సంపాదకీయం

ఎన్నికలు రైతు సాధికరతకు దిక్షూచి కావాలి

రైతు సాధికారత పదాన్ని అనేక దశాబ్ధాలుగా వింటున్నాం. అన్ని వర్గాల్లాగానే రైతులు కూడా ఓటు బ్యాంకుగా మారిపోయి క్రమేణా చట్టసభల్లో తమ ప్రాబల్యాన్ని కోల్పోతున్నారు. రైతులతోపాటు వ్యవసాయ రంగంపై మక్కువ ఉండి వివిధ రంగాల్లో పురోగమిస్తూ, రైతు పక్షపాతులుగా ఉన్న వారు కూడా అనేక విధాలుగా ఎన్నికల్లో పోటీ చేయలేక, చేసినా ధనిక వ్యాపార వర్గాల పోటీ తట్టుకోలేక వెనుకంజ వేస్తున్న సంఘటనలు మనం అనేకం చూస్తున్నాం. స్వాతంత్య్రం లభించిన నాటి నుండి ఈ ఎన్నికల సమయం వరకు చట్ట సభల్లో రైతులు, రైతు బిడ్డలు, వ్యవసాయ శాస్త్రాన్ని అధ్యయనం చేసిన వారి సంఖ్య తగ్గిపోతూ వస్తుండడాన్ని గమనిస్తున్నాం. వీరి స్థానంలో బడా వాణిజ్య వేత్తలు, ఆశ్రిత పెట్టుబడిదారుల ప్రాభల్యం ఎక్కువైపోయింది. గ్రామీణ యువత, నవతకు పెద్దపీఠ వేసి, వారి వెన్ను తట్టి నిలబెట్టి ఎన్నికల్లో గెలిచేందుకు పార్టీలు సిద్ధంగా ఉండడంలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌నే తీసుకుంటే స్వాతంత్య్రం వచ్చిన నాటి నుండి, రాష్ట్రం విడిపోయే వరకు ధనిక వర్గ ప్రాబల్యంతోనే చట్టసభలు నిండిపోయి ఉండేవి. రైతు ఉద్యమ ¬రు వినిపించినా అలనాటి రైతు సమరయోధులు ఆచార్య ఎన్‌జిరంగా, పి. తిమ్మారెడ్డి, గల్లా రాజగోపాల్‌ నాయుడు, తొలితరం రైతు నేతలుగా కొన్ని విజయాలు సాధించినా, కొంతకాలం ఒక వెలుగు వెలిగినా తరువాత మసకపోయి, సమకాలీన డబ్బు రాజకీయాలను తట్టుకోలేక వెనుకబడిపోయారు. తమిళనాడులో కామరాజు నాడార్‌ అనే రైతు బిడ్డ అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులుగా ఉండి కూడా ప్రధాన మంత్రి పీఠానికి చేరువకాలేకపోయారు. ఎక్కువగా చదువుకోలేకపోవడం, హిందీభాష మీద పట్టులేకపోవడంతో ఆయన అందలానికి దగ్గరుండి కూడా ఢిల్లీ పీఠాన్ని అందుకోలేకపోయారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లో పాలవిప్లవానికి పితామహుడైన కాకాని వెంకటరత్నం ఆంధ్రా ఉద్యమంలో అకాల మరణం చెందినందున రైతు సాధికారతకు న్యాయం చేకూరలేదు.

అఖిల భారత స్థాయిలో చూస్తే సర్థార్‌ చౌదరి చరణ్‌సింగ్‌ అనుకోని పరిస్ధితుల్లో ప్రధాన మంత్రి పదవిని అధిష్టించి కూడా లోక్‌సభ మొఖం చూడకుండానే నిష్క్రమించాల్సి వచ్చింది. స్వాతంత్రోధ్యమంలో చురుకుగా పాల్గొన్న కమ్యూనిస్టునేతలు పుచ్చల పల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావులు రైతు బిడ్డలుగా, రైతు ఉద్యమకారులుగా రాజకీయ జీవితాలను ప్రారంభించి, రావి నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో వీర తెలంగాణ రైతాంగ విప్లవపోరాటంలో సాయుధపోరాటం నిర్వహించి అనంతరం జాతీయస్థాయి నాయకులుగా ఎదిగినా కూడా ప్రత్యేక పరిస్థితుల్లో వారు అధికారంలోకి రాలేకపోవడం సాధికారతకు చేరువకాలేకపోవడం మనం చూశాం. 1982లో తెలుగుదేశం పార్టీ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి ఆధ్వర్యంలో ఏర్పడి, 1983లో అధికార పగ్గాలు చేపట్టిన తరువాత తొలిసారిగా భారతదేశంలో రైతాంగ స్థితిగతులపై దృష్టి సారించిన ఏకైక నాయకుడిగా పేరుపొందారు. సోషలిస్టుపార్టీ అభిమానులైన తుమ్మల చౌదరి, తుర్లపాటి సత్యన్నారాయణ గార్ల సలహాతో ఎన్‌టిఆర్‌ రైతులు పీడిత ప్రజల సమస్యలపై దృష్టి సారించారు. తొలిసారిగా రైతులకు హార్స్‌పవర్‌కు రూ. 50 తక్కువ విద్యుత్‌టారిఫ్‌ను నిర్ణయించి రామారావు రైతు బంధుగా పేరుతెచ్చుకున్నారు. ఎన్‌టిఆర్‌ బాటలోనే చంద్రబాబు నాయుడు రైతుల సంక్షేమానికి అన్ని రకాలుగా కృషి జరుపుతున్నారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల మేరకు రుణమాఫీ జరిపించడం, ఇప్పుడు కేంద్రప్రభుత్వం నగదు సహాయంగా రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు బదిలీ చేస్తున్న సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు ఇతమిథంగా సహాయపడడం జరుగుతుంది. చట్ట సభల్లో యువకులైన వ్యవసాయ విద్య అభ్యసించి, స్వయం కృషితో పైకి వస్తున్న వారిని గుర్తించి చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించి ప్రోత్సహిస్తున్నారు. అదే విధంగా జాతీయ స్థాయిలో రైతు సాధికారతకు, మున్ముందు రైతు ప్రాతినిధ్యానికి అవకాశాలు కల్పించాలి.