర్వహణ, యువతరం భవితకు తోడ్పడే కార్యక్రమాల నిర్వహణతో సాంబశివరావు తన జన్మదినాన్ని ముడిపెట్టి తద్విధంగా ప్రజారంజకంగా ఈ కార్యక్రమాన్ని గత ఐదేళ్ళుగా కొనసాగిస్తున్నారు.

పాదయాత్రలు, సైకిల్‌ యాత్రలు, తరచూ సందర్శనా యాత్రలు నిర్వహిస్తూ, నిత్యం ప్రజల మధ్య ఉండే సాంబశివరావు, ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండే కార్యాలయాన్ని నిర్వహిస్తూ, ఆ ప్రాంగణంలోకే వేలాది మంది జనాన్ని రప్పించి వేడుక జరుపుకోవడం ఆనవాయితీగా నిర్వహిస్తున్నారు. కోస్తా జిల్లాల్లోనే అత్యంత ఎత్తైన స్థితిలో వైభవంగా నిర్మించిన అన్న నందమూరి తారక రామారావు నిలువెత్తు విగ్రహం సాక్షిగా ఐదవ నెంబరు జాతీయ రహదారిపై గణతంత్ర దినోత్సవం రోజు అపూర్వమైన జన సంద్రం మధ్య నిర్వహించే ఈ వేడుక తెలుగు రాష్ట్రాల ప్రజా ప్రతినిధులందరికీ గర్వకారణమైంది. అనాదిగా భూస్వామ్య కుటుంబాలు రాజ్యమేలిన పర్చూరు పీఠంపై ఒక సామాన్య ప్రజాప్రతినిధిగా, నిజమైన నేతగా, యువతకు ప్రతీకగా నిలిచి, సాంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా ప్రజాజీవితంలో కొత్త ఒరవడిని సృష్టించే ముందు యుగం దూతగా ఈ జన్మదినోత్సవం నిలిచిపోతుంది. 2019 సం||లో మరోసారి ప్రజాతీర్పుకు వెళ్ళేముందు సామాన్యులతో అతి వైభవంగా జరిగిన ఈ జన్మదిన వేడుకగురించి ఇప్పుడు తెలుసుకుందాం.....

2019 జనవరి 26వ తేదీన ఉదయానికే మార్టూరులోని మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయం అశేషమైన జన సందోహంతో కిక్కిరిసిపోయింది. సాంప్రదాయ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు వేలాది మంది ప్రజలు హాజరై జై జై ద్వానాలతో ఏలూరికి శుభాకాంక్షలు తెలిపారు.

ఏలూరి జన్మదినం సందర్భంగా తొలుత మార్టూరు క్యాంపుకార్యాలయంలోని ఎన్ట్‌ఆర్‌ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఇసుకదర్శి గ్రామంలోని పాండురంగ స్వామి దేవాలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభిమానులతో కలసి బైక్‌ ర్యాలిగా పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ జాతీయ జెండాని ఎగురవేశారు. అనంతరం పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన పార్టీ జెండాను ఎగురవేసి అనంతరం జరిగిన కార్యకర్తల సమావేశంలో ఏలూరి మాట్లాడుతూ ఈ ప్రాంత అభివృద్ధికి తాను ఇచ్చిన హామీలను 80 శాతం పైగా పూర్తిచేశానని అన్నారు.

పార్టీ కష్టకాలాల్లో ఉన్న నాడు నేను పార్టీ బాధ్యతలు చేపట్టానని ఆ నాటి నుండి తన శక్తి మేరకు నియోజక వర్గంలో పనిచేస్తూ వస్తున్నానని గుర్తు చేశారు. బాధ్యతలు చేపట్టిన మొదటి రోజుల్లో నియోజకవర్గం వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు 32 రోజుల పాటు 789 కి.మీ. 112 గ్రామాలు పాదయాత్ర చేసి నియోజక వర్గంలోని ప్రతి గ్రామంపై పట్టు సాధించానన్నారు. పాదయాత్ర చేస్తున్న సమయంలో ప్రజలనుండి వచ్చిన వినతులను క్షుణంగా అధ్యయనం చేయడం జరిగిందని అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా కనీస వసతులు కూడా లేని గ్రామాలను చూడాల్సివచ్చిందని తెలిపారు. పాదయాత్ర సమయంలో సుమారు 70 వేల కుటుంబాలను ప్రత్యక్షంగా కలసిశానని అన్నారు. రహదారులు లేని గ్రామాల సైతం ఉండేవని నేడు ప్రతి గ్రామానికి లింక్‌ రోడ్లు ఏర్పాటు చేశామని ప్రధాన రోడ్లను సైతం నిర్మించామని 30 సం||లుగా ప్రజలు పడుతున్న ఇక్కట్లను తొలగించామని తెలిపారు.

పుట్టిన రోజు వేడుకలకు సీనియర్‌ నాయకులు, ఎమ్మెల్సీ కరణం బలరామకృష్ణ ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంగించారు. స్వచ్చందంగా ఉద్యోగాన్ని వదలి రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవ చేస్తున్న ఏలూరి ఈ ప్రాంత ప్రజలకు ఆదర్శనీయమని కొనియాడారు.

ఎమ్మెల్సీ మాగంటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఇక్కడి ప్రజలకు ఉచితంగా వేద్య సేవలు అందించడం అభినందనీయమని తెలిపారు.

అనంతరం డ్వాక్రా మహిళలకు కోటి రూపాయల చెక్కులను అందచేశారు. ఇంకొల్లు మండలానికి చెందిన 250 మంది ముస్లీములకు ఇళ్ళ పట్టాలను పంపిణీ చేశారు.

పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో 1000 మందికి కంటి పరీక్షలు చేయించారు. ఈ కార్యక్రమంలో కామేపల్లి హరిబాబు, రాయపాటి సీతయ్య, శివరాత్రి శ్రీనివాసరావు, జడ్‌పిటిసి ఈశ్వరమ్మ, వెంకటేశ్వర్లు, దేవినేని శ్రీనివాసరావు, వాసవి హనుమంతరావు, కంభంపాటి వెంకట్రావు, ఇంటూరి ఆంజనేయులు, కామినేని జనార్థన్‌, మక్కిన శేఖర్‌బాబు, పొద వీరయ్య, నల్లపునేని రంగయ్య చౌదరి, కోటపాటి సురేష్‌, వీరమ్మ, గ్రానైట్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు ఇంటూరి ఆంజనేయులు, కార్యదర్శి చెరుకూరి అంజిబాబు, చినబాబు, బొప్పూడి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

- అగ్రిక్లినిక్‌ డెస్క్‌