చైనా ఆస్టర్‌ శీతాకాలంలో సాగు చేయడానికి అనువైన పూల మొక్క. వీటి పూలు వివిధ రంగుల్లో ఉండి వాటిని విడి పూలగా, కట్‌ ఫ్లవర్‌గా, ఫ్లవర్‌ అరేంజ్‌మెంట్లలోనూ, పూజా కార్యక్రమాల్లో, కుండీల్లో, ఉద్యానవనాల్లో పూల మడులు పెంచడానికి వాడుతుంటారు. శీతాకాలంలో విడిపూలకు ఉన్న గిరాకి, దానికి తోడు తక్కువ కాలంలో పూల దిగుబడి వచ్చే వీలు ఉన్నందున ఈ పంటను సాగుచేయవచ్చు.

అనుకూల వాతావరణం :

నాణ్యమైన పూల ఉత్పత్తికి మద్యస్థంగా సూర్యరశ్మితో పాటు చల్లని వాతావరణం అవసరం. మంచి దిగుబడి కొరకు సెప్టెంబరు - నవంబరులో నాటుకోవాలి. వేసవి కాలంలో నాటరాదు. పగటి ఉష్ణోగ్రతలు 220-320 నుండి రాత్రి ఉష్ణోగ్రతలు 15-170 సెం. రాత్రి ఉష్ణోగ్రతలు నాణ్యమైన, అధిక దిగుబడికి అనుకూలం. పుష్పాలలో మంచి రంగు రావడానికి వాతావరణంలో 50-60 శాతం తేమ ఉండాలి. వాతావరణం ఎక్కువ వేడిగా ఉంటే మొక్కల కాండం పొడవుగా పెరిగి, తక్కువ సంఖ్యలో రేకులు చాలా తక్కువగా నాసిరకం పూలు వస్తాయి. వాతావరణం అనుకూలంగా లేకపోతే ఈ పంట పెరగదు.

నేలలు (పొలం ఎన్నిక) :

నీరు బాగా ఇంకే లోతైన ఎర్ర గరప నేలలు అనుకూలం. క్షార, లవణ గుణాలు ఉన్న పొలాలు పనికి రావు. నేల ఉదజని సూచిక 6-0 ఉండాలి. బరువైన, కాల్షియం ఎక్కువ ఉన్న భూములు పనికిరావు.

రకాల ఎంపిక :

ఇండియన్‌ ఇన్సిటిట్యూట్‌ ఆఫ్‌ హార్టికల్చర్‌ రీసెర్చ్‌ (ఐ.ఐ.హెచ్‌.ఆర్‌) బెంగుళూరు వారి అర్క కామని, అర్క పూర్ణిమ, అర్క శశాంక్‌, అర్క అర్చన మరియు వైలెట్‌ కుషన్‌, ప్రాంతీయ ఫల పరిశోధన కేంద్రం, గణేష్‌ ఖిండ్‌, పూణె వారి ఫూల్‌ గణేష్‌ వైట్‌, ఫూల్‌ గణేష్‌ పింక్‌, ఫూల్‌ గణేష్‌ వైలెట్‌, ఫూల్‌ గణేష్‌ పర్పుల్‌ రకాలను ఆ కేంద్రాల నుండి మరియు పూల పరిశోధనా కేంద్రం, రాజేంద్రనగర్‌, హైదరాబాద్‌ వారిని సంప్రదించి అనుకూలమైన రకాలను పొందవచ్చు.

నారు పెంచడం :

విత్తనం ద్వారా పెంచిన నారు మొక్కలను నాటాలి. వీటి విత్తనాలకు సుప్తావస్థ ఉండదు. విత్తిన వారానికి మొలకెత్తుతాయి. ఎక్కువ కాలం సాధారణ పరిస్థితుల మధ్య నిల్వ ఉంచిన విత్తనాల మొలకశాతం చాలా తక్కువ. కనుక తాజాగా సేకరించిన విత్తనాలను వాడాలి. చల్లని, ఎక్కువ వేడి లేని అనుకూల వాతావరణంలోనే మొలకశాతం ఎక్కువ. హెక్టారు పొలం నాటడానికి 625-650 గ్రా. విత్తనం అవసరం. ఎక్కువ ఉష్ణోగ్రత మొలక శాతాన్ని బాగా తగ్గిస్తుంది.

నారుమడి తయారీ :

60 శాతం నీడ ఉన్న ప్రాంతాల్లో 2 మీ. పొడవు + 90 సెం. మీ. వెడల్పు + 20-30 సెం.మీ. ఎత్తు ఉండే నారు వేసే బెడ్‌లు (లేదా) ప్రోట్రేలు తీసుకొని వాటిలో నాణ్యమైన కోకోపీట్‌ను వేసి నారు పెంచవచ్చు. నారు బెడ్‌ లేదా కోకోపీట్‌ ఉన్న ప్రోట్రేలను ముందుగా కాప్టాన్‌ 2.5 గ్రా. లేదా మాంకోజెబ్‌ 2.5 గ్రా. లేదా రిడోమిల్‌ యం. జెడ్‌ 1.5 గ్రా. లేదా సాప్‌ 1.5 గ్రా. లీటరు నీటికి కలిపి బాగా తడపాలి. నర్సరీ బెడ్‌ల కంటే ప్రోట్రేలలో విత్తనం వేయడం మంచిది. వాటిలో మొలకశాతం బాగా రావాలంటే నీటి తడుల వ్యత్యాసం ఉండరాదు. ప్రోట్రేలను 50-60 శాతం నీడ ఉన్న ప్రాంతాల్లో ఉంచి మొలకలను జాగ్రత్తగా గమనించాలి. ఎండ వేడి ఎక్కువై నీటి తడుల మధ్య తేడా ఉంటే మొలకలు ఎండిపోతాయి.

పొలం తయారీ, మొక్కలు నాటడం :

పొలం మంచి దుక్కి వచ్చేంత వరకు 4-5 సార్లు దున్నాలి. చివరి దుక్కిలో 10-15 టన్నులు బాగా మాగిన పశువుల ఎరువు + 20 కిలోల నత్రజని, భాస్వరం, పొటాష్‌ ఎరువులు కలుపుకోవాలి. రసాయన ఎరువుల కంటే జీవన ఎరువులు దుక్కిలో కలపడం మంచిది. నారు మొక్కలు 3-4 ఆకులు ఏర్పడినప్పుడు నాటుకోవాలి. మొక్కలను సాళ్ళ మధ్య 30 సెం.మీ. మరియు వరుసల్లో 30 సెం.మీ. ఉండేటట్లు నాటుకోవాలి.

ఎరువుల వాడకం, అంతరకృషి :

చివరి దుక్కిలో వేసిన ఎరువులు గాక పైపాటుగా 30-40 కిలోల నత్రజని, పొటాష్‌ ఎరువులను నాటిన తరువాత 30-40 రోజులకు ఇవ్వాలి. పూలు మంచి రంగు పొందేందుకు వీలుగా సూక్ష్మధాతువు మిశ్రమాన్ని 2 గ్రా. లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి. పూమొగ్గ రాక ముందు ఒకసారి మరలా మొగ్గ విచ్చే ముందు ఒకసారి పిచికారి చేసుకోవాలి.

మొక్కలు 30-45 సెం.మీ. ఎత్తు పెరిగిన తరువాత మొక్క తల మొగ్గ కత్తిరించాలి. దీనివల్ల పక్క కొమ్మలు వచ్చి వాటిని కట్‌ఫ్లవర్‌గా, విడిపూలగా వాడవచ్చు. కత్తిరింపులు చేయడం వల్ల మొక్క పైన ఉన్న పూలు వివిధ సమయాల్లో కోతకు వస్తాయి. కట్‌ఫ్లవర్‌ కొరకు అయితే పక్క కొమ్మలపై వచ్చే చిగుర్లను వెంట వెంటనే తీసివేయాలి. విడిపూల కొరకు పక్క కొమ్మలపై వచ్చే చిగుర్లు కోయకూడదు.

పూల కాడల పెరుగుదలకు, పూల పరిమాణం నిల్వ ఉండే విధంగా జిబ్బరిల్లిక్‌ ఆమ్లం 125 పిపియం తలలు కత్తిరించిన తరువాత పిచికారి చేయాలి. అవసరాన్ని బట్టి నీటి తడులు ఇవ్వాలి. మొక్కల వేర్లు చాలా వరకు పైనే ఉంటాయి. కాబట్టి పంట చివరి వరకు నేలపైపొరల్లో సరిపడే తేమ ఉండేటట్లు చూడాలి. ఏది ఏమైనా సాగు నీరు డ్రిప్‌ పద్ధతిలో ఇచ్చిన పూల నాణ్యత, దిగుబడి బాగా ఉంటుంది.

మైకోరైజా వినియోగం :

సిపార్సు చేసిన విధంగా గ్లోమస్‌ ఫాసిక్యులేటం, అకాలోస్పోరా లేవిస్‌, స్కీరోసిస్టిస్‌ డస్సి నేలలో కలపడం గానీ నర్సరీకి ఇవ్వడం మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ జీవన ఎరువులు వ్యవసాయ పరిశోధనాస్థానం, అమరావతి, గుంటూరు జిల్లాలో అందుబాటులో ఉన్నాయి. చైనా ఆస్టరు పంటను కొబ్బరిలో అంతర పంటగా వేయవచ్చు.

సస్యరక్షణ :

పొడివాతావరణం, మంచు పడే సమయంలో పురుగుల తాకిడి ఎక్కువగా ఉంటుంది.

కాండం తొలిచే పురుగు నివారణకు క్వినాల్‌ ఫాస్‌ 2 మి.లీ. లేదా ప్రొఫెనోఫాస్‌ 2 మి.లీ. లీటరు నీటికి

ఆకు మొగ్గ తొలిచే పురుగు నివారణకు క్లోరిపైరిఫాస్‌ 2 మి.లీ. లేదా క్వినాల్‌ఫాస్‌ 2 మి.లీ. లేదా స్పైనోసాడ్‌ 0.2 మి.లీ. / లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

తామర పురుగు నివారణకు ఎసిఫేట్‌ 1.5 గ్రా. లేదా పిప్రోనిల్‌ 2 మి.లీ. లేదా ఇమిడాక్లోప్రిడ్‌ 0.3 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

వేరుకుళ్ళు తెగులు నివారణకు సాగు చేసే పొలాన్ని సోలరైజేషన్‌ చేయాలి. డ్రిప్‌ ద్వారా నీరు పారించాలి. దుక్కిలో జీవన ఎరువులు వేయాలి. నీటి తడుల వ్యత్యాసం ఉండరాదు. జీవ సిలీంద్రాలను డ్రిప్‌ ద్వారా మొక్కలకు పంపాలి. పంటను బెడ్‌ల మీద, సాలు- బోదె పద్ధతిలోనే సాగు చేయాలి.

కాప్టాన్‌ 2 గ్రా. లేదా మాంకోజెబ్‌ 2.5 గ్రా. లేదా రితోయల్‌ యం.జెడ్‌ 1.5 గ్రా. చొప్పున లీటరు నీటికి కలిపి రెండు దఫాలుగా మొక్కల కాండం దగ్గర భూమిని తడిపి తెగులును అదుపు చేయాలి.

మొక్క ఎండు తెగులు నివారణకు ఎక్కువ మోతాదులో నత్రజని ఎరువులను వాడరాదు. భూమిని వేసవిలో సోలరైజేషన్‌ చేయాలి. మొక్కలను బోదెలు, బెడ్‌ల మీద నాటాలి. మొక్కల మొదళ్ళ వద్ద తడి ఎక్కువగా ఉండరాదు. జీవన ఎరువులు వేయాలి. లీటరు నీటికి 1 గ్రా. కార్బండిజమ్‌ లేదా 1 గ్రా. బెన్‌లేట్‌ మందును పిచికారి చేయాలి

.

పూల కోత :

రకాన్ని బట్టి నాటిన 70-80 రోజులకు పూలు వస్తాయి. పూలను రెండు విధాలుగా కోయవచ్చు. పూలను విడిగా కోసినట్లయితే అలంకారానికి పూజా కార్యక్రమాల కొరకు వాడవచ్చు. పుష్పాలను కాడలతో సహా కోసినట్లయితే కట్‌ ఫ్లవర్‌గా అమ్మడానికి వీలవుతుంది. పూలు ఎక్కువగా ఉన్నప్పుడు మొక్కలను భూమట్టానికి కోసి కట్‌ ఫ్లవర్‌గా విక్రయించవచ్చు. మొక్కలను నేల మట్టానికి కోసినప్పుడు పూల కాడలను నిలువుగా స్వచ్ఛమైన నీటిలో ఉంచాలి. పూల కాడ పొడవును బట్టి కట్‌ఫ్లవర్‌ గ్రేడింగ్‌ చేయాలి. విడిపూలను గోనె సంచుల్లో ప్యాక్‌ చేసి మార్కెట్‌కు రవాణా చేయాలి. ఎకరాకు 4-5 టన్నుల దిగుబడి పొందవచ్చు.

మన రాష్ట్రంలో వాణిజ్య సరళిలో చైనా ఆస్టర్‌ సాగు చేయాలంటే విత్తనాలు, మొలక మరియు మరింత సాంకేతిక పరిజ్ఞానం ముఖ్యంగా సాగుకు కావలసిన అనుకూల వాతావరణం గురించి ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హార్టికల్చర్‌ రీసెర్చ్‌ (డైరెక్టర్‌) హెస్సారఘట్ట లేక్‌ పోస్టు, బెంగుళూరు-560 089, ఫోన్‌ : 080 28466420-23, 28446140-43 వారిని సంప్రదించి మంచి దిగుబడి, ఆదాయం పొందాలి.

డా|| ఎం. రాజా నాయక్‌, డా|| ఎం. రామయ్య, డి. శ్రీధర్‌, ఉద్యాన కళాశాల, అనంతరాజు పేట, కడప, ఫోన్‌ : 8897998978