సంపాదకీయం

పౌష్టిక వృద్ధికి, రైతు ప్రగతికి వేదిక కోళ్ళ పరిశ్రమ

వ్యవసాయ అనుబంధ రంగాల్లో అతి ప్రాముఖ్యత కలిగిన రంగం కోళ్ళ పరిశ్రమ. అంతర్జాతీయంగా ప్రభుత్వాల సహకారం లేకుండా రైతన్నలే ఛోదకులుగా విస్తరించిన కోళ్ళ పెంపకం నేడు ప్రపంచ దేశాల ఆర్థిక స్థితి గతులను శాసించడమే కాకుండా, తృతీయ ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తున్న పౌష్టిక ఆహార లోపాలను సరిదిద్ది శక్తివంతమైన మానవ వనరుల వికాసానికి కోడిగుడ్లు, మాంసం, కోళ్ళ విసర్జితాలు ఎన్నో ఆశలను మోసులెత్తించి వికాసంలో తమదైన శైలిలో మానవ మనుగడకు దోహదం చేస్తున్నాయి. ఆదిమకాలం నుండి జంతువులను, పక్షులను మచ్చిక చేసుకొని వాటి అండతో మానవుడి భోజన విస్తరి ప్రమాణాలను పెంచుకోవడమే కాకుండా క్రమేణా వాణిజ్యపరంగా లాభసాటి వృత్తిగా మాంసం, పాలు అందచేసి ఈ జీవరాశి మనకెంతో మేలు చేస్తున్న సంగతి విదితమే. ముఖ్యంగా మన గృహపరిసరాల్లో మన మధ్యనే తిరుగుతూ మనం వృధా చేస్తున్న, విసిరిపారేసిన ఆహార పదార్థాలను తిని మనకు మేలైన పోషకాహారంగా గుడ్లను, మాంసాన్ని అందిస్తున్న కోళ్ళ పరిశ్రమ మానవ జీవితాన్ని ఎంత ప్రభావితం చేస్తుందో ఆధునిక యుగంలో మనం చూస్తున్నాం. ప్రకృతి వైపరిత్యాలతో, పలు రకాల చీడపీడలతో వ్యవసాయ పంటలు రైతుకు గిట్టుబాటుగా లేనప్పుడు ఒకప్పుడు మనలను ఆదుకున్న పెరటికోళ్ళు ఇప్పుడు బృహత్తర పరిశ్రమగా మారి మన జీవన విధానాన్ని శాసించే స్థాయికి ఎదగడం ముదావహం. ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మందికి ఉపాది కల్పిస్తూ, పేదవాడి పౌష్టికాహారంగా మనం మలచుకున్న ఈ కోడి మాంసం, గుడ్ల ఉత్పత్తి వ్యాపకం మానవ వికాసంలో ఒక అరుదైన వృత్తి.

మాంసం పరిశ్రమలో అగ్రస్థానంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర రాజధాని ఆ మాటకొస్తే తెలుగు వెలుగుల ఆతిధ్యరాజధాని హైదరాబాద్‌లో ప్రతి సంవత్సరం జరిగే ఉత్సవాలు కేవలం హైటెక్స్‌ ప్రాంగణానికే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రగతి వెలుగులను వ్యాపింపచేస్తుంది. పౌల్ట్రీ ఇండియా పేరుతో ఆసియా ఖండంలోనే అతిపెద్ద ప్రదర్శన, సాంకేతిక సదస్సుల వేదికగా జరిగే ఈ మహా ఉత్సవం 2018 నవంబరులో హైటెక్స్‌ వేదికగా కన్నుల పండుగగా జరుగడం ముదావహం. భారత దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మేధోరాజధానిగా కీర్తి శిఖరాలను అందుకుంటున్న సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమలే కాకుండా, ఆరోగ్య రాజధానిగా ప్రపంచంలోనే రోగ నిరోధక వ్యవస్థకు కొత్త నిర్వచనం చెప్పిన మహానగరం ఈ వేడుకలకు 12 సంవత్సరాలుగా నిలయంగా మారడం తెలుగు ప్రజలందరూ గర్వించదగిన అంశం. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలూ, కోడి మాంసం, గుడ్ల ఉత్పత్తిలో అగ్రస్థానానికి పోటీపడుతుండగా మనదేశం ఈ పరిశ్రమ పరంగా ప్రపంచ స్థాయిలోనే మూడవ స్థానంలో ఉండడం కేవలం మన రైతాంగం, పారిశ్రామిక వేత్తల స్వయం కృషి, ఎదుగుదల గురంచిన పట్టుదలే ప్రధానమైనది, ప్రశంసనీయమైనది కూడా. భారత్‌లోని జనాభాలో 50 శాతం కలిగిన మహిళలు ఆకాశంలో సగం, భూమిపైనా సగం అన్న నినాదంతో పురుషులతో సమానంగా ముందుకు వెళుతున్న నేపద్యంలో, గర్భిణీ సమయంలోనూ, ప్రసవ సమయంలోనూ, పౌష్టికాహార లోపంతో ఆ తరువాత జీవిత మంతా వారి పిల్లలతో రక్తహీనత వల్ల వచ్చే దీర్ఘరోగాలతో కృంగి కృశిస్తున్న సమయంలో నవతరాన్ని ప్రసాదించే తల్లుల, వారి పిల్లల భవిష్యత్‌ కొరకు కోళ్ళ పెంపకాన్ని, దాని వేదికగా మారిన పరిశ్రమను సంక్షోభాల నుండి రక్షించుకోవడానికి తీసుకోవలసిన చర్యలు, అవరోధాలను అధిగమించి పరిశ్రమను ముందు యుగం వికాసకేంద్రంగా తీర్చి దిద్దడానికి పౌల్ట్రీ ఇండియా 2018 ఘనవిజయం సాధించడాన్ని అభినందిస్తూ, ఈ పరిశ్రమ పితామహుడుగా పద్మశ్రీ డా|| బి.వి రావు గారి స్పూర్తితో మరింత ముందుకు వెళ్ళాలని సస్య విప్లవ శుభాకాంక్షలు సంబంధిత వర్గాలకు అందచేస్తూ...