సంపాదకీయం

కనీస ఆదాయం కల నెరవేరేనా!

ఆరుగాలం కష్టపడే రైతులు, రైతు కూలీలు, ఇతర శ్రమ జీవులకు కనీస ఆదాయం లభించే విధంగా ప్రణాళికలు రచిస్తామని అఖిల భారత కాంగ్రెస్‌ అధ్యక్షులు రాహుల్‌ గాంధీ ప్రకటించి సంచలనం సృష్టించారు. దేశ వ్యాప్తంగా సంపద అంతా వందల కుటుంబ లోగిళ్ళలో జమ అయిపోతుండగా, ఆర్థిక అంతరాలు వ్యవస్థలను బ్రస్టుపట్టిస్తుండగా సాధారణ మానవుని జీవితం మరో వంక దుర్భరమైన పరిస్థితులకు దారితీస్తుంది. ఈ అసహనం పెరిగి దావానంలా దేశంలోని ప్రభుత్వాలపై తిరుగుబాటు అస్త్రంలా మారిపోనుండడంతో అంతర్గత భద్రత ప్రశ్నార్థకరమవుతూనే ఉంది. ఈ నేపధ్యంలో పాలకులు ఖచ్ఛితంగా ఆమ్‌ఆద్మీకి సహకరించాల్సిన అవసరం ఏర్పడింది. దాన్ని గుర్తించే కాబోలు ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్‌ గాంధీ తన ఛత్తీస్‌ఘడ్‌ పర్యటనలో రైతులను ఉద్ధేశించి ప్రసంగిస్తూ ఈ కీలకమైన ప్రకటన చేశారు. మొదటి సస్య విప్లవం తరువాత రైతులు తమ విలువైన భూసారంతో పాటు విత్తనాలపై సాధికారతను కోల్పోయి ఏన్నో అగచాట్లకు గురౌతున్నారు. ముఖ్యంగా సంస్కరణల యుగం ప్రారంభమైన 1990 తొలిదశ నుండి ఇప్పటి వరకు కష్టపడినా, ప్రతి కూల పరిస్థితులకు ఎదురొడ్డి వ్యవసాయం ఎంతో కష్టతరమైన నేపధ్యంలో కూడా ఆ వృత్తిని వీడక సర్వజనానికి ఆహారం అందించే బాధ్యతను తమ భుజాలపై వేసుకొని మోస్తున్న రైతాంగానికి ఎటువంటి ఆదాయ వనరు కనిపించడం లేదు. ముఖ్యంగా భూమీకి పచ్చాని రంగులద్దే రైతన్న తన విషాదకరమైన జీవితాన్ని కొనసాగించలేక, ప్రభుత్వాలను, వ్యవస్థను దేవిరించలేక, ఆత్మాభిమానం చంపుకోలేక, ఆకలి దప్పులను తీర్చుకోలేక పురుగుల మందే పెరుగన్నంలా భావించి తనువు చాలించక తప్పదని భావించి తాను పంటలపై చల్లే పురుగుల మందునే పెరుగన్నంలా భావించి దేహాన్ని వీడుతున్నాడు.

వ్యవసాయం చేసుకునే రైతే అదే వృత్తిలో కొనసాగుతున్న ఇంకొక కుటుంబపు యువ రైతుకు బిడ్డను ఇవ్వని ఆత్మన్యూనతకు లోనుకావడంతో పవిత్రమైన ఈ వృత్తి మనుగడ ప్రశ్నార్థకమవుతున్న నేపధ్యంలో గత్యంతరం లేక తనువు చాలిస్తున్న దుస్థితి. రెండు దశాబ్ధాల మధ్యలో 3 లక్షల మందికి పైగా రైతులు ఆత్మహత్యలకు గురికావడం ప్రపంచంలో ఏ దేశంలో జరుగనంతటి దారుణం. ఒక పక్క నష్టాలతోనూ, మరో పక్క సామాజిక విచక్షణతోనూ నలిగిపోతున్న రైతాంగాన్ని ఆదుకోవడానికి పన్నీరు చిలకరించినట్లు రుణమాఫీలు, రైతు బంధు పథకాలు, ఇతర చిన్న చిన్న తాయిలాలు ఇస్తూ మభ్యపెట్టడం ఇక సాధ్యం కాదని పాలకులందరూ పార్టీ రహితంగా భావిస్తున్న నేపధ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో కాబోయే ప్రధాని ¬దాలో రాహుల్‌గాంధీ పై విధంగా విస్పష్టమైన ప్రకటన చేయడం కొంత ఊరటకలిగించే అంశంగానే భావించవచ్చు. ఇప్పుడున్న సామాజిక స్థితిగతులను అంచనావేసుకునే ఈ రకమైన ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాన్ని చూపించక తప్పదని భావించినట్లు అనిపిస్తున్నా, వాస్తవానికి అసంఘటిత రంగంలో ఎవరూ పలుకరించే దిక్కులేక నీరసంగా కునారిల్లుతున్న రైతులు, రైతు కూలీలకు ఈ మాటలు కారుచీకటిలో కాంతిరేఖల్లాగా, ఆశాదీపాలుగా కనిపించక మానవు. ఇప్పటికే రైతులకు కనీస వేతనంగా ఆదాయాన్ని చూపెట్టాలని ఒక బలమైన డిమాండ్‌తో ముందుకు రావడం, సాధారణ మీడియా దాన్ని హైలెట్‌ చేయకపోయినా సామాజిక మాధ్యమాల్లో ఆ వాదనబలపడడం జరిగిపోతుంది. ఈ నేపధ్యంలో వ్యవసాయ కుటుంబాలకు నూతన జవ సత్వాలు కల్పించడానికి రాహుల్‌ గాంధీ వంటి నేతలు ఒక ప్రయత్నంతో ముందుకు రావడం ఆనందం కలిగిస్తుంది. ఎన్‌జిఓలు, బుద్దిజీవులు, అధికార వర్గాలు, కార్మిక సంఘాలు, సంఘటితంగా పోరాడి, అవసరమైతే ప్రభుత్వాల మెడలు వంచి తమ కోర్కెలు సాధించుకుంటున్న సమయంలో దిక్కు మొక్క లేని వ్యవసాయ కుటుంబాలకు కనీసం ఈ రకమైన ఊరట లభించడం ఆశాజనకంగానే ఉంటుంది. అదే విధంగా అనగారిన వర్గాలు సంఘటిత కులా వర్గాలు హక్కులకై పోరాడి వాటిని సాధించుకుంటున్న నేపధ్యంలో ఆరుగాలం కష్టపడి సమాజానికి ఇంత తిండిపెడుతున్న రైతాంగానికి వ్యవసాయం ఇతర వృత్తులపై ఆధారపడిన జనానికి కనీస ఆదాయాన్ని చూపిస్తామని చేసిన ప్రకటన సర్వహితమైంది, స్వాగతించదగింది.